గురువారం, అక్టోబర్ 01, 2009

అంతరాయం

చిన్నప్పుడు రేడియోలో ఇష్టమైన పాట వస్తూ ఉంటే, పని మానుకుని రేడియో గదిలో చేరేవాళ్ళం. ఒక్కోసారి ఉన్నట్టుండి పాట ఆగిపోయేది. కరెంటు పోయిందేమో అని చూసుకుని, ఆ తర్వాత నాబ్ లు తిప్పి రిపేర్లు చేసినా ఉపయోగం ఉండేది కాదు. ఓ రెండు నిమిషాల తర్వాత పాట లో చివరి భాగం వినిపించేది. మరి కాసేపటికి ప్రసారం లో ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఇన్ని నిముషాల ఇన్ని సెకన్ల సేపు సాంకేతిక కారణాల వల్ల అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నామంటూ ప్రకటన వచ్చేది.

అదేమిటో కానీ ఎప్పుడూ మంచి పాటలు వచ్చినప్పుడో, నాటకం మంచి రసకందాయంలో ఉన్నప్పుడో పగ పట్టినట్టు అంతరాయం వచ్చేసేది. పాటలంటే మరో సారి వచ్చినప్పుడు వినొచ్చు కానీ, నాటకం లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? పైగా అంతరాయం అందరి రేడియోల్లోనూ ఒకేసారి వస్తుంది కాబట్టి ఎవరినీ అడగడానికి కూడా ఉండేది కాదు. దాంతో ఆ టైములో కథ ఏ మలుపు తిరిగి ఉంటుందో మా ఊహా శక్తి మేరకు ఊహించుకునే వాళ్ళం.

టీవీ వచ్చాక సహజంగానే రేడియో వెనకబడింది. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారి ప్రసారాలు మొదటి నుంచి చివరి వరకూ దీక్షగా చూడాల్సిందే. సుబాబుల్ పంట లో తెగుళ్ళ నివారణ మొదలు, గొర్రెల్లో నట్టల వ్యాధి, శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకం కార్యక్రమాలు కూడా రెప్ప వెయ్యకుండా చూసిన రోజులు ఉన్నాయి.'ఓవర్ టు ఢిల్లీ' రాగానే టీవీ కట్టేసేవాళ్ళం మొదట్లో. తర్వాత 'చిత్రమాల' వగైరా కార్యక్రమాలు అలవాటయ్యాయి.

అలా శ్రద్ధగా టీవీ చూస్తుండగా ఉన్నట్టుండి బుల్లి తెర నిండా మెరుపులూ, మరకలూ కనిపించేవి. షరా మామూలుగా మనకి చేతనైన మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం. ఒక్కోసారి అంతరాయం అని బోర్డు పెట్టేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే కొన్ని కార్యక్రమాల కన్నా మధ్యలో వచ్చే అంతరాయమే బాగుండేది.

కాసేపయ్యాక ఎనౌన్సరు విషన్న వదనంతో ప్రత్యక్షమై (అప్పుడే టీవీ పెట్టిన వాళ్ళు ఏ దేశ నాయకుడో తనువు చాలించేశాడేమో అని సందేహించే విధంగా) ప్రసారంలో అంతరాయం కలిగినందుకు చింతించే కార్యక్రమం ఉండేది. అందరూ యధాశక్తిగా చింతించినప్పటికీ, నాకు గుర్తున్నంతవరకు మిగిలిన వాళ్ళ కన్నా శాంతి స్వరూప్, విజయదుర్గ చింతించే విధానం కొంచం ప్రత్యేకంగా ఉండేది. ఈ చింతించడం మీద బోల్డన్ని జోకులు ప్రచారంలో ఉండేవి. అనౌన్సర్ కన్నీళ్ళకి డ్రాయింగ్ రూం సగం మునిగిపోయినట్టు వచ్చిన కార్టూను ఇప్పటికీ గుర్తే.

శాటిలైట్ చానళ్ళు వచ్చి టీవీ కార్యక్రమాల ప్రసారం లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. వాటిలో ముఖ్యమైనది అంతరాయాలకి చింతించక పోవడం. 'వీళ్ళకి బొత్తిగా మర్యాద తెలీదు.. అదే దూరదర్శన్ వాళ్ళైతే ఎంత మర్యాదస్తులో' అన్న జోకులూ వినిపించాయి. ఇప్పుడిప్పుడు ఫలానా టైము నుంచి ఫలానా టైం వరకూ అంతరాయం వచ్చే అవకాశం ఉంది అన్న స్క్రోలింగులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీవీలో మొన్నో ఆసక్తి కరమైన విషయం కనిపించింది.

మొన్న రాత్రి టీవీ తొమ్మిది లో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు ఇంటర్వ్యూ వస్తోంది. యాంకరు తో పాటు, ప్రజా నాట్యమండలి కళాకారిణి/ కార్యకర్త దేవి కూడా వంగపండు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తన పాపులర్ పాట 'ఏంపిల్లడో ఎల్దమొస్తవా..' ట్యూన్ తో వైఎస్ ని పొగుడుతూ ఒక పాట రాశారట వంగపండు. 'ఇది మీకు తగునా?' అని వాళ్ళిద్దరూ వంగపండుని చెరిగేస్తూ, చెడుగుడు ఆడుతూ, మధ్యలో ఆయన చేత పాటలు పాడిస్తున్నారు.

ఒక రెండు బ్రేకులు బ్రేకాక, ఫోన్ ఇన్ పెట్టారు. చానల్ వారి నిలయ విద్వాంసులు ఫోన్ లో వంగపండుని నిలదీస్తుండగా, మిగిలిన ఇద్దరూ చిరు నవ్వులు చిందిస్తున్నారు. అప్పుడు వచ్చిందో ఫోన్ కాల్. కాలర్ టీవీ తొమ్మిది వారిమీద విరుచుకు పడ్డాడు. ఇంతసేపటికి ఒక భిన్నస్వరం వినిపించింది కదా అనిపించింది. ఇంతకన్నా పెద్ద పెద్ద విప్లవ ద్రోహాలు చేస్తున్న వాళ్ళని వదిలి అమాయకుడైన వంగపండునే ఎందుకు టార్గెట్ చేశారు? మిగిలిన వాళ్ళతో మాట్లాడే ధైర్యం మీకు లేదు.. అని సూటిగానూ, స్పష్టంగానూ మాట్లాడుతున్న క్షణాల్లో వచ్చింది అంతరాయం.

పాపం.. యాంకరు శక్తి వంచన లేకుండా 'హలో..హలో..' అంటూనే ఉన్నాడు. ఫోన్లో అవతలి నుంచి స్పందన లేదు. చేసినాయన ఎవరో ప్రజాసంఘం నాయకుడే.. 'లైన్లో ఏదో ప్రాబ్లం' అని చెప్పి ప్రోగ్రాం కొనసాగించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ తర్వాత కార్యక్రమం దాదాపు అరగంట సేపు కొనసాగినా ఆయన మళ్ళీ ఫోన్ చేయలేదు.. చానల్ వాళ్లైనా ఆయనకి ఫోన్ చేసి అభిప్రాయం తీసుకుందామని ప్రయత్నించలేదు. కనీసం అంతరాయానికి చింతించనూ లేదు. తర్వాత అలా నిలదీసే కాల్ ఒక్కటి కూడా రాలేదు.