మంగళవారం, జనవరి 03, 2023

"అమ్మ సెల్లియ్యదు..."

రెండు మూడు రోజులుగా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో క్లిప్ ఇది. ఓ ప్రజాప్రతినిధి (?) తన మందీ మార్బలంతో ఓ జనావాసంలో తిరుగుతూ కనిపించినవాళ్ళని పలకరిస్తున్నారు. బొద్దుగా ఉన్న ఓ పిల్లాడిని చూడగానే ఆగి "ఏం చదువుతున్నావమ్మా?" అని అడగ్గానే, కుర్రాడు చేతులు కట్టుకుని "ఎయిత్ క్లాస్" అని బదులిస్తాడు. "ఏదిరా అంత లావై పోయినావు? గేమ్స్ ఆడుకోవా?" అని సదరు ప్రతినిధి ఆశ్చర్యపడుతూ అడగ్గానే, కుర్రాడు ధీర గంభీరంగా "అమ్మ సెల్లియ్యదు" అని జవాబు చెబుతాడు. వింటున్న వాళ్ళకే కాదు, వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అర్ధం కాడానికి ఓ క్షణం పడుతుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడి దృష్టిలో గేమ్స్ అంటే సెల్ ఫోన్ లో ఆడుకునేవి మాత్రమే అని అర్ధం కాగానే నా బుర్రని అనేక ప్రశ్నలు తొలచడం మొదలెట్టాయి. 

ఇప్పటి పిల్లలు మనుషులతో కన్నా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారన్నది నిజం. కరోనా పుణ్యమా అని పలకా, పుస్తకాలని కూడా స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు రీప్లేస్ చేసేయడంతో ఈ గాడ్జెట్స్ తో సావాసం మరింత పెరిగింది. వీడియో గేమ్స్ చూస్తూ పెరిగి పెద్దవుతూ, గాడ్జెట్స్ లోనే చదువుకుంటూ, అన్నీ మొబైల్ లోనే ఉన్నాయని నమ్ముతున్న పిల్లలకి గేమ్స్ అంటే వీడియో గేమ్స్ మాత్రమే అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అవితప్ప వాళ్లకి తెలిసిన వేరే గేమ్స్ ఏమున్నాయి కనుక? తల్లిదండ్రులిద్దరి దగ్గరా మొబైల్ ఫోన్లు ఉండడం మాత్రమే కాదు, అవి వాళ్ళకి దాదాపుగా శరీర భాగాలుగా కలిసిపోడాన్ని చూస్తూ పెరుగుతున్న పిల్లలు వీళ్ళు. చందమామని కాక, సెల్ఫోనుని చూస్తూ గోరు ముద్దలు తిన్న వాళ్ళూను. ఇలా కాక, ఇంకెలా ఆలోచించగలరు మరి? 

పిల్లవాడి వీడియో చాలాసార్లు చూశాక (చాలామంది మిత్రుల నుంచి ఫార్వార్డ్ అయి వచ్చింది, కొందరైతే రకరకాల జిఫ్ లూ అవీ జోడించారు కూడా) ప్రధానంగా అనిపించినవి రెండు - పిల్లలకి సెల్లు మాత్రమే తెలియడం, సెల్ ఫోన్ తప్ప ఇంకేమీ తెలియక పోవడం. అన్నం కన్నా ముందు సెల్ ఫోన్ పరిచయం అవుతోంది కాబట్టి, పిల్లలు వాటికి అలవాటు పడడంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళని సెల్ ఫోన్ ఆకర్షించినంతగా మిగిలిన ప్రపంచం ఎందుకు ఆకర్షించడం లేదు? టీవీలో సినిమా వస్తున్నా, చివరికి అమ్మానాన్నలతో సినిమా హాలుకి వెళ్లినా ఫోన్ లో తలదూర్చేసే పిల్లల్ని చూసినప్పుడల్లా బహురూపాల్లో వచ్చే ప్రశ్నే ఇది. పిల్లవాడి పుణ్యమా అని ప్రశ్నలో స్పష్టత వచ్చింది. చేత్తో పట్టుకోగలిగి, కంట్రోల్ చేతుల్లో ఉండి, కళ్ళకి సరిగ్గా సరిపోయేంత తెర ఉండడం మాత్రమేనా, ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా? 

గమనించిన మరో విషయం ఏమిటంటే పిల్లలు ఇలా సెల్ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసుకోడాన్ని మెజారిటీ తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు, కొందరైతే గర్వ పడుతున్నారు కూడా. "వీళ్ళ వయసులో మాకు ఫోనే తెలియదు. వీళ్ళకి ఫోన్ వాడకం మొత్తం వచ్చేసిందప్పుడే" అనే గర్వరేఖలకీ లోటులేదు. పిల్లల కళ్ళమీదా, బుర్రమీదా పడే ప్రభావాలని గురించి ఆలోచిస్తున్నవాళ్ళు అరుదు. ఇగ్నోరెన్సు అన్నివేళలా బ్లిస్సేనా? ఇదిగో ఇలాంటి తల్లితండ్రులమధ్య, సెల్లియ్యని ఆ అమ్మ చిన్న ఆశాకిరణంలా కనిపించింది. ఇవ్వకపోడానికి కారణాలు తెలియవు కానీ, ఇవ్వకుండా ఉండడం ద్వారా బిడ్డకి బయటి ప్రపంచం కాస్త పరిచయం అవడానికి సాయం చేస్తోంది. అదే సెల్లు చేతిలో ఉంటే ఆ నాయకుడికి ఈ పిల్లవాడు దొరికి ఉండేవాడు కాదు, ప్రశ్నని అర్ధం చేసుకోగలిగే వాడూ కాదు. 

నిజానికి పిల్లవాడికి కొంచం ప్రపంచం తెలిసి, "గేమ్స్ ఆడడానికి గ్రౌండ్ లేదు" అని చెప్పి ఉంటే సదరు నాయకుడు ఎలా స్పందించి ఉండేవాడన్నది మరో ఆలోచన. ఇప్పుడు ఎన్ని స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, వ్యాయామ విద్య అనే క్లాసు టైం టేబుల్ లో ఉంది, అసలు బోధించే ఉపాధ్యాయులు ఎందరు ఉన్నారు అన్నవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రయివేటు స్కూళ్లలో వ్యాయామ విద్యని గుర్తించేవి బహుతక్కువ. స్కూలు మొత్తానికి ఒకరో ఇద్దరో పిల్లల్ని - వాళ్ళు కూడా తల్లితండ్రుల పుణ్యమా అని క్రీడల్లోకి వచ్చినవాళ్లు - గుర్తించడం, వాళ్ళకి ఏదైనా పోటీల్లో బహుమతులొస్తే 'మా బడి పిల్లలకి బహుమతులు' అని ప్రచారం చేసుకోవడం మాత్రమే కనిపిస్తోంది. 

సర్కారు బడుల్లో కొన్నింటికి ప్లే గ్రౌండ్లు, మరికొన్ని చోట్ల పీఈటీలు ఉన్నా రెండూ ఉన్నవి తక్కువే అనిపిస్తుంది. నిజానికి వనరులు అన్నీ అందుబాటులోనే ఉన్నా, ఆడేందుకు ఆసక్తి చూపించే పిల్లలెందరు? ప్రోత్సహించే తల్లిదండ్రులెందరు? 'పిల్లల భవిష్యత్తంతా కంప్యూటర్ల లోనే ఉంది. ఫోన్ బాగా వస్తే (?) కంప్యూటరూ బాగా వస్తుంది' అనే ఆలోచనల్ని బద్దలుకొట్టేది ఎవరు, ఎప్పుడు? "గేమ్స్ ఆడుకోవా?" అని అడగడానికి ముందు, గేమ్స్ అంటే ఏమిటో స్పష్టంగా చెప్పి, ఎందుకు ఆడాలో వివరించి ఉంటే ఆ కుర్రాడు ఆడేందుకు ప్రయత్నించి ఉండేవాడేమో. సెల్లులోనే కాకుండా గ్రౌండ్ లో ఆడే గేమ్స్ కూడా ఉంటాయని తెలుసుకుని ఉండేవాడేమో. సెల్ ఫోన్ దాటి బయట ఉన్న ప్రపంచాన్ని పిల్లలకి పరిచయం చేయాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. పిల్లలకన్నా ముందు పెద్దలకి అర్ధంకావాలి. పిల్లి మెడలో గంటని కట్టేదెవరు??

9 కామెంట్‌లు:

  1. మంచి ప్రశ్న వేశారు. మార్పు మనలోనే మొదలవ్వాలి. ఇంకొకళ్ళు చెపితే రాదు కదా.

    రిప్లయితొలగించండి
  2. మొదట మీరన్నట్లు అర్ధం కాలా. పిల్లల జీవితం ఎల్లా మారిపోయింది !. అమెరికాలో పిల్లలకి సెల్ ఫోన్లు ఉన్నా, తల్లి దండ్రులు పిల్లలని బయటికిపోయి ఆడుకోమంటారు. అది ఎంతవరకూ సాగుతుందో చెప్పలేము.

    రిప్లయితొలగించండి
  3. నాహైస్కూలు చదువంతా నడిచిన కొత్తపేట (తూగోజి) పాఠశాలలో అటస్థలం చాలా పెద్దగా ఉండేది - జిల్లాస్థాయి అటలపోటీలకు ముఖ్యవేదికగా ఉండేది. కొన్నేళ్ళ క్రిందట చూసినప్పుడు చుట్టూ అందరూ నంచుకొని తినగా చిన్నముక్క అంత ఆటస్థలం మాత్రం ఉందక్కడ - చూసి చాలా బాధకలిగింది.రానురానూ ఆటలన్నీ ఆన్‌లైన్ ఐపోయాయి కాబట్టి ఆటస్థలాలను గురించి పట్టించుకొనే‌ నాథులు ఇంక అస్సలు ఉండరన్నమాట. పుట్టగానే సెల్‌ఫోన్ చేతికిస్తున్నారుగా, పిల్లలను తప్పుపట్టుకోలేం. పెద్దల తరంలో ఇంటికో‌కారూ లేదు చేతికో సెల్లూ లేదు, సెల్లుకో రెండు సిమ్ములూ‌ లేవు. అసలు ఫోను ఉన్నవాళ్ళు గొప్పోళ్ళు - కారున్నవాళ్ళంటే మహారాజులే అన్నట్లుండేది. ఇప్పుడందరికీ జీవనశైలి మారింది! గొణుక్కోవటం తప్ప విపరీతాఅలను చూసి, ఏమీ అనలేం కదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా స్కూళ్ల ప్లే గ్రౌండ్స్ పరిస్థితి అదేనండీ.. భూముల విలువ పెరగడం కాదు కానీ, వీటి ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  4. శ్యామలీయం గారు,
    నేను కూడా 1960ల్లో కొత్తపేట (తూగోజి) హైస్కూలులో చదువుకున్నవాడినే. మీకన్నా ఓ ఏడాదో రెండో నేను సీనియర్ ని అనుకుంటాను. ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది! అయిపోయిందా, అన్యాక్రాంతమైపోయిందా?

    కొత్తపేట తరువాత నేను అమలాపురం హైస్కూలులో జేరాను. రోడ్డు మీదకు కొట్టొచ్చినట్లు కనబడేది. అదొక లాండ్ మార్క్ గా ఉండేది. పైగా. బోలెడంత గ్రౌండ్. అక్కడ మేం ఫుట్ బాల్ ఆడాం, క్రికెట్ ఆడాం, హైజంపులు చేశాం (డ్రిల్లు మాస్టర్ గారి పర్యవేక్షణలో లెండి). ఓ పదేళ్ళ క్రితం కోనసీమ తిరిగి వెళ్ళడం జరిగింది. స్కూలుని గుర్తు పట్టడానికి ఇబ్బంది పడ్డాను. మెయిన్ గేట్ కూడా మూసుకుపోయినట్లు కనిపించింది , అంతలా ఆక్రమణలకు గురయింది. ఎంతో గొప్పలు చెప్పుకుని తీసుకువెళ్ళిన నా కుటుంబసభ్యుల ముందర వెర్రిమొహం వెయ్యాల్సి వచ్చింది.

    నా పాయింట్ ఏమిటంటే ఈ తరం పిల్లలు అటువంటి వైభోగం మిస్ అవుతున్నారే అని. సెల్ ఫోన్ మాయలో చిక్కుకుని అవుట్ డోర్ ఆటలు అంటే అసలు exposure ఏమిటో తెలియకుండా బతికేస్తున్నారు. పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వని తల్లితండ్రులకు నిజంగానే నమస్కారం చెయ్యాలి.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి