శుక్రవారం, సెప్టెంబర్ 10, 2021

వందేళ్ల వపా

కళాకారులు అంతర్ముఖులుగా ఉండడం సహజం. వాళ్ళ దృష్టి లౌకిక విషయాల మీద కాక, అంతకు మించిన వాటిమీద ఉంటూ ఉండడం కూడా వాళ్ళ కళాసృష్టికి ఒకానొక కారణం. అయితే, ఈ అంతర్ముఖత్వం కారణంగానే తన కళలో విశేషమైన కృషి చేసి, ఎంతో మంది అభిమానులని సంపాదించుకుని కూడా, తనను గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకుండానే వెళ్ళిపోయిన కళాకారులు ఉన్నారు. తెలుగు నేలకి సంబంధించి ఈ వరుసలో ముందు చెప్పుకోవాల్సిన పేరు విఖ్యాత చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ఇవాళ ఆయన శతజయంతి. సెప్టెంబర్ 10, 1921న  శ్రీకాకుళంలో జన్మించారని, డిసెంబర్ 30, 1992న కశింకోటలో మరణించారని, ఈ మధ్య గడిపిన జీవితంలో వేలాది వర్ణ చిత్రాలు రచించారనీ మినహా ప్రపంచానికి ఆయన గురించి తెలిసింది బహు తక్కువ. 

ఆయన చిత్రకళ రసజ్ఞులని రంజింపజేయ గలిగిందే కానీ, తగినన్ని కాసుల్ని రాల్చలేకపోయింది. తన చుట్టూ గిరి గీసుకుని బతికిన మనిషిని పిలిచి బిరుదులిచ్చి సన్మానాలు చేసేవారు మాత్రం ఎవరున్నారు? రెండు మూడు రంగాల్లో కాలు పెడితే ఒక చోట కాకపొతే, ఇంకో చోటన్నా పేరు మారుమోగి సౌకర్యవంతమైన జీవితం ఏర్పడి ఉండేదేమో. ఈయనేమో జీవితాంతం చిత్రకళ తప్ప మరోవైపు దృష్టి పెట్టలేదు. నాటి 'చందమామ' మొదలు నేటికీ నడుస్తున్న 'స్వాతి' పత్రిక తొలినాటి సంచికల వరకూ ఏ కొన్ని పత్రికల ముఖచిత్రాలను పరీక్షగా చూసిన వారికైనా 'ఎవరీ బొమ్మ గీసింది?' అన్న ప్రశ్న రాక మానదు. బొమ్మకి కుడివైపు మూలన 'వ.పా' అనే పొడి అక్షరాల్లో, లేక పూరీ జగన్నాధుడిని గుర్తు చేసే 'O|O' సింబలో కనిపిస్తుంది. అది వడ్డాది పాపయ్య సంతకం. 

శారదా నది ఒడ్డున పాతకాలపు చిన్న డాబా ఇంటిని తన ప్రపంచంగా చేసుకుని, ఆ ఇంటి మొదటి అంతస్తులోని కాస్త విశాలమైన గదిని తన స్థూడియోగా చేసుకుని రంగులతో వపా చేసిన ప్రయోగాలు అనితరసాధ్యాలు.  ఆయనకి ఖరీదైన డ్రాయింగ్ పేపర్ అవసరం లేదు, మామూలు కాగితం చాలు. ఆయిల్ కలర్లో, వాటర్ కలర్లో ఉండాలన్న నియమం లేదు. ఇనప సామాన్ల కొట్లలో దొరికే రంగు పొడులు చాలు. అవీ లేని నాడు (కొనడానికి డబ్బు లేనప్పుడు) నీలిమందు, ఆకు పసరు, బొగ్గు పొడులతోనే ప్రపంచస్థాయి చిత్రాలు రచించిన ఘనుడాయన. ఆయన బొమ్మలు చూసి ముగ్ధుడయ్యి చక్రపాణి అంతటి వాడు పిలిచి, 'చందమామ' స్టాఫ్ ఆర్టిస్టుగా ఉద్యోగం ఇచ్చాడు. బహుశా వపా చేసిన ఏకైక ఉద్యోగం అదే. అది కూడా కొన్నేళ్లే. మద్రాసు వాతావరణం సరిపడక, ఉద్యోగం మానేసి కశింకోట తిరిగి వచ్చేశారు. 

శ్రమజీవుల కుటుంబంలో పుట్టారు పాపయ్య. చిత్రకళ తండ్రి శ్రీరామమూర్తి నుంచే వచ్చింది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేయడంతో పాటు, చిత్రకళకు సంబంధించి ఇతరత్రా కృషి కూడా చేసేవారు. అలా, తండ్రికి సహాయకుడిగా చిన్ననాడే రంగులతో పరిచయం ఏర్పడింది వపాకి. తొలిబొమ్మ ఆంజనేయుడిది. తొలినాటి కలంపేరు 'పావనం', తర్వాతి కాలంలో తన ఇంటికి పెట్టుకున్న పేరు కూడా అదే. బొమ్మల్లోనే కాదు, రంగుల మిశ్రమంలోనూ తనదైన శైలిని నిర్మించుకున్నారు. కేవలం మేలి ముసుగుకు వేసిన రంగుని చూసి చెప్పొచ్చు అది వపా బొమ్మ అని. పురాణ పురుషులు, కావ్య నాయికలు, ఋతు శోభ మాత్రమే కాదు, జానపదుల జీవితాలూ ఆయనకు వస్తువులే. 

బొమ్మలు వేయడంలోనే కాదు, వాటికి పేర్లు పెట్టడంలోనూ వపాది ప్రత్యేక శైలి. 'చంపకమే భ్రమరీ..' లాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఎవరైనా ఇంటర్యూ చేయడానికి వెళ్తే, సున్నితంగా కాక తీవ్రంగా తిరస్కరించేవారట వపా. ఇందువల్లనే కాబోలు ఆయనకి ముక్కోపి, అహంభావి లాంటి బిరుదులొచ్చాయి. దగ్గరనుంచి చూసిన కొద్దిమంది మాత్రం ఆయన సాత్వికుడనీ, కళాకారుడికి కాకుండా కళకి మాత్రమే పేరు రావాలని పైపైకి కాక మనసా వాచా నమ్మినవారనీ చెబుతారు. సాధారణ కాగితం, మామూలు రంగులూ వాడి గీసినా వపా బొమ్మల్లో కనిపించే మెరుపు వెనుక రహస్యం ఏమిటి? 'మిసిమి' పత్రిక కోసం చిత్రకారులు 'బాలి' గతేడాది రాసిన వ్యాసంలో విప్పిచెప్పిన ఆ 'రహస్యం' నన్ను విస్మయ పరిచింది. అంతకు మించి, వపా మీద గౌరవం మరింత పెరిగింది. 

"వపా కొన్ని రంగులు కానీ, చార్కోల్ గీతలు కానీ కొంత కాలానికి చెడిపోతాయని భావించి - తాను స్వంతంగా గంజి మరగపెట్టి, చల్లార్చి, అటు చిక్కగా కాదు, మరీ పల్చగా కాకుండా చూసి, నోటిలో ఇత్తడి పుల్లను పెట్టుకుని ఊదుతూ లైట్ గా స్ప్రే చేసేవాడు - దానికి కొంచం ప్రాక్టీసు కావాలి. నీడలో ఆరబెడితే దాని ఫలితంగా బొమ్మపై సన్నటి గాజు స్ప్రే వంటిది వస్తుంది. బొమ్మ కూడా పాడవదు. (ఆ తర్వాతే పిక్చర్ వార్నిష్ (కేమిక్) వచ్చింది)". వపా చిత్రకారుడు మాత్రమే కాదు, ఫోటోగ్రాఫర్, కార్టూనిస్టు, కథా రచయిత కూడా. 'కథానంద సాగరం' లాంటి కథలున్నాయి ఆయన ఖాతాలో. (ఈ వివరాలూ పూర్తిగా తెలియవు). "ఎన్ని గీసినా, ఎన్ని తీసినా ఆయన చుట్టూ గీసుకున్న గీతను దాటలేదు. కనీసం కొన్నాళ్ళు చెరపలేదు. పెద్ద పెద్ద చిత్రకారుల ముందు నేనెంత అనే వినమ్ర భావన ఉండవచ్చు గాక. దానికీ ఓ పధ్ధతి ఉంటుంది కదా - ఇదే వారి చిన్ననాటి మిత్రులు గజపతి రావు గారి ఆలోచన" ఇవీ బాలి మాటలే. 


చదివే కథలు, చూసే సినిమాల వెనుక ఉండే మనుషుల్ని కలవడం సాధ్యమనే నమ్మకం ఏ మాత్రం లేని రోజుల్లో కూడా వపాని ఎలాగైనా కలవాలనే బలమైన కోరిక ఉండేది. ఆయన మరణించిన రెండు మూడు రోజుల తర్వాత 'ఆంధ్రప్రభ' ఆ మరణ వార్తని ప్రకటించింది. (తన మరణాన్ని గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఇంట్లో వాళ్ళకి ముందుగానే చెప్పారట). ఆవేళ చాలా దుఃఖ పడ్డాను. అప్పట్లోనే ఓ పుస్తక ప్రదర్శనలో కేవలం వపా బొమ్మలతో వచ్చిన ఓ బరువైన పుస్తకం కనిపించింది. అప్పటి నా ఆర్ధిక పరిస్థితి ఆ వెలని అందుకోగలిగేది కాకపోవడంతో ప్రదర్శన జరిగినన్నాళ్ళూ రోజూ వెళ్లి ఆ పుస్తకం పేజీలు తిరగేసి వస్తూ ఉండేవాడిని. తర్వాతి కాలంలో ఆ పుస్తకం ఎక్కడా దొరకలేదు. ఆమధ్య ఓ ప్రచురణకర్తని అడిగితే, బొమ్మల మీద హక్కుల సమస్యతో పాటు, మార్కెట్ ఉంటుందన్న గ్యారంటీ లేకపోవడంతో ఎవరూ అలాంటి పుస్తకం వేయడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇంటర్నెట్లో కొన్ని బొమ్మల్నయినా చూడగలగడం పెద్ద ఊరట. 

వపా మీద వచ్చిన నివాళి వ్యాసాలు బహు తక్కువ. వచ్చిన వాటిలోనూ పునరుక్తులే ఎక్కువ. ఆయన అమిత మితభాషి కావడం, చెప్పదల్చుకున్న విషయాలు తప్ప ఇంకేవీ బయటకి చెప్పకపోవడం వల్లనేమో బహుశా. అయితే, ఈ వ్యాసాల వల్ల  'O|O' సంతకానికి అర్ధం తెలిసింది. 'అటూ ఏమీలేదు, ఇటూ ఏమీ లేదు, నేను  మాత్రం వాస్తవం' అనే తాత్విక దృష్టిట అది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు డాక్యుమెంటరీ తీయడానికి ప్రయత్నిస్తే ఆయన అవసరం లేదనేశారట. వేసిన వేలాది బొమ్మల్లో ఎన్ని పాడవ్వకుండా ఉన్నాయో, ఎవరెవరి దగ్గర ఉన్నాయో తెలిసే వీలు లేకపోతోంది. అప్పుడెప్పుడో ఘనంగా ప్రకటించిన 'బాపూ మ్యూజియం' కే ఓ రూపు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం నుంచి వపా మ్యూజియం ఆశించడం అత్యాశే అవుతుంది. బొమ్మల్ని డిజిటైజ్ చేసి వెబ్సైట్ నిర్మించినా బాగుండును. చూడ్డానికి వెల పెట్టినా చెల్లించి చూసే అభిమానులున్నారు.  

(Google Images)

10 కామెంట్‌లు:

  1. మీరు చూసే ఉంటారు.. సురేష్ కడలి గారు గీసిన బొమ్మ
    https://m.facebook.com/story.php?story_fbid=4314411328636685&id=100002035811875

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు లింక్ షేర్ చేయడం వల్ల చూడగలిగానండీ.. ధన్యవాదాలు..

      తొలగించండి
  2. బాగుందండి మీ వ్యాసం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. చిత్రాలు చూసి ఆనందించిన వాళ్ళ లో నేనొకడ్ని. ఆయన గురించి చాలా తెలుసుకున్నాను మీ వ్యాసంతో. థాంక్స్.

    రిప్లయితొలగించండి
  4. వడ్డాది పాపయ్య గారి చిత్రాలు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను చూసిన యువ మాసపత్రికలోని వారి చిత్రాలు ఒక ప్రత్యెక శైలిలో విచిత్రంగా తోచేది. ఇంకా చందమామ, స్వాతి పత్రికలలో వారి చిత్రాలు చూసి ఆనందించే భాగ్యం కలిగింది.

    ఇక వారి సంతకం గురించి చెప్పాలంటే - వారు చెప్పినట్లుగా ఎప్పుడో చదివిన జ్ఞాపకం - 'అటు సున్నా, ఇటు సున్నా, మధ్యలో ఒంటరిగా నేనున్నా. గతం శూన్యం, భవిష్యత్ శూన్యం, వర్తమానమై నే నిలిచున్నా'.

    రిప్లయితొలగించండి
  5. ఎంత గొప్ప జీవితాలు , వ్యక్తిత్వాలు తెర మరుగునే ఉండాలన్న సంకల్పం తో ముగిసిపోయాయో .. సకల సాక్షిభూతుడైన ఆ భగంతుని మాత్రమే తమ ప్రజ్ఞ పాటవాలకు రసికునిగా ఎంచుకున్న ఉదాహరణలు వీరి జీవితాలు... చాల గొప్ప పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓ పాలగుమ్మి పద్మరాజు, ఓ వపా, ఇలా ఎందరోనండీ.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  6. ధన్యవాదాలు మురళి గారూ , శ్రీ వపా  గారి  పై సమయోచిత వ్యాసం ప్రచురించినందుకు !
    తెలుగు జాతి గర్వించ దగ్గ తెలుగువారిలో, శ్రీ వడ్డాది పాపయ్య గారి పేరు చిరస్ధాయి గా ఉంటుంది ! 

    రిప్లయితొలగించండి