ఆదివారం, మే 02, 2021

ఐనా, ఫలం దక్కలేదు ...

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 'కరోనా' కలిసిరాలేదు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిని లెక్కచేయకుండా ఎదురెళ్ళిన రెండు సందర్భాలలోనూ వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఈ ఎదుర్కోలు ఫలితంగా దేశం తీవ్రమైన ప్రాణ నష్టాన్ని, ఆర్ధిక కష్టాలని అనుభవించింది, అనుభవిస్తోంది. నిజానికి ఈ కష్టనష్టాలని భరిస్తున్నవాళ్ళు దేశంలోని పేదలు, మధ్యతరగతి వాళ్ళూను. ఈ కష్టకాలంలో సామాన్యుల మీద పన్నుల భారం దాదాపు రెట్టింపవ్వగా, సంపన్నుల సంపదలు సైతం అదే వేగంతో రెట్టింపు కావడం ప్రపంచం మొత్తం పరిశీలిస్తున్న విషాదం. దేశంలో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడం, చివరికి పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాలు కూడా భారత్ మీద ట్రావెల్ బ్యాన్ విధించడం అంతకు మించిన విషాదం. అతలాకుతలమైన పరిస్థితులన్నీ ఎప్పటికి అదుపులోకి వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. 

గత ఏడాది ఫిబ్రవరి మాసాంతం.. అప్పటికే కొన్ని దేశాలకి కరోనా తన తీవ్రతని రుచి చూపించింది. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. నూటముప్ఫయ్ కోట్లకి పైగా జనాభా ఉన్న, జనసాంద్రత అధికంగా ఉన్న భారతదేశంలోని అధికార యంత్రాంగం మాత్రం అమెరికా కి నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగత సత్కారాలకి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉంది. నిజానికి ఈ 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అంతకు నాలుగు నెలల క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాలో 'హౌడీ మోడీ' పేరిట జరిగిన సత్కారానికి కృతజ్ఞత ప్రకటించడం. రాబోయే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మళ్ళీ విజయ దుందుభి మోగించబోతున్నాడనీ, మోడీ-ట్రంప్ ల మధ్య స్నేహం బలపడడం వల్ల భారతదేశం మళ్ళీ వెలిగిపోతుందనీ ప్రచారం హోరెత్తింది. 

'నమస్తే ట్రంప్' ని విజయవంతంగా పూర్తిచేసి, యంత్రాంగం మళ్ళీ ప్రజల మీద దృష్టి సారించే నాటికి దేశంలో కరోనా పడగ విప్పింది. లాక్ డౌన్ ప్రకటనతో లక్షలాది మంది వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు కాలినడకన స్వస్థలాలకు ప్రయాణం అయ్యారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం పిండిన పన్నులకీ, విదిల్చిన సాయానికి పొంతనే లేదు. చమురు ధరల పెరుగుదల ఒక్కటి చాలు, ప్రభుత్వ పన్ను విధానం జనజీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో చెప్పడానికి. నిజానికి కాస్త ముందుగా మేల్కొని, అంతర్జాతీయ ప్రయాణికుల మీద ఆంక్షలు పెట్టి, విదేశాల నుంచి వచ్చిన వాళ్లందరినీ తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉంచడం లాంటి చర్యలు కూడా తీసుకుని ఉంటే లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సరే, ఎంత ప్రభుత్వమే అయినా ఇంతటి విపత్తుని ఊహించలేదు కదా. తీరా అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలవ్వడం, బైడెన్ ప్రభుత్వంతో భారత్ సంబంధాల విషయంలో ఒక స్పష్టత లేని అయోమయం కొనసాగుతూ ఉండడం నడుస్తున్న చరిత్ర. 

ఒకసారి దెబ్బతిన్నాక, రెండోసారి జాగ్రత్త పడడం అందరూ చేసే  పని. దురదృష్టవశాత్తూ మనదేశంలో అలా జరగలేదు. ఈ ఏడాది తొలినాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే కనిపించాయి. కానీ, కరోనాకి దెబ్బతిన్న దేశాలన్నీ అప్పటికే సెకండ్ వేవ్ దెబ్బని రుచిచూసి ఉన్నాయి. కొన్ని దేశాలైతే ప్రాప్తకాలజ్ఞతతో ముందస్తు ఏర్పాట్లు చేసుకుని వైద్య రంగాన్ని బలపరుచుకున్నాయి. వాక్సిన్ మార్కెట్లోకి వస్తే చాలు, మన దేశంలో మ్యాన్ పవర్ కి, నెట్వర్క్ కి కొరత లేదు కాబట్టి అతి త్వరలోనే అందరికీ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని నా బోట్లం ఆశించాము. ఇప్పటికే, పోలియో నిర్మూలన వాక్సినేషన్లో దేశానికి ఒక రికార్డు ఉంది కదా. మన ఫార్మా కంపెనీల గత చరిత్ర కూడా ఘనమైనదే. అభివృద్ధి చెందిన దేశాలకే ఔషధాలు, వాక్సిన్లు సప్లై చేసిన కంపెనీలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములా చేతికొస్తే తయారీ, రవాణా ఇబ్బందులు కూడా ఉండబోవనుకున్నాం. 

తీరా వాక్సిన్ మార్కెట్లోకి వచ్చేసరికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొచ్చాయి. నాటి పురాణ పురుషులు అశ్వమేధాది యాగాలు చేసి రాజ్య విస్తరణ చేసినట్టుగా, ఎన్నికల్లో రాష్ట్రాలని గెలవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది కదా. అయితే, నాటి పురాణ పురుషులు కరువు కాటకాలప్పుడు, విపత్తులతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు రాజ్యవిస్తరణ మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కానీ,  ప్రజాస్వామ్యంలో అలాంటి శషభిషలు పనికి రావు మరి. దేశీయంగా వాక్సిన్ తయారీ, పంపిణీ లాంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తులు, కీలకమైన సమయంలో ఎన్నికల ప్రచార బాధ్యతల్లో తలమునకలయ్యారు. అన్నీ బాగున్న రోజుల్లో వర్చువల్ సభలు నిర్వహించి టెక్నోక్రాట్ ఇమేజీకోసం తాపత్రయ పడిన వాళ్ళు, కరోనా కాలంలో నేరుగా సభలు నిర్వహించి బలప్రదర్శనలు చేశారు. 

ఐదు రాష్ట్రాలని, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ని ఏకఛత్రం కిందికి తీసుకు రాడానికి చేయని ప్రయత్నాలు లేవు, తొక్కని దారులు లేవు, పణంగా పెట్టనివీ లేవు. సుదీర్ఘమైన ఎన్నికల క్రతువు పూర్తయ్యేసరికి దేశంలో పరిస్థితులు పూర్తిగా చేయిదాటిపోయాయి. ఆక్సిజన్ సిలిండర్లకి మాత్రమే కాదు, శ్మశానాలలో కట్టెలకీ కరువొచ్చింది. వాక్సిన్ కి మాత్రమే కాదు, వ్యాధితో పోరాడుతున్న వాళ్ళని రక్షించే ఇంజక్షన్లకీ 'నో స్టాక్' బోర్డులు వేలాడుతున్నాయి. పరిస్థితులు విషమించేసరికి కేంద్రానికి రాష్ట్రాలు అనేవి ఉన్నాయని గుర్తొచ్చింది. బ్లేమ్ గేమ్ మొదలయ్యింది. పార్టీకి అధ్యక్షుడు వేరే ఉన్నా, పనులన్నీ మానుకుని మరీ ప్రధాని స్థాయి వ్యక్తి పదుల సంఖ్యలో పబ్లిక్ మీటింగులు పెట్టినా పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కలేదు. పార్టీ బలం బాగా పెరిగింది అని అభిమానులు గర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ, అందుకుగాను జరిగిన ఖర్చు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన అన్ని ప్రాణాలూ అనే వాస్తవాన్ని విస్మరిస్తూ ఉండడం విషాదాల్లోకెల్లా విషాదం.. 

4 కామెంట్‌లు:

  1. నాలాంటి చాలామంది పౌరుల మనసులో మాట‌ని సూటిగా వ్రాసారు.
    నాకు ఊహ తెలిసిన గత నలభై ఏళ్ళలో దేశం ఎప్పుడూ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో లేదు. నూతన్ ప్రసాద్ డైలాగ్ ఇప్పుడు నిజం అయింది.

    రిప్లయితొలగించండి
  2. దేశం ఒక్కటే కాదు ప్రపంచకమే క్లిష్ట పరిస్థితికి పరుగులు తీస్తోంది. ఇది మరి ఎక్కడ ఆగుతుందో ఏమో మరి. నా ముప్పై ఆరేళ్ళలో చలిజ్వరం (పెరసెటమాల్), పొడిదగ్గు (బెనడ్రిల్), ముక్కు దిబ్బడ (విక్స్ ఇన్హేలర్), జలుబు (సెట్రిజైన్ హైడ్రోక్లోరైడ్), కండరాల నెప్పి (డైక్లోఫెనాక్ సోడియం), డైయారియ (మెట్రనిడజోల్), అల్సర్ (పాంటప్రజోల్), కంజక్టైవా (అక్యూవిర్) గురించి విన్నానే గాని.. ౨౦౧౯\౨౦౨౦\౨౦౨౧ వరకు కనివినియెరుగని మాయరోగాన్ని గూర్చి ఇంతలా ఉండటం ఇదే తొలిసారి. టీకాలు వచ్చినా సరఫర తగ్గుముఖం, టీకాల మన్నిక తెలియక జనావలి లో పది శాతం యెడమొహం, టీకాలు వికటించి ప్రాణాలకు ముప్పని భయపడేవారు ఓ ముప్పై శాతం.. ప్చ్.. కాలమే సమాధాన పర్చాలి..

    రిప్లయితొలగించండి