మంగళవారం, ఫిబ్రవరి 02, 2021

కలికి చిలకల కొలికి ...

చిన్నప్పుడు నాకు ఇంట్లోనూ, బడిలోనూ కూడా నేర్పించిన పాట 'కలవారి కోడలు కలికి కామాక్షి.. కడుగుచున్నది పప్పు కడవలో పోసి.. అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న.. కాళ్లకు నీళ్లిచ్చి కన్నీళ్లు నింపె..' ఒక ద్విపదలా సాగిపోతుంది. కన్నీళ్లు పెట్టుకున్న చెల్లెలిని పుట్టింటికి ప్రయాణం చేస్తాడు పెద్దన్న. కలవారి కోడలు ఇల్లు కదలడం అంటే మాటలా? ఎందరి అనుమతి కావాలో కదా. 'కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా.. మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?' అని అత్తగారిని అడిగితే, 'నేనెరుగ నేనెరుగ మీ మామనడుగు' అనేస్తుంది అత్తగారు. వరసగా మామ, బావ, తోడికోడలు అయ్యాక చివర్లో భర్త అనుమతి కోరి, అతగాడు 'పెట్టుకో సొమ్ములు, కట్టుకో చీర.. పోయిరా సుఖముగా పుట్టింటికిని' అనడంతో పాట ముగుస్తుంది. 

చెవికింపుగా ఉండడం వల్లనో ఏమో కానీ చాలా త్వరగా నేర్చేసుకున్నానీ పాటని. అది మొదలు, ఎవరు పాడమన్నా ఈ పాటే అందుకునే వాడిని. తాతయ్య చేయించే విద్యా ప్రదర్శనల్లో అయితే ఈ పాటకి వన్స్ మోర్లు పడేవి. కాలక్రమంలో పాట జ్ఞాపకాల మరుగున పడిపోతూ ఉండగా, నాగేశ్వర రావు, రోహిణి హట్టంగడి, మీనా ప్రధాన పాత్రలుగా క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాని మొదటిసారి చూస్తున్నప్పుడు వేటూరి రాసిన  'కలికి చిలకల కొలికి మాకు మేనత్త..' పాట మొదలవ్వగానే చిన్ననాటి 'కలవారి కోడలు' గుర్తొచ్చేసింది. కలవారి కోడలు తనకోసం అనుమతులు అడిగితే, సీతారామయ్య గారి మనవరాలు సీతేమో మేనత్తని పుట్టింటికి తీసుకెళ్లడం కోసం ఆమె అత్తమామలనీ, భర్తనీ అనుమతి కోరుతుంది, ఒక్కొక్కరినీ ఒక్కో చరణంలో.


"కలికి చిలకల కొలికి మాకు మేనత్త.. 
కలవారి కోడలు కనకమాలక్ష్మి.. 
అత్తమామల కొలుచు అందాల అతివ.. 
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి.." 

అంటూ తన అత్తని గురించి చెప్పి... 

"మేనాలు తేలేని మేనకోడల్ని.. 
అడగ-వచ్చా మిమ్ము ఆడకూతుర్ని.. 
వాల్మీకినే మించు వరస తాతయ్య.. 
మా ఇంటికంపించవయ్య మావయ్య.." 

అంటూ తన అత్త మావగారి అనుమతి కోరింది మొదటగా. నిజానికి మేనా తెచ్చే స్థోమత ఉన్న పిల్లే, అంబాసిడర్ కారు తెస్తుంది కూడాను. ఆడపిల్ల అత్తవారితో మాట్లాడేప్పుడు పిల్ల తరఫువారు తమని తాము కొంత తగ్గించుకోవడం అనే సంప్రదాయం ఒకటి ఉండేది పాతరోజుల్లో. ఆ కారణానికి మాడెస్టీ చూపించి ఉంటుంది. 'వాల్మీకినే మించు వరస తాతయ్య' అనడం అతిశయోక్తే కానీ తప్పదు. ఆ తాతయ్యకి, తన తాతయ్యకి వచ్చిన మాట పట్టింపు కారణంగానే మేనత్తకి ఏళ్ళ తరబడి పుట్టింటి మొహం చూసే వీలు లేకపోయింది. రెండు కుటుంబాల మధ్యా సహృద్భావం కలుషితమయ్యింది. ఆ పెద్దాయన్ని మంచి చేసుకోవాలి కదా ముందుగా.  ఆయన తర్వాత, ఆయన భార్య అనుమతి.. అంటే మేనత్త గారి అత్తగారు, ఆమె దగ్గరికి వెళ్లి: 

"ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి.. 
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి.. 
నేటి అత్తమ్మా నాటి కోడలివే.. 
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి.."

..అంటూ చురక పెడుతుంది. ఇక్కడ 'అద్దగోడలు' గురించి చెప్పుకోవాలి. కట్టె పొయ్యిల మీద వంటలు చేసుకునే పూర్వపు రోజుల్లో పొయ్యిలకి పక్కనే కుడి చేతి వైపున మరీ ఎత్తైనది కాని గోడ ఒకటి ఉండేది. బయటి నుంచి చూసేవాళ్ళకి పొయ్యి మీది వంట కనిపించదు, అదే సమయంలో వంటింటికి గాలాడుతుంది. పైగా, వంటకి ఉపయోగించే గరిటల్లాంటివి అందుబాటులో పెట్టుకోడానికి వీలుగా ఉండే గోడ అది. తరచూ వాడుతూ ఉండడం వల్ల ఆ 'అద్దగోడ' కి రాపిడి ఎక్కువ. అత్తింట్లో పెద్దకోడలి పరిస్థితి కూడా అలాంటిదే, గుట్టుగా సమర్ధించుకు రావాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. "ఇప్పుడంటే నువ్వు అత్తగారివి అయ్యావు కానీ, ఒకప్పుడు నువ్వూ కోడలివే, గుర్తు చేసుకో" అని వినయం తగ్గకుండానే జ్ఞాపకం చేసింది. (కొందరు పండితులకి ఈ అద్దగోడలు గురించి తెలియకే కాబోలు, ఈ పాట పాడినందుకు చిత్రకి 'నంది' అవార్డు రావడాన్ని తప్పు పట్టారు, 'అత్తాకోడలు అనడం రాక అద్దగోడలు అని పలికింది, అయినా బహుమతీ ఇచ్చేశారూ' అని). అంతటితో ఆగకుండా: 

"తలలోని నాలికై తల్లిగా చూసే.. 
పూలల్లో దారమై పూజలే చేసే.. 
నీ కంటిపాపలా కాపురం చేసే.. 
మా చంటిపాపను మన్నించి పంపు.."  

అంటూ తన మేనత్త గుణగణాలు వర్ణించింది. 'నీ పెద్ద కోడలు నీకు తలలో నాలికలా మసలుకుంటూ ఎన్నో బాధ్యతలు మోస్తున్నా, మాకు (పుట్టింటి వాళ్లకి) మాత్రం ఆమె చంటిపాపే..కాబట్టి ఆమెని పుట్టింటికి పంపించు' అని అడిగింది.  సినిమా కథలో బావగారు, తోడికోడలు లేకపోవడం వల్ల కాబోలు, నేరుగా మావయ్య దగ్గరికే వెళ్ళింది, తదుపరి అనుమతి కోసం: 

"మసకబడితే నీకు మల్లెపూదండ.. 
తెలవారితే నీకు తేనె నీరెండ.. 
ఏడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు.. 
ఏడు జన్మల పంట మా అత్త చాలు..
పుట్టగానే పూవు పరిమళిస్తుంది.. 
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది..
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ.. 
సయ్యోధ్యనేలేటి సాకేతరామా.."  

..ఇంత లాలనగా అడిగితే కాదంటారా? వాళ్లంతా కూడా తోడొచ్చి మరీ పుట్టింటికి తీసుకొచ్చారు అమ్మాయి మేనత్తని. తొలి చరణంలో 'వాల్మీకినే మించు వరస తాతయ్య' అని తాతయ్యని, చివరి చరణంలో 'సయ్యోధ్యనేలేటి సాకేతరామా..' అని ఆయన కొడుకునీ సంబోధించడం ద్వారా రాముడిని వాల్మీకికి కొడుకుని చేసేసిన చమత్కారి వేటూరి. "కలవారి కోడలు కలికి కామాక్షి పాట స్ఫూర్తితోనే కలికి చిలకల కొలికి పాట పుట్టింద"ని చాలా సందర్భాల్లో చెప్పారు వేటూరి. 'అమెరికాలో పుట్టి పెరిగిన సీత పాత్రకి ఇన్నిన్ని సంప్రదాయాలు, మర్యాదలూ ఎలా తెలుసునబ్బా?' అన్న ప్రశ్నని పక్కనపెట్టి వింటే పదికాలాలు గుర్తుండిపోయే పాట ఇది. సహజమైన చిత్రీకరణ చూడడానికి హాయిగా అనిపిస్తుంది. ఈ పాటకి స్వరరచన కీరవాణి. చిత్ర ఈ పాట పాడిన విధానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కో చరణంలో అవతలి బంధువుకి తగ్గట్టు ఒక్కో మాడ్యులేషన్ వినిపిస్తుంది ఆమె గొంతులో. ఇది గమనించినప్పుడు ఆమెకి అవార్డు రావడాన్ని గురించి ఎలాంటి సందేహాలూ కలగవు. 

14 కామెంట్‌లు:

  1. ఎంత మంచి పాట ని గుర్తుచేసారండి!! ధన్యవాదాలు. ఒక్కో పదం ఒక్కో చెంచా తేనె తాగినట్టుంది. కానీ అద్దగోడలు అనే పదం మాకు రాయలసీమ లో అస్సలు పరిచయం లేని పదం. కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన పదం చేత ఆలా అపార్ధం పాలైనట్టుంది. తర్వాత తరాల వాళ్ళకి కొంత సీతారాముడి వెలుగు కొద్దీ వేటూరిగారి కలం రుచి గురించి పూర్తిగా తెలియదనే చెప్పాలి. ఇంత అందమైన తెలుగు విని ఎన్నాళ్ళయింది !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ. వేటూరి కూడా తాను రాసిన పాటల్లో తనకిష్టమైన వాటిని గురించి చెప్పేటప్పుడు ఈ సినిమాలో పాటల్ని తప్పక ప్రస్తావిస్తూ ఉండేవారు ఇంటర్యూలలో.. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపె _/\_

    రిప్లయితొలగించండి
  3. మంచి పాటనీ, దానితో పాటుగా సంగీత, సాహిత్యాల్నీ, గాత్ర సౌందర్యాన్నీ మళ్లీ గుర్తు చేసారు మురళీగారు..!!

    గాయని చిత్రకి ఇచ్చిన అవార్డు మీద ఆ వ్యాఖ్యని విన్నాను కానీ ఎప్పుడూ నమ్మలేదు. తప్పకుండా శ్రీ వేటూరి పదచాతుర్యం అయి ఉంటుందనుకున్నాను. మీ "అద్దగోడలు" వివరణ చదివిన తర్వాత, మీకు ధన్యవాదాలు అందజేస్తూ _/|\_ , నన్ను నేనే స్వయంగా అభినందించుకుంటున్నాను :) .

    రిప్లయితొలగించండి
  4. Chala bagundandi mee tapa. Kudirinappudu "kalavari kodalu kamchi kamakshi" pata kuda rayandi. Ma nanamma daggara vinnanu chinappudu. Ippudu aame leru. Pillalaki nerpinchukuntanu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి 
      అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న, కాళ్ళకి నీళ్లిచ్చి కన్నీళ్లు నింపె 

      ఎందుకు కన్నీళ్లు? ఏమి కష్టాలు? తుడుచుకో చెల్లెలా, ముడుచుకో కురులు 
      ఎత్తుకో బిడ్డను, ఎక్కు అందలము, చేరి మీ వారితో చెప్పి రావమ్మ

      కుర్చీపీట మీద కూర్చున్న అత్తా, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా 
      నేనెరుగ నేనెరుగ నీ మామనడుగు 

      పట్టెమంచము మీద పడుకొన్న మామా మా అన్నలొచ్చారు మమ్మంపుతారా 
      నేనెరుగ నేనెరుగ నీ బావనడుగు   

      భారతము చదివేటి బావ పెదబావ, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా 
      నేనెరుగ నేనెరుగ నీ అక్కనడుగు 

      వంట చేసే తల్లి ఓ అక్కగారూ, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా 
      నేనెరుగ నేనెరుగ నీ భర్తనడుగు  

      రచ్చలో కూర్చున్న రాజేంద్రభోగి,  మా అన్నలొచ్చారు మమ్మంపుతారా
      పెట్టుకో సొమ్ములు, కట్టుకో చీర, పోయిరా సుఖముగా పుట్టినింటికిని.. 

      తొలగించండి
  5. చక్కని పాటను గుర్తుచేసారు. పాటలో అద్దగోడ విన్నాగానీ అర్ధం ఇవాళే తెలిసింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. చక్కని పాటకు అంతే చక్కని వివరణ ఇచ్చారండీ.. థ్యాంక్స్ ఫర్ ద పోస్ట్.. మీరు చిన్నప్పుడు నేర్చుకున్న పాటకూడా బావుంది.. అద్దగోడలికి ఓ పేరా కేటాయించి మంచి పని చేశారు, చాలా మందికి తెలియదు. ఇక ఆ చివరి పేరాలో ప్రశ్నకి సీతారామయ్య గారి వారసత్వమండీ మరి సీతని అంత చక్కగా పెంచారనమాట అమ్మానాన్నానూ :-) చిత్ర గారి వాయిస్ మాడ్యులేషన్ గురించి భలే కాచ్ చేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మానాన్నా పెంపకం.. ఒప్పుకోవాల్సిదేనండీ. ఇదే మాట ఓ డైలాగులో సీతచేత చెప్పించారు కూడా.. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి