గురువారం, డిసెంబర్ 05, 2019

పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు ... 

"ఓరా వాకిలి తీసీ తీయని  దోరా వయసుల్లో.. 
మాఘామాసపు మంచూ బెబ్బులి పొంచే వేళల్లో.. "

మన సినిమాల్లో శృంగార భరిత యుగళగీతం సాధారణంగా పాడుకునే జంట సమాగమానికి ముందు వస్తుంది. పాట చివర్లో పూలు, పొదలు లాంటి సింబాలిక్ షాట్స్ ఉంటాయి. సమాగమం తర్వాత వచ్చే యుగళగీతాలు అరుదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'మనోహరం' (2000) సినిమాలో "పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు..." అనే పల్లవితో వచ్చే డ్యూయెట్ ఇందుకు మినహాయింపు. కొత్తగా పెళ్ళైన యువజంట గంటల్ని క్షణాలుగా గడిపేయడం సందర్భం. కవి వేటూరి. పాట ఇలా మొదలవుతుంది:  

"పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు.. 
పచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు.. 
వచ్చీనాయమ్మా..  విచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా..  కలువలు విచ్చీనాయమ్మా.. "
అంటూ అతడు ఆరంభించగానే,
"ముద్దా బంతులు మునిగోరింటలు మురిసే  సంజెల్లో.. 
పొద్దే ఎరగని ముద్దే తరగని రసనారింజల్లొ.. 
వచ్చీనాయమ్మా.. విచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. కలువలు విచ్చీనాయమ్మా.. "

అని ఆమె అందుకుంటుంది. 'వెన్నెల పుచ్చపువ్వులా ఉంది' అనడం వాడుక. అలాంటిది పుచ్చపువ్వులు విచ్చే చోట కాసే వెన్నెల (అది కూడా వెచ్చని వెన్నెల!),  దానితో పాటుగా ఆ అమ్మాయి కన్న కలలు - అవికూడా పచ్చ మీగడ (పాలని మరగ కాచగా వచ్చే మీగడ) తాలూకు తీయదనాన్ని తెచ్చేవి - కలలూ వెన్నెలా కలిసి రావడంతో కలువలు విచ్చుకున్నాయట!! అతనిలా చెప్పగానే ఆమె కలువలు విచ్చుకున్నాయని వెంటనే ఒప్పేసుకుంది (పెళ్ళైన కొత్త కదా). కాకపోతే ఆమె చెప్పే కారణాలు వేరు. ముద్దబంతులు, మునిగోరింట పూలు మురిసే (విరిసే కాదు) వేళ, పొద్దు తెలియనంతగా ముద్దుముచ్చట్లు సాగుతున్న వేళల్లో కలువలు విచ్చాయి అంటోంది.  (అసలే కొత్తజంట, ఆపై ముద్దబంతులు పూసే, చలి చంపేసే ధనుర్మాసం.. అర్ధంచేసుకోవాలి మరి). 



"గువ్వ జంటలకు కువకువ..  ఇటు కుర్ర గుండెలకు మెలకువ.. 
వీణ మీటె  సెలయేరూ ..  చలి వేణువూదె చిరుగాలీ.. 
కలువ కనులలోనా కలవరింతలాయే.. 
చలువ తనువులోనా జలదరింతలాయే.. "

అంటూ తొలి చరణం మొదలవుతుంది. గూటికి చేరిన గువ్వలు కువకువలాడడం ఎంత సహజమో, కుర్ర గుండెలకి నిద్ర పట్టకపోడమూ అంతే సహజం. సెలయేరు పాడే వీణపాటతో పాటుగా వేటూరి మార్కు 'చలి వేణువు' మళ్ళీ ప్రత్యక్షం ఇక్కడ. మామూలుగా జలదరింతని భయం లాంటి వ్యతిరేక భవనాలు చెప్పేందుకు వాడతారు కానీ ఈ సందర్భంలో కవి చేసిన  'చలువ తనువులో జలదరింత' ఆలోచించేకొద్దీ నచ్చేసే ప్రయోగం.  

"పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ  ఇసకల్లో.. 
తెల్లా మబ్బుల  వెల్లా వేసిన పిల్ల కాలువల్లో.. 
వచ్చీనాయమ్మా.. వచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. అలజడులొచ్చీనాయమ్మా.. "

పల్లవి చివర్లో కలువలు విచ్చాయి. తొలి చరణం చివరికి వచ్చేసరికి అలజడులొచ్చాయి. పాట మొదలైన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే సల్లాపాలు మరోమారు సరసానికి దారితీస్తున్నాయనిపిస్తుంది. ఇక, రెండో చరణానికి వస్తే:  

"లేత పచ్చికల అణకువ..  నును లేత మచ్చికల తొణకవ.. 
నిండు అల్లికల నవనవ..  తలదిండు మల్లికల శివశివ.. 
పట్ట పగటి ఎండే పండు వెన్నెలాయే.. 
నిట్ట నిలువు తపనే నిలువనీయదాయే.. "

ఒకసారి చెప్పిన దగ్గరితనాన్నే మళ్ళీ వేరే మాటల్లో చెప్పడం మిగిలిన కవులకి కష్టం కావచ్చేమో కానీ వేటూరికి కాదు. "తలదిండు మల్లికల శివశివ" ప్రయోగం మాత్రం పూర్తిగా వేటూరి మార్కు!

"ఓరా వాకిలి తీసీ తీయని  దోరా వయసుల్లో.. 
మాఘామాసపు మంచూ బెబ్బులి పొంచే వేళల్లో.. 
వచ్చీనాయమ్మా.. గిచ్ఛీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. వలపులు గిచ్ఛీనాయమ్మా.. "

అలజడులొచ్చి వలపుల్ని గిచ్చాయి.. అక్కడికీ వాకిలి ఇంకా పూర్తిగా తీయనే లేదు. అయితేనేం, పొంచి ఉన్న మంచు బెబ్బులి బోల్డంత దోహదం చేసింది దోర వయసుల వలపులకి. సంగీతాన్ని పక్కన పెట్టేసి కేవలం సాహిత్యాన్ని చూస్తే,  మాంచి రస దృష్టి ఉన్న కవి 'సంక్రాతి-కొత్తజంట' అంశం మీద రాసిన వచన కవితలా ఉంటుంది. తన తొలియవ్వనపు రోజుల్లో కృష్ణ ఒడ్డున విహరిస్తూ రాసుకున్న గాలిపాటని సినిమా కోసం ఇచ్చానని, ఈ పాట మీద విశ్వనాథ సత్యనారాయణ 'ఋతుసంహారం' కావ్య ప్రభావం ఉందనీ రాసుకున్నారు వేటూరి తన 'కొమ్మకొమ్మకో సన్నాయి' లో. 

మణిశర్మ చక్కని ట్యూన్ చేసినా, పార్థసారధి, చిత్ర అంతబాగా పాడలేకపోయారేమో అనిపిస్తుంది నాకు పాట విన్న ప్రతిసారీ. బోల్డన్ని గ్రాఫిక్స్ తో జగపతి బాబు-లయ ల మీద చిత్రించారు గుణశేఖర్. గ్రాఫిక్స్ లేకపోతే చిత్రీకరణ ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. కేవలం సాహిత్యం కోసం వినే పాటల్లో ఇదీ ఒకటి.

2 కామెంట్‌లు:

  1. ఆ గొంతులు భరించలేక వినే ధైర్యం చెయ్యని పాటండీ. మీ సహనానికి మరోమారు జోహార్లు. :) వినాలయితే. థాంక్యూ.

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: కేవలం సాహిత్యం కోసం వినే పాటల్లో ఒకటండీ.. ధన్యవాదాలు 

    రిప్లయితొలగించండి