గురువారం, అక్టోబర్ 03, 2019

హంసనాదమో .. పిలుపో ...  

"మురళికే చలి చెలి ప్రియా..
మరునికే గుడి మహాశయా.."

'రాజేశ్వరి కళ్యాణం' సినిమాలో "ఓడను జరిపే.." పాటని గురించి రాస్తూ ఉండగా గుర్తొచ్చిన పాట కోనేరు రవీంద్రనాథ్ నిర్మాణంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'లేడీస్ స్పెషల్' సినిమాలో వచ్చే యుగళగీతం "హంసనాదమో.. పిలుపో.."  రెండు సినిమాలూ ఒకే కాలంలో రావడం, ఒకే హీరో (సురేష్) నటించడంతో పాటు, రెండు పాటల్నీ రాసిన వేటూరి రెంటిలోనూ త్యాగరాజుని స్మరించుకోవడం ఈ రెండు పాటల మధ్యనా ఉన్న పోలికలు. 

సుస్వర బాణీల సృష్టికర్త సాలూరి రాజేశ్వరరావు సంతానంలో, రావాల్సినంత గుర్తింపు రానిది వాసూరావుకే అనిపిస్తుంది. ఈయన చేసిన మంచిట్యూన్లు వేరే వాళ్ళ పేర్లమీద చెలామణిలో ఉన్నాయన్నది ఒక వినికిడి. నిజానిజాలు తెలియవు. శాస్త్రీయ సంగీతం మీద మంచి పట్టున్న వాసూరావు, సినిమాలో కథానాయకుడు, నాయికకి తన ప్రేమని తెలిపే సన్నివేశంలో వచ్చే యుగళగీతానికి 'హంసనాదం' రాగంలో ట్యూన్ చేశారు. 'బంటురీతి కొలువు ఈయవయ్య రామా' అని త్యాగయ్య వేడుకున్నది ఈ రాగంలోనే!


"హంసనాదమో.. పిలుపో..
వంశధారలో..  వలపో..
సరిపా..  మపనీ పామా..
మదిలో..  విరిసింది ప్రేమా..
తొలకరి రాగాలేవో రేగే.." 

ఇది పల్లవి. 'వంశధార' ని ఎన్ని విరుపులతో, ఎన్నెన్ని రకాలుగా ప్రయోగించ వచ్చో వేటూరికి తెలిసినంత బాగా మరో కవికి తెలీదేమో. 'వంశ' ధార అన్న కొంటె ప్రయోగం మీద పూర్తి పేటెంటు వేటూరిదే.  హాయిగా సాగే రాగంలా వలపు మొదలయ్యింది. ఆ ప్రేమ, పెళ్ళికి దారితీయడం, అటుపై నాయికా నాయకులిద్దరూ పరిపూర్ణ జీవితాన్ని ఊహించుకోవడం చరణాల్లో వినిపిస్తుంది.  

"ఏ స్వప్న లోకాల ఆలాపన..
సంసార సుఖవీణ తొలికీర్తన.. 

బృందా విహారాల ఆరాధన..
నా ప్రాణ హారాల విరులల్లనా.. 

మురళికే చలి చెలి ప్రియా..
మరునికే గుడి మహాశయా.. 

కిసలయా ధ్వనే శ్రుతి లయ..
మదన మోహనా మృదంగ
తకధిమి తాళాలెన్నో రేగే... "

సంసార వీణ అనడం తెలుసు కానీ, దానికి సుఖాన్ని జోడించారు వేటూరి. ప్రేమ జంటకి పెళ్ళైన తొలిరోజులు కదా మరి. బృందావిహారాలు (హనీమూన్) కూడా అందుకే. మామూలుగా విరులతో (పువ్వులతో) హారాలు అల్లుతారు. కానీ, నాయిక చేత 'నా ప్రాణ హారాల విరులల్లనా" అని పలికించారు. బృందావనాన్ని కృష్ణుడితో ముడిపెట్టి "మురళికే చలి చెలి ప్రియా" అని అతని చేత అనిపించి, "మరునికే గుడి మహాశయా" అని ఆమెచేత బదులిప్పించారు. హనీమూన్లో ప్రధాన పాత్ర మరునిదే (మన్మధుడు) మరి. ఆ మరుని వాహనం చిలుక, ఆ చిలుక పలికే పలుకులు కిసలయలు. "మదనమోహనా మృదంగ తకధిమి తాళాలెన్నో" రేగడాన్ని గురించి ఇక్కడ వివరించబూనుకోవడం సభామర్యాద అనిపించుకోదు. 

"ఈ రీతి నీ బంటునై ఉండనా.. 
నీ సీతనై ఇంట కొలువుండనా..
బంటురీతి కొలువు
ఇయ్యవయ్య రామా.. 

త్యాగయ్య పాడింది హరి కీర్తన..
నీ పాట నా ఇంటి సిరి నర్తన..
కనులకే ఇలా స్వయంవరం..
గృహిణితో కదా ఇహం పరం.. 

కలయికే సదా మనోహరం.. 
స్వరస వాహినీ తరంగ
కథకళి లాస్యాలెన్నో రేగే..."
  

రెండో చరణానికి వచ్చేసరికి హనీమూన్ ముగిసి సంసారంలో పడ్డారు దంపతులు. అందుకే, "ఈ రీతి నీ బంటునై ఉండనా.. నీ సీతనై ఇంట కొలువుండనా.. బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా.. " అని పాడుతుంది నాయిక. ఈమె మరీ త్రేతాయుగం మనిషి (సినిమాలో వాణి విశ్వనాధ్ ఆహార్యం, పాత్రచిత్రణ కూడా ఇందుకు తగ్గట్టే ఉంటాయి). శాస్త్రీయ సంగీతాభిమానులకి  'హంసనాదం'  అనగానే గుర్తొచ్చే త్యాగయ్య కీర్తనని సందర్భోచితంగా సాహిత్యంలో జోడించడం కవిగా వేటూరి ప్రతిభకి తార్కాణం. నాయకుడూ ఆ కాలం వాడే, కాబట్టే 'నువ్వు పాడితే నా  ఇంట్లో లక్ష్మీదేవి నర్తిస్తుంది' అని జవాబిచ్చాడు. 

సీతారాముల ప్రస్తావన వచ్చింది కనుక, ఆ వెనుకే స్వయంవర దృశ్యం, ఏకపత్నీవ్రతం కూడా వచ్చేశాయి సాహిత్యంలోకి. పెళ్ళైన కొత్తల్లో ఉండే 'తకధిమి తాళాలు' తర్వాతి కాలంలో 'కథకళి లాస్యాలు' గా మారే సహజ పరిణామాన్ని అలవోకగా చెప్పేసినందుకు మరోమారు నచ్చేశారు వేటూరి. వాసూరావు ట్యూన్ వినిపించి, సందర్భం చెబితే కేవలం నాలుగు గంటల్లో పాట రాసి చేతిలో పెట్టారట. బాలూ, చిత్ర పాడిన తీరు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటుంది. సురేష్, వాణి విశ్వనాధ్ ల మీద సంసారపక్షంగానే  చిత్రించారు జంధ్యాల. 

4 కామెంట్‌లు:

  1. "సై రా" చిత్రం మీద మీ అభిప్రాయం విందామని వెయిటింగ్ ఇక్కడ, మురళి గారూ.

    రిప్లయితొలగించండి
  2. మీరు రాసినది చదివాక పాట వింటే వినే తీరే మారిపోతుంది!

    రిప్లయితొలగించండి
  3. "హంసనాదమో.. పిలుపో..
    వంశధారలో.. వలపో..
    సరిపా.. మపనీ పామా..
    మదిలో.. విరిసింది ప్రేమా..
    తొలకరి రాగాలేవో రేగే.." "- Disjointed sets లాగా ఉన్న ఈ పదాల కూర్పులో ఏమి ప్రత్యేకత ఉందొ నాకు అంతు పట్టడం లేదు.
    వేటూరి చేసే అనవసర జిమ్మిక్కుల మాయలో చాలామంది పడిపోవడం గమనించాను.
    వేటూరి పాటలో కనిపించే అనవసర అతి ధోరణి నాకు నచ్చదు.

    విశ్వనాథ్ సినిమాలలో మంచిపాటలే వ్రాశాడు. కానీ చక్రవర్తి వేటూరి కలిసి దారుణమైన కుంభీపాకాలు వండివార్చారు.
    Somehow I don't like fulsome praise. I see fans going gaga over Veturi and sitarama Sastry. Both are good lyricists and wrote many good songs and plenty of mediocre stuff.

    I wrote my opinion Murali Garu. No intention of belittling the post.

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు: భారీ సినిమాలకి నేను దూరమండీ (అతికొద్ది మినహాయింపులున్నాయి). చూడలేదు, చూడాలని అనుకోడం లేదు కూడా. ..ధన్యవాదాలు @కొత్తావకాయ: ధన్యవాదాలండీ.. @బుచికి: పల్లవితోనూ, చరణలతోనూ నాకెలాంటి ఇబ్బందీ లేదండీ.. బహుశా నేను చేసుకున్న అన్వయం వేరేమో (అదేమిటో టపాలో ప్రస్తావించాను కదా). లేదూ, మీరన్న 'అనవసర జిమ్మిక్కుల మాయలో' పడిపోయిన వాళ్లలో నేనూ ఉండి ఉంటాను. ఇష్టంలేని పాటని గురించి కూడా ఓపిగ్గా చదివి, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. 

    రిప్లయితొలగించండి