సోమవారం, జులై 29, 2019

ది గుడ్ ఎర్త్ (The Good Earth)

దేశమేదైనా, కాలం ఎలాంటిదైనా వ్యవసాయం చేసే రైతుల ఆలోచనలు, జీవనవిధానమూ ఒకేలా ఉంటాయని  తెలియజెప్పే నవల  చైనా రచయిత్రి పెర్ల్ ఎస్ బక్ ఆంగ్లంలో రాసిన 'ది గుడ్ ఎర్త్.' 1931 లో నాటి గ్రామీణ చైనాని చిత్రిస్తూ రాసిన ఈ నవలకి గాను పెర్ల్ బక్ పులిట్జర్ బహుమతిని అందుకున్నారు. అంతేకాదు, ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారానికి ఆమె ఎంపిక కావడానికి ఈ నవల కూడా దోహదం చేసింది.  ప్రపంచ సాహిత్యాభిమానులు మెచ్చిన ఈ నవలకి కొనసాగింపుగా మరో రెండు నవలలు రాశారామె. ఈ కథ ఇదే పేరుతో సినిమా గానూ విడుదలైంది.

కథానాయకుడు వాంగ్ లంగ్ పెళ్లి హడావుడితో కథ మొదలవుతుంది. కొద్దిపాటి వ్యవసాయ భూమి, ఒక చిన్న ఇల్లు మాత్రమే వాంగ్ ఆస్థులు. తల్లి మరణించింది. వృద్ధుడైన తండ్రి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాబట్టి, వాంగ్ పొలం పనులతో పాటు తన పెళ్లి పనులనీ తానే చేసుకోవాలి. పెద్దమొత్తంలో కన్యాశుల్కం చెల్లించగలిగే స్థితిపరుడు కాదు కాబట్టి, వాంగ్ తండ్రి తన కొడుకు కోసం ఓలాన్ అనే బానిస యువతిని వధువుగా ఎంచుతాడు. వాంగ్ వాళ్ళ పల్లెకి సమీపంలోని పట్టణంలో ఉండే జమీందార్ల ఇంట వంట మనిషిగా పనిచేస్తోంది ఓలాన్. ఆమె చిన్నపిల్లగా ఉండగా ఓ కరువు సంవత్సరంలో ఆమెని జమీందార్లకి బానిసగా అమ్మేశారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి కూతురి కోసం భయంభయంగా భవంతిలోకి అడుగుపెడతాడు వరుడు.

దంపతులుగా తన ఎదుట నిలబడ్డ వాంగ్, ఓలాన్ లని మనస్ఫూర్తిగా దీవిస్తుంది వృద్ధ  జమీందారిణి. ఆమె నల్లమందు మత్తులో జోగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మాటలు మర్చిపోతూ ఉంటుంది కూడా. "ఓలాన్ ఒళ్ళు దాచుకునే బానిస కాదు. కష్టపడి పనిచేస్తుంది. ఆమెలో నా కొడుకుల్ని మెప్పించేంత అందం లేదు. కనుక ఆమె కన్య అనే నేను భావిస్తున్నాను. నీ ఇంటికీ, పొలానికీ ఆమె చాకిరీ చేస్తుంది. నీకు కొడుకులని కనిస్తుంది. మీ మొదటి కొడుకుని ఎత్తుకుని నా  దగ్గరికి రండి," అంటూ కొత్త దంపతులని తన భవనం నుంచి సాగనంపుతుంది. జమీందారిణి  మాటలు అక్షరాలా నిజం. వాంగ్ లంగ్ ఇంటికీ, పొలానికీ ఓలాన్ తన శ్రమనంతటినీ ధారపోసింది.

ఏడాది తిరిగేలోగా మగబిడ్డకి జన్మనిచ్చింది ఓలాన్. రోజంతా పొలంలో పనిచేసి, నొప్పులు వస్తుండగా ఇంటికి వెళ్లి మరో మనిషి సాయం లేకుండా బిడ్డని కనడమే కాదు, మర్నాటి నుంచీ ఇంటి పనులు, పొలం పనులూ యధావిధిగా అందుకుంది. బిడ్డకి పాలిచ్చి పొలం గట్టున పడుకోబెట్టి, పొలంలో వంగి పని అందుకుంటే ఓలాన్ చనుబాలతో పొలం తడిసేది. ఆ ఏడు పంట విరగపండింది. పట్నంలో పంటని అమ్మి, వెండి నాణేలమూట రొంటిన దోపుకుని ఇంటికి వచ్చాడు వాంగ్ లంగ్. నూతన సంవత్సరం పండగ వస్తోంది. భార్యకీ కొడుక్కీ కానుకలు కొనాలి.

ఓలాన్ బహు పొదుపరి. పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండానే ఇంటిల్లిపాదికీ అందమైన కొత్త దుస్తులు అమరుస్తుంది. భర్తకీ కొడుక్కీ పాదరక్షల్ని స్వయంగా తయారు చేస్తుంది. అంతేకాదు, తాను పనిచేసే చోట వంటబట్టించుకున్న పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని వినియోగించి పల్లెలో ఎవరూ తయారుచేసుకోని వంటకాల్ని సిద్ధం చేస్తుంది కూడా. జమీందారిణి ఆదేశం ప్రకారం, భార్యనీ కొడుకునీ ఆమె దర్శనానికి తీసుకెళ్తాడు వాంగ్ లంగ్. ఈసారికి జమీందారిణి అంతఃపురంలో ఉంటుంది. మగవాళ్ళకి అక్కడ ప్రవేశం లేదు. బయటే నిలబడిపోతాడు వాంగ్ లంగ్.  తిరిగి వచ్చిన ఓలాన్ ఇంటికి వెళ్లే దారిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది భర్తతో. 


జమీందారు పరిస్థితి బాగా లేదనీ, డబ్బుకి కటకటగా ఉండడంతో కొంత  పొలాన్ని అమ్మాలని అనుకుంటున్నారన్నది ఆమె మాటల సారాంశం. "ఎటూ మన దగ్గర వెండి ఉంది కదా, ఆ పొలాన్ని మనమే ఎందుకు కొనకూడదు?" అన్న ఆలోచన వస్తుంది ఇద్దరికీ. దారి పొడవునా తర్జనభర్జనలు పడతారు. ఏ ఇంటి నుంచి తనో బానిసని భార్యగా తెచుకున్నాడో, అదే ఇంటి వాళ్ళ పొలాన్ని తాను కొనబోవడం అన్న ఊహ చాలా బాగా నచ్చేస్తుంది వాంగ్ లంగ్ కి. పొలాన్ని కొనేస్తాడు. మరి రెండేళ్లు గడిచేసరికి మరో మగపిల్లాడు, ఆడపిల్ల కలుగుతారు. జమీందార్ల నుంచి మరికొంత పొలం కొంటాడు వాంగ్ లంగ్. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఉన్నట్టుండి కరువొస్తోంది. వర్షాల్లేవు. పంటల్లేవు. డబ్బు లేదు. ఒకవేళ డబ్బులున్నా కొనేందుకు ఏమీ దొరకని పరిస్థితి.

వాంగ్ లంగ్ ఎదుగుదల అతని చిన్నాన్నకి కంటగింపవుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాడికి  ఆ కరువు కాలంలో అవకాశం దొరుకుతుంది. తల్లిపాల బలం వల్లనేమో కానీ, కరువు రోజుల్లో ఊళ్ళో పిల్లలంతా డొక్కలెండిపోయి ఉంటే, వాంగ్ లంగ్ పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉంటారు. వాంగ్ లంగ్ తన ఇంట్లో తిండి గింజలు దాచుకున్నాడనీ అందుకే అతడి పిల్లలు మాత్రమే మిసమిసలాడుతూ ఉన్నారనీ పితూరీ లేవదీస్తాడు చిన్నాన్న. దాంతో, ఊరందరూ వాంగ్ లంగ్ ఇంటిమీద కరువు దాడి చేస్తారు. కానీ ఆ ఇంట్లో తిండి గింజలు దొరకవు. రోజులు గడవడం మరింత భారమవుతుంది. తప్పని పరిస్థితుల్లో కుటుంబంతో సహా నగరానికి వలస వెళ్తాడు వాంగ్ లంగ్.

ఓ పెద్ద భవంతి ప్రహరీ గోడ పక్కన గుడారాన్ని నిర్మించుకుంటుంది ఆ కుటుంబం. వాంగ్ లంగ్ రిక్షా లాగడం మొదలు పెడతాడు. ఓలాన్, పిల్లల్నీ, మావఁగార్నీ తీసుకుని భిక్షాటనకు బయలుదేరుతుంది. నగర ప్రముఖులు ఏర్పాటు చేసిన గంజి కేంద్రాల్లో నామమాత్రపు ధరకి ఆహారం దొరుకుతుంది. కానీ, కరువు రోజుల్లో ఆ మొత్తాన్ని సంపాదించడమూ అసాధ్యమే. రోజులు బరువుగా గడుస్తూ ఉంటాయి. వాంగ్ లంగ్ దృష్టంతా ఊరిమీదా, తన పొలాలమీదా ఉంటుంది. కరువు దాడుల్లో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ గురించి విన్నప్పుడు, తన భూమిని ఎవరూ దోచుకోలేరని తృప్తి పడతాడు వాంగ్ లంగ్. కానీ ఎప్పటికన్నా మంచిరోజులు వస్తాయా అన్న చింత అతన్ని తొలిచేస్తూ ఉంటుంది. అదే విషయాన్ని తన పక్క గుడిసెలో ఉండే అతన్ని అడుగుతాడు.

"ధనవంతుడు మరింత ధనవంతుడు అయినప్పుడు, పేదవాడు మరింత పేదవాడు అయినప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయి" అని భరోసా ఇస్తాడతను. ఆ మాటలు అర్ధం కాకపోయినా, ఆ మంచిరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వాంగ్ లంగ్. అనుకోని విధంగా ఆ మంచి రోజు వస్తుంది. వాంగ్ లంగ్ తన ఊళ్ళో ఎవరూ ఊహించనంత పొలాన్ని కొంటాడు. కొడుకుల్ని చదివిస్తాడు. కవలపిల్లలకు (ఆడ, మగ) జన్మనిస్తుంది ఓలాన్. వాళ్ళ జీవితాల్లో వచ్చిన అనూహ్యమైన మార్పులు, మట్టినే నమ్ముకుని బతికిన ఆ కుటుంబం మట్టికి దూరంగా జరిగేలా చేసిన పరిస్థితులు తెలుసుకోవాలంటే 354 పేజీల 'ది గుడ్ ఎర్త్' చదవాల్సిందే.

ఈ నవల చదువుతున్నంతసేపూ డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రాసిన 'మట్టిమనిషి,'  శివరామ కారంత్ కన్నడ నవల 'మరళి మణ్ణిగె' ('మరల సేద్యానికి' పేరిట అందంగా తెనిగించారు ఆచార్య తిరుమల రామచంద్ర) పదేపదే గుర్తొచ్చాయి. ఈ ఇద్దరు రచయితలనీ పెర్ల్ బక్ రచన ప్రభావితం చేసింది అనడం నిర్వివాదం. వాంగ్ లంగ్-ఊరుబోయిన సాంబయ్య, ఓలాన్-పారోతి పాత్రల మధ్య పోలికలు సుస్పష్టం.  ఇవాళ్టికీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని ఆనాడే తన నవలలో చిత్రించడం పెర్ల్ బక్ ముందు చూపుకు నిదర్శనమా లేక వ్యవసాయం చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు లేదన్న సంకేతమా అన్న ప్రశ్న రాక తప్పదు. 'ది గుడ్ ఎర్త్' మార్కెట్లోనూ, ఆన్లైన్లోనూ దొరుకుతోంది.

2 కామెంట్‌లు: