బుధవారం, ఏప్రిల్ 03, 2019

కీలుబొమ్మలు

తప్పక చదవాల్సిన తెలుగు నవలల జాబితాని ఎవరు ప్రకటించినా అందులో తప్పకుండా ఉండే పేరు  జి.వి. కృష్ణారావు రాసిన 'కీలుబొమ్మలు.' గుంటూరు జిల్లా కూచిపూడి (అమృతలూరు) కి చెందిన గవిని వెంకట కృష్ణారావు 1951 లో రాసిన ఈ నవల మానవ మనస్తత్వ విశ్లేషణకి, విలువల చిత్రణకీ పెద్దపీట వేసింది. మార్క్సిస్టు నుంచి మానవవాది (ఎమ్మెన్ రాయ్) గా మారిన కృష్ణారావు, ఈ రెండు రాజకీయ సిద్ధాంతాలనీ నవలలో ముఖ్యమైన మలుపుల దగ్గర ప్రస్తావించారు.

కోస్తా ప్రాంతంలోని ఓ పల్లెటూరు 'కీలుబొమ్మలు' నవలలో కథాస్థలం. ప్రధాన పాత్ర పుల్లయ్య ఆ ఊళ్ళో మోతుబరి రైతు. పెద్దకొడుకు అకాల మరణం మినహా అతడి జీవితంలో లోటేమీ లేదు. కోడల్ని, మనవడిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఉన్న ఒక్క కూతుర్ని, చిన్న కొడుకుని బస్తీలో పెట్టి చదివిస్తున్నాడు. ఇంటి పెత్తనం అంతా భార్య లక్ష్మమ్మదే. ఊరికి పెద్దమనిషే అయినా, ఇంట్లో పుల్లయ్య కూడా ఆవిడ మాటకి సరే అనాల్సిందే. భార్యతో చెప్పకుండా ఏపనీ చేయని పుల్లయ్య, గ్రామస్తుడు చంద్రశేఖరం మార్వాడీ దగ్గర చేసిన ఐదువేల రూపాయల అప్పుకి మాత్రం హామీ పడతాడు.

చంద్రశేఖరం బాగా చదువుకున్న, డబ్బున్న కమ్యూనిస్టు. ఊళ్ళో ఫ్యాక్టరీ నిర్మించి కార్మికులకి సకల సౌకర్యాలూ ఏర్పాటు చేస్తాడు. అయితే, అతనికి వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో ఫ్యాక్టరీకి నష్టాలు మొదలవుతాయి. కార్మికులతో చర్చలు జరిపి, సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుదామని ప్రతిపాదిస్తాడు. కార్మికులు మాత్రం లాభనష్టాలతో తమకి సంబంధం లేదనీ, జీతభత్యాలు, సౌకర్యాలు మరింత పెంచాల్సిందేననీ తెగేసి చెబుతారు. తన సొమ్మే కాక, మామగారి సొమ్ము మొత్తం తెచ్చి పెట్టుబడి పెట్టినా, ఫ్యాక్టరీ దివాళా తీయడంతో ఆ రెండు కుటుంబాలూ వీధిన పడతాయి. 


ఫ్యాక్టరీని నిలబెట్టడం కోసం చంద్రశేఖరం చేసిన అప్పుల్లో పుల్లయ్య హామీ ఉన్న మార్వాడీ అప్పు ఒకటి. అయితే, పుల్లయ్య హామీ సంతకం చేసినట్టుగా సాక్ష్యం లేదు. చంద్రశేఖరం తరపున పుల్లయ్య మార్వాడీకి బాకీ తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. నిజానికి పుల్లయ్యకి చంద్రశేఖరం మీద సానుభూతి ఉంది. చెల్లించాల్సిన మొత్తమూ లెక్కలోది కాదు. కానీ, హామీ విషయాన్నీ అతడు తన భార్య నుంచి దాచాడు. ఇప్పుడు బయట పడితే ఆమె గొడవ చేయచ్చు. చంద్రశేఖరం బాకీ తాను తీరిస్తే, ఊళ్ళో తన పరపతి తగ్గొచ్చు. ఈ ఆలోచనల్లో ఉండి ఎటూ తేల్చుకోకుండానే, తానేమీ హామీ పడలేదని అర్ధం వచ్చేలా గొణుగుతాడు పుల్లయ్య.

అక్కడినుంచి అనూహ్యంగా పరిస్థితులు మారిపోతాయి. తాను అభిమానించిన చంద్రశేఖరం మీద ఫోర్జరీ కేసు పెట్టాల్సి వస్తుంది పుల్లయ్యకి. అతడి మనస్సాక్షికి, లోకరీతికీ మధ్య సంఘర్షణ. పుల్లయ్య దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న సత్యనారాయణకి హామీ విషయం తెలుసు. కానీ ప్రభుభక్తి, ఉద్యోగభయం అతన్ని నోరు మెదపనివ్వవు. పట్నంలో చదువుకుంటున్న పుల్లయ్య కొడుకు రామారావు కమ్యూనిస్టు సానుభూతి పరుడు. చంద్రశేఖరం ఫోర్జరీ చేశాడని నమ్మలేని రామారావు తన తండ్రిని అనుమానిస్తాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి అనూహ్యమైన ముగింపుకి చేరుతుంది.

పుల్లయ్య, చంద్రశేఖరాల కుటుంబాలతో పాటు, ఆదర్శభావాలతో ఊరి వాళ్లకి వైద్యం చేసే వాసుదేవ శాస్త్రి, సంఘసేవిక ముసుగులో రాజకీయాలు చక్కబెట్టే అమ్మాయమ్మ, ఊళ్ళో పుల్లయ్య ప్రత్యర్థి మల్లయ్య ఇతర ముఖ్య పాత్రలు. మానసిక సంఘర్షణలు, స్త్రీపురుష సంబంధాలని చిత్రించిన తీరు బుచ్చిబాబు 'చివరికి మిగిలేది' ని జ్ఞాపకం చేస్తుంది. వ్యంగ్యాన్ని కథనంలో భాగం చేశారు రచయిత. తాను సృష్టించిన ప్రతి పాత్ర పట్లా రచయిత సానుభూతి చూపడం, ప్రతి పాత్రకీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఈ నవల ప్రత్యేకత. అలకనంద ప్రచురణలు తాజాగా ప్రచురించిన 'కీలుబొమ్మలు' నవల  అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. పేజీలు: 204, వెల రూ. 100.

4 కామెంట్‌లు:

  1. ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నాను - మీ పుస్తక పరిచయాలు చదివి నేను బోల్డన్ని మంచి మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. ధన్యవాదాలు.

    మిమ్మల్ని ఒకసారి డి. కామేశ్వరి గారి "జీవితం చేజారనీకు" నవల గురించి అడిగాను. అది ప్రస్తుతానికి teluguone.com వారి గ్రంథాలయంలో వుంది - Just FYI :)

    రిప్లయితొలగించండి
  2. @లలిత టీఎస్: ఆచార్య సి. మృణాళిని ఐ డ్రీమ్స్ కోసం 'అక్షరయాత్ర' అనే సిరీస్లో రచయితల్ని ఇంటర్యూలు చేస్తున్నారండీ.. డి. కామేశ్వరి గారి ఇంటర్యూ కూడా ఉంది, కుదిరినప్పుడు చూడండి. ఆ నవలలో పాటు, తన మిగిలిన రచనలగురించి కూడా చాలా వివరంగా చెప్పారావిడ. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఒకటి రెండు వారాలలో జిలేబి‌ గారి తో ఇంటర్వ్యూ రాబోతోంది తప్పక చూడ వలె :)


      ఇట్లు
      జిలేబి

      తొలగించండి
  3. మురళిగారు: మంచి ఇంటర్వ్యూ సిరీస్ గురించి చెప్పారు. అక్షరయాత్ర తప్పక చూస్తాను.
    జిలేబిగారు: నిజంగా? ఎప్పుడొస్తుందో చెప్పండి. అందులో మీరు యామినీపూర్ణతిలకలా యవనికకి అవతల వుండి మాట్లాడరు కదా?!

    రిప్లయితొలగించండి