శనివారం, జులై 08, 2017

మంచివృక్షం

"త్రిపుర కథల్లో భగవంతం, శేషాచలపతి లాగా మీ రచనల్లో సుందరం, వీరా తరచుగా కనిపిస్తూ ఉంటారు, ఏదో కారణం ఉండే ఉంటుంది కదూ?" ... "మీ రచనల్లో కనిపించే 'మోహిని' గ్లోబలైజేషన్ కి ప్రతీక అనుకుంటున్నాను, కరెక్టేనా?" ...ఎప్పుడైనా ఆయన ఎదురుపడితే ఈ ప్రశ్నలు అడిగి, జవాబులొస్తే కనుక, కొనసాగింపుగా "మీ తొలిరచనల్లో మార్కిస్టు-లెనినిస్టు (ఎమ్మెల్) రాజకీయాల పట్ల కనిపించిన ఆరాధన, కాలం గడిచే కొద్దీ కరిగిపోతూ, అవే రాజకీయాలని వ్యంగ్యంగా ప్రస్తావించడం కనిపిస్తుంది, దీన్ని కాలం తెచ్చిన మార్పు అనుకోవాలా?" లాంటి ప్రశ్నలెన్నో అడగాలనుకున్నాను. కానీ, ఇక అడగలేను. ఇవాళ్టినుంచీ ఇవన్నీ ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలే. జవాబులివ్వాల్సిన డాక్టర్ వి. చంద్రశేఖర రావు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయారు.

పాతికేళ్లుగా ఆయన కథలు చదువుతూ ఉన్నా, చంద్రశేఖర రావుని గురించి ఆగి, ఆలోచించింది మాత్రం 'ఆకుపచ్చని దేశం' నవల చదివినప్పుడే. అత్యాధునిక కవిత్వాన్ని ఓ కొరుకుడు పడని విషయంగా భావించే నేను, ఆ నవల్లో కవితాత్మక వచనానికి ముగ్ధుణ్ణయిపోయాను. చివరిపేజీ చదివిన వెంటనే మళ్ళీ మొదటి పేజీకి వచ్చి ఆపకుండా చదివేసిన కొన్ని పుస్తకాల్లో అదీ ఒకటి. కొన్ని రోజుల పాటు నవల్లో చెంచులు అక్షరాలా నన్ను వెంటాడారు. అత్యంత బలహీనమైన, అత్యంత పట్టుదల కలిగిన మనుషుల గుంపు అడివి వెంబడి అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం అప్పుడప్పుడూ గుర్తొచ్చి గగుర్పాటు కలుగుతూ ఉంటుంది.

చంద్రశేఖరరావు మీద గౌరవం మరో మెట్టు పైకెక్కి, ఎప్పటికైనా కలవాలి అని బలంగా అనుకోడానికి కారణం కూడా నవలే. ఆ నవల పేరు 'నల్లమిరియం చెట్టు.' సాంఘికంగానూ, రాజకీయంగానూ కూడా అత్యంత సున్నితమైన అంశాన్ని తీసుకుని, నిర్మొహమాటంగా, నిస్పక్షపాతంగా రాసిన నవల అది. కొన్ని పేజీలని వెనక్కి తిప్పి మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, కథలో వచ్చే కొన్ని మలుపులు 'నిజమేనా?' అని కళ్ళు నులుముకుని మరోసారి చదువుకోవడం ఆ నవల చదివిన నాటి జ్ఞాపకాలు. వస్తువు, శైలీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, పాఠకులని ఆశ్చర్యంలో ముంచెత్తే శిల్పంతో ఆపకుండా చదివించేలా, చదివిన తర్వాత కూడా ఆలోచించేలా నవలలు రాయడం, అదికూడా తెలుగు నవల క్షీణ యుగంలో ఉండగా రాయడం - బహుశా ఆయనపట్ల నాక్కలిగిన గౌరవానికి కారణాలు.

నాకు తెలిసినంత వరకూ మొత్తం ఆరు పుస్తకాలు - మూడు కథా సంపుటాలు, మూడు నవలలు - తెలుగు సాహిత్యానికి ఆయన కంట్రిబ్యూషన్. రచనల్లోలాగే, ప్రచురణలోనూ నాణ్యతకి రాజీ పడలేదాయన. "చంద్రశేఖర రావు గారు పుస్తకాలు సొంతంగా వేసుకుంటారు. కవర్ పేజీ నుంచి, లేఔట్ వరకూ అన్నీ ఆయన ఇష్ట ప్రకారం జరగాలి. హై క్వాలిటీ పుస్తకానికి చాలా నామినల్ రేటు పెడతారు," సుమారు రెండేళ్ల క్రితం ఓ పబ్లిషర్ నుంచి ఈ మాటలు విన్నప్పుడు ఆయన పుస్తకాలని ఈ కోణం నుంచి చూశాను. పబ్లిషర్ మాట అసత్యం కాదు. వైద్య వృత్తిని అభ్యసించి, ఎమ్మెల్ రాజకీయాలని అభిమానించి, రైల్వేలో ఉన్నతోద్యోగం చేస్తూ, సాహితీ యాత్రని కొనసాగించిన చంద్రశేఖర రావు చేయాల్సిన, తాను మాత్రమే చేయగలిగిన రచనలు చాలా చాలా ఉన్నాయి. 

నిజానికి సరిగ్గా వారం క్రితం 'ద్రోహవృక్షం' కథా సంకలనం గురించి టపా రాయాలని మొదలు పెట్టాను. ఎప్పడూ లేనన్ని అవాంతరాలు. ఇవాళ ఎలాగైనా ఆ టపా పూర్తి చేయాలి అనుకుంటూ ఉండగా ఆయన ఇక లేరన్న నమ్మశక్యం కాని వార్త. రెండు నవలల్లోనూ 'అలలసుందరం' 'రాజసుందరం' పాత్రలు జ్ఞాపకం ఉండిపోతే, 'ద్రోహవృక్షం' లోని మొత్తం ఇరవై కథల్లో చాలా కథల్లో కథా నాయకుడు 'సత్యసుందరం.' అన్నదమ్ముల్లా కలిసున్న మాల, మాదిగల మధ్య రాజకీయంగా పబ్బం గడుపుకోడం కోసం కొందరు నాయకులు పెట్టిన చిచ్చు ఎలాంటి పరిణామాలని దారితీసిందో ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'ద్రోహవృక్షం.' ఒక్క రాజకీయాలనే కాదు, అన్ని వ్యవస్థల్లోనూ పెరిగిపోతున్న అరాచకాన్ని కళ్ళకి కట్టారు ఈ సంపుటంలో కథల్లో.

నిస్పక్షపాతంగా రచనలు చేసే రచయిత(త్రు)లు అరుదైపోతున్న కాలంలో, ఒక కమిట్మెంట్ తో రచనలు చేసిన రచయిత చంద్రశేఖర రావు. ప్రతీకల్ని వాడుకోవడంతో తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకోడమే కాదు, తాను సృష్టించిన లోకంలోకి పాఠకుణ్ణి అలవోకగా తీసుకుపోయే విద్యలో ఆరితేరారు కూడా. ముఖ్యంగా, గ్లోబలైజేషన్ అనంతర పరిణామాలని నిశితంగా పరిశీలించి కథలుగా మలిచారు. తెలుగు సాహిత్య వాతావరణంలో చంద్రశేఖర రావు లాంటి రచయితల అవసరం పెరుగుతున్న సమయంలోనే, ఆయన అనారోగ్యంతో కన్నుమూయడం అత్యంత దురదృష్టకరం. తెలుగు సాహితీ వనంలో ఓ మంచివృక్షం డాక్టర్ వి. చంద్రశేఖర రావుకి కన్నీటి నివాళి.

5 కామెంట్‌లు:

  1. 'రచయితగా నేను spectator గా ఉండిపోవాలనుకున్నాను. పాత్రలే వాటి logical extensions/ conclusions యివ్వాలనే నేననుకున్నాను. దుఃఖపు తడో, ఆపుకోలేని ఆవేశమో, ఆగ్రహమో ఏదీ నాకు అంటకుండా జాగ్రత్తపడ్డాను.'

    నల్లమిరియం చెట్టు కి రాసుకున్న ముందుమాటలో రచయిత. ఇంత విజ్ఞతనీ, లౌల్యమెరుగని మప్పితమబ్బిన కథకుడినీ మళ్ళీ ఇప్పట్లో చూడగలమా!

    రిప్లయితొలగించండి
  2. ద్రోహవృక్షం కథ ద్వారా కమ్యూనిస్టు పార్టీల మధ్య వివాదాలు, విభేదాల గుట్టుమట్లను బైటపెట్టి ద్రోహం చేశారని చంద్రశేఖరరావుగారి మీద ఎర్రోళ్ళు (ఏ కొమ్మనో గుర్తులేదు) చదివినట్టు గుర్తు... ఆయన ఈయనేనా!

    రిప్లయితొలగించండి
  3. @కొత్తావకాయ: చూడగలిగే వాతావరణం కనిపించడం లేదండీ :( ..ధన్యవాదాలు
    @పురాణపండ ఫణి: కాదండీ, కేవలం 'ద్రోహవృక్షం' కథ అయితే రిజర్వేషన్ల కోసం మాల-మాదిగ కులాల మధ్య పెరిగిన దూరం, దాని వెనుక ఉన్న రాజకీయ కారణాల గురించి.. మిగిలిన కథల్లో మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాలని గురించి ఉన్నదున్నట్టు మాట్లాడారు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  4. @Adabala: 'ఫిదా' చూడడం వీలవ్వలేదండీ.. చూస్తే తప్పకుండా రాస్తాను.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి