సోమవారం, జులై 11, 2016

మా జ్ఞాపకాలు

సుప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ప్రచురించిన తాజా సంకలనం 'మా జ్ఞాపకాలు.' బుచ్చిబాబు భార్య, రచయిత్రీ అయిన శివరాజు సుబ్బలక్ష్మి, బుచ్చిబాబుతో గడిపిన రోజులని జ్ఞాపకం చేసుకుంటూ, నాటి విశేషాలని వ్యాసాలుగా రాస్తే, 'చినుకు' పత్రిక పాతిక భాగాలుగా ప్రచురించింది. వాటన్నింటినీ కలిపి పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది విశాలాంధ్ర. ఇవి కేవలం బుచ్చిబాబు, సుబ్బలక్ష్మిలకి సంబంధించిన విశేషాలు మాత్రమే కాదు, ముప్ఫయ్యేళ్ళ  కాలంలో ఆంధ్ర దేశంలో జరిగిన అనేక పరిణామాల తాలూకు పరామర్శ కూడా.

పన్నెండేళ్ల వయసులో బుచ్చిబాబుకి భార్యగా అత్తవారింట అడుగుపెట్టిన సుబ్బలక్ష్మి, ముప్ఫయ్యేళ్ళ పాటు బుచ్చిబాబుతో కలిసి జీవించారు. 1967 లో బుచ్చిబాబు అకాలమరణం పాలైనప్పటి నుంచీ ఒంటరి జీవితం గడుపుతున్నారు. కథలు, నవలలు, వ్యాసాలు రచించడం, పెయింటింగ్స్ చేయడం ఆవిడ వ్యాపకాలు. నవ వధువుగా అత్తింటి జ్ఞాపకాల మొదలు, బుచ్చిబాబు చివరి రోజుల వరకూ జరిగిన ఎన్నో విశేషాలను అక్షరబద్ధం చేశారు. వ్యాసాల వరుసలో చెప్పాలంటే 'మల్లెమొగ్గ చెంబు మళ్ళా దొరికింది' మొదలు 'అభిమానం అంటే ఇదేనేమో' వరకూ.

అత్తవారింట్లో మనుషుల మనస్తత్వాలని గురించి ఆవిడ రాసింది చదువుతుంటే బుచ్చిబాబు కథల్లో కొన్ని పాత్రలు అదాటున గుర్తొస్తాయి. అలాగే, బుచ్చిబాబుతో కలిసి తిరిగిన ఊళ్ళు, చేసిన యాత్రలు కూడా కథల్లో సంఘటనలని జ్ఞాపకం చేస్తాయి. తొలుత అనంతపురంలోనూ, తర్వాత విశాఖపట్నంలోనూ లెక్చరర్ గా పనిచేసిన బుచ్చిబాబు, ఆకాశవాణి లో ఉద్యోగం రావడంతోనే మద్రాసుకి మకాం మార్చారు. అదే సమయంలో 'చివరకు మిగిలేది' నవల 'నవోదయ' పత్రికలో సీరియల్ గా రావడం, నాటి సాహితీ ప్రముఖులంతా బుచ్చిబాబు ఇంటికి వచ్చి నవలని గురించి చర్చించడం, వారికి అతిధి మర్యాదలు చేస్తూనే చర్చలని చెవి వొగ్గి వినడాన్ని గురించి గుర్తు చేసుకున్నారు సుబ్బలక్ష్మి.


సుబ్బలక్ష్మి కథల్ని 'ఇవి ఇంగ్లీష్ లోకి అనువాదం అవ్వాల్సినవి' అంటూ ప్రోత్సహించిన బుచ్చిబాబు, పెయింటింగ్స్ విషయంలో మాత్రం ఆమె వేసిన చిత్రాల కన్నా తాను చిత్రించినవే బాగున్నాయన్న అభిప్రాయంతో ఉండేవారట. తాను అభిమానించే ఇంగ్లీష్ రచయితల పుస్తకాలు మార్కెట్లోకి రాగానే కొనడం, సుబ్బలక్ష్మి చేత వాటికి అట్టలు వేయించుకోవడం బుచ్చిబాబుకి  ఇష్టమైన పనుల్లో ఒకటి. గాంధీ, నెహ్రూ, రమణ మహర్షిలని కలుసుకోడాన్ని అపురూపంగా గుర్తుచేసుకున్నారు. అలాగే, స్వతంత్రం  రాగానే నెహ్రూ చేయబోయే రేడియో ప్రసంగాన్ని వినడం కోసం రేడియో సెట్ కొనుగోలు చేయడం కూడా (అప్పట్లో రేడియోలకి రేషన్, పెద్ద రికమండేషన్ ఉంటే తప్ప దొరకని పరిస్థితి).

విశ్వనాథ సత్యనారాయణ, ఆచంట జానకిరామ్, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు లాంటి సాహితీ ప్రముఖులెదంరో ఆ ఇంటికి తరచూ వచ్చే అతిధులు. వచ్చిన వారి సంప్రదాయాన్ని అనుసరించి మర్యాదలు చేయాలి. (భోజనానికి వచ్చినప్పుడు తనకి ఏం వండాలో విశ్వనాథే స్వయంగా చెప్పేవారట). సాహిత్య విశేషాలతో పాటు, కాలంతో పాటు అత్తింటి, పుట్టింటి పరిస్థితుల్లో వఛ్చిన మార్పులు, నెలల తరబడి ఇంట్లో తిష్ట వేసే దూరపు బంధువుల బెడద లాంటి కబుర్లనీ జ్ఞాపకం చేసుకున్నారు. నాటి కవిపండితుల అలవాట్లు, వ్యవహార శైలి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి ఈ పుస్తకపు పేజీల్లో.

బుచ్చిబాబు పేరు చెప్పగానే గుర్తొచ్చే 'చివరకు మిగిలేది' గురించిన విశేషాలెన్నో. బంధువులు కథ అర్ధం కావడం లేదని గొడవ చేస్తే, స్నేహితులేమో 'నవల్లో స్త్రీ పాత్రలు నిజంగా బుచ్చిబాబుకి సన్నిహితమైన మహిళలా?' అని అడిగేవారట. ఆనాటి రేడియో కార్యక్రమాల తీరుతెన్నులు, సినిమాల సంగతులనీ సందర్భానుసారంగా ప్రస్తావించారు. తన చుట్టూవున్న మనుషుల్లో ఎవరికీ దైవత్వం ఆపాదించలేదు, అలాగని తూలనాడనూ లేదు. విశాలాంధ్ర వారి ప్రచురణలో తగుమాత్రం అచ్చుతప్పులు సాధారణమే కానీ, ఈ పుస్తకంలో ముద్రా రాక్షసాలు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. కొన్ని సార్లు వాక్యాలు కూడబలుక్కుని మళ్లీ మళ్లీ చదువుకుని అర్ధం చేసుకోవాలి. 'అంపశయ్య' నవీన్ ముందుమాట నిరాశ పరిచింది. రచనకి మాత్రం వంక పెట్టేందుకు లేదు. (పేజీలు 128, వెల రూ. 100, విశాలాంధ్ర అన్ని శాఖలూ).

3 కామెంట్‌లు:

  1. చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు, మీదైన ఆకట్టుకొనే శైలిలో..
    వెంటనే పుస్తకం చదవాలన్నంతగా ఉంది మీ పోస్ట్.
    బుచ్చిబాబు ' చివరకు మిగిలేది' కూడా అందరికి మల్లె నాకూ బాగా నచ్చిన నవల. అది మిరిదివరకు పోస్ట్ చేసారో, లేదో తెలియదు. చేస్తే లింక్ పంపరూ...లేనట్టైతే తప్పకుండ రివ్యూ చేయండి. ఎందుకంటే మీ రివ్యూస్ చాలా కట్టిపడేస్తాయి. కోమలి, అమృతం వగైరా ఇతర స్త్రీ పాత్రలు ఇప్పటికీ కలలో కూడా వేన్నాడుతాయి..
    'చీకటి సంకెళ్ళ' లో ' అమృతం తన శ్వాసలో మల్లెపూలు కాలిన పరిమళం చుట్టేసింది'.. కనుక. ఆ శ్వాస ఇప్పటికి మనల్ని సజీవంగా ఉంచుతుంది కనుక.
    సో, దయచేసి లింక్ పంపండి.
    -భాస్కర్ కూరపాటి.

    రిప్లయితొలగించండి
  2. Sir, gowtami putra satakarni pustakam r novel gurinchi emyna blog rasara

    రిప్లయితొలగించండి
  3. @భాస్కర్: 'చివరకు మిగిలేది' గురించి రాయలేదండీ.. అమృతం గురించి 'నాయికలు' లో రాశాను. పూర్తి నవల గురించి రాయాలి ఎప్పుడైనా.. ..ధన్యవాదాలు..
    @కిరణ్ బి: గౌతమిపుత్ర శాతకర్ణి గురించి రాయలేదండీ.. శాతవాహనుల చరిత్ర ఆధారంగా అడివి బాపిరాజు రాసిన 'హిమబిందు' నవల గురించి రాశాను, చాలా రోజుల క్రితం.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి