శనివారం, ఆగస్టు 29, 2015

అదీ సంగతి ...

హోటల్ డైనింగ్ హాల్ అంతా హడావిడిగా ఉంది. శనివారం సాయంత్రం టిఫిన్స్ అన్-లిమిటెడ్ బఫే ఆఫర్. పెద్దలూ, పిల్లలూ అన్న భేదం లేకుండా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆబాలగోపాలమూ అక్కడే ఉన్నారు. మెనూ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇడ్లీ, కోకోనట్ ఇడ్లీ, పకోడీ, పుణుకులు, పెసరట్, ఉప్మా, పుల్కా విత్ రాజ్మా కర్రీ, నూడుల్స్, చాట్ మరియూ అక్కడిక్కడ తయారు చేసి వడ్డిస్తున్న స్వీట్ మలై పూరీ. ప్లేట్లో రెండిడ్లీలు పెట్టుకుని, చట్నీలు, సాంబారు కప్పుతో చోటు వెతుక్కుంటూ హాలంతా కలియతిరుగుతున్న నా బాధ భరించలేక ఓ టేబుల్ కార్నర్ సీట్ చూపించాడు మేనేజర్.

నా ఎదురుగా ఇద్దరు పెద్దవాళ్ళు. ఎప్పుడో రిటైరైన ఉద్యోగులై ఉంటారు బహుశా. కొంచం గట్టిగానే కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వద్దన్నా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, బంగారం ధరల్లో మార్పులు, షేర్ మార్కెట్ పతనం లాంటి టాపిక్స్ జమిలిగా నడుస్తున్నాయి. పక్క టేబిల్ లో కుర్ర గుంపు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంటూ టాపు లేపేస్తున్నారు. శ్రద్ధగా రెండిడ్లీలూ పూర్తి చేసి పెసరట్ ఉప్మా కోసం వెళ్ళబోతూ ఎదుటివాళ్ళిద్దరివైపూ చూశాను. ఒకాయన మా పక్క టేబిల్ వైపు విసుగూ కోపం కలగలిపి చూస్తున్నాడు. ఎందుకై ఉంటుంది?

పెసరట్టు, పేస్టుప్మాతో పాటు చట్నీలు వడ్డించుకుని సీటు దగ్గరికి వస్తూ ఈసారి పక్క టేబిల్ మీద దృష్టి పెట్టాను. మొత్తం నలుగురు. కాలేజీ ఈడు వాళ్ళు. ముగ్గురు అబ్బాయిలు, ఓ అమ్మాయి. ఆమె వాళ్ళందరితోనూ నవ్వుతూ, తుళ్ళుతూ కబుర్లు చెబుతోంది. 'అరేయ్' 'ఒరేయ్' అంటూ కబుర్లు చెబుతూ, అప్పుడప్పుడూ చనువుగా ఒక్కటేస్తోంది. కూర్చుంటూ ఎదుటాయన్ని ఓసారి చూశా. ఆయనకే శక్తి ఉంటే వాళ్ళ నలుగురినీ అక్కడికక్కడే బూడిద చేసేసి ఉండేవాడేమో బహుశా. పెసరట్టు పని పడుతూ ఉండగా మహేష్ బాబు గ్రూపుకీ, పవన్ కళ్యాణ్ కీ తగాదా. పవన్ కళ్యాణ్ గ్రూపులో ఒక్కడే. ఆ అమ్మాయి ఈ గొడవ పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటోంది.

చుడీదారు, కళ్ళజోడుతో చదువుల సరస్వతిలా ఉందా అమ్మాయి (స్కూలు, కాలేజీ పిల్లలకి కనుక కళ్ళజోడు ఉంటే వాళ్ళు పుట్టు మేధావులని నాకో బలమైన ఫీలింగ్, నా చిన్నప్పటినుంచీ కూడా). గొడవ చల్లారింది. వాళ్ళు నలుగురూ వెళ్లి స్వీటు తెచ్చుకున్నారు. ఎదుటి ఇద్దరూ కళ్ళతోనే మొటికలు విరుస్తున్నారు. ఒకాయన ఉన్నట్టుండి వాళ్ళ పిల్లలని తను ఎంత క్రమశిక్షణతో పెంచాడో చెప్పడం మొదలుపెట్టాడు, రెండో ఆయనకి. నేను నవ్వాపుకోవాల్సిన తరుణం రానే వచ్చేసింది. ఆయన్ని పూర్తి చేయనివ్వకుండా రెండో ఆయన అందుకుని 'పిల్లలు-తల్లిభయం' టాపిక్ అలవోకగా అందుకున్నాడు. ఆ పిల్లలు కనీసం ఇటు చూడకుండా 'శ్రీమంతుడు' గురించి చెప్పుకుంటున్నారు.

చూస్తుండగానే జనం పెరిగారు. చిన్న పిల్లలు మెనూ చూసి సరదా పడిపోతున్నారు. స్త్రీలేమో ఒకరి నగలని ఒకరు వోరగా చూసుకుంటున్నారు. మగవాళ్ళు యధావిధిగా జేబులు తడుము కుంటున్నారు. నేను పుల్కా తినడమా లేక నూడుల్స్ రుచి చూడ్డమా అని తీవ్రంగా ఆలోచిస్తుండగా వెయిటరమ్మాయి వచ్చి "ప్లేటు తీసేయనా సార్?" అని వినయంగా అడిగింది. నేనెక్కడ 'ఊ' అనేస్తానో అని కంగారు పడ్డ ఎదుటాయన "ఆయనింకా ఏం తినలేదు" అనడంతో, "సారీ సర్" అని చెప్పి వెళ్ళిపోయింది. రాజ్మా తిని చాలా రోజులయిందని గుర్తు రావడంతో నా మనసు పుల్కా వైపు మొగ్గింది.

నేను సీట్లో కూర్చుంటూ ఎదుటివాళ్ళ వైపు చూసేసరికి ఒక్క క్షణం అయోమయం కలిగింది. మన్ను తిన్న కృష్ణుళ్ళా ఇద్దరూ నోళ్ళు తెరుచుకుని ఉన్నారు. ఇద్దరి కళ్ళూ పక్క టేబిల్ వైపే ఉన్నాయి. ఆ అమ్మాయి ముగ్గురబ్బాయిలకీ రాఖీలు కడుతోంది. దృశ్యం చూడముచ్చటగా అనిపించడంతో నేనూ చూస్తూ ఉండిపోయాను. కుర్రాళ్ళు ముగ్గురూ జేబుల్లోనుంచి గిఫ్ట్లు తీసిచ్చారు ఆ అమ్మాయికి. ఇంతలో బిల్ వచ్చింది. ఆ అమ్మాయి అందుకుంది. ఇప్పుడు ముగ్గురబ్బాయిలకీ వాళ్ళ హీరోలు గుర్తొచ్చినట్టు లేదు. ఒకే పార్టీగా మారిపోయి ఆమె చేతినుంచి బిల్ ఫోల్డర్ అక్షరాలా లాగేసుకున్నారు. మరో ఐదు నిమిషాల్లో ఆ టేబిల్ ఖాళీ అయ్యింది. ఎదుటి ఇద్దరివైపూ నేనస్సలు చూడలేదు.

మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!!

4 కామెంట్‌లు:

  1. నాకెందుకో కార్టూన్లా ఊహకొచ్చి తెగ నవ్వొచ్చిందండీ :) :)

    రిప్లయితొలగించండి
  2. @వేణూ శ్రీకాంత్: :) ధన్యవాదాలండీ..
    @పరిమళం: లైవ్ చూసిన నా పరిస్థితి ఊహించండి.. నవ్వడానికి కూడా లేదు పైగా :) ..ధన్యవాదాలండీ
    @మహేష్ తిరుపతి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి