శుక్రవారం, ఆగస్టు 07, 2015

బాకీ పడ్డాను ...

శ్రీనివాస్ నాకు ఐదేళ్లుగా పరిచయం. ఇతన్ని తెలిసిన మనిషి అనాలో, స్నేహితుడు అనాలో, ఇంకేమనాలో కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇకపై ఆలోచించాల్సిన పనిలేదు.. పనిలేకుండా చేసేశాడు తను. కానీ, కొన్నాళ్ళ పాటు.. కనీసం కొన్నేళ్ళ పాటు గుర్తొస్తూనే ఉంటాడు నాకు. ఐదేళ్ళ క్రితం ఓ తెలుగు దినపత్రిక ఏజెంట్ గా పరిచయం అయ్యాడతను. నేనా పత్రిక చందాదారుడిగా చేరడంతో ప్రతినెలా మొదటివారంలో బిల్లు వసూలు చేసుకోడానికి వచ్చేవాడు.

కొన్ని నెలల తర్వాత, ఓ నెలలో తను వచ్చేసరికి నా దగ్గర తనకివ్వడానికి సరిపడే చిల్లర లేదు. తనదగ్గరా లేదు. హాల్లో కూర్చోమని చెప్పి, ఇంట్లోకి వెళ్లి, చిల్లరతో తిరిగొచ్చేలోగా బొత్తులుగా ఉన్న పాత పేపర్లని చూశాడు తను. "నేను పాత పేపర్లు కూడా కొంటాను సార్. తీసుకెళ్ళి పొమ్మంటారా?" అని అడిగాడు. అప్పటివరకూ, పేపర్లు పేరుకుపోయిన ప్రతిసారీ కొనే వాళ్ళకోసం వెతకడం ఓ పెద్ద పనిగా ఉండేది. అప్పటి నుంచీ నెలకి రెండు సార్లు వచ్చేవాడు. బిల్లుకి ఓసారి, పేపర్ల కోసం రెండోసారి.

తెలుగు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు విడగొట్టి, విడిగా లెక్క కట్టి, వేటికి ఎంత అయ్యిందో విడిగా లెక్క చెప్పి, మొత్తం మాచేతే కూడించి డబ్బు చేతిలో పెట్టేవాడు. లెక్కేయడానికి బద్దకించి "మీరే లెక్క చూసి ఇచ్చేయండి" అన్నా వినేవాడు కాదు. ఓ పక్క పేపర్లు లెక్క పెట్టుకుంటూనే రాజకీయాల మొదలు, తన సొంత సంగతులవరకూ చెప్పుకొచ్చేవాడు. నేను చదివే ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఏజెంట్ గా చేరాలని తన కోరిక. ఆ ప్రయత్నాల గురించి చెబుతూ, తనకి ఏజెన్సీ వస్తే నాకా పేపర్ ఉదయాన్నే అందేలా చూస్తానని మర్చిపోకుండా చెప్పేవాడు.

ఒక నెల బిల్లు కట్టించుకుంటూ, మర్నాడు వచ్చి పేపర్లు తీసుకెళ్తానని చెప్పాడు. ఎప్పుడూ క్రమం తప్పనివాడు ఆసారి రాలేదు. ఈలోగా ఇంకో పేపర్ కుర్రాడు హాల్లో పేపర్లు చూసి తనకి ఇవ్వమని మరీ మరీ అడగడంతో, పేపర్ బిల్లు వెతికి శ్రీనివాస్ కి ఫోన్ చేశాను. "పాప పుష్పవతి అయ్యింది సార్.. ఆ హడావిడిలో ఉన్నాను.. నాల్రోజుల్లో వచ్చి తీసుకెళ్తాను" అనడంతో వచ్చిన కుర్రాణ్ణి ఉత్తి చేతులతో పంపేశాను. చెప్పిన ప్రకారం తను వచ్చి, ఫంక్షన్ ఖర్చులు వగయిరా విషయాలు చెబుతూ పేపర్లు లెక్కచూసి తీసుకెళ్ళి పోయాడు.

పుష్టిగా ఉండేవాడు కాస్తా ఉన్నట్టుండి బరువు తగ్గడం మొదలుపెట్టాడు. రెండు నెలలు చూసి, నాలుగైదు నెలల క్రితం బిల్లిస్తూ అడిగాను "వాకింగ్ చేస్తున్నారా? బరువు తగ్గారు" అని. "ఏమీ లేదు సార్" అనేసి వెళ్ళిపోయాడు. తర్వాతి నెల వచ్చినప్పుడు చెప్పాడు: "మొన్న మీరు బరువు తగ్గేను అన్నారు కదా సార్. ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు. డాక్టర్ కి చూపించుకున్నాను.. సుగర్ తగిలిందన్నారండి.." అని, "పిల్లలింకా చిన్నాళ్ళండి" అని బెంగ పడ్డాడు. నాకు తోచిన నాలుగు మాటలు ధైర్యం చెప్పి పంపించాను.

గతనెలలో అనుకోకుండా ఓ పెద్ద టూర్ తగలడంతో, తనకి ఫోన్ చేసి ఏరోజు నుంచి ఏరోజు వరకూ పేపర్ అవసరంలేదో చెప్పాను. ఊరి నుంచి తిరిగి వచ్చినా పేపర్ రావడం లేదు. తనకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. సరే, బిల్ తీసుకుని, పేపర్లు పట్టుకెళ్ళడానికి వస్తాడు కదా అనుకుని, నా పనుల్లో పడిపోయాను. ఉదయాన్నే ప్రింట్ ఎడిషన్ కి బదులు నెట్ ఎడిషన్ చదువుతూ, ఈపాటికి రావాలి కదా, ఇంకా రావడం లేదేమిటి అనుకుంటున్నాను తప్ప అంతకు మించి ఆలోచించడం లేదు.

ఇవాళ పక్కవాళ్ళ ఇంటికి వెళ్తే, మాటల్లో పక్కాయన "పేపర్ ఏజెంట్ పోయాడు, తెలుసా?" అనడంతో ఉలికి పడ్డాను. "సుగర్ తగిలిందని బాధ పడ్డాడు ఆ మధ్యన" అని నేనంటే, "అనారోగ్యం కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. పదిహేను రోజులు అవుతోంది. తెలియలేదా?" అని అడగడంతో షాక్ తగిలినట్టు అనిపించింది నాకు. "మా డ్రైవర్ ఉండే ఏరియాలోనే ఉంటాడతను. భార్యతో గొడవొచ్చి, ఉరి పోసుకున్నాట్ట.." ఆయన చెబుతుంటే, "పిల్లలు చిన్నవాళ్ళు సార్" అన్న శ్రీనివాస్ గొంతు వినిపించింది నాకు.

నేను మీకు పదిహేను రోజుల పేపర్ బిల్ బాకీ శ్రీనివాస్ గారూ.. పాత పేపర్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి.. ఎప్పుడొస్తారు ??

11 కామెంట్‌లు:

 1. వ్యవహారం / లావాదేవీ వరకు మాత్రమే పరిమితమైన (transaction-based) సంబంధాలతో కూడిన నేటి దైనందిన జీవితం లో సన్నకారు వ్యాపారులతో కూడా దీర్ఘకాలిక సత్సంబంధాలు నిలబెట్టుకుంటున్న మీరు అభినందనీయులు. మీ పేపర్ ఏజెంట్ స్మృతి కి మీ నివాళి హృదయపూర్వకమైన నివాళి. RIP.

  రిప్లయితొలగించు
 2. చాలా బాగుంది మురళీగారు. మనసుని తాకింది కధ

  రిప్లయితొలగించు
 3. మా కాలేజ్ వాచ్ మాన్ మా మాజార్ భాయ్ గుర్తొచ్చాడు మురళీ గారు:(

  రిప్లయితొలగించు
 4. కాలం సంఘటనల్ని పాత పేపర్లలా మారుస్తుంది. కానీ అదేంటో ఆ పాత రోజుల్లోని సంతోష సమయాల్ని మర్చిపోయినంత త్వరగా బాధాకర సంఘటనల్ని మరువలేం.

  కొన్నిసార్లు వాటిలోని విషాదం ఇలా గుండెల్లోంచి పొంగి అక్షారాలుగా మారి మనల్ని ఓదారుస్తుందేమో...
  :-(

  రిప్లయితొలగించు
 5. అవునండీ, కొంతమందితో తెలియకుండానే బంధం పెనవేసుకుపోతుంది వాళ్ళేమో ఎలా వచ్చారో అలానే నిష్క్రమించేస్తారు. నేను కూడా నా రాఖీ సోదరుడికి ఒక రాఖీ బాకీ, తనింకెప్పటికీ రాడని తెలిసినా నా రాఖీ తనకోసమే ఎదురుచూస్తోంది :(

  రిప్లయితొలగించు
 6. చాన్నాళ్ళకి తీరిక చేసుకుని మీ బ్లాగ్ లోకి వస్తే మనస్సు భాధపడే విషయం చదివాను కొందరు ఇంతేనండీ జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తారు కనీసం పిల్లలయినా గుర్తురాలేదా తనకి ;(

  రిప్లయితొలగించు
 7. omg, very sad; pillalanu gurtu chesukumte ii panini talapette waadu kaadu - [కుసుమాంబ 1955]

  రిప్లయితొలగించు
 8. @విన్నకోట నరసింహారావు: సత్సంబంధాలు అంటే, అవతలివారిని బట్టి కూడా ఉంటుంది కదండీ.. సగం క్రెడిట్ అతనిదే.. ..ధన్యవాదాలు..
  @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
  @జయ: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 9. @గీతిక: అంతే అనుకోవాలండీ మరి.. వేరే కారణం తోచడంలేదు.. ధన్యవాదాలు
  @లక్ష్మి: అర్ధమవుతుందండీ.. ఏమీ చేయలేం, అంతే... ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 10. @హిమబిందు: పిల్లల విషయం.. ..నాకూ అదే అనిపించిందండీ.. ..ధన్యవాదాలు..
  @అనిల్ పిడూరి: గుర్తొచ్చి ఉంటే బావుండేదండీ.. ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 11. ఆత్మహత్య... ప్చ్.... గుండెలో కలుక్కుమంది. చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలి అంత ధైర్యం బ్రతకడానికి పనికిరాదా రోజురోజుకీ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉంటుందా?మీరు విని వదిలేయకుండా రాశారు చూడండి అది మీ మనసుకు అద్దం పడుతోంది.పిల్లలు బావుండాలని ప్రార్ధిస్తున్నా.

  రిప్లయితొలగించు