శనివారం, ఫిబ్రవరి 14, 2015

గులాబీరంగు వోణీ

సందు మలుపు తిరిగి సరిగ్గా పదకొండు ఇళ్ళు దాటాక కుడివైపు పన్నెండో ఇల్లు జీవీఎస్ మేష్టారిది. ఎడం వైపు ఇళ్ళ మధ్యలో ఖాళీ స్థలాలున్నాయి కానీ, కుడివైపు పొడవు పొడవూ ఇళ్ళే. చలికి కొంకర్లు పోతున్న వేళ్ళని, గుండెలకి అదుముకున్న పుస్తకాల బొత్తి చుట్టూ మరింత గట్టిగా బిగించింది రాధిక.

మంచు వర్షంలా కురుస్తోందేమో రోడ్డు కనిపించడం లేదు. అయితేనేం, మలుపు తిరిగినప్పటినుంచీ ఆమెని అనుసరిస్తున్న అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. సరిగ్గా మరొక్క ఇల్లు దాటితే మేష్టారిల్లనగా ఎప్పటిలాగే ఆగిపోయిందా చప్పుడు.

ఉదయం ఆరు కొట్టిందంటే మేష్టారి ట్యూషన్ మొదలవ్వాల్సిందే. చలీ, వర్షమే కాదు తుపానొచ్చినా ఆగదా క్లాసు. అంతేకాదు, మొదట వచ్చిన వాళ్ళకే ముందు వరసలో చోటు. ఓ వైపు అబ్బాయిలు, మరోవైపు అమ్మాయిలు.

రోజూలాగే ఐదూ యాభై ఐదుకి ముందే క్లాసులో ఉంది రాధిక. మొదటగా వచ్చింది ఆమే. అప్పటికే మేష్టారు ట్యూషన్ గదిలో లైటు వేసి, చాపలు పరిచి లోపలి ఇంట్లోకి వెళ్ళిపోయారు, పూజ చేసుకోడానికి.

వోణీని భుజం చుట్టూ కప్పుకుని ఒద్దికగా  కూర్చుందామె. నోట్సు తిరగేస్తూ ఉండగానే హడావిడిగా లోపలికి అడుగు పెట్టారు జ్ఞానేశ్వరి, భ్రమరాంబ.

"ఒచ్చేసేవా? అయినా క్లవర్లతోటి మేవెక్కడ పోటీ పడగల్దువమ్మా.. ఆ నోట్సు ఓసారిలాగియ్యి," రాధిక పక్కన చొరవగా కూర్చుని ఒళ్లో పుస్తకం లాక్కుంది జ్ఞానేశ్వరి.

"ఇంపార్టెంట్లన్నీ రెడ్డింకుతో బలేగా గుర్తులు పెడతావే నువ్వు.. ఇయి చూస్కుంటే చాలు," ఓ మెచ్చుకోలు విసిరింది.

అబ్బాయిల్లో మొదట వచ్చినతన్ని చూసినా చూడనట్టు నటిస్తూ "అచ్చుత్ కి ఏ షర్టయినా బలేగా ఉంటాదే.. టీషర్టు, ఫుల్ హేండ్సు అచ్చుత్ తొడిగితేనే చూడాలనుకో," ఉత్సాహంగా చెప్పుకుపోతున్న జ్ఞానేశ్వరిని మోచేత్తో పొడిచింది భ్రమరాంబ.

"ఎహె.. నిన్న రాత్రి అంతరంగాలు సీరియల్లో మొత్తం మూడు చొక్కాలు మార్చేడు," నవ్వు దాచుకుంటూ చెప్పింది జ్ఞానేశ్వరి. ఆ కుర్రాడు అచ్యుత్, ఇవేవీ పట్టించుకోకుండా నోట్సులో తల దూర్చేశాడు.

నుదుటిన విభూతి పట్టీలు, వాటి మధ్యలో కుంకుమ బొట్టుతో మేష్టారు క్లాసులోకి రావడంతో గుండు సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోయిందా గది. సరిగ్గా ఏడయ్యేసరికి క్లాసు పూర్తయ్యింది. ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు.

"కంగ్రాచ్యులేషన్సోయ్ అచ్యుతా.. నిన్నటి పేపర్లో నీ ఫోటో చూశాను. కలెక్టర్ గారి దగ్గర నుంచి బహుమతి అందుకుంటున్నది. ఈమధ్యెందుకో నీకు చదువు మీద శ్రద్ధ తగ్గిందేమో అనిపిస్తోంది. ఫైనలియరు.. జాగ్రత్త మరి," మేష్టారు నెమ్మదిగానే చెప్పినా, గుమ్మం దగ్గర చెప్పు సరిచేసుకుంటున్న రాధిక చెవిన పడ్డాయా మాటలు.

ఆ ముందు రోజు పేపర్, కాలేజీ లైబ్రరీ నుంచి మాయమైపోయింది.

***

"ఆ అచ్యుత్ ని ఏదో ఒకటి అనకుండా ఉండవెప్పుడూను. ఏటమ్మా స్టోరీ?" లేడీస్ వెయిటింగ్ రూంలో జ్ఞానేశ్వరిని నిలదీసింది భ్రమరాంబ. దీక్షగా 'బ్యాంగిల్ సెల్లర్స్' చదువుకుంటున్న రాధిక ఓసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకంలో తలదూర్చేసింది.

"క్లవర్లతోటి మాకేం స్టోరీలుంటాయమ్మా..ఏవుండవు.."

అప్రయత్నంగా పళ్ళు బిగించింది రాధిక.

"పోనీ అంత ఇంట్రస్టుంటే మీ ఇంట్లో ఓ మాట చెప్పి చూడవే," వదల్లేదు భ్రమరాంబ.

"మా ఇంట్లో కేస్ట్ ఫీలింగ్ ఎక్కువే బాబూ. అయినా నేను బంగారం నగల షాపోణ్ణి తప్ప చేసుకోనని చెప్పేసేను," పాత విషయాన్ని కొత్తగా చెప్పింది జ్ఞానేశ్వరి.

"మరింకెందుకమ్మా.. చొక్కా బావుంది, చెడ్డీ బావుంది అని ఆ కుర్రోణ్ణి యేడిపించటం.." భ్రమరాంబ మాట పూర్తి కాకుండానే "ఓయ్" అటూ అడ్డు పడింది జ్ఞానేశ్వరి.

"చూడమ్మా బ్రెమరాంబికా దేవీ.. నీకంటే నువ్వు పుడతానే మీ మావయ్యతో పెళ్లి కుదిరిపోయింది. ఇంక నీకెవరికేసీ చూసే చాన్సు లేదు. మాకల్లాక్కాదు. ఎవడో ఒకడు దొరికే వరకూ కనిపించినోణ్ణల్లా ఏదొకటి అనొచ్చు.. కదే రాదికా," అన్న జ్ఞానేశ్వరి, అంతలోనే నాలిక్కరుచుకుని "అంటే ఈ క్లవర్లకి చదూ తప్ప ఇంకేం అక్కర్లేదనుకో.. నగల్షాపోడు దొరికేవరకూ నాకు మాత్రం ఇదే పని" కుండ బద్దలు కొట్టేసింది.

***

సందు మలుపు తిరగ్గానే ఎడమవైపు నుంచి వచ్చిన చలిగాలి నడుముకి తగిలి ఒళ్ళు ఝల్లు మంది రాధికకి. పరిచితమైన అడుగుల చప్పుడు వినిపిస్తోంది వెనుకనుంచి.

"నన్ను చూస్తున్నావని తెలుసు.. వీపుక్కూడా కళ్ళుంటాయి మీ ఆడపిల్లలకి," చలికి వణుకుతున్న గొంతు నుంచి ఆ మాట వినిపించిన కాసేపటికి అడుగుల చప్పుడు ఆగిపోయింది.

క్లాసులో కూర్చున్నాక వీపు మీద మంట తెలిసింది రాధికకి. తడిపొడి జుట్టుని అల్లేసుకుందేమో జడ నుంచి ఒక్కో నీటిబొట్టూ వీపు మీదకి జారినప్పుడల్లా బ్లేడుతో కోసినట్టు అనిపిస్తోంది.

"ఓహోయ్.. ఇవ్వాళ శుక్రారం.. ఇంగ్లీష్ మేడం ఎలాగూ లేటుగానే వస్తాది. పొద్దుపొద్దున్నే తల్తడపా పోతే కేలేజీకొచ్చేముందు చేసి రావొచ్చు కదే?" ప్రశ్నతో పాటు వచ్చింది జ్ఞానేశ్వరి.

"భ్రమర రాలేదా?" అడిగింది రాధిక.

"ఇంటి నిండా చుట్టాలున్నారే.. మూర్తం పెట్టుకుంటారేమో.. అదేవీ చెప్పలేదు మరి.." మేష్టారు రావడంతో సంభాషణ ఆగిపోయింది. కాలేజీలో కూడా కనిపించలేదు భ్రమరాంబ.

"మేలో గానీ జూన్ లో గానీ ఉంటాదంట పెళ్లి. డిగ్రీ ప్రైవేటుగా చదువుతాదంట," సాయంత్రానికి వార్త పట్టుకొచ్చింది జ్ఞానేశ్వరి. మర్నాడు కాలేజీ వెయిటింగ్ రూంలో అదే వార్తని పంచింది భ్రమరాంబ, పెద్ద మైసూర్ పాక్ తో పాటుగా.

"నేనూ నీకోటి తెచ్చేనేవ్ రాదికా," అంటూ పుస్తకంలోంచి గ్రీటింగంతున్న కార్డునొకటి బయటికి తీసింది జ్ఞానేశ్వరి. "ఇది తొమ్మిది సంవస్సరాల కేలండర్. నీలాంటి క్లవర్లకైతే పనికొత్తాది. ఎందుకేనా మంచిది గానీ జిరాక్స్ తీయించుకుని నాది నాకిచ్చెయ్.."

ఏమీ మాట్లాడకుండా కార్డు అందుకుని నోట్సులో పెట్టుకుంది రాధిక.

***

జీవీఎస్ మేష్టారి ట్యూషన్లో మొదటి ప్రి-ఫైనల్ పరిక్ష ఆరోజున. చలి కాస్త తగ్గు ముఖం పట్టినా, పరిక్ష  విషయం తల్చుకుంటే అడుగులు తడబడుతున్నాయి రాధికకి. సందు మలుపు తిరగ్గానే వెనుక నుంచి అడుగుల చప్పుడు.

"గులాబీ రంగు వోణీ నీకెంత బావుంటుందో తెలుసా? నీకిష్టం ఉండదేమో మరి. ఆర్నెల్లలో నాలుగంటే నాలుగుసార్లే వేసుకున్నావ్.. ఎల్లుండి పద్నాలుగో తారీకు. నేనంటే.. నామీద.. ఇష్టం ఉంటే... ఆ వోణీ వేసుకురా.." అడుగుల చప్పుడు ఆగిపోయింది. 

కాస్త ఆలస్యంగా వచ్చిన జ్ఞానేశ్వరి, వెనుక వరుసలో కూర్చుంది. అబ్బాయిలు ఒక్కొక్కరూ వస్తున్నారు. అందరూ పరిక్ష మూడ్ లో ఉండడంతో పుస్తకాల్లో తల దూర్చేశారు.

"క్లవరవ్వాలంటే ఏం చెయ్యాలే రాదికా?" నెమ్మదిగా మాట్లాడుతున్నాననుకుని కాస్త పెద్ద గొంతుతోనే అడిగింది జ్ఞానేశ్వరి. ఇబ్బంది పడింది రాధిక.

"ఎదుటివాళ్ళ గురించి ఆలోచించడం మానెయ్యాలి" మేష్టారి గొంతు విని క్లాసంతా ఉలికిపడింది, రాధికతో సహా.

"ఇదిల్లాగే మనల్ని బుక్ చేసేస్తోందే బాబూ.. ఆ అచ్యుత్ గొడవ దీనికెందుకంట? చెప్తే విన్దు," వెయిటింగ్ రూంలో భ్రమరాంబ రాధికతో చెబుతూ ఉండగానే, "ఒహోహోయ్" అంటూ వచ్చింది జ్ఞానేశ్వరి.

"నగల్షాపోడు దొరికేసేడే.. దీని పెళ్ల ప్పుడే నాదీ ఉంటాదేమో," స్టీలు బాక్సు మూత తీస్తూ శుభవార్త ప్రకటించింది.

"నాతో సెపరేటుగా మాటాడాలన్నాడు. లవ్ స్టోరీలున్నాయా అనడుగుతాడేమో అనుకున్నాను. కానీ, 'చదువు మానెయ్యాల్సి వస్తాదేమో, పర్లేదా?' అని అడిగేడు. మరీ బ్రెమ్మాండం అనుకున్నాను. పన్లోపని నేనూ అడిగేసేను," ఎఫెక్ట్ కోసం ఒక్క క్షణం ఆగింది. చెప్పమన్నట్టుగా చూశారు శ్రోతలిద్దరూ.

"కొత్త నగలేవొచ్చినా ముందర నేను పెట్టుకున్నాకే షాపులో పెట్టాలన్నాను. 'ఓస్.. ఇంతేనా' అనేసేడు,"  బరువు దిగిపోయినంత ఆనందంగా చెప్పింది జ్ఞానేశ్వరి.

"మేవిద్దరం ఇంటర్ తోనే ఆపేస్తన్నాం.. నీ సంగతేటమ్మా రాదికా?  క్లవరువి కదా మరి.. డిగ్రీలు సంపాదిత్తావా?" జవాబు చెప్పకుండా ఆలోచనలో పడింది రాధిక. పెళ్ళిసంబంధం విశేషాలు భ్రమరకి వర్ణించి వర్ణించి చెప్పింది జ్ఞానేశ్వరి.

మర్నాడు ట్యూషన్లో రోజూ కన్నా సీరియస్ గా ఉన్నారు మేష్టారు. దిద్దిన పేపర్లు పంచారు. రాధిక కి క్లాస్ ఫస్ట్.. కానీ నూటికి నూరూ రాలేదు. "నువ్వు క్లవరువని నేన్చెప్పేనుకదా" అంటూ గుసగుసలాడుతున్న జ్ఞానేశ్వరిని గుడ్లురిమి చూశారు మేష్టారు.

"ఇలా అయితే లాభం లేదు అచ్యుతా.. ఇన్నాళ్ళూ బాగా చదివి, పరిక్షల ముందు ఇలా చేస్తే ఎలాగ? వచ్చే టెస్ట్ లో కూడా ఇవే మార్కులొస్తే నేను మీ ఇంట్లో మాట్లాడాల్సి వస్తుంది," మేష్టారు అచ్యుత్ తో చెబుతున్న మాటలు రాధిక చెవిన పడ్డాయి.

ఆవేళ కూడా ఆమె చెప్పు ఇబ్బంది పెట్టేసింది.

***

మంచు తగ్గుముఖం పట్టినా, సూర్యుడింకా మేలుకోక పోవడంతో మసక మసగ్గా ఉందా ఉదయం. ఆమె వోణీ రంగేవిటో స్పష్టంగా తెలియడంలేదు. అయినా అతని అడుగులు ఆమె అడుగుల్లో పడుతున్నాయి అలవాటుగా.

మేష్టారింటికి రెండిళ్ళ ముందు ఆగి, వెనక్కి తిరిగింది రాధిక. తెల్లబోయి చూశాడతను. నోట్సు నుంచి అరిచేయంత ఉన్న తెల్లని కవర్ని బయటికి తీసి అతని చేతిలో పెడుతూ, నిశ్చలంగా అతని కళ్ళలోకి చూసింది. నాలుగు కళ్ళూ కలుసుకున్నాయి కొన్ని క్షణాలపాటు.

చేతి వణుకుని దాచుకుంటూ అతనా కవర్ని జేబులో పెట్టుకోడం ఆలస్యం, గిరుక్కున వెనుతిరిగి మేష్టారింట్లోకి అడుగుపెట్టింది రాధిక.

జడ కొసల్నుంచి రాలి పడుతున్న నీటి బొట్లు ఆమె గులాబీ రంగు వోణీ మీద ఎర్ర చుక్కల్ని సృష్టిస్తున్నాయి.

***

"డిగ్రీ అవ్వగానే సమ్మంధం చూసి పెళ్లి చేసేస్తానంటే ఉద్యోగం చేస్తాన్నాన్నా అన్నావు. బ్యాంకుద్యోగం సంపాదించుకున్నావు.. ఇప్పుడు ఇంకేవిటమ్మా అభ్యంతరం?" తండ్రి మాటకి జవాబు చెప్పలేదు రాధిక.

"ఆ రోజుల్లో మీ నాన్నగారు కూడా ఆడపిల్లలకి ఎస్సెల్సీ చెప్పించారు. కానీ ఇలాగా? వాళ్లకి తల్లి భయం, తండ్రి భయం రెండూ ఉన్నాయి. నోరెత్తకుండా తెచ్చిన సంబంధం చేసుకున్నారు.. భయభక్తుల్లో పెట్టుకోవాలి పిల్లల్ని.. తల్లన్నా చెప్పుకోవద్దూ.." నాయనమ్మ అందుకుంది.

"మీరు దానితో మాట్లాడండి" అన్నట్టుగా భర్తకి కనుసైగ చేసింది రాధిక తల్లి. ఆ సైగ అందుకుంటూనే "మేడ మీదకి టీ పంపించు" అంటూ మెట్ల వైపు నడిచాడాయన. నైటీ కాళ్ళకి అడ్డం పడకుండా ఓ చేత్తో పట్టుకుని, రెండో చేత్తో టీ కప్పు పట్టుకుని రాధిక మేడ మీదకి వెళ్లేసరికి, అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు తండ్రి.

"ఏవిట్రా రాధీ ఇది? నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అంటే చెప్పవు. వచ్చిన సంబంధంలో లోపం ఉందా అంటే మాట్లాడవు. కుర్రాడు డిప్యుటీ తాసిల్దార్ చేస్తున్నాడు. కనీసం సబ్-కలక్టర్ గా రిటైర్ అవుతాడు. ఏం కావాలి చెప్పు?  ఇంతకన్నా పెద్ద సమ్మంధం అంటే మన స్తోమతూ చూసుకోవాలి కదమ్మా.." తండ్రికేం చెప్పాలో అర్ధం కాలేదు రాధికకి.

"నాకు.. ఇంకొంచం టైం ఇవ్వండి నాన్నా.. ప్లీజ్" అంది నోరు పెగుల్చుకుని. చలిగా ఉన్న వాతావరణంలో వేడివేడి టీని రెండు గుక్కల్లో తాగడం పూర్తి చేసి, ఖాళీ కప్పు ఆమె చేతిలో పెట్టి, మొదలు పెట్టాడు తండ్రి.

"మాఘ మాసం వెళ్ళిపోతే మళ్ళీ ముహూర్తాలు లేవని తొందర పడుతున్నారు వాళ్ళు. మాకు చిన్న పిల్లవే కానీ, నువ్వు చిన్నదానికి కాదు కదమ్మా," అర్ధం చేసుకోమన్నట్టుగా ఉందా గొంతు.

రెయిలింగ్ కి ఆనుకుని ఆకాశాన్ని చూస్తున్నదల్లా వీధిలో అలికిడికి స్పృహలోకి వచ్చింది రాధిక. తండ్రి హడావిడిగా మెట్లు దిగేస్తున్నాడు అప్పుడే. పైన నీలం లైటు వెలుగుతున్న పెద్ద కారు ఆగింది వీధిలో. డవాలా బంట్రోతు అడ్రెస్ సరిచూస్తున్నాడు. గబగబా మెట్లు దిగుతున్న రాధిక కాలి పట్టీ, నైటీకి పట్టుకోడంతో నేరుగా తన గదిలోకి వెళ్లి తలుపేసేసుకుంది.

"మన మూర్తి గారబ్బాయమ్మా" అంటున్నాడు తండ్రి.

"ఎవరూ? అచ్యుతవల్లి మనవడా? తల్లంటే ఎంత ప్రేమో మూర్తికి.. మగ పిల్లాడికి తల్లిపేరు కలిసొచ్చేలా పెట్టుకున్నాడు.."

వీపుకున్న చెవులతో వింటోంది రాధిక. గుండెలదురుతున్నాయి. శరీరం ఆపాదమస్తకమూ కంపిస్తోంది. ఆనందాన్ని దాచుకోవడం చేతనవ్వడంలేదు.

అద్దంలో తనని తాను ఒక్క క్షణం తేరిపార చూసుకుని బాత్రూంలోకి పరిగెత్తింది. తల్లి వచ్చి తలుపు తట్టేసరికి, జడ అల్లుకుంటోందామె.

"నాన్నగారు పిలుస్తున్నారు," గులాబీ రంగు చీరలో ముస్తాబైన కూతుర్ని చూసి తల్లి కళ్ళు నవ్వాయి. 

మామూలుగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ, హాల్లోకి వచ్చింది రాధిక. నాయనమ్మ జాడ లేదు. తండ్రి ఆచితూచి మాట్లాడుతున్నాడు అతనితో.

"రాధిక.. బ్యాంకులో పనిచేస్తోంది.. అచ్యుత్ అమ్మా.. మూర్తి గారబ్బాయి.. సివిల్ సర్వీస్ కి సెలక్టై, ట్రైనింగ్ కూడా పూర్తిచేశారట.."

నాలుగు కళ్ళూ మళ్ళీ కలుసుకున్నాయి, ఆరేళ్ళ తర్వాత.

*** 

అది రాధిక గది. ఆ రాత్రి మాత్రం వాళ్ళిద్దరిదీను. రెండో వాళ్ళ మాటలు వినడం కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరూ. మంచం కింద ఉన్న సూట్ కేస్ నుంచి ఓ చిన్న పేకెట్ తీసి అచ్యుత్ కి అందించింది రాధిక. మెత్తని పేకెట్ లో గులాబీ రంగు వోణీ. అపురూపంగా అందుకుని తన మెడ చుట్టూ వేసుకున్నాడు, స్ట్రాల్ లాగా.

క్షణమాగి, తన జేబులో ఉన్న చిన్న కవర్ని "మరి నాకూ" అన్నట్టుగా చూస్తున్న రాధికకి అందించాడు.

తెల్లని కవర్  రంగు మారింది. లోపల చిన్న పేపర్ కటింగ్. కేవలం కలక్టర్ ఫోటో మాత్రమే ఉంది అందులో. ఆ వెనుకే జాగ్రత్తగా కత్తిరించిన చిన్న కేలండర్. ఆ ఏడాదిదే. రెండో నెల పద్నాలుగో తేదీ చుట్టూ ఉన్న ఎర్ర సున్నా అస్పష్టంగా కనిపిస్తోంది.

కళ్ళెత్తి చూస్తే కళ్లెగరేస్తూ అచ్యుత్. గర్వం దాగడంలేదతని చూపుల్లో.

తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని వదిలి, ఫక్కున నవ్వేసింది రాధిక.

"ఇది మా జ్ఞానేశ్వరి కేలండర్.. ఇన్నాళ్ళూ ఈ ముక్క లేదని తిరిగివ్వలేదు. ఇప్పుడు అతికేసి ఇచ్చెయ్యనా?" చాలా అమాయకంగా అడుగుతున్నాననుకుంది. మరు క్షణం ఆమె చెవి పట్టుకుని తనకి దగ్గరగా లాగేసుకున్నాడు. 

గులాబీరంగు వోణీ నిలువెల్లా నలిగిపోయింది!!

(మిత్రులందరికీ 'వేలంటైన్స్ డే' శుభాకాంక్షలు!)

22 కామెంట్‌లు:

  1. murali garu chala baga ...anni kallaku kattinatluga ... ila cheppadam .. meeku vennatho pettina vidyemo ...manchi rojuna manchi presentation..
    Thanks murali garu ...

    రిప్లయితొలగించండి
  2. అందమైన కథనం.. బాగుందండీ సో స్వీట్.. ప్రేమికుల రోజున మంచి సందేశమే ఇచ్చారు.

    పూర్తి చేసేసరికి "మనసిచ్చి చూడు" సినిమాలో "లవ్వు చేయండ్రా మీరు లాభ పడండ్రా" పాట గుర్తొచ్చిందండీ :-)

    రిప్లయితొలగించండి
  3. కలిసొస్తే అన్ని రోజులూ ప్రేమికుల రోజులే. కధ చక్కిలిగింతలు పెట్టేట్టుగా ఉందండీ "క్లవర్లు కదా మీరు అలానే రాస్తారు మరి"

    రిప్లయితొలగించండి
  4. మరో 'మళ్లీమళ్లీ ఇదిరానిరోజు ' చూసిన ... కాదు కాదు చదివిన ఫీలింగ్ బావుందండి :)

    రిప్లయితొలగించండి
  5. @పురాణపండ ఫణి: ప్రయోగం అంటారా అయితే :)) ..ధన్యవాదాలు
    @శ్రీ: మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు..
    @వేణూ శ్రీకాంత్: కొత్త కథేమీ కాదండీ, చాలా సినిమాలే గుర్తొస్తాయి :)) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. @కొత్తావకాయ: ధన్యవాదాలండీ..
    @శ్రీనివాస్ పప్పు: అబ్బే.. నేను జ్ఞానేశ్వరి టైపండీ :) ..ధన్యవాదాలు..
    @పరిమళం: అయ్ బాబోయ్.. ఎంత గొప్ప పోలిక!! ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  7. అబ్బ.... దృశ్యాలన్నీ కళ్ల ముందే సజీవంగా కదలాడుతున్నట్టుగా ఎంత అద్భుతంగా రాశారండీ.

    రిప్లయితొలగించండి
  8. @నాగరాజ్: నిజంగా!! ధన్యవాదాలండీ..
    @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @rays: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. ప్రతి మలుపుకూ మీరిచ్చిన కొసమెరుపు కథకి చాలా అందాన్నిచ్చింది మురళి గారు. ప్రేమ భావాన్ని ఎంతో సున్నితంగా పొందుపరిచి చాలా జాగ్రత్తగా మాకు అందించారు. కథలో జ్ఞానేశ్వరి భాష చక్కటి హాస్యాన్ని కూడా అందించింది:) ప్రేమ విలువని ఓ ఎర్రటి గులాబి కాదు, లేలేత గులాబి హృదయం అని అతి మామూలు మాటలతో ఒక పాఠం చెప్పినట్లే చెప్పారు. కథా, కథనం ఆపకుండా చదివించేసింది. ఎక్కడా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రేమ సాధించే నిజమైన విజయం ఇదే.... నేను టోపీ తీసేసానండి.

    రిప్లయితొలగించండి
  10. @జయ: హమ్మయ్య!! జ్ఞానేశ్వరి నచ్చింది అన్నారు కదా.. సంతోషంగా ఉందండీ.. ఎవరన్నా ఆ పాత్ర మరీ 'పానకంలో పుడకలా ఉంది' అంటారా అనుకుంటున్నా :)) ...శ్రద్ధగా చదివి, అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. మురళిగారూ,
    మీ కథ హృద్యంగా ఉందండీ! మళ్ళీ పాత రోజులను గుర్తుకుతెచ్చారు. మీ కథలు గుండెలోతుల్లో ఒక తీయటి బాధను కలిగిస్తాయి.

    రిప్లయితొలగించండి
  12. @సుభగ: "పాతరోజులు గుర్తుకుతెచ్చారు" ఈ మాట ఒక్కరన్నా అంటారా అనుకున్నానండీ, పోస్టు చేసేప్పుడు :) .. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. నేనేమీ చెప్పలేదా చెప్పాననుకున్నానే. కథ చాలా బావుందండి.

    రిప్లయితొలగించండి
  14. @జ్యోతిర్మయి: నేనూ మీకు రిప్లై ఇచ్చేశా అనుకున్నానండీ :) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  15. ఇలాంటి ప్రేమల్లో ఒక completeness ఉంటుంది కదండి. జీవితమంతా వెలితి లేకుండా పంచుకునేనంత ప్రేముంటుంది. భలే ఉంది మురళిగారూ.

    రిప్లయితొలగించండి
  16. @MURALI: అవునండీ.. బావామరదళ్ల తర్వాత ఈ ప్రేమలు ప్రత్యేకమైనవి అనిపిస్తుంది.. అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి