సోమవారం, అక్టోబర్ 28, 2013

చింతలవలస కథలు

విజయనగరం జిల్లాలో ఉన్న ఓ పల్లెటూరు చింతలవలస. నిజానికి ఇదే జిల్లాలో ఇదే పేరుతో సుమారు ఓ పది పల్లెటూళ్ళు ఉన్నాయి అంటారు రచయిత డాక్టర్ మూలా రవి కుమార్. పశువైద్య శాస్త్రం చదివి, నేషనల్ డైరీ డవలప్మెంట్ కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్న రవి కుమార్ స్వస్థలం, ఒకానొక చింతలవలసకి సమీపంలో ఉన్న అమరాయవలస. చింతలవలస కథా స్థలంగా తను రాసిన ఆరు కథలకి, పాలకేంద్రాల పని తీరు ఇతివృత్తంగా రాసిన నాలుగు కథలు, అనేక అంశాలని స్పృశిస్తూ రాసిన మరో ఎనిమిది కథలని చేర్చి, మొత్తం పద్దెనిమిది కథలతో వెలువరించిన కథా సంకలనమే 'చింతలవసల కథలు.'

ఇవి నేటివిటీ చుట్టూ అల్లుకున్న కథలు కావు. ఇంకో మాటలో చెప్పాలంటే, చింతలవలస అని మాత్రమే కాదు, ఏ పల్లెటూళ్ళో అయినా జరిగేందుకు అవకాశం ఉన్న కథలే ఇవి. వానాకాలం చదువులు ఇతివృత్తంగా సాగే 'బడిశాల' ఈ సంకలనంలో మొదటి కథ. అడివిని ఆనుకుని ఉన్న ఓ పల్లెలో ఓ రీసెర్చ్ స్కాలర్ కి ఎదురైన అనుభవాలు 'బలిపశువు' కథ. వ్యవస్థ పనితీరుని ఎత్తిచూపించే కథ ఇది. 'చింతలవలస 1985 అను ది సీక్రెట్ ఆఫ్ జోయ్' కవితాత్మకంగా సాగే మినీ కథ. రాజకీయాలు, మానవ మనస్తత్వ విశ్లేషణల సమాహారం 'గురివింద నాయుడు' కథ. 

ఆద్యంతం ఆసక్తిగా సాగే కథ 'పాఠం' ఆర్టీసీ బస్సు డిపో కథా స్థలం ఇందులో. 'పొడుం డబ్బాలో దూరిన దోమ' ఓ బడిపంతులు ఉద్యోగాన్ని ఎలా పొట్టన పెట్టుకుందో చెప్పే కథ సస్పెన్స్ ప్రధానంగా సాగుతుంది. చిన్న చేపను పెద్ద చేప మింగే అవినీతి శాఖా చంక్రమణానికి క్లాస్ రూం పాఠాన్ని జోడించి ఆసక్తికరంగా చెప్పిన కథ 'ఫుడ్ చైన్.' ఈ కథ చదువుతుంటే శ్రీరమణ రాసిన 'పెళ్లి' కథ గుర్తొచ్చింది అసంకల్పితంగా. 'ఎలోవీరా' గా పిలవబడే కలబంద పంట ఇతివృత్తంగా రాసిన 'చెంచు మంత్రం' చాలాకాలం పాటు గుర్తుండిపోయే కథల్లో ఒకటి.


పాడిపరిశ్రమ ఇతివృత్తంగా కథలేవీ ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన దాఖలాలు లేవు. ఓ అధికారిగా ఈ రంగంలో అనుభవం గడించిన రవికుమార్ 'రోడ్డు పాలు,' 'కులం పాలు,' 'సానుభూతి పాలు,' 'పాలపుంతలో ముళ్ళు' అనే నాలుగు 'పాల' కథలు రాశారు. చదువుతున్నంతసేపూ తన అనుభవాలని, పరిశీలనలనీ మరిన్ని కథల రూపంలో అక్షరీకరించి ఈ రచయిత ఓ పాల కథల సంపుటం తీసుకువస్తే బావుంటుంది కదా అనిపిస్తూనే ఉంది. డైరీల నిర్వహణ, పాలసేకరణలో క్షేత్ర స్థాయిలో ఉండే ఇబ్బందులు మొదలు, పైస్థాయిలో జరిగే రాజకీయాల వరకూ ఎన్నో అంశాలని స్పృశించారు.

చదివించే గుణం పుష్కలంగా ఉన్న కథలే ఇవన్నీ. ఎక్కడా సుదీర్ఘమైన సంభాషణలు లేవు. "ఈయన కింద ఏడాది పరిగెడితే  మేలుజాతి గుర్రాలు కూడా మేం గాడిదలం అనే అభిప్రాయానికి వచ్చేస్తాయి" లాంటి వాక్యాలతో ఆఫీసు బాసునీ, "రోజుకి నాలుగు గంటలే నిద్రపోడానికి మీరేమైనా ప్రధాన మంత్రా?" లాంటి ప్రశ్నల ద్వారా ఇంటిబాసునీ పాఠకులకి రూపు కట్టేస్తారు. చాలా కథల్లో కనిపించే 'కిరణ్' పాత్ర మరెవరో కాదు, రచయిత రవికుమారే అని పాఠకులకి అర్ధం కాడానికి ఎన్నో కథలు పట్టవు. 'చెంచు మంత్రం' కథలో కిరణ్ ఉండడు.. కానీ పార్థ, సారథి పాత్రలు రెంటిలోనూ రచయిత కనిపించేస్తారు.

పుస్తకం పేరులో చింతలవలస ఉన్నా, కథల్లో కళింగాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలు మూడూ కనిపిస్తాయి. పాల కథలు అన్నింటికీ కథాస్థలం రాయలసీమే. అలాగే నల్గొండ, పల్నాడు ప్రాంతాల్లో పశుపోషణని గురించిన నిశిత పరామర్శ కనిపిస్తుంది 'పాలపుంతలో ముళ్ళు' కథలో. పుస్తకం చదవడం పూర్తిచేసేసరికి ఉత్తరాంధ్ర నుంచి మరో ప్రామిసింగ్ రైటర్ వచ్చారన్న భావన బలపడింది. ('చింతలవలస కథలు,' చినుకు పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 152, వెల రూ. 95, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 వ్యాఖ్యలు:

 1. chintavalasa kathalu bhale intrestingaa unnai.
  http://www.googlefacebook.info/

  ప్రత్యుత్తరంతొలగించు
 2. 'నిజానికి ఇదే జిల్లాలో ఇదే పేరుతో సుమారు ఓ పది పల్లెటూళ్ళు ఉన్నాయి'

  నిజం. నాకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది అప్పుడప్పుడు. మీ రివ్యూలు చదివితే వెంటనే పుస్తకాలు కొనేయాలనిపిస్తుంది కానీ ఎన్నని కొంటాం? మీ స్పీడ్‌లో చదవడం మాకు సాధ్యమా? :) పసలపూడి కథల తర్వాత ఈ ఊళ్ల కథల ట్రెండ్ పెరిగినట్టుంది కదూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. This book is available in kinige..

  http://kinige.com/kbook.php?id=989&name=Chinthalavalasa+Kathalu

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @అజయ్ కుమార్ : ధన్యవాదాలండీ
  @చాణక్య: పది ఊళ్ళ విషయం రచయితే చెప్పారండీ, మొదటి కథలో :) ..ధన్యవాదాలు
  @సుబ్రహ్మణ్యం మూలా: ధన్యవాదాలండీ

  ప్రత్యుత్తరంతొలగించు