ఆదివారం, జులై 28, 2013

అందుకో నా లేఖ...

అమ్ములూ,

నాలుగు కాగితాలు ఉండచుట్టి పడేశాను.. ఎలా పిలవాలో తెలీక.. ఎదురుగా ఉన్నప్పుడు పిలవడం అన్నది ఎప్పుడూ ప్రత్యేకంగా అనిపించలేదు.. ఒకే ఒక్కసారి తప్ప!! కాపురానికి వచ్చిన రెండు వారాల తర్వాత, ఆషాఢమాసం వంకన పుట్టింటికి బయల్దేరడానికి రెండు వారాల ముందూ ఆవేళ ఉదయం నేను యదాలాపంగా 'అమ్మీ' అని పిలిస్తే ఎర్రగా చూశావు చూడు.. అలా చూసేసి విసురుగా తల తిప్పుకోగానే నీ బారు జడ మెడకి చుట్టుకుని బుగ్గని ముద్దాడినప్పుడు 'వాలు జడనైనా కాకపోతిని..' అని పాడుకున్నాను మూగగా.. మరీ.. ఇప్పుడు ఎవర్ని చూస్తున్నావలా చురచురా??

ఇంతకీ ఎలా ఉన్నావు... ఏం చేస్తున్నావు?? నీకేం, మీ వాళ్ళందరితోనూ సరదాగా గడిపేస్తూ ఉంటావు.. రోజులు గడుస్తున్నట్టే తెలియడం లేదు కాబోలు. నా పరిస్థితి ఏమిటో కనీసం ఒక్కసారన్నా ఆలోచించావా.. పున్నమి కదా అని నిన్నరాత్రి డాబా మీదకి వెళ్లి చందమామని చూడబోతే, మబ్బు చాటు చంద్రుడు నన్ను చూసి నవ్వినట్టు అనిపించింది. ఒక్క చంద్రుడేనా, ఎవర్ని చూసినా నన్ను చూసి నవ్వుతున్నారేమో అని ఒకటే అనిపించేస్తోంది. ఎందుకు నవ్వుకుంటున్నారో అని అద్దంలో మొహం చూసుకోవాలని కూడా అనిపించడం లేదు. అసలు ఏ పనిమీదకీ దృష్టి పోవడం లేదు తెలుసా.

నాలుగేళ్ల నుంచీ ఈ క్వార్టర్స్ లో ఉంటున్నా నాకు తెలిసిన వాళ్ళు తక్కువే.. నువ్వొచ్చి అందరినీ ఇట్టే పరిచయం చేసేసుకుని, స్నేహం కూడా కలిపేశావు. అందరికీ ఏం చెప్పావో తెలీదు కానీ, రోజుకో కేరియర్ వస్తోంది.. చుట్టుపక్కల వాళ్ళ దగ్గరనుంచి. కూరలు, పులుసుల మొదలు, అవియల్, కూటు వరకూ... కేరియర్ విప్పిన ప్రతిసారీ ఒక్కటే ఆలోచన.. 'నువ్వు కూడా ఉంటే...' ...ఈ ఆలోచనే నా గొంతుకి అడ్డం పడిపోతోంది. కనీసం మరో రెండు వారాలు ఆగాలి నీతో కలిసి గడపాలంటే.. ఎప్పటికి గడుస్తాయో కదూ.. ఉదయం నుంచి సాయత్రం వరకూ బాగానే గడిచిపోతోంది, ఆఫీసు పుణ్యమా అని. కానీ, సాయంత్రం నుంచి ఉదయం వరకూ గడపడం నా వల్ల కావడం లేదు. ప్చ్...

రోజూ ఆఫీసు నుంచి వస్తూ నాకు తెలియకుండానే పూలకొట్టు ముందు ఆగిపోతున్నాను.. ఇంట్లో నువ్వు లేవన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ బయల్దేరుతున్నా.. అదిగో.. అలా నన్నుచూసి నవ్వుకునే వాళ్ళలో పూలమ్మి కూడా చేరిపోయింది. ఏం చేయనూ ఇంటికి వచ్చి? క్వార్టర్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా.. ఆడుకుంటున్న పిల్లల్ని చూసినప్పుడు, కొన్నేళ్ళు గడిచేసరికి మన పిల్లలూ వాళ్ళలో ఉంటారన్న ఊహ తోస్తుంది. నిన్న మొన్నటి వరకూ నేను... ఇప్పుడు నువ్వు-నేను.. కొన్నేళ్ళు గడిచేసరికి మనం.. తలచుకుంటే ఆశ్చర్యంగా అనిపించే నిజం కదూ ఇది..

నువ్వు రాకముందు గడిపిన జీవితం ఆలోచనలోకి కూడా రావడం లేదంటే నమ్ముతావా? ప్రతి ఆలోచనా మనం కలిపి గడిపిన రోజుల చుట్టూనే తిరుగుతోంది. వచ్చిన రోజు సాయంత్రమే షికారుకని బయల్దేరదీసి పూల మొక్కలు కొనిపించావు చూడూ.. అవే ఇప్పుడు నాకీ ఇంట్లో తోడు. గులాబీ మొగ్గ తొడుగుతోంది. ఎరుపా, గులాబిరంగా అన్నది ఇంకా తెలియడం లేదు. జాజితీగ నెమ్మదిగా పాకుతోంది, తాడు మీదకి. వర్షాలు బానే పడుతున్నాయి కదా... నీళ్ళు పోసే పని ఉండడం లేదు.. వెళ్తూ వెళ్తూ నువ్వు చెప్పిన జాగ్రత్తలు మాత్రం పూటా గుర్తొస్తున్నాయి.. వాకిట్లో మొక్కలు ఎండిపోతూ ఉంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారమ్ములూ?

నిన్ను చూడాలని బాగా అనిపిస్తోంది.. ఏ అర్ధరాత్రో కలత నిద్ర నుంచి మెలకువ వచ్చినప్పుడు అప్పటికప్పుడే బయల్దేరి నీ దగ్గరికి వచ్చేయాలని యెంతగా అనిపిస్తుందో.. అదేం ఊరసలు? వంక పెట్టుకుని వద్దామన్నా ఎవరూ చుట్టాలూ, స్నేహితులూ లేని ఊరు.. మా ఆఫీసే కాదు, ఆ చుట్టుపక్కల ఐదూళ్ళలో అసలు ఏ ఆఫీసూ లేనే లేదు కాబట్టి 'ఆఫీసు పని' అని వంక పెట్టడానికి అస్సలు కుదరదు. పోనీ, గోదారికి వరదలు కదా.. ఎలా ఉన్నారో చూద్దామనీ అని వంక పెడదాం అంటే, 'ఎంత పెద్ద వరదొచ్చినా మా ఊరికి ఏమీ అవ్వద'ని పెళ్లి చూపులప్పుడే చెప్పేశారు మీవాళ్ళు. ఎన్నో జాగ్రత్తలు చెప్పావు కానీ, ఏ వంక పెట్టుకుని నిన్ను చూడ్డానికి రావాలో ఉపాయం చెప్పావు కావు..

చూస్తాను చూస్తాను... నేరుగా వచ్చేసి, "మీ అమ్మాయి ఉన్నఫళంగా రమ్మని ఉత్తరం రాసిందండీ" అని చెప్పేస్తాను.. ఇంటికొచ్చిన అల్లుడిని వెళ్ళిపొమ్మని చెప్పలేరు కదా.. వేరే ఏ దారీ దొరక్కపోతే ఇదే దారి.. మళ్ళీ, ముందుగా చెప్పలేదని నన్ను సాధించకుండా ఇప్పుడే చెప్పేస్తున్నా... అప్పుడు తెల్లముఖం వెయ్యకూడదు.. తెలిసిందా... ఉహు... ఉత్తరం ముద్దులు ఇవ్వదల్చుకోలేదు నీకు.. అన్నీ నేరుగానే... వచ్చేస్తున్నానూ...

నీ
-నేను

15 వ్యాఖ్యలు:

 1. ఆషాఢం ముగుస్తుందని తెలిసీ బాబుగారికి తొందరేమిటో !! మురళి గారిలో మురళీధరుడు కూడా ఉన్నరన్నమాట ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హాం!!! ఎంత బావుందో....! చాలా చాలా తియ్యగా ఉందండీ. ఇంక మాటలు రావడం లేదు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మరి అటువైపునుండి వచ్చిన జవాబు మాకెప్పుడు చూపిస్తున్నారు...:)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఎంత బాగుందో .....మీ ఉత్తరం చదువుతుంటే రచయిత్రీ రంగనాయకమ్మ గారి కథానాయకుడు బుచ్చిబాబు భార్య విమలకు రాసిన ఉత్తరం గుర్తుకు వస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @నాగార్జున: హహహా... ధన్యవాదాలండీ..
  @విశ్వనాథ్ : ధన్యవాదాలండీ
  @పప్పు శ్రీనివాస రావు: ఊ ఊ :) :) ..ధన్యవాదాలండీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
  @ప్రియ: ధన్యవాదాలండీ..
  @చిన్ని వి: ధన్యవాదాలండీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @ప్రవీణ: ధన్యవాదాలండీ...
  @స్ఫురిత మైలవరపు: జవాబు రాగానే చూపించేస్తానండీ :) ..ధన్యవాదాలు..
  @డేవిడ్: ధన్యవాదాలండీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @వాసు: ధన్యవాదాలండీ..
  @మనీ పర్స్: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు