శుక్రవారం, జులై 05, 2013

జర్నీ ముచ్చట్లు

టైటిల్ చూసి ఇదేదో మా గోదారమ్మాయి అంజలి పొడవు జడతో నటించిన 'జర్నీ' సినిమా గురించిన పోస్టు అనుకోవద్దని మనవి.. (ఆ అమ్మాయి కన్నా, జడే ఎక్కువగా నటించేసిందని నా అనుకోలు).. మరి పోస్టు దేనిగురించీ అంటే.. ప్రయాణాల గురించి.. మరీ ముఖ్యంగా బస్సు ప్రయాణాల గురించి.. ప్రయాణాల్లో ఎదురయ్యే పదనిసల గురించీ అన్నమాట.. సాంకేతిక పరిజ్ఞానం బాఘా పెరగడం వల్ల అనేకానేక ప్రయోజనాలు ఉన్నాయి కానీ, బస్సు ప్రయాణాల్లో మాత్రం బోల్డన్ని ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. సమస్య పరిజ్ఞానంతో కాదు, దాన్ని సరిగ్గా వాడుకోక పోవడంతో.. అదికూడా ఎలా వాడకూడదో తెలిసీ అలాగే వాడడం వల్ల అనిపిస్తూ ఉంటుంది, కొన్ని కొన్ని అనుభవాలు ఎదురైనప్పుడు.

సెల్ఫోన్ల లో కేవలం పాటలు మాత్రమే వినిపించేవి నిన్న మొన్నటివరకూ.. త్రీజీ పుణ్యమా అని ఇప్పుడు సర్వమూ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఈ వినిపించడం అన్నది కేవలం మనకు మాత్రమే జరిగేందుకు వీలుగా ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ లు ఉన్నాయి. కానైతే, వీటిని వాడేవాళ్ళు కొద్దిమందే.. ప్రయాణాల్లో అయితే అతికొద్దిమంది. బస్సులో కనీసం ఒకరో ఇద్దరో నిస్వార్ధ పరాయణులైన అవుత్సాహిక ప్రయాణికులు ఉంటారు. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' టైపులో వీళ్ళ ఆనందం మొత్తం ప్రపంచానికి ఆనందం కావాలి అని మనసా వాచా కోరుకుంటారు. అందు నిమిత్తం, స్పీకర్ ఆన్ చేసి మరీ వాళ్ళ ఫోన్ లో ఉన్న పాటల్ని మిగిలిన ప్రయాణికులు అందరికీ వినిపిస్తూ ఉంటారు.

'తెల్లారితే వీళ్ళందరూ తలోచోటికీ వెళ్ళిపోతారు కదా... మనదగ్గరున్న పాటలన్నీ ఇప్పుడే వినిపించేద్దాం' అనే ఆత్రుత కొద్దీ, అర్ధ రాత్రుళ్ళు సైతం తమ రాగయాగాన్ని నిరంతరాయంగా కొనసాగించేసే ఈ అవుత్సాహికుల వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. మరీ ముఖ్యంగా పగలంతా పనిచేసుకుని రాత్రి బస్సులో చిన్నదైనా ఓ కునుకు తీసేద్దాం అని ప్లాన్ చేసుకున్న వాళ్ళకీ, తెల్లారితే ఊపిరి సలపని పనులు కాబట్టి ప్రయాణంలోనే కూసింత రెస్టు తీసుకుందాం అనుకున్న వాళ్ళకీ ఈ పాటలు ఆనందానికి బదులు చిరాకుని మిగులుస్తాయి. పెద్దగా చదువుకొని వాళ్ళైతే ఒక్కసారి చెప్పగానే అర్ధం చేసుకుని, ఇయర్ ఫోన్లు పెట్టుకోడమో లేదా పాటలు ఆఫ్ చేయడమో చేస్తారు. అదే వెల్-ఎడ్యుకేటేడ్ వాళ్ళైతే డ్రైవర్ కి కంప్లైంట్ చేయాల్సిందే. అప్పుడు కూడా "ఐ టూ బాట్ ది టికెట్" లాంటి ఆర్గ్యుమెంట్లు వినాల్సి ఉంటుంది.

దూరదర్శన్ రోజుల్లో కుర్చీలో కూచోబెట్టి కాళ్ళూ చేతులూ కట్టేసి మరీ పందుల పెంపకం కార్యక్రమం నిర్బంధంగా చూపించడం లాంటి కార్టూనులు వచ్చేవి పత్రికల్లో. అలాంటి నిర్బంధ సినిమా వీక్షణం ఒకటి బస్సు ప్రయాణాల్లో తరచూ సంభవిస్తూ ఉంటుంది. బస్సులో వేసే సినిమా మొదలు, సౌండ్ వరకూ దేనిలోనూ ప్రయాణికుల ప్రమేయం ఉండదు. మొన్న ఓ ప్రయాణంలో ఓ కొత్త సినిమా చివరి అరగంటా చూశాను. అప్పుడే చదువు పూర్తిచేసుకున్న ఓ పాతికేళ్ళ అమ్మాయి, తనకి కార్లో లిఫ్ట్ ఇచ్చిన తన తండ్రి వయసు హీరోతో ప్రేమలో పడిపోతుంది, అతగాడు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ విని. ప్రేమ గుడ్డిది.. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అబద్ధం అని తెలిసి అతనిమీద పగ పెంచుకుంటుంది.. ప్రేమ ప్రతీకారాన్ని కోరింది... తల్లిదండ్రులు ఆ పిల్లని ఆమె ఈడువాడే అయిన మరియు బాల్యం నుంచీ ఆమెని ప్రేమించేస్తున్న ఆమె బావతో నిశ్చితార్ధం ఏర్పాట్లు చేస్తారు. ఈ బావేమో, తండ్రి వయసు హీరోనే నీకు సరైన వాడు, నేను తగను అని పక్కకి తప్పుకుంటాడు.. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది.. సినిమా మాత్రం ప్రేక్షకుల తలనొప్పిని కోరింది.

చివరి అరగంటలోనే ఇంత కథ జరిగిపోతే, ముందు గంటన్నర లోనూ దర్శకుడు ఏం చెప్పాడా? అన్న కుతూహలం ఎంతైనా కలిగింది. చూసిన ఒకే ఒక్క పాట ఆధారంగా గూగుల్ చేసి సినిమా పేరు తెలుసుకున్నాను.. చూసే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నా.. మళ్ళీ ఏదన్నా ప్రయాణంలో మొత్తం సినిమా చూడాల్సి వస్తుందేమో అన్న భయం మాత్రం కలుగుతోంది. టీవీ ఉన్న బస్సు, టీవీ లేని బస్సు అన్న చాయిస్ ఉంటే బాగుండును కదా అని బలంగా అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి సినిమాలకి బలి అయినప్పుడల్లా.. ఒంటరి ప్రయాణంలో పక్కసీటు ప్రయాణికుడు ఫేస్ బుక్ అప్డేట్ల బాపతు అయితే ఆ కష్టం అంతా ఇంతా కాదు.. ఏ కొందరు పుణ్యాత్ములో ఉంటారు, సౌండ్ ఆప్షన్ తీసేసేవాళ్ళు. మిగిలిన జనాభా మాత్రం వాళ్లకి అప్డేట్ వచ్చిన విషయాన్ని చుట్టుపక్కల అందరికీ వినిపించేంత సౌండ్ కనీసం ఉంచుతారు డివైస్ కి.

టెక్నాలజీ తో సంబంధం లేని సమస్యలూ తక్కువేమీ కాదు. ఆ మధ్య ఓ ప్రయాణం లో ఓ తల్లీ కొడుకూ బస్సెక్కారు. కొడుక్కి యాభై, తల్లికి డెబ్భై ఐదు పైమాటే. అంత పెద్దావిడ బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా అనుకున్నా, ఆవిడ కర్ర సాయంతో బస్సు ఎక్కుతుంటే. అనుకోకుండా వాళ్ళది మా వెనుక సీటే. మనిషి వంగిపోయినా గొంతు మాత్రం భానుమతి, యెస్. వరలక్ష్మిల వారసత్వంలో వచ్చిందన్న విషయం అర్ధం కాడానికి ఎక్కువ టైం పట్టలేదు. గొంతు విషయంలో కొడుక్కి అచ్చం తల్లిపోలికే. ప్రయాణం పూర్తయ్యేసరికి వాళ్ళ ఉమ్మడి కుటుంబ రాజకీయాలు, బంగారం వెండి పంపకాల గురించి బస్సు యావత్తుకీ ఎన్ని విషయాలు తెలిశాయో చెప్పలేను. "మేం కాసేపు పడుకుంటాం" అని ఒకరిద్దరు నిర్మొహమాటులు నోరు తెరిచి అడిగేసినా లాభం లేకపోయింది. అర్ధం అయిన విషయం ఏమిటంటే, అటు తల్లి కానీ ఇటు కొడుకు కానీ ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు మౌనంగా ఉండలేరు. ఇలా చెప్పుకుంటూ వెడితే వీటికి అంతం కనిపించదు కాబట్టి ఇక్కడితో ఆపుతున్నా...

16 కామెంట్‌లు:

  1. బస్సుల్లో బాధలు...బాగున్నాయి.

    రాత్రే అనుకున్నాను మీ టపా పడి చాలా రోజులయింది అని.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారూ,
    చాలా రోజుల తర్వాత మీ బ్లాగు చూసాను.
    భలే nostalgic గా అనిపించింది మీ పోస్టు చదివితే. మా బెంగుళూరు-హైదరాబాదు బస్సు ప్రయాణాలు గుర్తొచ్చాయి. అప్పుడింత టెక్నాలజీ లేదనుకోండీ, అయినా దాదాపు ఇలాగె వుండేది.
    ఇక్కడా మేమూ బస్సు ప్రయాణాలు చేస్తాం. అందం చందం లేనివి. ఓ మాటా లేదు, ముచ్చటా లేదు. ఎవరికి వాళ్ళే బిగదీసుకొని, కిటికీల్లోంచి బయటికి చూస్తూ, నిశ్శబ్దంగా! ఏమాత్రం సరదాగా వుండదు!
    శారద

    రిప్లయితొలగించండి
  3. అన్నిటికంటే పెద్ద సమస్య, సెల్‌ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడడం.
    బస్సు లేదా రైలు బోగీ అంతా వినపడేలా మాట్లాడేస్తుంటే, మన ఇయర్ ఫోన్ కూడ పనిచెయ్యదు.

    రిప్లయితొలగించండి
  4. meeru mee comfort gurinche chepparu, kani meeru appudu viileges ku bus prayanam chesinatlu leru ala chesi unte meeku meeru rasinavanni chinnaviga kanipinchi undevi

    రిప్లయితొలగించండి
  5. నిస్వార్ధపరాయణులు దగ్గర నుండీ నవ్వుతూనే ఉన్నానండీ :-) పాపం ఆ తండ్రి వయసు హీరో గారు చాలా ఎనర్జిటిక్ యూత్ & మాస్ హీరోనని ఫీల్ అవుతుంటే మీరేటండీ అంత మాటనేశారూ :)))

    రిప్లయితొలగించండి
  6. ఈ ఔత్సాహిక పాటల ప్రేమికుల వల్ల పాట్లు అన్నీ ఇన్నీ కావు.. మన టైం బావుంటే, వాళ్ళది మన ప్రక్క సీటే అవుతుంది కూడానూ!!
    మీరు చెప్పిన అదే అరగంట, ఈరోజే చూశా టి.వి.లో..!! అధ్బుతమైన చిత్రరాజం !!

    @శారద గారూ: మీరన్నదీ పాయింటే.. అతి సర్వత్ర....

    రిప్లయితొలగించండి
  7. వీళ్ళ ఆనందం మొత్తం ప్రపంచానికి ఆనందం కావాలి అని మనసా వాచా కోరుకుంటారు<<<

    నిజమేనండీ. ఈ బాధ మీరూ పడుతున్నారన్నమాట.

    రిప్లయితొలగించండి
  8. aa ammaayikannaa aame jade ekkuvagaa natinchesindani naa anukolu...
    manchi kitabandi anjaliki. aa vaakyam nijangaa nannu kattipadesindi.
    mee next post aalasyam ayyindi. aalasyam amrutham visham annaaru kadandee...
    bhasker koorapati

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగా రాశారండీ. చదువుతున్నపుడు నవ్వొచ్చినా.. ఆ తిప్పలన్నీ నాకూ అనుభవమయ్యాయి కనుక అవి గుర్తొచ్చి మనసు కాస్త మూగగా మూలిగింది. అందునా మరుముఖ్యంగా పోయినసారి దమ్ము అని ఓ దిక్కుమాలిన సినిమాకు బలయిన నాకు మీ పోస్ట్ కాస్త ఉపశమనాన్ని కలిగించింది (హమ్మయ్య.. నేనే కాదు నాలాటి వారు ఇంకొందరున్నారన్న ఫీలింగ్ వల్ల కాబోలు :P).

    రిప్లయితొలగించండి
  10. బాగుంది... ఊహించుకుంటుంటె నవ్వాగలేదు... అంటే, బస్ లో లేను కదా అందుకే నవ్వు... లేదంటే కెవ్వే

    రిప్లయితొలగించండి
  11. @సిరిసిరిమువ్వ: అవునండీ.. బాగా గ్యాప్ వచ్చేసింది... ధన్యవాదాలు..
    @శారద: నాలాంటివాళ్ళకి అలాంటి ప్రయాణం హాయిగా ఉంటుందేమోనండీ.. ధన్యవాదాలు
    @బోనగిరి: నిజమేనండీ..కనిపించని సమస్య.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  12. @వాణి: అయ్యో.. ఆ అనుభవాలూ ఉన్నాయండీ.. రాస్తాను ఎప్పుడైనా.. ధన్యవాదాలు..
    @వేణూ శ్రీకాంత్: మన హీరోల్లో యూత్ కానివాళ్ళు ఎవరు చెప్పండి? :) ... ధన్యవాదాలు..
    @మేధ: చూసేశారా? నేనెప్పుడో ఏదో బస్సులో చూడ బడతానేమో ఆ సినిమాని.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. @పురాణపండ ఫణి: ధన్యవాదాలండీ
    @శిశిర: తప్పడం లేదండీ మరి ... ధన్యవాదాలు
    @భాస్కర్: కొంచం తరచుగా రాసే ప్రయత్నం చేస్తానండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  14. @ప్రియ: అబ్బో... చాలామందే ఉన్నారండీ.. ధన్యవాదాలు
    @నవీన్: ధన్యవాదాలండీ...
    @డేవిడ్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి