ఆదివారం, మార్చి 03, 2013

శ్రీరమణ పేరడీలు

పెద్ద పెద్ద కవుల్నీ రచయితలనీ అనుకరించే వాళ్ళు బోల్డంత మంది. ఈ ఔత్సాహిక కవులూ, రచయితలూ తమకంటూ ఓ సొంత బాణీని ఏర్పరుచుకునే క్రమంలోనో, లేక ఏర్పరుచుకోలేకో పెద్దవారిని అనుకరించేస్తూ ఉంటారు కానీ, ఆ విషయాన్ని బాహాటంగా ఒప్పుకోరు. ఆయా కవుల్నీ, రచయితల్నీ అనుకరించి, ఇది ఫలానా వారి రచనకి అనుకరణ అని ప్రకటించడమే కాకుండా, ఆ అనుకరణలో హాస్యాన్ని మేళవిస్తే అది 'పేరడీ' అవుతుంది. తెలుగునాట పేరడీకి పేరు తెచ్చినవాడు సాహితీలోకం రుక్కాయిగా పిల్చుకునే జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి (జరుక్ శాస్త్రి) కాగా, దానిని నవతరం పాఠకులకి చేరువ చేసినవాడు శ్రీరమణ.

ఏ ఒక్క సాహితీ ప్రక్రియకో తన పేరడీని పరిమితం చేయకుండా అటు పద్యాన్ని, ఇటు గద్యాన్ని అనాయాసంగా తిరగారయడంతో పాటు, ఆయా కవులు, రచయితల మాటతీరుని, ప్రవర్తననీ కూడా కళ్ళకి కట్టారు శ్రీరమణ. తమ కథా నాయకులని ఇంపాలా కారుల్లో తప్ప, మామూలు కార్లలో తిప్పడానికి ఇష్టపడని రచయిత్రులనీ వదలలేదు ఈ పేరడీ ప్రక్రియలో. వచనం, కవిత్వం, పీఠిక, ఫీచర్, ప్రేమలేఖ, సినిమా సమీక్ష... ఇలా అనేక అంశాలని ఆయా ప్రముఖులు ఎలా రాస్తారో ఊహించి పేరడీ రాశారు శ్రీరమణ.

"నట్టడివి లోంచి/నయా దిల్లీకి/మహాప్రస్థానం/మర్చిపోకు నేస్తం/నీ వాణ్ణి నేను/జాతీయ జంతువుని/మనిషిని" అంటారట శ్రీశ్రీ, నెమలిని జాతీయ పక్షిగా ప్రభుత్వం గుర్తించిన సందర్భంలో స్పందించమంటే. ఇదే సందర్భంలో కృష్ణశాస్త్రి అయితే "కరిమబ్బు మేనితో/స్వామివచ్చే వేళ/చివురాకు జంపాల/పురివిప్పి యాడేవు..." అంటారట!! "నీ రెక్కల సవ్వడికి సప్త తంత్రుల విపంచి/తూరుపు ఆకాశం నుంచి మహాభినిష్క్రమణం చేసినప్పుడు..." అంటూ మొదలు పెడితే ఆ కవి, తిలక్ కాక మరెవరు చెప్పండి. "జాతీయ విహంగం/సౌందర్య తరంగం/కాళిదాస కావ్య మరందం/పురివిప్పిన విపిన మయూరం" అంటే అది 'ప్రాస కోసం భావాన్ని బలిపెట్టడానికైనా సిద్దపడే' కవి సినారె.


శ్రీరమణ, మిగిలిన కవులనీ, రచయితల్నీ పేరడీ చేయడం ఒక ఎత్తు. విశ్వనాథ సత్యనారాయణని పేరడీ చేయడం ఒక్కటీ ఒక ఎత్తూ. విశ్వనాథ పీఠిక రాస్తే "సర్వశ్రీ గారి గ్రంధమును జూచితిని. చదివితిని. నా వద్దకు బరిచయ వాక్యముల నర్ధించుచు వచ్చెడువారి సంఖ్య యధికము. బహుశః నేడాంధ్ర దేశమున నాకు గల పేరు ప్రతిష్ఠలు అందుకు కారణము గావచ్చును" అంటారు. అదే ప్రేమలేఖ రాస్తే, "బాలామణీ! ఆశీః నిన్ను జూచితిని తదాది ఆలోచనలన్నియు నీ చుట్టూ పరిభ్రమించును. వదలి వచ్చుటకవి మొరాయించుచున్నవి. నా వంటి వాని మనస్సు సైతము బందీకృతమొనర్చిన నీదగు రూపలావణ్యములు అసామాన్యమే అయి ఉండవలె. మునుపే సరస్వతి నన్ను వరించెననుట లోక విదితము. అందులకై ఎందరు ఈర్ష్యబడిరో, బడుతుండిరో అది వేరు విషయము..." ఈ ప్రకారం సాగుతుందిట.

'మధురవాణి ఇంటర్యూలు' పేరిట ఎందఱో ప్రముఖుల్ని కన్యాశుల్కం మధురవాణి చేత ఇంటర్యూ చేయించారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఆ పురాణం వారినే, మధురవాణి చేత ఇంటర్యూ చేయించారు శ్రీరమణ. "నువ్వు పురాణం చేతిలో టాకింగ్ డాల్ వి. నీ పెదాలు అడ్డుపెట్టుకుని వారే మాట్లాడేశారు. పురాణం మహ లావు వెంట్రి లాక్విస్టు అన్నారు గిరీశం గారు" అంటుంది మధురం. అంతేనా? "ఈ బుక్కు మీరు భరాగో గారికి అంకితం ఇస్తే ఆయన తిరిగి ఆలపాటి రవీంద్రనాథ్ గారికి దత్తం చేశారు. చివరికి కృతిభర్త విషయంలో కూడా నా వృత్తి ధర్మాన్ని వదలనిచ్చారు కారు. మీరంతా మేధావులు" అంటూ చురక అంటిస్తుంది కూడా.

ఎంతటివారైనా నవ్వపుకోలేని పేరడీ 'రైలుబండిలో వైతాళికులు.' రచయితలూ, కవులూ అందరూ కలిసి ఓ రైలు బండిలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఊహకి అక్షర రూపం ఇది. "ఏపిల్... ఏపిల్... పావలా.. పావలా.. అని గుక్క తిప్పుకోని పళ్ళబ్బాయ్ కంపార్ట్మెంట్ లోకి వచ్చాడు. 'కొంటే బావుంటుంది' అన్నారు పింగళి. 'తింటే మరీ బావుంటుంది' అన్నారు కాటూరి. 'జంటకవిత్వం బానే ఉంది.. అయితే నేను కొనాల్సిందేనా..' అంటూ ఎంపిక చేసి పది పళ్ళు బేరం చేశారు విశ్వనాథ. 'మిగిలితే మాత్రం నాకోటి ఇవ్వండి' అన్నారు గణపతి శాస్త్రి. విశ్వనాథ వారు తలొకటి పంచి తానొకటి నోటికి తగిలించారు. పక్క క్యూ లోనుంచి శ్రీశ్రీ బుస కొట్టిన శబ్దం చేసి 'ఏపిల్ బూర్జువా వ్యవస్థకి ప్రతీక' అన్నారు. 'అయితే మీరు జామి పళ్ళు తప్ప తినరా ఏమిటి? ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను హనుమత్ప్రసాదంగా తింటూ ఉంటాను.." విశ్వనాథ ఏపిల్ నములుతూ అన్నారు..." ఈ ప్రకారంగా సాగుతుంది ఈ పేరడీ..

తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్వాదించే ఈ పుస్తకాన్ని నవోదయ వారు ప్రచురిస్తున్నారు, 1980 నుంచీ. విశేష ఆదరణ పొందిన పుస్తకం ఇది. ఇప్పటికీ జరుగుతున్నపునర్ముద్రణలే సాక్ష్యం. శ్రీరమణ రచనలకి బాపూ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. (పేజీలు 154, వెల రూ.75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

 1. కినిగెలో ఈబుక్కూ ప్రింటు బుక్కూ ఇక్కడ http://kinige.com/kbook.php?id=1316&name=Sriramana+Peradeelu

  రిప్లయితొలగించు
 2. నేను కినిగె లోనే కొని చదువు తున్నాను .. విశ్వనాథ వారి మీద పేరడీలు భలే పేలాయి.

  మధురవాణి ఇంటర్వ్యూలు చదవాలి ఇంకా .

  రిప్లయితొలగించు
 3. @ చావా కిరణ్ : ధన్యవాదాలండీ

  @వాసు: ఆస్వాదిస్తున్నారన్న మాట... ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు