సోమవారం, మార్చి 11, 2013

అనురాగ ప్రస్తారం

హరిప్రసాద్, కామాక్షి ల పెళ్లై ఏడేళ్ళు గడిచింది. కామాక్షి అందగత్తె. హరిప్రసాద్ ప్లీడర్, గాయకుడు కూడా. ఇద్దరి జాతకాల్లోనూ సంతాన రేఖ బలంగా ఉన్నా, ఇంకా పిల్లలు కలగలేదు. అన్నీ బాగానే ఉన్నా ఏదో స్థబ్దత.కామాక్షి కోపం, అలకా, అనుమానం ఇవన్నీ హరిప్రసాద్ కి అలవాటై పోయాయి. అటు శాస్త్రీయ సంగీతం లోనూ, ఇటు లలిత సంగీతంలోనూ ప్రావీణ్యం ఉన్న హరిప్రసాద్ పాట అందరినీ మెప్పిస్తుంది, ఒక్క కామాక్షిని తప్ప. మొదట్లో క్రమం తప్పకుండా అతని కచేరీలకి హాజరైన కామాక్షి, క్రమంగా వెళ్ళడం మానుకుంది.

హరిప్రసాద్ లో అసంతృప్తి పెరుగుతున్న తరుణంలోనే అతని జీవితంలో శోభాసుందరి ప్రవేశించింది. కాకినాడ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేసిన శోభాసుందరి ఆ ఊరి ఆస్పత్రికి వైద్యురాలిగా వస్తుంది. ఆమెని ముఖాముఖిని కలవడానికి మునుపే, ఇద్దరు ముగ్గురినుంచి శోభని గురించి వింటాడు హరిప్రసాద్. అందరి మాటల సారమూ ఒక్కటే. శోభ అచ్చుగుద్దినట్టు కామాక్షి లాగే ఉంటుందని. తన భార్యలాగే ఉండే మరో స్త్రీని చూడాలన్న కుతూహలం మొదలవుతుంది అతనిలో.

అటు శోభాసుందరి లోనూ అదే కుతూహలం. అచ్చం తనలాగా ఉండే ఆమెనీ, ఆమె భర్తనీ చూడాలని. ఇద్దరినీ కలిసి చూడడం వీలు పడదు ఆమెకి. మొదట కామాక్షిని ఆమె ఇంట కలుస్తుంది. ఆ తర్వాత హరిప్రసాద్ కచేరీకి వెళ్లి, అతని పాట విని, అతన్ని పరిచయం చేసుకుంటుంది. కచేరీలో ఉన్న హరిప్రసాద్, దూరంగా శ్రోతల్లో ఉన్న శోభని చూసి కామాక్షిగా పొరబడతాడు. దగ్గరగా వచ్చినప్పుడు, ఆమె కామాక్షి కాదని గ్రహిస్తాడు. అప్పటికే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి కుతూహలం ఉండడం వల్ల చాలా తొందరలోనే స్నేహితులు అవుతారు హరిప్రసాద్, శోభాసుందరి. శోభని చూసిన కళ్ళతో కామాక్షిని చూసినప్పుడు ఆమె ప్రత్యేకంగా కనిపించడం మొదలవుతుంది హరి ప్రసాద్ కి.

అంతేకాదు, శోభ కన్నా కామాక్షి అందగత్తె అన్న సత్యాన్ని గ్రహించి, ఆ ఇద్దరు స్త్రీల దగ్గరా అంగీకరిస్తాడు కూడా. శోభ మీద ప్రేమని పెంచుకుని, దానిని కామాక్షి యెడల ప్రదర్శించే చిత్రమైన స్థితికి వెడతాడు హరిప్రసాద్. శోభాసుందరి సైతం హరిప్రసాద్ మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. కానీ తన పరిమితులు ఏమిటో బాగా తెలుసు ఆమెకి. ఉన్నట్టుండి ఒకరోజు శోభని 'ప్రేమిస్తున్నా' అంటాడు హరిప్రసాద్.అయితే, ఆమె నుంచి ఏమీ కోరడం లేదని కూడా చెబుతాడు.

రెండు నెలలు గడిచాక ఒక రోజున, హరిప్రసాద్ వచ్చేసరికి హడావిడిగా ఉంటుంది ఇల్లు. కామాక్షిని పరీక్ష చేసిన శోభాసుందరి ఆమె గర్భవతి అని చెబుతుంది అతనికి. శోభని ఇంటి దగ్గర దిగబెట్టడానికి వెళ్ళిన హరిప్రసాద్ అడుగుతాడు ఆమెని, "మీరు నా జీవితంలో ప్రవేశించక పొతే అది జరిగేదే కాదంటే నమ్ముతారా?" అని. తన మనసు శోభ దగ్గరా, శరీరం కామాక్షి దగ్గరా ఉన్నాయని చెబుతాడు. అంతేకాదు, "మీకు నేనంటే నమ్మకం లేదా? ఏం కావాలి?" అని అడుగుతాడు కూడా.

శోభాసుందరి యేమని జవాబు చెప్పింది? వాళ్ళిద్దరి కథా చివరికి ఏమయ్యింది? నేను చెప్పడం కన్నా, బుచ్చిబాబు రాసిన 'అనురాగ ప్రస్తారం' కథ చదివి తెలుసుకోడమే బాగుంటుంది. తన రచనల్లో మానసిక విశ్లేషణలకి పెద్దపీట వేసే బుచ్చిబాబు, ఈ కథలోనూ అదే చేశారు. కథోచితమైన, పాత్రోచితమైన వర్ణనలు తళుక్కున మెరుస్తాయి అక్కడక్కడా. ఆరంభం కథలా కాక, వ్యాస ధోరణిలో ఉన్నా, అసలు కథ మొదలు కాగానే విడిచిపెట్టకుండా చదివించే కథనం. విశాలాంధ్ర ప్రచురించిన 'బుచ్చిబాబు కథలు' మొదటి సంపుటంలో చదవొచ్చీ కథని.

6 కామెంట్‌లు:

  1. దీనినే సెవెన్ ఇయర్స్ ఇచ్చింగ్ అంటారు ,తీనేటీగ సినిమా ద్వారా తెలిసింది :) అవును మీనాక్షి అని ఒకచోట కామాక్షి అని ఒక చోట వుంది ,పొరపాటా ?

    రిప్లయితొలగించండి
  2. మీరు ఇలా రెగ్యులర్ గా బ్లాగులు రాయడం బావుందండి. ఎన్ని సార్లు చదివినా మీ టపాలు బోర్ కొట్టవు.

    రిప్లయితొలగించండి
  3. మురళి గారికి, నమస్తే.
    బుచ్చిబాబు "అనురాగ ప్రస్తారం" కథ మీద మీ పోస్ట్ చదివాను. చాలా బావుంది.
    ప్రస్తారం అంటే ఏవిటో నాకు అర్ధం తెలియలేదు. చెప్పగలరు. ఈ సారి కథ ముగింపు గురింఛి అడగను.
    ఆ కథ లింక్ ఉంటె పంపగలరు. చదువుతాను. మీ పోస్ట్స్ అన్నీ విడవకుండా చదువుతున్నాను.
    మీ, భాస్కర్కే.

    రిప్లయితొలగించండి
  4. బాగుంది మాస్టారు మీ టపా ..బుచ్చిబాబు కథల గురించి వినడమే గాని ఎప్పుడూ చదవలేదు. మీ టపా చదివాక బుచ్చిబాబు గారి కథలు చదవాలన్న కొరిక కలిగింది.

    రిప్లయితొలగించండి
  5. @చిన్ని: కామాక్షి అండీ.. సరిచేశాను... ఆమె కళ్ళని బాగా వర్ణించారు బుచ్చిబాబు, అందువల్ల రాసేప్పుడు మీనాక్షి అని పోరబడ్డా.. సరిచేసినందుకు ధన్యవాదాలు..

    @స్వాతి: ధన్యవాదాలండీ... వీలు చిక్కినప్పుడల్లా రాస్తున్నా..

    రిప్లయితొలగించండి
  6. @భాస్కర్: సంగీత కళాకారులు కచేరీలో రాగప్రస్తారం చేస్తారండీ.. ఒక రాగాన్ని అందుకుని చేసే ఆలాపన.. ప్రయాణం అనవచ్చేమో.. నాయకుడు సంగీత కళాకారుడు కనుకా, ప్రేమకథ కనుకా 'అనురాగ ప్రస్తారం' అని పేరు పెట్టి ఉండవచ్చని నా అనుకోలు.. ధన్యవాదాలు..

    @నవజీవన్: బుచ్చిబాబు కథలు రెండు సంపుటాలు విశాలాంధ్ర ద్వారా అందుబాటులో ఉన్నాయండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి