గురువారం, ఫిబ్రవరి 14, 2013

అబ్బాయి తండ్రికి...

యువరాజా వారి తండ్రి గారికి,
చిరంజీవి రాజావారి తల్లి వక్కపొడి నములుతూ వ్రాయునది ఏమనగా....

శ్రీవారూ... చిలిపి నవ్వుల శ్రీవారూ,

ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి నన్ను మధ్యాహ్నం పూట కాసేపు నడుం వాల్చనివ్వడం లేదు తెలుసా.. "నువ్వలా పగలు పడుకుంటే, పుట్టేవాడు నిద్ర మొహం వాడు అవుతాడు" అంటూ ఇంట్లో అందరూ కలిసి బెదిరించేశారు. ఇంకేం చేస్తానూ..ఆయనగారి కబుర్లు వింటూ కాలక్షేపం చేస్తున్నాను. మీరిక్కడ ఉంటే నా పొట్టకి తల ఆన్చి వాడి అల్లరి వినే వారు కదూ. నాకూ మిమ్మల్ని విడిచిపెట్టి రావాలని అనిపించలేదు కానీ, 'తొలిచూలు...పుట్టింట్లోనే' అని పెద్దవాళ్ళు అందరూ అంటుంటే ఏమీ మాట్లాడలేకపోయాను, మీలాగే.

ఒక్కో మాట రాస్తున్నప్పుడూ గాజులన్నీ గలగల్లాడుతున్నాయండీ. మోచేతుల వరకూ తొడిగేశారు కదూ మొన్ననే, సీమంతం అనీ. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ.. "నువ్వేదో అనుకుంటున్నావ్ కానీ అక్కా.. సీమంతానికి వచ్చిన నా స్నేహితురాళ్ళని బావగారు తదేకంగా చూశారేవ్" అంటూ చెల్లి నన్ను ఆట పట్టించ బోయింది. అసలే మీరు వెళ్లిపోయారన్న చికాకులో ఉన్నానేమో, ఒక్క కసురు కసిరాను దాన్ని. ముఖం చిన్నబుచ్చుకుంది పాపం. ఆవేళ నన్ను చూడ్డానికే మీ రెండు కళ్ళూ చాల్లేదని దానికేం తెలుసూ, వెర్రి మొహంది.

ఏమిటో...నిన్న కాక మొన్ననే ఆషాఢమాసం వెళ్లినట్టు ఉంది.. రోజులెంత తొరగా గడిచిపోతున్నాయో.. అలాగని మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చేశాక ఉన్నట్టుండి గడియారం తిరగడం మానేసింది తెలుసా. ఇదిగో, ముందే చెబుతున్నాఇప్పుడు మీ ఉత్తరంలో "అరెరె..గడియారం పాడయిందా..వెంటనే సులేమాన్ షాపుకి పట్టుకెళ్ళి బాగుచేయించమని చెప్పు మీ నాన్నారికి" అని రాస్తే అస్సలు ఊరుకునేది లేదు. ఏం చెబుతున్నానూ? గడియారం గురించి కదూ.. ఉహు..అదేమిటో, చుట్టూ ఇంతమంది ఉన్నా అస్సలు తోచడం లేదండీ.

అక్కడినుంచి తెచ్చుకున్న ఊలు బంతులతో బుజ్జిగాడికి స్వెట్టరూ, మేజోళ్ళూ అల్లానా? తమ్ముడేమో రోజుకోసారైనా ఆ మేజోళ్ళలో వాడి వేళ్ళు పెట్టి చూసి, "ఏమిటక్కా? నా రెండు వేళ్ళంత కూడా ఉండదా వాడి పాదం? ఊలు కావాలంటే నే తెచ్చి పెడతా కానీ, కొంచం పెద్దవి అల్ల"మని విసిగిస్తున్నాడు. బామ్మకి బొంతలు కుట్టడానికే రోజంతా చాలడం లేదు. చేటలంతా, చెదరలంతా బుజ్జి బుజ్జి బొంతలు. మొన్నటికి మొన్న, "పుల్లేటికుర్రు చీరతో కుట్టిన బొంతైతే చంటాడు హాయిగా నిద్దరోతాడే అమ్మా" అంటూ కుట్టడానికి కూర్చుంది. అమ్మా నాన్నా ఏదో పరిక్షకి వెళ్ళే వాళ్ళలాగా దీక్షగా చదివేస్తున్నారు పంచాంగాన్ని. అంతేనా, ఏ ముహూర్తంలో పుడితే మనవడు చక్రవర్తి అవుతాడో లెక్ఖలు వేసేస్తున్నారు.

అష్టకష్టాలూ పడి మీకు అత్తిసరుతో పాటు, వేపుడు ముక్కలు వేయించడం, చారు పెట్టడం నేర్పించాను. ఎన్ని తిప్పలు పెట్టారు నన్నూ.. ఇంతకీ వంటింటి వైపైనా చూస్తున్నారా? కేరియర్ బోయినమేనా? నిలవ పచ్చళ్ళూ, పొడులూ అన్నీ ఉన్నాయ్. చిన్న గిన్నెతో అత్తిసరు పడేసుకున్నా చాలు మీకు. ఇక్కడ నన్నేమో అమ్మా, బామ్మా మొదలు పక్కింటి నరసమ్మమ్మ గారు, వెనక వీధి సుందరత్తయ్య గారివరకూ అందరూ అడగడమే... "పిల్లా... ఏమన్నా తినాలని ఉందా? చేసి పంపమా?" అని..నేను వద్దు అంటుంటే, తమ్ముడూ, చెల్లీ అడ్డు పడి "చెయ్యమను అక్కా...మేం తిని పెడతాం కదా" అని గోల చేస్తున్నారు.

అబ్బా...మీ అబ్బాయి కదులుతున్నాడండీ.. చిట్టి చిట్టి కాళ్ళూ, చేతులూ కదలడం తెలుస్తోంది. చక్కిలిగిలి పెట్టడంలో తండ్రికేమీ తీసిపోడు తెలుసా? వీడు మీ అంతటి వాడు అవ్వాలండీ.. ఆ పాడు సిగరెట్టు మాత్రం అలవాటు అవ్వకుండా కాసుకోవాలి బుజ్జి నాయినకి. మొగుడి సిగరెట్టు ముద్దు - నా కోడలికి నేను ఇవ్వలేను బాబూ.. మరేమో ఇప్పుడు నన్ను చూసి, వాడు ఎలా ఉంటాడో చెప్పేస్తోంది బామ్మ. పనస పండులాగా ఉంటాట్ట, రింగురింగుల జుట్టు ఉంటుందిట. పాపం నాకు మూడు పూటలా దిష్టి తీసేస్తోంది, ఆయాస పడుతూనే.

ఏమిటీ మూతి బిగించారు? పుట్టబోయేది అబ్బాయే అని చెప్పేస్తున్నాననా? నాకు తెలియదు కనుకనా మీ కోరిక.. ఆ వేళ ఆస్పత్రి నుంచి రాగానే, నా ఒళ్లో తలపెట్టుకుని పడుకుని చెప్పారు కారో.. వెండి మువ్వల పట్టీలు పెట్టుకున్న పారాణి పాదాలతో, పట్టు పరికిణీ ని కొంచం పైకి పట్టుకుని నట్టింట్లో ఆడపిల్ల ఘల్లు ఘల్లున తిరిగితే చూడాలని కదూ మీ ఆశ. పుడుతుందండీ.. మన బుల్లి తండ్రికి ఓ చెల్లెలు పుడుతుంది. అసలు మీరు తలచుకుంటే అదెంత పని కనుకా? (ఈ మాట రాశాక, సిగ్గేసింది.. కొట్టేద్దామా అనుకున్నాను కానీ, చదివేది మీరే కదా అనీ..) ఆడపిల్లకి ఓ అన్నయ్య ఉంటే ఆ అందమే వేరు కదండీ.

ఏవండీ... మరీ...చుట్టూ అందరూ ఉన్నా ఒక్కోసారి నాకెందుకో బెంగగానూ, భయంగానూ అనిపిస్తోంది. మీరు గట్టిగానే చెప్పేశారు కదా "ఇంట్లో వద్దు..ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే" అనీ. డాక్టర్లూ వాళ్ళూ ఉంటారు కానీ, ఆ వేళకి మీరూ నా పక్కన ఉండరూ...  నాకు తెలుసు మీ మనసు ఇక్కడే ఉంటుందని. నాన్నారి టెలిగ్రాం అందగానే వెంటనే వచ్చేయాలి మరి. పైకి బింకంగా ఉన్నారు కానీ, నాన్నారికీ లోపల్లోపల బెంగగానే ఉంది. నేను వినడం లేదనుకుని బామ్మే ధైర్యం చెబుతోంది ఆయనకి. మీరు జాగ్రత్త... ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది మిమ్మల్నీ,  మీ అబ్బాయినీను. చాలా సేపటి నుంచీ కూర్చుని ఉన్నాను కదా, నడుం కొంచం నొప్పిగా అనిపిస్తోంది. నిద్రపోను కానీ, కాసేపు వెన్ను వాలుస్తానండీ...ఉంటానూ. -'యువరాజ' మాత

(బ్లాగ్మిత్రులకు వేలంటైన్స్ డే శుభాకాంక్షలు!!)

29 కామెంట్‌లు:

 1. aardramga haayiga nalleru meeda bandi nadakala..............................

  రిప్లయితొలగించు
 2. చాలా బాగుంది. పరకాయప్రవేశం బానే చేశారు. :)

  రిప్లయితొలగించు
 3. భలే రాసారు ! ప్రతి వాక్యం కళ్ళ ముందు అవిష్కరించబడినది.గుడ్ .

  రిప్లయితొలగించు
 4. Claps Claps! :)

  మొత్తానికి భామిని విభుడికి ప్రమోషన్ ఇప్పిస్తోందన్నమాట! బావుందండీ. మీక్కూడా హేపీ వేలెంటైన్స్ డే! :)

  రిప్లయితొలగించు
 5. భామిని విభునకు వ్రాసిన రెండో ఉత్తరం...అదే స్థాయి. ఆ ఉత్తరమే ఇంకా రెపరెపలాడుతోంది. అంతలోనే మరో లేఖ. బావుంది బావుంది.

  రిప్లయితొలగించు
 6. ఎన్నెన్నో జ్ఞాపకాలు కళ్ళల్లో గిర్రున తిరిగాయి. Wonderful, మురళిగారూ!

  రిప్లయితొలగించు
 7. 'ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు'....మీ కలలన్నీ పండుతాయిలెండి:)

  రిప్లయితొలగించు
 8. వావ్.. బాగుందనేది చాలా చిన్నమాట మురళి గారు అద్భుతం.

  రిప్లయితొలగించు
 9. మీకొచ్చిన పాత ఉత్తరాలు తీసి చదువుకుంటుంటే బయట పడినట్టుంది ఈ ఉత్తరం. సందర్భానికి తగినట్టు ఉంటుందని ఇక్కడ పెట్టేసినట్టున్నారు. :):):)

  రిప్లయితొలగించు
 10. ఈ ప్రేమికుల రోజు గోల ఏమిటో.. దీనర్థం ఏమిటి ..ఈ ఒక్క రోజు ప్రేమించుకుని మిగతా రోజులు అస్సలు ప్రేమించు కోవద్దనా .. నిన్న Macys వాడి గళ్ళ పెట్టి బాగానే నిండి వుంటుంది. అమ్మల రోజుకి, నాన్నల రోజుకి ఇంత హడావడి ఉండదు ఎందుకో.

  Mee post chaala bagundi. Hat's off to you.

  రిప్లయితొలగించు
 11. "చిరంజీవి రాజావారి తండ్రికి మీ శ్రీమతి వక్కపొడి నములుతూ వ్రాయునది...." నిజంగా మనసును కట్టిపడేసింది.చాలా మంచి పోస్ట్ మురళి గారూ! మీదైన మార్కు రచన. ఓ గుక్కలో చదివేసాను. ప్రతి వాక్యం వెంట కళ్ళు అలా పరుగెత్తినయ్ ! సజీవ చిత్రణ చూపించారు,బాపు బొమ్మ కళ్ళ ముందు కదలాడింది, మీ పోస్ట్ చదువుతున్నసేపు. గుడ్. హాట్స్ ఆఫ్ టు యు మురళి గారూ!!

  రిప్లయితొలగించు
 12. "చిరంజీవి రాజావారి తండ్రికి మీ శ్రీమతి వక్కపొడి నములుతూ వ్రాయునది...."
  నాకూ ఇక్కడ భలే నచ్చేసిందండీ! ఎంతైనా వక్కపొడి/యాలుకలు నములుతూ రాసే/చెప్పే కబుర్లకి ఒక ప్రత్యేకత ఉంటుందండీ! ఆ మాటల పరిమళం మనల్ని అట్టే వదలదు!

  చాలా బావుంది, మురళీ.. రాసింది మీరే అయినా క్రెడిట్ మాత్రం భామినికే ఇవ్వాలనిపిస్తుంది నాకు :)

  రిప్లయితొలగించు
 13. @ఎ. సూర్యప్రకాష్: ధన్యవాదాలండీ
  @వాసు: ధన్యవాదాలండీ
  @చాణక్య: మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 14. @వెంకట్: ధన్యవాదాలండీ
  @చిన్ని.వి : అవునా!! ధన్యవాదాలండీ
  @కొత్తావకాయ: అవునండీ... భామినీ, విభుడూ ఇద్దరూ ప్రమోట్ అవుతున్నారు :-) ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 15. @గీతాంజలి: ధన్యవాదాలండీ
  @జ్యోతిర్మయి: ఆ ఉత్తరం మీకు యెంత నచ్చిందో గుర్తుందండీ :-) ధన్యవాదాలు
  @కామేశ్వరరావు భైరవభట్ల: పెద్ద ప్రశంస!! ధన్యవాదాలండీ

  రిప్లయితొలగించు
 16. @జయ: కలలది ఏముందండీ... వస్తూనే ఉంటాయి :) ధన్యవాదాలు
  @చిన్ని: ధన్యవాదాలండీ
  @వేణూ శ్రీకాంత్: బాగా నచ్చిందన్న మాట మీకు!! ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు

 17. @ఎన్నెల: థాంక్స్ థాంక్స్ :)
  @శిశిర: మీ ఇష్టం అండీ, ఏమనుకున్నా :) ధన్యవాదాలు
  @ఉషశ్రీ: ధన్యవాదాలండీ

  రిప్లయితొలగించు
 18. @లక్ష్మణ్: ధన్యవాదాలండీ
  @Anjaaas: పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలండీ

  రిప్లయితొలగించు
 19. @భాస్కర్: మీకు యెంత నచ్చిందో అర్ధమయ్యిందండీ... ధన్యవాదాలు
  @నిషిగంధ: అవునండీ... క్రెడిట్ భామినికీ, విభుడికే ఇవ్వాలి మరి :-) ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 20. wow. Beautiful! చాలా బాగా రాసారు మురళి గారు.

  (పిడకలవేట: సిగరెట్ తాగే మొగుణ్ణి ముద్దు పెట్టుకోవటమెంత కష్టమో, వక్కపొడి వేసుకున్న భామని ముద్దు పెట్టుకోవటం కూడా అంతే కష్టం మురళి గారూ :) మూడ్ కిల్లర్ :)

  రిప్లయితొలగించు
 21. @కుమార్ యెన్: అంతే అంటారా? భిన్న రుచి: కదండీ మరీ :) ధన్యవాదాలు

  రిప్లయితొలగించు