మంగళవారం, సెప్టెంబర్ 04, 2012

సావిరహే

ఇద్దరు పెద్దమనుషులు ఆడుతున్న చదరంగంలో ఆ అమ్మాయి ఒక పావు. ఆమె పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే తన తాతయ్య సంపాదించిన విలువైన ఆస్తికి వారసురాలు అవుతుంది. అలా కాక, ప్రేమ వివాహం చేసుకున్నట్టయితే ఆ ఆస్తి మొత్తం ఓ ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్ కి చెందుతుంది. ఆ ఇద్దరు పెద్దమనుషుల్లో ఒకరు ఆమె శ్రేయోభిలాషి. ఆస్తి ఆమెకి మాత్రమే చెందాలని కోరుకుంటున్నారు. మరొకరు, ట్రస్టు శ్రేయోభిలాషి. ఆమె ప్రేమ వివాహం చేసుకుంటే, ట్రస్ట్ కి కలిసి రాబోయే ఆస్తితో ఏమేం అభివృద్ధి పనులు చేయాలో ఆలోచిస్తూ ఉంటారు.

విచిత్రం ఏమిటంటే, తన పేరిట పెద్దమొత్తంలో ఆస్తి ఉన్నట్టు గానీ, దాని కోసం జరుగుతున్న చదరంగం గురించి కానీ ఆ అమ్మాయికి ఎంత మాత్రం తెలియదు. పుట్టక మునుపే తండ్రినీ, పుట్టిన కొద్దిరోజులకే తల్లినీ పోగొట్టుకున్న ఆ అమ్మాయి తన మామయ్య  ఇంట అతి సామాన్యంగా పెరుగుతోంది. పదిహేడేళ్ళ ఆ అందమైన అమ్మాయి పేరు ప్రియాంక. విమెన్స్ కాలేజీలో బీయే ఇంగ్లిష్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల 'సావిరహే' ఈ ప్రియాంక ప్రేమకథే.

కాలేజీలో చేరిన తొలిరోజే ఇంగ్లిష్ లెక్చరర్ రాజ్ కృష్ణ ఆకర్షణలో పడుతుంది ప్రియాంక. మలయాళీ అయిన రాజ్ కృష్ణ, పాఠాలు చెప్పే విధానం మిగిలిన లెక్చరర్స్ కి భిన్నంగా ఉండడంతో పాటు, ఇంగ్లిష్ లిటరేచర్ మీద అతనికి విపరీతమైన ప్రేమ ఉండడం వల్ల, అతి త్వరలోనే ఆ క్లాసులో అమ్మాయిలందరూ అతని క్లాసు కోసం ఎదురు చూడడం మొదలుపెడతారు. స్నేహితురాలు వాహిలతో కలిసి ప్రతి వారం సినిమాకి వెళ్ళే అలవాటున్న ప్రియాంకకి, ఓసారి థియేటర్ లో రాజ్ కృష్ణ తారస పడడంతో అతని గురించి మరికొంచం ఎక్కువ తెలుసుకో గలుగుతుంది.

తను రాజ్ కృష్ణతో ప్రేమలో పడ్డానేమో అని ప్రియాంక అనుమానిస్తున్న సమయానికే, రాజ్ కృష్ణ తను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫారిన్ ఛాన్స్ వెతుక్కుంటూ రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి యూఎస్ వెళ్ళిపోతాడు. తన మనసుకి తగిలిన గాయం తాలూకు నొప్పి తెలుస్తూనే ఉంటుంది ప్రియాంకకి. స్నేహితురాలి మనసు అర్ధం చేసుకున్న వాహిల, ఆ గాయం మానేందుకు తనవంతు సాయం చేస్తూ ఉంటుంది. సరిగ్గా, రాజ్ కృష్ణ ఆలోచనల నుంచి బయట పడుతున్న సమయంలోనే సందీప్ పరిచయం అవుతాడు ప్రియాంకకి.


ఇరవై ఒక్క సంవత్సరాల సందీప్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఉద్యోగి. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, తల్లే పెంచి పెద్ద చేసింది. చురుకైన అ కుర్రాడు, తొలి చూపులోనే ప్రియాంకతో ప్రేమలో పడతాడు. అతని బాస్ ఏకాంబరం ప్రియాంక ప్రేమని గెలుచుకునేందుకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాడు సందీప్ కి, తగుమాత్రం 'ఫీజు' పుచ్చుకుని. సందీప్ చొరవ, ఏకాంబరం సలహాలు, కలిసొచ్చే పరిస్థితులతో పాటు, ప్రియాంక, వాహిలలిద్దరికీ సందీప్ మీద మంచి అభిప్రాయం ఏర్పడడంతో ప్రియాంక కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.

ప్రియాంక-సందీప్ ల ప్రేమ చిక్కబడేనాటికి, వారికి మద్దతుగా ఓ పెద్ద మనిషి, వ్యతిరేకంగా మరో ఆయనా చేసే ప్రయత్నాలూ ఊపందుకుంటాయి. వారి ప్రేమకథ పెళ్ళి పీటల వరకూ వెళ్ళ గలిగిందా? ప్రియాంక తన ఆస్తిని దక్కించుకో గలిగిందా? అన్న ప్రశ్నలకి జవాబిస్తూ ముగుస్తుందీ నవల. ఆద్యంతం మల్లాది మార్కు నవల ఇది. ప్రతి అంశాన్నీ విపులంగా రాసే మల్లాది, నవల శీర్షికని గురించి ఓ సందర్భంలో ఓ పాత్ర చేత ఇలా చెప్పించారు: "విరహం లేకపొతే అది సరయిన ప్రేమ కాదు. 'సావిరహే తవదీనా రాధా' అన్నాడు జయదేవుడు. అంటే, 'నా విరహంతో ధన్యురాలైన రాధ' అని అర్ధం." 

ప్రియాంక-సందీప్ ల తొలి ముద్దుకి మల్లాది మార్కు వర్ణన ఇది: "స్వల్పంగా గడ్డి పరక మీద వాన చినుకులా మొదలయిన ఆ చిరుముద్దు, క్షణాల్లో జడివానలా మారి, జలపాతంలా దూకి, నదులుగా సాగి సాగరమై పొంగి పొరలసాగింది. అంతా కొన్ని పదుల క్షణాలు మాత్రమే. ఒకరికి మాత్రమే కుదరనిది, ఇద్దరికీ సరిపోయేది, ముగ్గురికి ఎక్కువయ్యేది అయిన ఆ ముద్దు, ప్రపంచంలోని అతి తియ్యటి మధుర భాష అయిన ఆ ముద్దు ఉపయోగించడానికి పనికిరాని వస్తువులాంటిదయినా, డబ్బుకన్నా విలువైనదానిలా చూసుకునే ఆ ముద్దు కేవలం కొన్ని పదుల క్షణాల్లోనే వాళ్ళని వివశులని చేసింది." 

సందీప్ కాసే చిత్రమైన పందాలు, ప్రియాంక, సందీప్ ఒకరికొకరు తమ ప్రేమని వ్యక్త పరుచుకునే తీరు, కాలేజీలో అమ్మాయిల కోడ్ లాంగ్వేజీ చదవడానికి సరదాగా అనిపిస్తే, ప్రియాంక మామయ్య క్షీరసాగరానికి దినఫలాల మీద ఉన్న నమ్మకం నవల చివరికి వచ్చేసరికి విసుగు కలిగిస్తుంది పాఠకులకి. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం రాసిన నవల ఇది. టీనేజ్ యువతీయువకులని, మరీ ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారిని బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమలో ఉన్నవాళ్ళకి, కొత్తగా ప్రేమలో పడ్డవాళ్ళకి బహుమతిగా ఇవ్వదగిన పుస్తకం. (సాహితి ప్రచురణ, పేజీలు 264, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

9 వ్యాఖ్యలు:

 1. వావ్ ఈ నవల నేను చదివేసానోచ్. యురేకా..ఆ...ఆ....ఆ.... అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలుసన్న మాట:)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళి గారూ!
  నాకు ఇష్టమైన..
  అప్పట్లో కొని దాచుకున్న నవల ఇది..
  నేను మొదటిసారి చదివినపుడు
  నా DIARY లో ఆ నవల లోని విషయాలు ఏవేవి
  వ్రాసుకున్నానో అవన్నీ మీరు చాలా వరకు చెప్పారు..:-)
  ENGLISH LITERATURE, COLOUR COMBINATIONS
  అన్నీ చాలా బాగుంటాయి...
  ఆ నవల లో నాకు ఇష్టమైన వాక్యం...
  "సున్నితమైన ప్రేమ నిశ్శబ్దంలో కూడా సిగ్గు పడుతుంది"
  చాలా సార్లు చదివిన...ఇపుడు కూడా అప్పుడప్పుడు
  చదివే నవల ఇది...
  మీరు గుర్తు చేసారు కాబట్టి రేపోసారి చదివేయాలి...:-))
  అభినందనలు మురళి గారు...మంచి పోస్ట్.
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Hello Murali garu,

  Meeku teluso ledoo..Malladi garu online Telugu Radio lo oka show chestunnaru. Kiran prabha(Koumudi.net) garu kuda ade radio lo weekly oka show chestunnaru. Meekemina interest unte details teluguoneradio.com lo chudandi. Meeru live shows catch cheyalekapote Archives lo vinochu.

  Mee reviews valla konni pustakalu chaduvutunnanandi. Chala baaga raastunnaru. Thank you.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నేను చాలా చాలా చిన్నప్పుడు చదివిన పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఇప్పటికీ నా దగ్గర ఉంది, ఊడిపోయిన అట్టతో. ఏకాంబరాన్ని, ఇద్దరనిని కలపడానికి వాడారన్న విషయం అర్థమయ్యేసరికి భలే అనిపించేది.

  నాకు కాలేజీ లెక్చరర్ ప్రేమ ఎపిసోడ్‌లు భలే నచ్చేవి. ఆయన ప్రశ్నలూ, వీళ్ళ తంటాలూ..
  (vamp fox held quartz duck just by wing ) ?!
  సరదాగా సాగిపోయే రచన. ఆహ్లాద రచయిత రచనల గురించి, అంతే ఆహ్లాదంగా రాశారండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @వసంతం: ధన్యవాదాలండీ..
  @జాహ్నవి: అవునండీ, 'మా' లోనే వచ్చింది.. ధన్యవాదాలు..
  @జయ: అభినందనలండీ :-) :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @శ్రీ: అవునండీ, ఇప్పుడు చదువుకోడానికీ సరదాగా ఉండే నవల.. ధన్యవాదాలు.
  @స్వాతి; యూఎస్ మిత్రుల ద్వారా తెలిసిందండీ, ఆ షో గురించి.. వినాలి, వీలు చూసుకుని.. ధన్యవాదాలు.
  @మానస చామర్తి: మీరు గుర్తు పెట్టుకోడాన్ని బట్టి అర్ధమవుతోందండీ, యెంత ఇష్టంగా చదివారో!! ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీ సమీక్ష చదివాక మరోసారి చదవాలనిపిస్తోందండీ "సావిరహే". మల్లాది మార్కు పూలశరం. మర్చిపోలేం. :)

  ప్రత్యుత్తరంతొలగించు