మంగళవారం, ఫిబ్రవరి 28, 2012

అమ్మాయి పెళ్ళి

దాదాపు రెండువేల మంది కూర్చునేందుకు సౌకర్యంగా ఉన్న కల్యాణ మండపం. రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక. ఆంధ్ర దేశంలోని అధునాతన ఫ్యాషన్లు ఏమిటో తెలుసుకోడానికి గూగుల్ సెర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అన్నట్టుగా అతిధులు. ఓ పక్క బ్యాండ్ మేళం వాళ్ళ హడావిడి.. వారిలో ఒక గాయకుడు కూడా ఉన్నట్టున్నాడు.. మైకందుకుని 'జగదానంద కారకా...' పాడేస్తున్నాడు. తిరునామాలు, కేరళ అంచు పంచెలతో మెరిసిపోతున్న ఐదుగురు పురోహితులూ చుట్టూ ఉన్నవాళ్ళని ఖంగారు పెట్టేస్తున్నారు.

తెల్లటి కుర్తా పైజమా, మెడ చుట్టూ మెరూన్ రంగు ష్రాల్ తో పెళ్ళికొడుకు మండపంలోకి వచ్చాడు. నేరుగా పరిచయం లేదు కానీ, ఆమధ్య స్కైప్ లో పరిచయాలై, కొద్దిగా మాటాడుకున్నాం. కొంచం చిక్కినట్టుగా అనిపించాడు. ఎంతైనా పెళ్ళంటే అబ్బాయిలకి టెన్షన్ మొదలవుతుంది కదా. పురోహితులకీ, బ్యాండు వాళ్ళకీ మధ్య హోరాహోరీ జరుగుతోంది. వీళ్ళు వాయించడం ఆపమంటారు, వాళ్ళు ఆపరు. ఆపారా, మళ్ళీ వాయించమన్నప్పుడు వాయించరు. ఉన్నట్టుండి బ్యాండు వాళ్ళు "బంగారు బొమ్మ రావేమే.." అందుకున్నారు. వచ్చేసింది బంగారు బొమ్మ. కానైతే వేదిక కి కొంచం ఎడంగా పూజకి కూర్చుంది.

పెళ్ళి శ్రద్ధగా చూడడం కోసం, చుట్టుపక్కల ఎవరితోనూ మాట కలపకుండా వేదికకి కళ్ళు అప్పగించేశాను. నా చుట్టుపక్కల గుంపుల్లో పెళ్ళి ఖర్చు, అబ్బాయి సంపాదన మొదలు, అమ్మాయి కట్టుకున్న చీర, పెట్టుకున్న నగల వరకూ తీవ్రంగా జరుగుతున్న చర్చలు వద్దన్నా చెవుల్లో పడుతున్నాయ్. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి బహుమానాలు అందించారు. ముందుగా అమ్మాయి, తర్వాత అబ్బాయి వేదిక మీద నుంచి తప్పుకున్నారు. పురోహితుల్లో పెద్దాయన మైకందుకుని అప్పటివరకూ చదివిన మంత్రాలకి అర్ధాలు వివరంగా చెప్పారు. విన్నవాళ్ళు మెచ్చుకున్నారు. కబుర్లలో బిజీగా ఉన్నవాళ్ళు, బహుశా వాటిని కూడా మంత్రాలనే అనుకుని ఉంటారు.

అబ్బాయి వచ్చాడు, మరో డ్రెస్ లో. బ్యాండు వాళ్ళు 'పందిట్లో పెళ్లవుతున్నాది..' వాయిస్తున్నారు. అమ్మాయి రాబోతోందని వీడియో వాళ్ళ హడావిడిని బట్టి అర్ధమయ్యింది. "పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు కడగడం ఎక్కడా జరగదు. ఒక్క పెళ్ళిలో తప్ప. ఇక్కడ వరుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు..." పురోహితుడు వివరిస్తూ ఉండగానే, అమ్మాయి తల్లిదండ్రులు వరపూజకి ఆయత్తమయ్యారు. కళ్ళ నిండుగా చూసుకున్నాను ఇద్దరినీ. ఆది దంపతుల్లా అనిపించారు. ఇవాల్టి పరిచయం, స్నేహమూ కాదు కదా. అమ్మాయి వాళ్లకి ఎంత అపురూపమో తెలుసు నాకు. ఆమెని అతనికి అప్పగించే క్షణంలో వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? సర్రున దూసుకొచ్చింది ఈ ప్రశ్న. నాకు తెలియకుండానే, వాళ్లలోకి పరకాయ ప్రవేశం చేసేశాను.

మనసెంత బరువెక్కి పోయిందంటే, బ్యాండు వాళ్ళ హడావిడి వినబడితే తప్ప సుముహూర్తం అయిందన్న స్పృహ కలగలేదు. ఉలికిపడి చూసేసరికి నూతన వధూవరుల మీద అక్షింతలు వేయడానికి బారులు తీరిన జనం. ఒకరితలపై ఒకరు జీలకర్ర, బెల్లం ఉంచుకున్న వధూ వరులు. వారి వెనుక నిలబడి అతిధులకి నమస్కరిస్తున్న వధువు తల్లిదండ్రులు. కాసేపలా చూస్తూ ఉండిపోయాను. నెమ్మదిగా కదిలి, క్యూలో నిలబడ్డాను. నా వంతు వచ్చేసరికి, వధూ వరులిద్దరూ పీటల మీద కూర్చుని అతిధులకి నమస్కరిస్తున్నారు. నా మిత్రులుద్దరూ నవ్వుతూ పలకరించేశారు. అమ్మాయి, అబ్బాయికి నేరుగా నన్ను పరిచయం చేసేయడం, అంత హడావిడిలోనూ.

వేదిక దిగుతుండగా కొందరు పరిచయస్తులు పలకరించారు. వారితో కలిసి భోజనానికి దారితీశాను. రెండు మూడు వంటకాలు కేవలం నాకోసమే వండించారేమో అనిపించింది. "మా ఇంటికి మీరెప్పుడు భోజనానికి వచ్చినా, ఐటమ్స్ సరిగ్గా ఉండవు" ఆవిడ మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. పాత బాకీలన్నీ వడ్డీతో సహా తీరిపోయాయి కదా మరి. అప్పటికప్పుడు చుట్టిచ్చిన తాజాపాన్ అందుకుని, మండపం దగ్గరికి వచ్చేసరికి ఇంకా అక్షింతలు వేసే కార్యక్రమం జరుగుతోంది. కాసేపటికి నూతన వధూవరులిద్దరూ చెరో చేంజింగ్ రూములోకీ వెళ్ళారు. పురోహితుడు మైకందుకునే లోగా, బ్యాండ్ గాయకుడు అలర్టై 'పెళ్ళి' గురించిన సినిమా పాటలన్నీ ఆపకుండా పాడేయడం మొదలు పెట్టాడు. తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరూ పలకరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు స్నేహితులూ కూడా పరిచయమే నాకు.

అమ్మాయి తల్లిదండ్రులు వేదిక దిగడానికి అనుమతి దొరికేసింది. వాళ్ళు ఒక్కొక్కరినీ పలకరించడం మొదలు పెట్టారు. "ఎలా ఉందండీ భోజనం?" అడిగారాయన, చేయి నొక్కుతూ. "చాలా బాగుందండీ.. ఎక్కడా వేస్టేజ్ కూడా లేదు. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది.." ఆయన సంతోష పడ్డారు. పెళ్లితంతు మళ్ళీ మొదలయ్యింది. మాంగల్య ధారణ పూర్తయ్యి, తలంబ్రాలకి రంగం సిద్ధమవుతోంది. "అమ్మాయి రేపటినుంచీ ఉదయం లేచీ లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని, అతని కాళ్ళకి నమస్కరిస్తుందా... " ఊహ చాలా సరదాగా అనిపించింది నాకు. తలంబ్రాల్లో ఇద్దరికీ పోటీ పెట్టారు బంధుమిత్రులు.. అబ్బాయి పొడుగు, తలవంచని స్వభావం (!!) అవ్వడం వల్ల అతగాడే గెలిచినట్టు కనిపించింది. "అమ్మాయే గెలిపించింది" అనిపించింది.

"మీరొక్కరే కూర్చున్నారా? ఎవరితోనన్నా మాట్లాడొచ్చు కదా" వేదిక ఎప్పుడు దిగారో, వధువు తల్లి అడుగుతున్నారు నన్ను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖంలో బోలెడంత అలసట, అంతకు మించిన తృప్తీ కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరగడం, బాధ్యత తీరడం వల్ల కలిగిన తృప్తా అది? ఏమో.. "లేదండీ.. నేనే కలవడం లేదు, పెళ్ళి చూడడం కోసం..." జవాబుగా నవ్వేశారు. భోజనాలు బాగున్నాయనీ, అందరూ మెచ్చుకున్నారనీ కూడా చెప్పేశాను, ఆవిడకి తీరిక దొరకదని అర్ధమై. అమ్మాయీ, అబ్బాయీ వాళ్ళ స్నేహితులతో కబుర్లలో పడబోతుండగా, పురోహితులు అడ్డుకుని, దాంపత్యం ఎలా ఉండాలో శ్లోకాలు, అర్ధాలతో సహా చెబుతున్నారు వాళ్లకి. తిరుగు ప్రయాణానికి సన్నద్ధమై, ఆవిడకి చెప్పి, ఆయన్ని వెతికి పట్టుకుని "బాధ్యత తీర్చేసుకున్నారు.." అన్నాను. "మీ అందరివల్లానండీ.." అన్నారాయన, నిజానికి భోజనం తప్ప నేను చేసింది ఏమీ లేకపోయినా. "ఇది చాలా మంచి ముహూర్తం.. చాలా పెళ్ళిళ్ళు జరిగాయివాళ" ఆటో అతని మాటలు చాలా సంతోషపెట్టాయి నన్ను.

20 కామెంట్‌లు:

  1. పెళ్ళిమండపం నుండి ఇప్పుడే బయటికి వచ్చిన ఫీలింగ్ మీ పోస్ట్ చదివాక...బాగుందండి!

    రిప్లయితొలగించండి
  2. లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని, అతని కాళ్ళకి నమస్కరిస్తుందా... :):):) హి హి హి ప్స్చ్

    రిప్లయితొలగించండి
  3. ...మీకు కలిగిన అనుభూతిని పంచి ,నేను కూడా పెళ్లి చుసివచ్చినంత చక్కగా ఉంది మీ టపా

    రిప్లయితొలగించండి
  4. "పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు కడగడం ఎక్కడా జరగదు. ఒక్క పెళ్ళిలో తప్ప. ఇక్కడ వరుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు..."
    వధువు లక్ష్మీ స్వరూపం కూడానండోయ్.

    అయితే అలా మీ బాధ్యత తీర్చేసుకునారన్నమాట.శుభం,సంతోషం.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ రామపత్నీ జనకస్యపుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ !
    భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదాభవంతు !!


    పెళ్లి విశేషాలు బావున్నాయి :)

    రిప్లయితొలగించండి
  6. అదే పెళ్లికి నన్ను కూడా తీసుకెళ్లారు మురళి గారు. చాలా బాగుండి టపా:)

    రిప్లయితొలగించండి
  7. పెళ్ళిమండపం మొత్తం కనిపించేలా పక్కగా కూర్చుని అందరినీ నిశితంగా పరిశీలిస్తూ.. చిరునవ్వుతో పెళ్ళికి హాజరైన పెద్దమనిషి కనిపించారు. :)

    రిప్లయితొలగించండి
  8. ఎంత కాలమయ్యిందో పెళ్లి చూసి...మీ పోస్ట్ చదువుతుంటే, పెళ్లి మండపంలో ఉన్నట్టే ఉంది.

    రిప్లయితొలగించండి
  9. మమ్మల్ని కూడా మీతో పాటు పెళ్ళికి తీసికెళ్లారు !

    రిప్లయితొలగించండి
  10. పెళ్ళి పందిట్లో వున్నట్లుగా వుంది .

    రిప్లయితొలగించండి
  11. "ఎంతైనా పెళ్ళంటే అబ్బాయిలకి టెన్షన్ మొదలవుతుంది కదా." -- :)

    రిప్లయితొలగించండి
  12. చాన్నాళ్ళ తరువాత, ఒక పెళ్ళికి గత నెలలో విజయవాడ వెళ్ళానండి.
    పెళ్ళి కవర్ చెయ్యడానికి వీడియో తీస్తున్నారో, వీడియో తీయడం కోసం పెళ్ళి జరుగుతోందో అర్థం కాలేదు.
    పెళ్ళికి 20 లక్షలు ఖర్చు పెట్టామని మాత్రం చెప్పారు.

    రిప్లయితొలగించండి
  13. హ్మం! మేము కూడా అక్కడున్నట్లు ఫీల్ అయ్యామండీ! పనిలోపని మీ సెల్లు తో నాల్గు ఫుటోలు తీసిపెడితే ఇంకాస్త లైవ్ గా వుండేది అమ్మాయి పెళ్లి :-).రియల్లీ గుడ్ అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్.

    రిప్లయితొలగించండి
  14. టపా చదువుతున్నంత సేపు నాకు చాలా ఇష్టమైన ఐదురోజుల పెళ్ళి పాట నేపథ్యంలో మోగుతూ ఉన్నది.
    utterly beautiful

    రిప్లయితొలగించండి
  15. @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
    @వాసు: హ..హ... ధన్యవాదాలండీ..
    @శేఖర్: నిజంగా?!! ...ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  16. @శ్రీనివాస్ పప్పు: అవునండోయ్.. వధువు మాట కూడా పురోహితులు చెప్పారు.. నే రాయలేదు :( నా బాధ్యత.. హ..హ.. ధన్యవాదాలండీ..
    @శ్రీ: ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేశారు.. కాసుకోండి టపాకి :-) ధన్యవాదాలు.
    @మనసుపలికే: ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  17. @కొత్తావకాయ: :-) ధన్యవాదాలండీ..
    @ప్రవీణ: ధన్యవాదాలండీ..
    @శ్రావ్య వట్టికూటి: అయితే నేను చార్జీలు వసూలు చేయొచ్చన్నమాట :)) ...ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  18. @మాలాకుమార్: ధన్యవాదాలండీ..
    @ఉమాశంకర్: చా....లా... రోజుల తర్వాత కనిపిస్తున్నారు.. ఎలా ఉన్నారండీ? ...ధన్యవాదాలు.
    @పురాణపండ ఫణి: :-) :-) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. @బోనగిరి: ఇప్పుడు చాలాచోట్ల వీడియో వాళ్ళు అలాగే చేస్తున్నారండీ.. కేవలం వాళ్ళనే తప్పు పట్టలేం.. ..ధన్యవాదాలు.
    @చిన్ని: ఫోటోలంటే అనుమతులూ అవీ తీసుకోవాలి కదండీ.. అందుకని ఇలా సరిపెట్టేశాను :-) ..ధన్యవాదాలు.
    @నారాయణస్వామి: utterly beautiful !!! thanks a ton..

    రిప్లయితొలగించండి