మంగళవారం, అక్టోబర్ 25, 2011

బీప్...బీప్...

ఏకాగ్ర చిత్తంతో పని చేసుకుంటూ ఉండగా చొక్కా జేబులోనుంచి బీప్ బీప్ అన్న చప్పుడు వినిపించింది. 'తర్వాత చూడొచ్చులే' అని నాకు నేను సర్ది చెప్పుకుని పనియందు మనసు లగ్నం చేసినవాడిని అయ్యాను. ఎంతసేపూ.. కేవలం ఒక్క నిమిషం. రెండో నిమిషంలో కుతూహలం. 'ఏదన్నా అర్జెంటు సంగతేమో.. ఫోన్ చేసి డిస్ట్రబ్ చేయడం ఎందుకని మెసేజీ పంపారేమో..' ఇలా మనసు పరిపరి విధాల పక్క దోవలు పట్టేసరికి, తప్పనిసరై జేబులోనుంచి ఫోను తీశాను.

"దంతేరాస్, దీపావళి శుభాకాంక్షలు. బంగారం కొనండి.. అంతే బరువున్న వెండిని ఉచిత బహుమతిగా పొందండి. తరుగు, మజూరీ చార్జీలు లేవు" అంటూ సకుటుంబ వస్త్రనందనం వారి పలకరింపు, మూడు రోజుల్లో ముప్ఫై మూడోసారి. కసిగా డిలీట్ బటను నొక్కి, మళ్ళీ నా పనిలో పడ్డాను. పది నిమిషాలన్నా గడిచాయో లేదో మళ్ళీ అదే దృశ్యం పునరావృతమయ్యింది. ఈసారి శుభాకాంక్షలు అందజేసిన వారు మా కుటుంబ దర్జీ. తన సేవలని వినియోగించుకుంటోన్నందుకు ధన్యవాదాలు కూడా అర్పించారు వారు.

'పండగ ఇంకా ఓ రోజు ఉందనగానే తొందరపడి ఈ కోయిల ఇలా ముందే ఎందుకు కూస్తోంది చెప్మా' అని ఒకప్పుడైతే ఆశ్చర్య పోయేవాడిని కానీ, ఇప్పుడు అలవాటైపోయింది. కొన్ని కొన్ని నెట్వర్కులు పండుగ రోజుల్లో మెసేజీ చార్జీలు పెంచేయడం మొదలు, నెట్వర్కులు జామైపోవడం వరకూ రకరకాల కారణాల వల్ల అసలు పండగకన్నా ముందరే శుభాకాంక్షల పరంపర మొదలైపోతోంది. కేవలం ఫోన్ల నుంచి మాత్రమే కాక, ఇంటర్నెట్ ద్వారా ఉచిత మెసేజీల సౌకర్యం మొదలయ్యాక ఈ శుభకామన సందేశాల పరంపర కొత్త పుంతలు తొక్కడం మొదలయ్యింది.

మొబైల్ ఫోన్ వినియోగంలోకి వచ్చిన కొత్తల్లో కాల్ చార్జీల మాదిరిగానే, మెసేజీల చార్జీలూ భారీగానే ఉండేవి.. చాన్నాళ్ళ పాటు మెసేజీ ఆప్షన్ వైపు వెళ్ళనే లేదు సామాన్య వినియోగదారులు చాలామంది. చూస్తుండగానే కాల్ చార్జీలతో పాటు మెసేజీల పేకేజీల్లోనూ ఊహించనన్ని మార్పులు వచ్చేశాయ్. అలాగే ఓ కొత్త తరహా ప్రకటన విధానమూ మొదలయ్యింది. శ్రీరమణ రాసిన 'గుత్తొంకాయ కూర - మానవ సంబంధాలు' వ్యాసాల పరంపరని ఓసారి గుర్తు చేసుకుంటే, మన సెల్ఫోన్ మెసేజీలు కూడా మానవ సంబంధాల మీద తమదైన ముద్రని వేశాయని అంగీకరించక తప్పదు.

ఇప్పుడిప్పుడు పండగ వస్తోందంటే చాలు.. అది ఏ మతానికి సంబంధించినదైనా, చివరికి దేశానికి సంబంధించినదైనా సరే సెల్ ఫోనులో అక్షరాలా సందేశాల వర్షం కురుస్తోంది. ఈ సందేశాలు పంపేది కేవలం మన సర్కిల్లో వాళ్ళు మాత్రమే కాదు.. మనం ఏమాత్రమూ ఊహించని వైపునుంచి కూడా శుభాకాంక్షలు వచ్చి పడుతున్నాయి. అంటే, శుభాకాంక్షల సందేశాల ద్వారా సర్కిల్ విస్తృతమవుతోందన్న మాట, మెచ్చుకోవాల్సిన విషయమే కదా..

మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవాళ్ళూ, తమ వివరాలతో సందేశాలు పంపేవాళ్ళతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ, వాళ్ళ పేరు కచ్చితంగా మన జాబితాలో ఉంటుందన్న దీటైన నమ్మకంతో శుభాకాంక్షలు అందించేవారితో అప్పుడప్పుడూ ఇబ్బందులు తప్పవు. వాళ్ళెవరో మనకి తెలీదు.. కానీ మనం వాళ్లకి తెలుసు. 'మీరు ఎవరు?' అనకూడదు. ఎవరో తెలుసుకోవాలి. బుర్రకి పదును పెట్టే కార్యక్రమమే కచ్చితంగా. మొదటినుంచీ నాకు నేనుగా పండుగ శుభాకాంక్షల సందేశాలు పంపే అలవాటు లేదు కానీ, అందుకున్న ప్రతి సందేశానికీ కచ్చితంగా జవాబు పంపేవాడిని నిన్న మొన్నటివరకూ. ఇప్పుడిప్పుడు అదికూడా సాధ్యపడడం లేదు, అందుకునే సందేశాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది మరి.

దసరా పండుగ నెల్లాళ్ళు ఉందనగా ఓసారి రెగ్యులర్ విజిట్లలో భాగంగా వాళ్ళ పార్లర్ కి వెళ్ళినప్పుడు ఓ పుస్తకం నా ముందు పెట్టి ముసిముసిగా నవ్వుతూ 'పండగ మామూలు సార్' అన్నాడు నా బ్యూటీషియన్. పూర్వాశ్రమంలో ఇతగాడి వృత్తినామం క్షురకుడు అని ఉండేది. నాకు తోచిన అంకె వేసి తిరిగి ఇవ్వబోతుండగా, "పేరూ, ఫోన్ నెంబరూ కూడా రాయండి సార్" అన్నాడు చనువుగా. నా తల మీద కత్తెర పెట్టిన మరుక్షణం చిరంజీవి గురించీ, ప్రజారాజ్యం గురించీ వేడి వేడి చర్చ మొదలు పెట్టడం అతగాడి అలవాటు. చెసేదేముందీ, రాసిచ్చాను. ఈ టపా రాయడానికి కొద్ది క్షణాల ముందు నా ఫోన్ బీప్ మంది. పండుగ శుభాకాంక్షలు, అతగాడి నుంచి!!

మిత్రులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు...

19 కామెంట్‌లు:

  1. :) 'నా బ్యూటీషియన్' అని విని అమ్మో మురళి గారు అయితే పర్సనల్ బ్యూటీషియన్ ని మెయిన్ టెయిన్ చేస్తారా అని ఆశ్చర్యపోయాను. రెండో లైన్ చదివే లోపలే.. :)

    అన్నట్టు.. మీ ఫోన్ నంబర్ ఇస్తారా.. శుభాకాంక్షలు పంపించాలి.. కాస్త!

    రిప్లయితొలగించండి
  2. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు! :)

    రిప్లయితొలగించండి
  3. హహ బాగుందండీ.. నేను అమితాబ్ గారి బీప్..బీప్.. ఫిలాసఫీ గురించి రాయబోతున్నారనుకుని చదివాను. ఒక రకంగా ఈ SMS లను ఏమనలేక బీప్.. బీప్.. అని తిట్టుకున్నట్లే ఉందనుకోండి :-D

    ఆస్థాన దర్జీ, క్షురకుడు నుండి కష్టమేమో కానీ మార్కెటింగ్ మాస్ మెసేజింగ్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ మొబైల్ నుండి START 0 అని టైప్ చేసి 1909 కి మెసేజ్ పంపించండి. ఇది కొత్త డునాట్ డిస్ట్రబ్ సర్వీస్ ఈ మధ్యే యాక్టివేట్ చేయబడింది. ఎయిర్ టెల్,వొడాఫోన్ ఇలా ఏమొబైల్ నుండైనా ఇదేనంబర్ కు పంపించడమ్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. Just today morning I received some greetings from an unknown person in my mail. I asked a simple question "who r u" and without waiting for reply, spammed the message. Recently I had a problem of my g mail box getting filled up and so from then on I have beenam spamming every mail that I do not know the source.

    రిప్లయితొలగించండి
  5. మీకు దీపావళి శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  6. >>నా తల మీద కత్తెర పెట్టిన మరుక్షణం చిరంజీవి గురించీ, ప్రజారాజ్యం గురించీ వేడి వేడి చర్చ మొదలు పెట్టడం అతగాడి అలవాటు.

    జాగ్రత్త మురళిగారు, గాటు పెట్టకుండా చూసుకోండి :)
    ఆ మధ్య ఒక సెలూన్ కి వెళితే నన్ను 'మీది ఏ ఊరు' అన్నాడు అక్కడి తెలుగు బ్యూటీషియన్, నేను ఫలానా అన్నాను..'ఎక్కడ సార్ అది?' అన్నాడు. అదే.. చిరంజీవి పోటి చేసి ఓడిపోయాడు చూడు, అదే మా ఊరు అని చెప్పాను. ఇప్పుడు నన్ను మా ఊరిని బాగా గుర్తుపెట్టుకున్నాడు అతను :)


    మీకు దీపావళి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  7. మురళీ గారు.. మెసేజ్ ల ప్రహసనం గురించి బాగా చెప్పారు.
    వేణుశ్రీకాంత్ గారు మీ సమాచారం కి ధన్యవాదములు. అంధరికి దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. మీ 'కామెడీ సుమన్ బాబు' ఇవాళ మిమ్మల్ని డైరెక్ట్ గా విష్ చేద్దామని వచ్చేస్తున్నాడుగా మురళి గారు. కాబట్టి SMS ల బాధ ఇంకేల:)
    పోన్లెండి, లాండ్ లైన్ నెంబర్ ఇస్తారా. మీకు SMS ల బాధలేకుండా మేము కూడా డైరెక్ట్ గానే విష్ చేసేస్తాము.

    రిప్లయితొలగించండి
  9. అప్పుడెప్పుడో ఈ మెసేజ్ ల శరపరంపర గురించి ఓ టపా రాయాలి అన్నారు. ఈ దీపావళి మీకు ఆ విషయాన్ని గుర్తు చేసిందన్నమాట. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  10. ఈ సందేశాల వలన ఒక ఉపయోగం కూడా ఉందండి.
    ఎవరైనా బంధుమిత్రుల ఫోన్ నంబర్ మారితే అప్ డేట్ చేసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  11. మీకు మీ కుటుంబ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  12. మీకు బీప్... బీప్... ఇద్దామనుకుంటున్న సమయంలోనే, నా బుజ్జి "సిరి" బీప్ బీప్ అంటూ దీపావళి వెలుగులను ఇచ్చి వెళ్ళింది :-)

    రిప్లయితొలగించండి
  13. @కృష్ణప్రియ: :-) :-) ...ధన్యవాదాలండీ..

    @కొత్తావకాయ: ధన్యవాదాలండీ..

    @సునీత: :-) :-) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. @వేణూ శ్రీకాంత్: మంచి సమాచారం ఇచ్చారు.. ఇవేవీ కూడా మార్కెటింగ్ చైన్ మెసేజీలు కావండీ.. వాళ్ళ వాళ్ళ మొబైల్ ఫోన్లనుంచి వచ్చినవే.. ధన్యవాదాలు.

    @శివరాం ప్రసాద్ కప్పగంతు: స్పాం మెయిళ్ల కథ వేరండీ.. లక్షల కొద్దీ లాటరీ ప్రైజులు (యూరోలు, డాలర్లూ) వచ్చేస్తూ ఉంటాయి :-) ..ధన్యవాదాలు.

    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. @శ్రీ: గెడ్డం దగ్గరికి వచ్చేసరికి టాపిక్ మార్చేయడం ద్వారా గాటు నుంచి నన్ను నేను కాపాడుకుంటూ ఉంటానండీ :-) ..ధన్యవాదాలు

    @వనజ వనమాలి: ధన్యవాదాలండీ..

    @జయ: :-) :-) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  16. @శిశిర: అవునండీ.. భలే గుర్తు పెట్టుకున్నారు!! ధన్యవాదాలు.

    @బోనగిరి: నిజమేనండీ.. ఆ ఉపయోగం ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @బులుసు సుబ్రహ్మణ్యం: ధన్యవాదాలండీ..

    @పానీపూరీ: :-) :-) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  18. మురళి గారు..
    రాజకీయాలు చర్చించే క్షురకులని దూరంగా ఉంచండి. చాలా డేంజరపాయం!
    నేను పండగల్నీ, పుట్టిన రోజుల్నీ పట్టించుకోను.
    కాబట్టి మీ సమస్య నాకు లేదు.
    మీ పోస్ట్ బాగుంది.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి