సోమవారం, అక్టోబర్ 24, 2011

తిరస్కృతులు

వాళ్ళంతా ఎదుటి వ్యక్తిని నిష్కల్మషంగా ప్రేమించగలరు. మనస్పూర్తిగా నమ్మగలరు. కానీ, అవతలి వ్యక్తినుంచి తిరిగి పొందేవి మాత్రం అవమానాలు, అవహేళనలు. వాళ్ళందరూ తిరస్కృతులు. నికోలాయ్, అతడి భార్య అన్నా, వాళ్ళ ఏకైక కుమార్తె నతాష, ముసలి స్మిత్ కూతురు, మనవరాలు నీలీ... వీళ్ళందరూ కూడా ప్రేమనీ, నమ్మకాన్నీ ఇచ్చి తిరస్కరింపబడ్డ వాళ్ళే. వీళ్ళందరి కథే 'తిరస్కృతులు' నవల. ప్రముఖ రష్యన్ రచయిత దస్తయేవస్కీ రాసిన 'The Insulted and Injured' కి తర్వాతికాలంలో 'సహవాసి' గా అనువాద రంగంలో గొప్పపేరు తెచ్చుకున్న జంపాల ఉమామహేశ్వర రావు తెలుగు సేత.

కథలో ప్రధాన పాత్ర వాన్య. అప్పుడే రచయితగా పేరు తెచ్చుకుంటున్న వాడు. చిన్నప్పుడే అనాధగా మారిన వాన్య ని పొరుగింటి పెద్దమనిషి నికోలాయ్ తన కూతురు నతాష తో పాటుగా పెంచి పెద్ద చేశాడు. వాన్యకి నతాష అంటే పిచ్చి ఇష్టం. కానీ నతాష అయోషాని ప్రేమించింది. ప్రిన్స్ వాల్కొవిస్కీ ఏకైక కుమారుడు ఆయోషా. ఎందరినో మోసం చేసి ప్రిన్స్ స్థాయికి ఎదిగిన వాల్కొవిస్కీ తెలివితేటలు ఏమాత్రమూ రాలేదు అయోషాకి. అతను అమాయకుడు, నిష్కల్మష హృదయుడు. తండ్రిమీద విపరీతమైన ప్రేమ ఉన్నవాడు.

తను డబ్బు సంపాదించుకునే క్రమంలో నికోలాయ్ తో స్నేహం చేశాడు ప్రిన్స్. తన ఎస్టేట్ వ్యవహారాలూ నికోలాయ్ కి అప్పగించాడు. ఎంతో నిజాయితీగా పని చేసిన నికోలాయ్ ఎస్టేట్ వృద్ధి చెందడానికి అహరహం శ్రమించాడు. నికోలాయ్ వ్యక్తిత్వం పట్ల ఎంతగానో ఆకర్షితుడైన ప్రిన్స్, అయోషాని కొంత కాలంపాటు అతని ఇంట్లో ఉంచాలని నిర్ణయించుకుంటాడు. ఆ రకంగానైనా ఆయోషాకి లోకజ్ఞానం అబ్బుతుందన్నది ప్రిన్స్ ఆశ. ప్రిన్స్ ప్రతిపాదనని సంతోషంగా ఆహ్వానిస్తాడు నికోలాయ్. ఫలితంగా, యవ్వనంలో అడుగుపెట్టిన ఆయోషా నికోలాయ్ ఇల్లు చేరతాడు.

ఆయోషా నతాష తో ప్రేమలో పడడం ప్రిన్స్ పాలిట పిడుగుపాటే అవుతుంది. అంతస్తుల భేదాన్ని కలలో కూడా మర్చిపోలేని ప్రిన్స్ నికోలాయ్ మీద నిప్పులు చెరుగుతాడు. ఎస్టేట్ మీది ఆశతో అమాయకుడైన తన కొడుకు మీదకి కూతుర్ని ఉసిగొలిపాడని అనరాని మాటలు అంటాడు. మాటల యుద్ధం చేతల్లోకి మారుతుంది. ఎస్టేట్ సొమ్ము కాజేశాడనే అభియోగం మోపి నికోలాయ్ ని కోర్టుకి ఈడుస్తాడు ప్రిన్స్. మరోపక్క ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆయోష-నతాష ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. కూతురు చేసిన పని మరింత కుంగదీస్తుంది నికోలాయ్ ని.

జీవిక కోసం ఇల్లు విడిచిన వాన్య రచయితగా స్థిరపడతాడు. ఇల్లు వెతుక్కునే క్రమంలో అతనికి వృద్ధుడైన స్మిత్, అతని టీనేజ్ మనవరాలు నీలీ తారసపడతారు. స్మిత్ మరణించడంతో ఏకాకిగా మారిన నీలీకి ఆశ్రయం ఇస్తాడు వాన్య. నీలీది ఓ విషాద గాధ. ఆమె తల్లి తన యవ్వనంలో ఓ యువకుడిని నమ్మి తన సంపదనంతా అతని చేతిలో పెడుతుంది. నీలీ భూమిమీద పడ్డాక అతడు మోసగాడని తెలుస్తుంది. అతన్నుంచి విడిపోయి దుర్భర దారిద్ర్యం అనుభవించిన ఆ వనిత, తన తండ్రి తనని క్షమించడం కోసం జీవితమంతా ఎదురు చూస్తుంది. క్షమాపణ పొందకుండానే మరణిస్తుంది. వాన్య ఇంటికి చేరిన నీలీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతుంది.

కోర్టు కేసుల నిమిత్తం తన బసని పట్నానికి మారుస్తాడు నికోలాయ్. నతాష ఆచూకి తెలిసినా ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడడు. మరోవంక ప్రిన్స్ కొడుకుని చేరదీయడంతో పాటుగా, నతాషని తన కోడలిగా చేసుకుంటానని ఆమెకి మాట ఇస్తాడు. మరోవంక డబ్బున్న అమ్మాయి కాత్య తో అయోషకి పెళ్ళి నిశ్చయం చేస్తాడు. తనకంటూ ఓ వ్యక్తిత్వం లేని ఆయోష నతాషతో ప్రేమగా ఉంటూనే, పెళ్ళి చేసుకుంటానని చెబుతూనే కాత్యతో ప్రేమలో పడతాడు. కొడుకు మనస్తత్వం తెలిసిన ప్రిన్స్ ఇందుకు పరోక్షంగా రంగం సిద్ధం చేస్తాడు. ప్రిన్స్ పధకం ఫలించిందా? నికోలాయ్ కేసు ఏమయ్యింది? నతాష ని అతడు క్షమించగలిగాడా? నీలీ జన్మ రహస్యం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకి జవాబిస్తూ నవల ముగుస్తుంది.

నవల ముగించి పక్కన పెట్టినా, ప్రధాన పాత్రలూ, వాటి వ్యక్తిత్వాలూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కథ చెప్పే వాన్య స్పటికంలాగా స్వచ్చంగా అనిపిస్తాడు. స్వీయ ప్రేమకథతో సహా ఎవరి కథ చెప్పేటప్పుడూ కూడా ఎలాంటి ఉద్వేగానికీ లోనవ్వకుండా, ఏ వ్యాఖ్యలూ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతాడతడు. నతాషా, నీలీ ఇద్దరూ కూడా బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలే. ఆయోషా ప్రేమకోసం నతాషా చివరికంటా నిలబడితే, తల్లి జీవితం, బాల్యంలోనే ఎదురైన అనుభవాల కారణంగా వయసుకి మించిన పరిణతి చూపిస్తుంది నీలీ. కూతుర్ని విపరీతంగా ప్రేమించే, ఆత్మాభిమానం విషయంలో రాజీ పడలేని నికోలాయ్-అన్నా దంపతులనీ మర్చిపోలేం.

"జంపాల ఉమామహేశ్వర రావు ఇంకా సహవాసిగా మారక ముందు వెలుగు చూసిన గ్రంధం ఇది. ....ఆయన చేపట్టిన తొలి అనువాదం ఇది. అయన మాటల్లో 'విశ్వమంతా విశాల హృదయంతో విశ్వ విఖ్యాతుడైన దస్తయేవస్కీచే చిత్రింపబడి విశ్వమానవ హృదయాలలో ఉన్నత స్థానాన్ని అందుకొంది, ఈ తిరస్కృతులు. మన తెలుగు పాఠకులకి ఇది సుమారు యాభయి ఏళ్ళ క్రితం దర్శనమిచ్చింది. మళ్ళీ ఇంత కాలానికి ఇప్పుడు మీ ముందుంది. స్వీకరించండి," అన్నారు ప్రకాశకులు పీకాక్ క్లాసిక్స్ వారు, మూడేళ్ళ క్రితం విడుదల చేసిన ప్రింట్ చివరిమాటలో. 'ఏడుతరాలు' లాంటి ఎన్నో విదేశీ నవలల్ని తెలుగు వారికి పరిచయం చేసిన జంపాల అనువాద సరళిని గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అత్యంత సరళంగా ఉంది. (పేజీలు 204, వెల రూ.75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

9 వ్యాఖ్యలు:

 1. ఈ పుస్తకం గురించి ఇంకో బ్లాగులో రాసిందే ఇక్కడ పంచుకుంటున్నా..

  నేను దస్తయేవస్కీ రాసిన " " చదివా. జంపాల గారు చేసిన తెలుగు అనువాదం "తిరస్కృతులు". చాలా బాగా చేసారు. ఇంకా మూలంలో ఎంత బాగుంటుందో అనుకున్నా. సగటు జీవి అంతరంగాన్ని, ఆలోచనలని, అనుభవాలని అంత బాగా మాటల్లో వ్యక్తం చెయ్యగలగడం నేనైతే ఎక్కడా చదవలేదు. నాకు ఆ ఆలోచనలు గుర్తు లేవు. కానీ అంతరంగాన్ని అంత ప్రభావవంతంగా బహిర్గతం చేసాడు అనే విషయం గుర్తుంది. కానీ ఆ నవలలో నాయకుడు వన్యా చుట్టూ ఉన్న దృశ్యాలు గుర్తున్నాయి. ఆ దృశ్యాలు చదివేప్పుడు వన్యా ఆలోచనలతో కలిసి మరింతగా అనుభూతిని పెంచుతాయి. ఆయా పాత్రల పరిస్థితిని రచయిత ఎంచుకున్న చుట్టు ఉన్న దృశ్యాలు తారా స్థాయిలో చూపుతాయి. నా మీద ఇప్పటికీ ఉన్న అతని ప్రభావం ఏంటంటే, అంతరంగపు వివిధ పార్శ్వాలని ఉన్నది ఉన్నట్టు బహిర్గతం చెయ్యగలగడం అనే అతని శక్తి. ఇంకా ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే అతను ఆ నవలలో సిధ్హాంతాలని ప్రతిపాదించలేదు, చదువరుల మీద రుద్ధదానికి ప్రయత్నించలేదు. ఒక కథని చెప్పాడు, అప్పటి పరిస్థితులని చూపాడు, కథలోని పాత్రల అంతర్మధనాన్ని, పాత్రల మధ్య సంఘర్షణని చాలా బాగా చూపాడు.

  http://loveforletters.blogspot.com/2007/08/vs.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మ్మ్.... దొస్తొయేవ్ స్కీ ! చాలా బాగుంది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. గుర్తుందా, ఇంతకుముందెప్పుడో (కొన్నేళ్ళ క్రితం అనుకుంటా) మీరు ఒక నతాషాని, ఒక ఎలిజబెత్ ని మీ "నాయికలు"లో పరిచయం చేస్తే చదవాలని ఉంది అంటే, మనం తెలుగు వాళ్ళం, తెలుగు చదువుదాం అన్నారు! మరి ఈ నతాషాని గురించి ఎప్పుడు రాస్తున్నారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హమ్మయ్య మీరు రాయడం మానేశారేమోనని కంగారు పడ్డాను. ఇంతకీ మీరు బజ్జులో ఎక్కడున్నారో తెలియట్లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీరు అన్నిట్లోనూ రికార్డ్ బ్రేకే నండి. వస్తే రోజూ వస్తారు, లేక పోతే కంటికి కనిపించకుండావెళ్ళిపోతారు. ఈ రివ్యూ చాలా బాగుంది. ఎప్పుడో అనుకోకుండా చాలాకాలం క్రితం చదివిన ఆ పుస్తకం మీ పరిచయం తో చాలా కొత్తగా అనిపించింది. మళ్ళీ చదవాలనిపిస్తోంది.
  మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో...మీకు హృదయపూర్వక దీపావళీ శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ నవల నేను చదవలేదు కానీ మీ పరిచయం చదువుతుంటేనే, కొన్ని హిందీ, తెలుగు సినిమాలు గుర్తుకొస్తున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మురళి గారికి దీపావళి శుభా కాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @ఏకాంతపు దిలీపు: నిజమేనండీ వాన్య వెంటాడుతాడు మనల్ని.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అంతే.. ఎలాంటి వ్యాఖ్యానాలూ చేయకుండా.. ..ధన్యవాదాలు.
  @రూత్: నవల చదువుతున్నంత సేపూ నతాషా, నీలీ ఇద్దరూ కూడా చాలా బాగా నచ్చేశారండీ.. తప్పకుండా రాస్తాను :) ..ధన్యవాదాలు.
  @పక్కింటబ్బాయి: లేదండీ రాస్తున్నాను :) ..బజ్జులో లేనండీ ఇప్పుడు.. కొత్త ఐడీతో ప్రవేశం దొరకలేదు.. అక్కడ నాది కేవలం ప్రేక్షక పాత్ర, అంతే!! ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @జయ: రోజూ వస్తున్నానంటే తగినంత పని లేదనీ, కనిపించలేదంటే బాగా బిజీగా ఉన్నాననీ అర్ధమండీ :)) తప్పక చదవండి.. మీక్కూడా శుభాకాంక్షలు! ..ధన్యవాదాలు.
  @బోనగిరి: అవునండీ.. చాలా పాయింట్లని సినిమాల్లో వాడేసుకున్నారు :( ..ధన్యవాదాలు.
  @రాజశేఖర్ దాసరి: మీకూ శుభాకాంక్షలండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు