సోమవారం, అక్టోబర్ 10, 2011

లైబ్రరీలో ఓ సాయంత్రం...

మొన్నొక రోజు దగ్గరలోనే ఉన్న ఒక లైబ్రరీకి వెళ్లాను. చాలా రోజులుగా బయటినుంచి చూస్తున్నా ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. మిగిలినవన్నీ ఎలా ఉన్నా లైబ్రరీకి వెళ్ళే అలవాటు తప్పిపోయి చాలా రోజులు అవ్వడం ఇందుకు ఒక ముఖ్యమైన కారణం అయి ఉండొచ్చు. ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రభుత్వ సాయంతో నిర్వహిస్తున్న ఈ లైబ్రరీలో కేవలం ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే కాక అన్నిరకాల పుస్తకాలూ ఉండడం నన్ను ఆశ్చర్య పరిచింది.

పోటీ పరీక్షలకి ప్రిపేరవుతున్న పిల్లలంతా మహ సీరియస్సుగా పుస్తకాలు తిరగేస్తూ నోట్సులు రాసేసుకుంటున్నారు. పేపర్లు చదవడానికి వచ్చిన సీనియర్ సిటిజన్లు అక్కడక్కడా కనిపించారు. విశాలమైన ఆవరణ, దానికి తగ్గట్టు చక్కని నిర్వహణ. ర్యాకులు చూడగానే అసలు ఏమేం పుస్తకాలు ఉన్నాయా అన్న ఆసక్తి మొదలయ్యింది. యండమూరి నవలల మొదలు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం వరకూ చాలా రకాల పుస్తకాలే కనిపించాయి.

ఇది పని కాదనిపించి, కేటలాగు చదవడం మొదలు పెట్టాను. ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, చాలా రోజులుగా ప్రింట్లో లేని ఎన్నో పుస్తకాలు ఆ లైబ్రరీలో ఉన్నాయి. ప్రతి పుస్తకానికీ ఓ కోడ్ నెంబర్ ఇచ్చారు. ఓ రెండు పేజీలు తిరగెయ్యగానే చిన్న ఆలోచన వచ్చి, నేను చదవాలనుకునే పుస్తకాల కోడ్ నెంబర్లు నోట్ చేయడం మొదలు పెట్టాను. ఆ పని చేస్తున్నంత సేపూ మా ఊరి రచ్చబండ దగ్గర సామూహిక పత్రికా పఠనం మొదలు, పక్కూళ్ళో ఉన్న ప్రభుత్వ గ్రంధాలయంలో గంటలకి గంటలు గడపడం వరకూ ఎన్నో సంగతులు గుర్తొచ్చాయి.

మా రచ్చబండ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ ఎవరూ పేపర్ చదవక్కరలేదు. వింటే చాలు, రేడియో వార్తలు విన్నట్టుగా. అప్పట్లో మా ఊళ్ళో తమని తాము ఆకాశవాణి వార్తా చదువర్లుగా భావించుకున్న వారికి లోటు లేని కారణాన, మొదటగా పేపర్ దక్కించుకున్న వాళ్ళు మిగిలిన వాళ్లకి చదివే అవకాశం ఇవ్వకుండా గడగడా చదివేసేవాళ్ళు. మా బడి ఉన్నది ఆ పక్కనే అవ్వడం వల్ల వద్దన్నా సరే, పేపరు వార్తలూ ఆ తర్వాత జరిగే విశ్లేషణలూ చెవిన పడుతూనే ఉండేది.

ప్రభుత్వం గ్రంధాలయాలని నిర్వహిస్తుందనీ, అక్కడ అన్నిరకాల పత్రిలతో పాటు నవలలూ ఉచితంగా చదువుకోవచ్చనీ కాలేజీకి వచ్చేంత వరకూ నాకు తెలీదు. హైస్కూల్లో పరిచయమైన అద్దె నవలల లైబ్రరీ ఓ విషాద జ్ఞాపకం. ఇది రాస్తూ కూడా వీపు తడుముకున్నానంటే ఇంక చెప్పడానికి ఏముంటుంది? అదృష్టవశాత్తూ ప్రభుత్వ గ్రంధాలయం లైబ్రేరియన్ తో నాకు స్నేహం కుదిరింది. వార, మాస పత్రికల్ని మడత నలగకుండా తాజాగా చదవగలిగే వీలు కుదిరింది. కోడూరి కౌసల్యా దేవి 'చక్రభ్రమణం' లాంటి నవలల్ని చదివింది అక్కడే.

తర్వాతి కాలంలో లైబ్రరీలకి వెళ్లిందీ, సమయం గడిపిందీ బహుతక్కువ. కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవడం, చదువుకోవడమే తప్ప లైబ్రరీల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. లెండింగ్ లైబ్రరీలు కను మరుగైపోవడం తెలుసు.. ప్రభుత్వ లైబ్రరీల గురించి అప్పుడప్పుడూ పేపర్లలో 'నిధుల కొరతతో సతమతం' లాంటి వార్తలు చదవడమే తప్ప ఎలా ఉన్నాయో చూద్దాం అనిపించలేదు. ఇదిగో ఇప్పుడు, ఒక లైబ్రరీని కనుగొన్నాను. నేను తదేక దీక్షతో కేటలాగుని చదువుతూ ఉండగానే లైబ్రేరియన్ వచ్చారు.

తగుమాత్రంగా నన్ను నేను పరిచయం చేసుకుని, లైబ్రరీ వివరాలు అడిగాను. ప్రవేశం, పుస్తకాలూ ఉచితమే. కానైతే ఆవరణ దాటి బయటికి ఇవ్వరు. అక్కడే కూర్చుని చదువుకుని, వాళ్ళ పుస్తకాన్ని వాళ్లకి జాగ్రత్తగా అప్పగించేసి రావాలి. అంతా బాగానే ఉంది కానీ, వాళ్ళ టైమింగ్సూ, నా వేళలూ బొత్తిగా రైలు పట్టాల్లా ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఈ పట్టాల మీద బండి నడపాలని మాత్రం గట్టిగా అనేసుకున్నాను. చూడాలి, మనసుంటే మార్గం అదే దొరుకుతుంది అంటారు కదా..

3 కామెంట్‌లు:

  1. అసలు టపా శీర్షిక చూడగానే నేను వీపు తడుముకున్నాను, తెలుసాండీ! మా ఊళ్ళో గురజాడ గ్రంధాలయానికి వెళ్ళినా పుస్తకాల్లో పడి, వేళ దాటి, బొబ్బట్లు తిన్న రోజులెన్నో!ఇంక లెండింగ్ లైబ్రరీకి బోనస్ విమానం మోతే. ప్చ్..

    మీ రైలు పట్టాల క్రాసింగ్ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకొన్ని మంచి మంచి టపాలు రాస్తారని మా స్వార్ధం. :)

    రిప్లయితొలగించండి
  2. చక్కగా ఉంది మీతో పాటు నాకు కూడా మా గౌతమీ గ్రంధాలయం కళ్ళముందు కదిలింది!

    రిప్లయితొలగించండి
  3. @కొత్తావకాయ: ధన్యవాదాలండీ..
    @రసజ్ఞ: ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి