బుధవారం, నవంబర్ 24, 2010

ఇందిరమ్మ రాజ్యం

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన అత్తగారు ఇందిర గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాష్ట్రాల విషయంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ విషయంలో నాడు ఇందిర అనుసరించిన వైఖరే నేటి సోనియా వైఖరి. లేకపొతే, అన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే రాయకీయం మారిపోవడం ఏమిటి? కొత్త ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని సోనియాకే వదిలేస్తూ పార్టీ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేయాల్సిన అగత్యం రావడం ఏమిటి?

రోశయ్య రాజీనామా ఆయన చెప్పినట్టుగా "వయోభారం, అనారోగ్యం" కారణాల వల్ల కాదన్నది రోజూ టీవీలు చూసే చిన్న పిల్లలు కూడా చటుక్కున చెప్పగలిగే సమాధానం. "అధిష్ఠానం నియమిస్తే ముఖ్యమంత్రిని అయ్యాను.. సోనియా నన్నీ బాధ్యత నిర్వహించమన్నంత కాలం ఈ కుర్చీలో ఉంటాను" అని గడిచిన పద్నాలుగు నెలల ఇరవైరెండు రోజుల్లో రోశయ్య లెక్కలేనన్నిసార్లు చెప్పారు. పెద్ద సమస్య వచ్చిన ప్రతిసారీ ఆయన చెప్పిన మొదటి మాట ఇదే.

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ళ కాలాన్ని మినహాయిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మిగిలిన కాలంలో పేరుకి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పెత్తనం చేసింది అధిష్టానమే అన్నది బహిరంగ రహస్యమే. నిజానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సైతం ఆయన "ఒంటెత్తు పోకడల" పట్ల అధిష్ఠానం అసంతృప్తిని వ్యక్తం చేసిందన్న వార్తలు చాలాసార్లే వెలుగు చూశాయి. ఈ నేపధ్యంలో స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని సోనియా ముఖ్యమంత్రిగా నియమిస్తారని ఆశించడం వృధా ప్రయాస.

వ్యక్తి ఎవరైనా పాలన సోనియాదే అయినప్పుడు రోశయ్యని మార్చి మరొకరిని ఆ కుర్చీలో కూర్చోపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా రోశయ్య విధేయత ఏమాత్రం తగ్గనప్పుడు, మంత్రులు ఆయన మాట వినేలా అధిష్ఠానం చేయగలిగినప్పుడు ఈ మార్పు ఎందుకు? జవాబు మనకి ఇందిరమ్మ రాజ్యంలో దొరుకుతుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో, రాజకీయ వాతావరణం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ సందర్భాలలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరిగిందన్నది గమనించాల్సిన విషయం.

అటు కేంద్రంలో ఆదర్శ్ సొసైటీ, టెలికాం కుంభకోణం ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సమయంలో, రాష్ట్రంలో తెలంగాణా సమస్య, జగన్మోహన్ రెడ్డి అసమ్మతి, ఇంకా వివిధ వర్గాల ఆందోళనలు ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసురుతున్న నేపధ్యంలో జరుగుతున్న ఈ ముఖ్యమంత్రి మార్పు ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే అనిపిస్తోంది. అత్తమ్మ ఎంచుకున్న సీల్డ్ కవర్ సంస్కృతిని కొద్దిగా మార్చి, రాష్ట్రానికి తన ప్రతినిధులని పంపారు కోడలమ్మ. అంతిమంగా ఎంపిక తన చేతిలోనే ఉండేలా జాగ్రత్త పడ్డారు.

అధిక సంఖ్యలో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రమే అయినా, ఎలాంటి ముఖ్య ప్రాజెక్టులూ కేటాయించక పోవడం, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వక పోవడం, నిధుల కేటాయింపులో సైతం చిన్న చూపు చూడడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఏం చేసినా చేయకున్నాఇక్కడ గెలిచేది తమ పార్టీనే అన్న వైఖరి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మార్పు తతంగం అందుకు ఊతమిస్తోంది. ఇందిర కాలంలో ఏర్పడ్డ ఇలాంటి వాతావరణమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి, ఎన్టీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ అఖండ విజయం సాధించడానికీ తోడ్పడిందన్న సత్యాన్ని సోనియా విస్మరించారా? లేక ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్న ధీమాతో ఉన్నారా? వేచి చూడాలి...

4 కామెంట్‌లు:

  1. ఒకటి మాత్రం నిజమండి ,కాంగ్రెస్స్ లో దేసశ్రేయస్సుకన్నా వ్యక్తీ పూజకే విలువలు, అందుకే అంతమంది పెద్దలమంటూ సుద్ద మోద్దుల్లా రాష్ట్ర రాజకీయాలని భ్రస్టు పట్టిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  2. కాంగ్రెస్ నాయకులు(రాష్ట్రం, కేంద్రంలో తెలుగు మంత్రులు) అప్పుడూ, ఇప్పుడూ చార్మినార్ దగ్గర రాళ్ళ గాజులు షాపింగ్ చేసుకోవటానికి తప్ప ఎందుకూ పనికిరాని వాళ్ళు...

    రిప్లయితొలగించండి
  3. పేపర్లలో చదివి తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకున్నాను. ఇప్పుడు, అప్పటి పరిస్థితి ఇలా ఉండేదన్న మాట అని ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే భాగ్యం కలిపిస్తున్నారు నాకు మన నాయకులు.

    రిప్లయితొలగించండి
  4. @వాజసనేయ: ఏళ్ళు గడుస్తున్నా పద్ధతులు మార్చుకోకపోవడం...ప్చ్.. వ్యాఖ్య కి ధన్యవాదాలండీ..

    @శేఖర్ పెద్దగోపు: కొంచం తీవ్రంగా వినిపించినా నిజం చెప్పారండీ.. ధన్యవాదాలు.

    @శిశిర: నిజమేనండీ.. అప్పటి సంగతులు తెలియని వాళ్లకి మళ్ళీ చక్కగా చూపిస్తున్నారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి