శనివారం, జులై 24, 2010

యజ్ఞం

కొందరు రచయితల్నీ, వారు చేసిన కొన్ని రచనలనీ వేరు చేసి చూడలేం. రచయిత పేరు చెప్పగానే రచన, రచన పేరు వినగానే రచయిత అప్రయత్నంగానే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. తెలుగు సాహితీ లోకానికి 'కారా మేష్టారు'గా చిరపరిచితులైన కాళీపట్నం రామారావు మేష్టారి పేరు తలవగానే గుర్తొచ్చే రచనల్లో మొదటి వరుసలో ఉండే రచన - నలభై నాలుగేళ్ల క్రితం ఆయన రాసిన కథ 'యజ్ఞం.' మామూలుగా మొదలై, ఊహించని మలుపులు తిరుగుతూ ఆలోచనలో పడేసే ముగింపుకి చేరే ఈ కథ ఈనాటికీ సమకాలీనమే అనిపించక మానదు.

కథా స్థలం ఉత్తరాంధ్రలోని 'సుందరపాలెం' అనే పల్లెటూరు. రచయిత మాటల్లో "మదరాసు నుండి కలకత్తాకు - విశాఖపట్నం మీదుగా విజయనగరం కెడంగా - పోయే గ్రాండ్ ట్రంక్ రోడ్డు నుండి ఆరు మైళ్ళు కుడిగా, సముద్రానికి ఐదు మైళ్ళు ఎడంగా - కాకి మార్గాన పోతే శ్రీకాకుళానికి పదిహేను మైళ్ళ దూరంలో ఉందా గ్రామం." అంతా కలిసి నాలుగు వందల ఇళ్ళు. కొత్తగా వెలిసిన షాపులూ, హోటళ్ళూ. ఆరుమైళ్ళ పక్కా రోడ్డూ, విద్యుత్ వాహకాల ఏర్పాటు కారణంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్నాయా ఊళ్ళో.

కథా వస్తువు ఒక తగవు. మూడేళ్ళ క్రితం పుట్టి, మూడు నెలలుగా ముడిపడి, మూడు రోజుల నుంచి నలుగుతూన్న తగవది. ఆవేళ అటో ఇటో తేలిపోవాలి. అప్పల్రాముడు - ఆ ఊరి పంచాయితీలో హరిజన మెంబరు, కుల పెద్ద మాత్రమే కాక వయసు మళ్ళిన వాడు. ఆ ఊరి వాడే అయిన బతికి చెడ్డ మాజీ షావుకారు గోపన్నకి రెండు వేలు బాకీ పడ్డాడు అప్పల్రాముడు. రెండు వేలంటే అప్పల్రాముడి కుటుంబానికి ఉన్న రెండెకరాల ముప్పై సెంట్ల మడి చెక్క విలువకి సమానం.

ఊరి వాళ్ళందరికీ గోపన్న మీద సానుభూతి ఉంది. కానీ తగవు తీర్చాల్సిన పంచాయితీ ప్రెసిడెంటు శ్రీరాములు నాయుడికి మాత్రం అప్పల్రాముడి మీద అభిమానం ఉంది. ఈ అభిమానం కారణంగా గోపన్నకి అన్యాయం జరుగుతుందేమో అని సందేహించే వాళ్ళూ లేక పోలేదు. అందుకే ఆ వేళ తగవుకి ఎన్నడూ లేనంతమంది హాజరయ్యారు. శ్రీరాములు నాయుడు చదువుకున్న వాడు. ఊరిని బాగు చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వాడు. గడిచిన పదిహేనేళ్ళలో ఊరిని ఎంతగానో అభివృద్ధి చేసిన వాడు. ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉన్నా ప్రెసిడెంటుగానే మిగిలిపోయిన వాడు. తనఊరి తగువులు కోర్టు వరకూ వెళ్లకూడని బలంగా కోరుకునే వాడు.

ఆసాంతమూ ఉత్తరాంధ్ర మాండలీకంలో సాగే కథలో సన్నివేశాలని రచయిత వర్ణించే తీరు, ఆయా సన్నివేశాలు మన కళ్ళ ముందే జరిగాయా? అనిపించేలా సాగుతుంది. నిశ్శబ్దమైన సభ నడుమ సభ వారి ఎదుట నిలుచుని అప్పల్రాముడిలా చెబుతున్నాడు: "బాబయ్యా! మొన్న, నిన్నా, ఈ యేలా, నలిగిన నలుగుల్లని బట్టి సబవోరి ఉద్దేశమని నాకనిపించేదేటంటే 'నాయాన్నాయాల మాట ఎలాగున్నా, మూడేళ్ళ కిందట ముగ్గురు పెద్ద మనుషుల ముందు ఆరి మాట కాదనలేకో, అన్నాయానికి బయపడో, అప్పల్రావుడు అప్పంటూ ఒప్పుకున్నాడు; ఆ ఒప్పుకున్నా అప్పు ఈయాలటికి తీరుస్తానని ఆ పెద్దల ముందు మాటిచ్చినాడు; కాబట్టి ఈ నాడు ఆడికున్నా లేకపోయినా, ఆడమ్ముడుబోయో, ఆడి బూవులమ్ముడుబోయో సావుకారి ఋణం ఆడు తీర్చేయాలా! అన్నట్టుంది.

సబవోరి కంటిక్కనిపించేదేటంటే - గోపన్నబాబు కష్టం. ఆబాబుకీ నలుగురు కొడుకులున్నా ఆయన కొడుకులాయనకాడ లేరు. అప్పల్రాముడి కొడుకులందరూ ఆడికాడే ఉన్నారు. ఆల్లంతా ఏనుగ్గున్నల్లా ఉన్నారు. ఆల్లకి సెక్కాముక్కా లేకపోయినా ఆల్లు రెక్కల కష్టం సేసుకు బతగ్గలరు. ఒక పూట దప్పిక లేకపోయినా ఆల పేనాలు పోవు. అందుసేత ఆల్లను ఏదో ఓ పద్దతిని ఒప్పించి ఆల్లకున్న ఆ ఒక్క మడిసెక్కా అమ్మించేసైనా గోపన్నబాబు అప్పు తీరుమానం సేసేటట్టు సూడాల అన్నట్టుంది సబవోరి మనసులోమాట. బాబయ్యా! సబవోరికదే నాయవనిపించిన్నాడు ఆ నాయవే ఇప్పించండి. నెత్తిమీదెట్టుకుంటాను."

'ధర్మ ప్రెబువు' శ్రీరావులు బాబు కూడా అప్పల్రాముడు గోపన్నకి బాకీ తీర్చాల్సిందే అనడంతో ఆ వృద్ధుడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఒకప్పుడు భూవి, బంగారంతో పచ్చగా ఉన్న తను అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో సుదీర్ఘంగా వివరిస్తాడు. గడిచిన పదిహేనేళ్ళుగా శ్రీరావులు బాబు చేసిన అభివృద్ధి 'ఎగ్గెం' తనవాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకు వచ్చిందో సాదోహరణంగా చెబుతాడు. అప్పల్రాముడి ఆక్రోశానికి సభ ఎలా స్పందించింది? గోపన్న బాకీ తీరిందా? ఊరివారెవరూ కోర్టుకి వెళ్లరాదన్న శ్రీరాములు బాబు ఆశయం ఏమైంది? ..ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు భీభత్స రసంతో కూడిన ముగింపు వాక్యాలు చెబుతాయి.

"ధర్మ పన్నాలెంత వరకూ? ...అంతా నువ్ చెప్పినట్టు వినేవరకూ; ఆ తరువాత....!" అనే వాక్యంతో ముగిసే ఈ కథ, పాఠకుల మదిలో ఎన్నో ప్రశ్నలని లేవనెత్తుతుంది. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్నీ ఒక కొత్త దృష్టి కోణం నుంచి చూసేలా చేస్తుంది. అభివృద్ధి కావాలా? వద్దా? లాంటి సవాళ్ళని ఆలోచనల్లో నింపుతుంది. 'యువ' దీపావళి సంచిక (1966) లో తొలిసారి ప్రచురితమైన ఈ కథ ఎన్నో పునః ప్రచురణలను పొందింది. తాజాగా 'మనసు ఫౌండేషన్' ప్రచురించిన 'కాళీపట్నం రామారావు రచనలు' (పేజీలు 548, వెల రూ. 180) లోనూ ప్రచురితమయ్యింది.

6 కామెంట్‌లు:

 1. నాకేంటో అంత బాగా ఎక్కలేదండి కధ. వుత్తరాంధ్రా యాస మూలంగానో లేక ఎందుకో తెలియదు.

  రిప్లయితొలగించు
 2. బాగుందండి. మంచి కథ అనిపిస్తుంది. కథా ప్రారంభం బాగుంది.
  అతని రచనలు ఇంతవరకూ చదవలేదు. అవకాశం దొరికితే చదువుతాను.
  కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 3. మీకు ఏ మాండలీకాలైనా కొట్టిన పిండి మురళి గారు. కొంచెం మాలాంటి వాళ్ళను దృష్ఠిలో పెట్టుకొని చాలా వివరంగా రాయాలి మరి. అందులోనూ, పల్లెటూరి తగాదాలు ఒక పట్టాన నా కర్ధం కావు. ఒకమాట మాత్రం నిజం...చదువుతుంటే చాలా బాగుండి, చివరిదాకా చదివించేశారు. ఇది మాత్రం మీ రివ్యూ గొప్పతనమే.

  రిప్లయితొలగించు
 4. ఈ మాండలీకం అర్ధం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది సుమండీ :(

  రిప్లయితొలగించు
 5. @భావన: ఇది నింపాదిగా చదవాల్సిన కథండీ, బహుశా మీరు హడావిడిగా చదివారేమో.. ధన్యవాదాలు.
  @సవ్వడి: తప్పక చదవండి, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 6. @జయ: పుస్తకాలు చదవడం వల్ల నాకు అనుభవంలోకి వచ్చిన మొదటి ప్రయోజనం మాండలీకాలని కొంత వరకూ అర్ధం చేసుకోగలగడం అండీ.. నిజంగా చాలా ఉపయోగ పడింది కూడా.. ధన్యవాదాలు.
  @పరిమళం: కానీ కథల కోసం అర్ధం చేసుకోవాలండీ.. ఆ మాండలీకం లో చాలా చక్కని కథలు ఉన్నాయి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు