మంగళవారం, సెప్టెంబర్ 29, 2009

పితృవనం

శ్మశానం, మరుభూమి, రుద్రభూమి, ఒలుకుల మిట్ట.. ఇవన్నీ పితృవనానికి సమానార్ధకాలు. ప్రతి మనిషి జీవితానికి తప్పని సరి అయిన చివరి మజిలీనే 'పితృవనం.' ఇదే పేరుతో రెండు దశాబ్దాల క్రితం కాటూరు విజయ సారథి రాసిన నవల 'ఆంధ్రప్రభ' దీపావళి నవలల పోటీల్లో ప్రధమ బహుమతి అందుకోవడం తో పాటు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నవల అవార్డునీ అందుకుంది.

'పితృవనం' నవలలో కథానాయకుడు సూరి. శవాల సూరిగాడు అంటారు అందరూ. అతను శవ వాహకుడు. తాత, పద్దిగాడు, సొట్ట కాలు అతని ముఠాలో మిగిలిన సభ్యులు. తమ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవాలంటే ఊళ్ళో ఎవరింట్లో శవం లేవాలి. అది కూడా బ్రాహ్మణుల ఇళ్ళలోనుంచి లేవాలి. మోయడానికి ఎవరూ మనుషులు లేని కుటుంబం అయిఉండాలి. అప్పుడే వాళ్లకి గిరాకీ. 'కేసు' అంటారు వాళ్ళు. విశాఖపట్నం పూర్ణా మార్కెట్ సమీపంలోని ప్రభాత్ టాకీస్ దగ్గర 'కేసు' ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు.

ముఠా నాయకుడు సూరి ముప్ఫయ్యేళ్ళ వాడు. చింత మొద్దులా ఉంటాడు.. కరుకుగా మాట్లాడతాడు. అవును.. వృత్తిని బట్టి కంఠస్వరం ఏర్పడుతుంది. ఎలా మాట్లాడినా అతనితో పని ఉన్నవాళ్ళు వెనక్కి పోలేరు. అదీ కాక అతనిదగ్గరకి ఎవరూ శుభ్రంగా తయారై రారు. మర్యాదలు పట్టించుకునే స్థితిలో ఉండరు. రేటు మాట్లాడుకున్నాక సూరి మిగిలిన ముఠా సభ్యులకి కబురు చేస్తాడు. వాళ్ళంతా కలిసి శవానికి అంతిమ యాత్ర నిర్వహిస్తారు.

కరుగ్గా మాట్లాడతాడని సూరిని రాతి మనిషి అనుకుంటే పొరపాటు. అతనిది సున్నితమైన మనసు. ఎదుటివాళ్ళ కష్టాలని అర్ధం చేసుకోగలడు. కాబట్టే, ఒకప్పుడు వైభవంగా బతికి, అయినవాళ్లు అలక్ష్యం చేస్తే రోడ్డున పడ్డ డెబ్భయ్యేళ్ళ జానకిరామయ్య 'తాత' కి తన ముఠాలో చోటిచ్చాడు. తండ్రి శవాన్ని దహనం చేయలేని స్థితిలో ఉన్న ఆనందుకి సాయం చేశాడు. అయినవాళ్ళే తనని అయినకాడికి అరబ్బు షేకుకి అమ్మేయ్యాలని చూస్తున్న 'జయ' ఆశ్రయం కోరితే కాదనలేక పోయాడు.

శ్మశానం లో శవాలని దహనం చేసే వీర బాహుడు సూరికి ఆప్త స్నేహితుడు. ఓ పక్క శవాలు కాలుతుంటే, వీరబాహుడికి హాస్య కథలు చెప్పి నవ్వించగలడు సూరి. జమీలు పోయినా పేరులో మాత్రమే మిగిలిన 'రాజు' మరో ఆప్తుడు సూరికి. నిరుద్యోగ పర్వం సాగిస్తూ ఇంటర్యూలకి వెళ్లి వస్తూ, కూడు పెట్టని కులాన్ని నిందించుకుంటూ ఉంటాడు రాజు. వీళ్ళందరికీ సూరి మాట మీద గురి. అతని సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేయరు. సూరిదో విచిత్రమైన కథ.

పదకొండేళ్ళ సూర్యనారాయణ పరబ్రహ్మ శాస్త్రి బీయే, ఎమ్మే చదవాలనీ, పెద్ద ఆఫీసరు కావాలనీ కలలు కన్నాడు. తాత పరబ్రహ్మ శాస్త్రి సోమయాజి అయ్యాడు. తండ్రి లక్ష్మినారాయణ శాస్త్రి ఊళ్ళో 'సిద్ధాంతి' అనిపించుకున్నాడు. వరుస ఫస్టు క్లాసులతో ఎనిమిదో తరగతిలోకి వచ్చిన కుర్రాడిని ఒక రోజు బడికి ఆలస్యంగా వచ్చినందుకు హెడ్మాష్టరు అడ్డగించారు. "బ్రామ్మలంటే బ్రెమ్మ మొగంలోంచి పుట్టారట్రా?" అని చెంప చెళ్ళుమనిపించారు.

ఆ దెబ్బ ఆ కుర్రాడి జీవితం మీద తగిలింది. మళ్ళీ బడి ముఖం చూడలేదు. అటు వేదమూ రాక, హెడ్మాష్టారి పుణ్యమా అని ఇటు ఏబీసీడీలూ పూర్తిగా రాక చివరికి 'శవాల సూరిగాడ'య్యాడు. శవ వాహకులని కార్మిక సంఘం లో చేర్చుకోమని అడిగి భంగపడతాడు సూరి. "మీరు కార్మికులు కాదు' అంటారు సంఘం వాళ్ళు. శ్మశానం పక్కనే వొళ్ళమ్ముకునే అమ్మాయిలు.. వాళ్ళదో ప్రపంచం. సూరి రిజర్వేషన్ల గురించి అనర్ఘళంగా ప్రసంగించే సన్నివేశం, ముగింపు సన్నివేశాల్లో నాటకీయత శృతి మించిందనిపించింది.

ఇరవయ్యేళ్ళ క్రితం ఈ నవల ఆంధ్రప్రభ లో సీరియల్ గా వచ్చినప్పుడు వారం వారం ఆసక్తిగా ఎదురు చూశాను. నవలని మెచ్చుకుంటూనూ, శవ వాహకుడు కథా నాయకుడేమిటని విమర్శిస్తూనూ ఉత్తరాలు వచ్చాయి. జాగ్రత్త ఫైల్ చేసి, తర్వాత పోగొట్టుకున్నాను. ఈ మధ్య అరుణ పప్పు గారి 'అరుణమ్' బ్లాగు లో టపా చూశాక కొత్త ప్రింట్ వచ్చిందని తెలిసి వెంటనే తీసుకున్నాను. గోకుల్ చంద్, రాహుల్ చంద్ మెమోరియల్ ట్రస్టు ప్రచురించిన 'పితృవనం' అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వెల రూ. 100.

12 కామెంట్‌లు:

 1. ఒక బ్లాగ్ లో ఈ పుస్తకం గురించి చదివిన గుర్తు.మీరు రాసిన బ్లాగే అయి వుంటుంది.ఎప్పటిలానే బాగుందండి పరిచయం.

  రిప్లయితొలగించు
 2. ఎప్పటిలానే మీ టపా బాగుంది. చదివిన వెంటనే ఆ నవల మీద ఆసక్తి పెరిగింది. మీ టెంప్లేట్ బాగానే ఉంది ఒక రోజు ఫైరుఫాక్సు లో సరిగా లోడ్ కాకపోతే టెంప్లేట్ ప్రాబ్లం అనుకుని వ్యాఖ్య రాసాను సారీ...

  రిప్లయితొలగించు
 3. 'పితృవనం' పదం మొదటి సారి వింటున్నాను. కథ ఆసక్తి కరంగ ఉంది. గురువు దండిస్తాడని భయపడి చదువు పాడు చేసుకున్న ఓ మితృడు గుర్తొచ్చాడు. ఇటువంటి సంఘటనలో ఎవరిది తప్పో ఒకోసారి అర్ధంకాదు.

  రిప్లయితొలగించు
 4. Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

  Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

  Click here for Install Add-Telugu widget

  రిప్లయితొలగించు
 5. @అమృత: ధన్యవాదాలు
  @నాగ: ధన్యవాదాలు.. సారీ ఎందుకండీ.. ఇబ్బంది ఉంటె టెంప్లేట్ మారుద్దామని అడిగాను.
  @వేణూ శ్రీకాంత్: నిజమేనండీ.. ధన్యవాదాలు.
  @రాం: ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 6. అరుణగారి బ్లాగ్ లో మొన్నెళ్ళినప్పుడు కొందామనుకుని అప్పటికే బిల్లు ఎక్కువైందని మానేసాను.కొనాలన్నమాట..!

  రిప్లయితొలగించు
 7. @తృష్ణ: సీరియస్ నవలండీ.. ఏక బిగిన చదివిస్తుంది.. కాకపొతే శ్మశానం, శవాలు.. ఇవన్నీ చదవగలగాలి.. సబ్జెక్ట్ నచ్చితే నవల నిరాశ పరచదు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 8. అయితే పితామగన్ అన్న తమిళ సినిమా పేరుకి సమానమైన అర్ధం పితృవనమేనంటారా?

  రిప్లయితొలగించు
 9. @బృహస్పతి: 'పితామగన్' అర్ధం కాటికాపరి అనుకుంటానండి.. పితృవనం అంటే శ్మశానం.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 10. మీదైన శైలిలో మరో మంచి పుస్తక పరిచయం ! బావుందండీ !

  రిప్లయితొలగించు
 11. నేను ఎన్ని రోజులనుంచో ఈ పిత్రువనం నవల కోసం ఎదురు చూస్తున్నాను.చాల ఆసక్తి ఎదురు చూసేదాన్ని. ఆంధ్రప్రభ కోసం.
  ఈ పిత్రువనం ని సెర్చ్ చేస్తే మీ బ్లాగ్ దొరికింది. ధన్య వాదాలు

  రిప్లయితొలగించు