కొట్టం రామకృష్ణా రెడ్డి కథల సంపుటికి 'చీకటి యుద్ధం' అన్న పేరే పెద్ద విరోధాభాస. ఈ కథల్లో చీకటి లేదు, యుద్ధమూ లేదు, చీకటితో చేసే యుద్ధం అంతకన్నా లేదు. సంపుటిలో ఈ పేరుతో ఉన్న కథ ముగింపు చీకటిలో జరిగిన యుద్ధాన్ని స్ఫురణకి తెచ్చి, పాఠకులకి మెరుపు ముగింపు చదివిన అనుభూతిని కలిగిస్తుంది. ఆ కథ, ఆ ముగింపూ రచయితగా బాగా దగ్గరగా అనిపించి ఉంటాయి బహుశా. కవర్ డిజైన్ లో వెన్నెల వెలుగుని చూపించే ప్రయత్నంలో మొత్తం నలుపుని అద్దారు. ఇంత చెప్పడం ఎందుకంటే, ఈ పుస్తకాన్ని కొని చాలా రోజులే అయినా 'నెగటివ్ కథలు ఇప్పుడెందుకు' అన్న ఆలోచనలో చదవడాన్ని అలా అలా వాయిదా వేస్తూ వచ్చాను. రచయితా, పబ్లిషరూ కలిసి మిస్లీడ్ చేశారు అనడం కన్నా, నేనే మిస్ లీడ్ అయ్యాను అనుకోవడం సబబు. 'ఇంకొంచం ముందే చదివేసి ఉండాల్సిందే' అని మాత్రం అనిపించింది.
సంపుటిలోని మొత్తం పదిహేను కథల్లో ఐదు కథలు తెలంగాణ మాండలీకంలో వున్నాయి. వీటిలో రెండు కథలు నాకు బాగా నచ్చాయి. 'జాయిజాదులు', 'పెద్ద దిక్కు' ఈ రెండు కథలూ చదువుతున్నంతసేపూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు గుర్తొస్తూనే వున్నాయి. శ్రీపాద రాసిన చాలా కథల్లో కథనం మనల్ని ఆ స్థలకాలాల్లోకి తీసుకుపోతుంది. ఒకటి రెండు పేజీలు తిరిగేసరికి, కథ చదువుతున్నట్టుగా కాక కళ్ళముందు చూస్తున్న భావన వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే కుతూహలం కన్నా జరుగుతున్న కథని ఆస్వాదించడానికే పెద్దపీట వేస్తాం. కథ ఎటూ ఉంటుంది. ఈ రెండు కథలూ చదువుతున్నంత సేపూ నాకు కలిగిన భావన అదే 'జాయిజాదులు' చివర్లో లచ్చుమమ్మ మొగుడు చెప్పే మాటలు పాఠకులకి ఆసరికే ఆలోచనకి వస్తాయి. వాటిని వాచ్యంగా చెప్పించనవసరం లేదు. అలాగే, 'పెద్ద దిక్కు' ముగింపులో బాపు మాటలని బాగా కుదించడం ద్వారా చర్విత చర్వణాన్ని ఆపే వీలుంది.
'చీకటి యుద్ధం' కథకి కొనసాగింపుగా అనిపించే కథ 'వీడని నీడ'. రెండూ ఆలుమగల కథలే. రెండు కథలూ కూడా ఇద్దరి వైపు నుంచీ చెప్పినవే. రెండింటిలోనూ ఇద్దరూ తమ భాగస్వామి గురించి వరుసగా ఫిర్యాదులు చేస్తూనే వుంటారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని రచయిత వాచ్యంగా చెప్పరు. కథల ముగింపులో చెప్పకనే చెబుతారు. నిజానికి ఈ సంపుటిలో మెజారిటీ కథలు భార్యాభర్తల కథలే. భిన్నమైన ఇతివృత్తంతో సాగుతూనే, కాస్త దగ్గరగా అనిపించే కథలు 'స్పర్శ', 'విస్పర్'. 'స్పర్శ' కథలో ముగింపు, అత్తగారి పాత్రా బాగా గుర్తుండిపోతాయి. తాపీగా సాగే కథ, ప్రి-క్లైమాక్స్ నుంచి పరుగందుకుంటుంది. 'విస్పర్' కథ సాగుతున్నంతసేపూ ముగింపుకి సంబంధించిన క్లూలు కనిపిస్తూనే వుంటాయి. ఈ రెండూ సమకాలీన సమాజం నుంచి వచ్చిన కథలు. వీటిలో కనిపించే లాంటి ఆదర్శమే (?) తొలి కథ 'దిద్దుబాటు' లోనూ కనిపిస్తుంది.
కాస్త సుదీర్ఘంగా సాగినట్టు అనిపించే కథ 'చెల్లని మొహం'. సంపుటిలో చివరి కథ 'నేను..తను..అతను' స్త్రీవాద కథలా అనిపిస్తుంది. 'చెల్లని మొహం' వర్తమానంలో జరిగే కథ. కథా నాయకుడి ఫుల్ టైం ప్రొఫెషన్ కమర్షియల్ రైటర్. సినిమాలకి, సీరియళ్ళకీ రాయడం కాదు, కేవలం కథా, నవలా సాహిత్యాన్ని తెలుగులో రాస్తూ ఉంటాడు, అది కూడా ప్రత్యేకంగా ఒక ఆఫీసుని ఏర్పాటు చేసుకుని!! 'భయం' కథని వన్ సైడ్ లవ్ స్టోరీ అని ఒక్కమాటలో తేల్చేయలేం. నేరేషన్ ఈ కథకి ప్రత్యేకమైన అందాన్నిచ్చింది. 'హద్దులు' కథలో సరిహద్దు ప్రాంతపు వర్ణన, ఇదే ఇతివుత్తంతో వచ్చిన ఇతర కథల్లో కనిపించే వర్ణనకి భిన్నంగా వుంది. యుద్ధ క్షేత్రాన్ని కాక, దానికి సమీపంలో సామాన్యులు ఉండే ఆవాసాన్ని కథాస్థలంగా ఎంచుకోవడం కథకి ఒక ప్రత్యేకతని అద్దింది.
'జాయిజాదులు' లాగా హాయిగా సాగిపోయే కథ 'ఒకరికొకరు'. నెమ్మదిగా కనుమరుగవుతున్న ఒక సంప్రదాయాన్ని రికార్డు చేసేందుకు మాత్రమే కాదు, 'నీటికన్నా రక్తం చిక్కన' అనే సత్యాన్ని మరోమారు చెప్పేందుకు రాసిన కథలా అనిపించింది. 'ఉనికి' 'తొవ్వ' ఇవి రెండూ తెలంగాణ మాండలీకంలో సాగే స్కెచ్ లు. కుటుంబ బంధాల ప్రాశస్త్యాన్ని చెప్పే కథలే రెండూను. ఉనికి కథ ఒక సుదీర్ఘ జీవితంలో దశలని చిత్రిస్తే, 'తొవ్వ' కథ ఒక మరణవార్తతో మొదలై తలపోతలతో సాగి, ఆర్ద్రంగా ముగుస్తుంది. ఒకేసన్నివేశాన్ని వివిధ పాత్రల వ్యూపాయింట్ నుంచి చూపుతూ రాసిన కథ 'నైజం'. ప్రతి పాత్రా మిగిలిన పాత్రల్ని కామెంట్ చేస్తుంది. కథ ఆ పాత్ర వైపు నుంచి చదివేప్పుడు, మిగిలిన పాత్రలు చేసిన కామెంట్స్ లో ఏవి ఎంత నిజం అనే నిర్ధారణకి రాగలుగుతారు పాఠకులు. ఇందుకోసం ఈ కథని కనీసం రెండుసార్లు చదవాలి. హాయైన కథల్నీ, ఆపకుండా చదివించే కథల్నీ ఇష్టపడే పాఠకులకి నచ్చే సంకలనం ఈ 'చీకటి యుద్ధం'. (బోధి ఫౌండేషన్ ప్రచురణ, పేజీలు 152, వెల రూ. 225)
