బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ జీవితంలో ప్రతి దశలోనూ అలవి కాని కష్టాలే. జీవితపు ప్రతి మలుపు లోనూ ఊహించని ఇబ్బందులే. అయితేనేం, సాహిత్యాన్ని పడవగానూ, సంగీతాన్ని తెడ్డుగానూ చేసుకుని ఈ కష్టాల వైతరణిని దాటేసిన 'సామాన్యుడు' ఆయన. భరాగో అనే పొట్టిపేరుతో తెలుగు సాహిత్యాభిమానులకి తెలిసిన భమిడిపాటి రామగోపాలమ్ ఆత్మకథ 'ఆరామ గోపాలమ్' చదువుతుండగానూ, పూర్తి చేసిన తర్వాతా కూడా ముళ్ళపూడి వెంకటరమణకి 'కోతి కొమ్మచ్చి' రాయడానికి అతి పెద్ద ప్రేరణ బహుశా ఈ పుస్తకమే అయి ఉండొచ్చని బలంగా అనిపించింది. నిజానికి ముళ్ళపూడి బాల్యంలో కష్టపడ్డా, సినిమాల్లో స్థిరపడ్డాక జీవితం సాఫీగానే సాగింది. కానీ, భరాగో కథ అది కాదు. అయినా, మనుషుల్ని పోలిన మనుషులు ఉండొచ్చు కానీ జీవితాలని పోలిన జీవితాలు అరుదుగా తప్ప ఉండవు కదా.
తన జీవిత కథని 'బాల్య లహరి' 'యువ తరంగం' 'ఉద్యోగ పర్వతం' 'సంసారం సాగరం' 'సాహిత్య వనం, సంగీత వాహిని' అనే ఐదు అధ్యాయాలుగా విభజించారు భరాగో. చివర్లో 'My Scribes' 'మిత్ర పుష్పాలు' అనే రెండు అనుబంధాలని చేర్చారు. విజయనగరం జిల్లాలో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో 1932 లో జన్మించారు రామగోపాలమ్. ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి బడిపంతులు. పెద్ద కొడుకు హైస్కూలు చదువుకి వచ్చేసరికి తండ్రికి పదవీ విరమణ వచ్చేసింది. పైగా. పింఛను లేని ఉద్యోగం. ఆ తండ్రికి ఉన్నదల్లా పిల్లల్ని బాగా చదివించాలన్న ఆశ. నిజానికి ఆశ కాదు, గట్టి పట్టుదల. స్కూలు ఫీజు కోసం కాలినడకన ఊళ్లు తిరిగి దానాలు స్వీకరించడం మొదలు, పిల్లవాడికి చదువుకునే ఊళ్ళో వారాలు కుదర్చడం వరకూ పడని శ్రమ లేదు.
పోతన పద్యాలూ, త్యాగరాయ కృతులూ మొదలుగా భరాగోకి చిన్న నాటి నుంచీ సంగీత సాహిత్యాల పట్ల అభిరుచి యేర్పడింది. జీవితంలో ఎదురైన ప్రతి కష్టమూ ఈ రెంటినీ ఆయనకి మరింత దగ్గర చేసింది తప్ప, దూరం చేయలేదు. విజయనగరం బ్రాంచి కాలేజీలో చదువుకునే రోజుల్లో ఘంటసాల (వెంకటేశ్వర రావు) భరాగోకి 'సత్రం మేట్'. ఈ కాలేజీ కబుర్లు ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఆకాలంలోనే హిందీ సినిమా పాటలతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది భరాగోకి. తెలుగు పాటలు సరేసరి. కాలేజీ రోజుల్లోనే రచనా వ్యాసంగమూ మొదలైంది. ఆ కాలంలో కలం పట్టిన విజయనగరం కుర్రకారు అందరికి మల్లేనే భరాగో ఆశయం కూడా 'చాసోని మెప్పించే' కథ రాయడం. చాసో హవేలీ వెదజల్లిన సాహితీ పరిమళాలు అన్నీ ఇన్నీ కావని మరోమారు చెబుతుంది ఈ ఆత్మకథ.
చదువు పూర్తవుతూనే భరాగో తక్షణావసరం ఉద్యోగం. ఓపిక తెచ్చుకుని ట్యూషన్లు చెబుతున్న తండ్రి, కంటి చూపు పోగొట్టుకున్న తల్లి, చదువుకుంటున్న తమ్ముళ్లు, వీళ్ళందరికీ ఓ భరోసా ఇచ్చేది ఉద్యోగమే. సర్వే శాఖలో చిన్న ఉద్యోగిగా ప్రవేశించి, అంచెలంచెలుగా నిచ్చెనమెట్ల ఎక్కడం, ఊహించని విధంగా ఉద్యోగం పోగొట్టుకోవడం, మళ్ళీ కష్టపడి పునర్నియామకపు ఉత్తర్వు సంపాదించుకోవడం, విశాఖ పోర్టు కి డిప్యుటేషన్ మీద వెళ్లి, అక్కడే స్థిరపడి పదవీ విరమణ చేయడాన్ని సరదాగా చెప్పేరు భరాగో. ఈలోగానే పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు, బాధ్యతలు ఒకపక్కా, సాహిత్య వ్యాసంగం మరోపక్కా సాగేయి. దినపత్రికలో సాంస్కృతిక విలేకరిగా పార్ట్ టైం ఉద్యోగం మొదలు పెట్టి కాలమిస్టు గా ఎదగడం, ఈ క్రమంలో పెరిగిన పరిచయాలు, ఎదురైన అనుభవాలు, ఇదంతా సమాంతరంగా నడిచిన మరో కథ.
చాలామంది కాలమిస్టుల్లాగే భరాగో కూడా అనేక కథా వస్తువుల్ని కాలమ్స్ గా కుదించేశారు. అయినప్పటికీ కూడా. 'వెన్నెల నీడ' 'వంటొచ్చిన మగాడు' లాంటి గుర్తుండిపోయే కథల్ని రాశారు. పోర్టు ట్రస్టు ప్రోత్సాహంతో వాటన్నింటినీ 'ఇట్లు మీ విధేయుడు' పేరిట కథా సంకలనంగా ప్రచురించి, 1991 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్నారు. కాలమ్స్ లో ఎంపిక చేసిన వాటిని 'సరదా కథలు' 'కథన కుతూహలం' పేరిట పుస్తకాలుగా ప్రచురించారు. వీటిలో 'కథన కుతూహలం' కి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం రావడం మాత్రమే కాదు, వీటిలో ఎంపిక చేసిన కథనాల్ని చిత్రించి దూరదర్శన్ లో 'భమిడిపాటి రామగోపాలం కథలు' పేరిట ప్రసారం చేశారు కూడా. ప్రముఖ నటుడు సుత్తివేలు భరాగో పాత్రని పోషించారు (యూట్యూబ్ లో చూడవచ్చు). అలా, చేయగలిగినంత సాహిత్య రచన చేయలేకపోయినా, చేసిన మటుకు గౌరవాలు అందుకున్నారు.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం, పదవీ విరమణ అనంతరం అనారోగ్యం కబళించి మంచానికి పరిమితమై పోయినా, రాసేందుకు శరీరం సహకరించకపోయినా, వ్రాయసకాండ్రని నియమించుకుని రచనల్ని కొనసాగించడం. అలా రాత సాయం అందించిన అందరినీ పేరుపేరునా 'My Scribes' అనుబంధంలో తలుచుకోవడం. ఈ పుస్తకం తాలూకు మరో ప్రత్యేకత ఛాయాచిత్రాలు. చిన్ననాటి నుంచి, చివరి రోజుల వరకూ తనకు తారసపడిన వారిలో తాను ప్రస్తావించిన అందరివీ ఛాయాచిత్రాలని ఈ పుస్తకంలో చేర్చారు. మునుపు ఏ ఆత్మకథ లోనూ ఇలా ఫోటోలు వాడడం జరగలేదని కూడా ఆయనే చెప్పారు. భరాగో అనగానే గుర్తొచ్చే 'సావోనీర్ రచన' ని గురించి కూడా వివరంగానే రాశారు తన ఆత్మకథలో. త్రివేణి పబ్లిషర్స్ ప్రచురించిన ఈ 384 పేజీల పుస్తకం వెల రూ. 300. డిస్ప్లే లో ఉండక పోవచ్చు కానీ, పుస్తకాల షాపులో జాగ్రత్తగా వెతికితే లోపలి అరల్లో దొరికే అవకాశం వుంది. కల్పనని మించిన వాస్తవాలు ఎన్నో వున్న ఆత్మకథ ఈ 'ఆరామ గోపాలమ్'.