మంగళవారం, జూన్ 04, 2024

ఉచితమైన తీర్పు

"జగన్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవక పోతే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద కూడా ఎక్కడా ఏ రాజకీయ పార్టీ ఉచిత పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు..." సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది మొదలు మిత్రులెవరితో ఎన్నికల ప్రస్తావన వచ్చినా నేను చెబుతూ వచ్చిన మాట ఇదే. ఉచిత పథకాలని ఉద్యమ స్థాయిలో అమలు చేసిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇంతటి దారుణ పరాభవాన్ని రుచి చూస్తారని నాకే కాదు, నా మిత్రులు ఎవరికీ కూడా అంచనా లేదు. ఎందుకంటే, పోలింగ్ బూత్ కి తప్పకుండా వెళ్లి ఓటు వేసే కుటుంబాలన్నింటికీ గడిచిన ఐదేళ్ల కాలంలో పంచిన మొత్తాలు తక్కువేమీ కాదు. ఆ కృతజ్ఞత పూర్తిగా పని చేస్తుందని జగన్ నమ్మితే, ఎంతోకొంత మేరకు తప్పక ప్రభావం చూపిస్తుందని మా బోంట్లం అనుకున్నాం. 

ఆంధ్రప్రదేశ్ వోటింగ్ సరళిని చూస్తే, ప్రతిపక్షం పట్ల అనుకూలత కన్నా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతే ఎక్కువగా పనిచేసినట్టు అనిపిస్తోంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి తీర్పునే ఇంతే బలంగా ఇచ్చారు ప్రజలు. (ఐదేళ్ల పాలనకే ఇంత వ్యతిరేకతని ఎందుకు మూట కట్టుకుంటున్నాం అనే ఆత్మవిమర్శని మన నాయకుల నుంచి అస్సలు ఆశించలేం, ఇది ఒక విషాదం). ప్రతిపక్ష నాయకుడిగా కొంచం విశ్రాంత జీవితం గడిపినా, ఎన్నికలకి ఏడాది ముందు పూర్తిగా యాక్టివేట్ అయిన నారా చంద్రబాబు నాయుడు తన సర్వమూ ఒడ్డి పోరాడారు ఈ ఎన్నికల్లో. ఈ వయసులో ఈ పోరాట స్ఫూర్తి  ఎంతైనా అభినందనీయం. అయితే, బాబు ఇచ్చిన 'అంతకు మించి' హామీలని జనం నమ్మేరా? 

నేనైతే నమ్మలేదనే అనుకుంటున్నాను. పదేళ్ల నాటి 'రైతు రుణ సంపూర్ణ మాఫీ' 'ఇంటికో ఉద్యోగం' లాంటి అమలు కాని హామీలని జనం మర్చిపోలేదు. కానైతే, ప్రభుత్వం మీద వ్యతిరేకతని ప్రకటించడానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో, తెలుగుదేశం పార్టీయే ఊహించని రీతిలో విజయాన్ని కట్టబెట్టారు. (దీనిని ఏమాత్రం ముందుగా ఊహించగలిగినా, పొత్తుల ప్రస్తావన లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉండేది ఆ పార్టీ). ఇంత బలంగా ఆగ్రహ ప్రకటన ఎందుకు చేశారు అన్నది కుతూహలం కలిగించే విషయం. నెలనెలా అకౌంట్లలో పడే డబ్బు ఆగిపోయినా పర్లేదనే నిర్ణయానికి ఊరకే వచ్చెయ్యరు కదా. నిజానికి జగన్ డబ్బు పంపిణీతో సరిపెట్టేసి వుంటే అది వేరే కథ. కానీ విద్యా వైద్య రంగాల్లో చెప్పుకోదగిన కృషి జరిగింది (దీనినెందుకో ప్రచారానికి పెద్దగా వాడుకోలేదు). వాలంటీర్ల వల్ల చాలావరకు మేలు జరిగింది, ముఖ్యంగా కరోనా కాలంలో. 

మౌలిక సదుపాయాలు (రోడ్లు), ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఇసుక, లిక్కర్ పాలసీలు, చాలామంది ఎమ్మెల్యేలు సామంత రాజుల్లాగా వ్యవహరించడం (కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగినట్టు), కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగిన నిత్యావసర వస్తువుల ధరల విపరీత పెరుగుదల.. ఇవి ప్రధాన కారణాలు అయితే, సవాలక్ష కారణాల్లో మరికొన్నింటిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకి జీతాలు/పెన్షన్లు ఎన్నో తారీఖున వస్తాయన్నది ప్రతి నెలా ఓ పజిల్ కావడం లాంటి వాటిని చెప్పుకోవాలి. చంద్రబాబు వస్తే మంత్రదండంతో రాత్రికి రాత్రే ఇవన్నీ సరైపోతాయని భ్రమలు లేకపోవచ్చు కానీ, తమ ఆగ్రహాన్ని ప్రకటించే మార్గంగా ప్రజలు ఓటుని ఎంచుకున్నారనిపిస్తోంది. అందిన వాటి పట్ల కృతజ్ఞత కన్నా (నిజానికి ఈ కృతజ్ఞత ఉండాలా అన్నది వేరే చర్చ) అందని వాటి పట్ల ఆగ్రహమే ఎక్కువగా పనిచేసింది. 

జగన్ ప్రభుత్వం చేయలేకపోయిన రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు -- ఒక స్థిరమైన రాజధాని ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం. ఐదేళ్ల నాడు కేంద్రంలో మెజారిటీ తక్కువ వస్తే, తన ఎంపీల మద్దతు ఇచ్చి నిధులు సాధించుకోవాలని జగన్ ఆశించారు. "కేంద్రం మెడలు వంచి" అని పదేపదే చెప్పారు. అప్పుడు రాని అవకాశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. లోక్ సభ ఫలితాల తీరు చూస్తుంటే "పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు" అనే ఐదేళ్ల నాటి తన వ్యాఖ్యని నరేంద్ర మోడీ మర్చిపోవాల్సిన తరుణం వచ్చినట్టుగా అనిపిస్తోంది. పోలవరాన్నీ, అమరావతినీ నిధుల వరద ముంచెత్తవచ్చు. అయితే, రెండూ కూడా ఆ ఫళాన పూర్తయ్యే నిర్మాణాలు కావు. ఆ పనులు ఏ రీతిగా సాగుతాయన్నది చూడాలి. 

"మళ్ళీ బీజేపీ గెలిస్తే ఇన్కమ్ టాక్స్ శ్లాబ్ నలభై శాతం అవుతుంది, జీఎస్టీ ముప్ఫయి శాతం అవ్వచ్చు.." ఎన్నికలకి ముందు మిత్రులొకరు వ్యంగ్యంగా అన్న మాట ఇది. గత పదేళ్ల పన్నుపోట్ల మీద సెటైర్ అన్నమాట. ఇప్పుడిక ఏ పక్షం అధికారం లోకి రావాలన్నా మిత్ర పక్షాల సాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ధరలు, పన్నుల దూకుడు అలాగే ఉంటుందా, లేక ఏమన్నా నిదానిస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఈ మిత్రపక్షాల సాయం ఏమేరకు అవసరం పడుతుంది అన్నదాని మీద కొన్ని కీలకమైన విషయాలు ఆధార పడి వున్నాయి. ఆ సర్దుబాట్లు, ఇచ్చిపుచ్చుకోడాలు ఇదంతా జరగబోయే కథ. చంద్రబాబు మీద ఉన్న స్కిల్ స్కామ్ వగయిరా కేసులన్నీ తొలగిపోతాయనడానికి సందేహం లేదు. జగన్ కేసుల విషయంలో ఇప్పుడు వ్యవస్థ ఎలా పని చేయబోతోందన్నది చూడాలి. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉచితాలు లేకపోయినా పర్లేదనుకున్నారా లేక చంద్రబాబు 'అంతకుమించి' ని నిజంగానే నమ్మేరా??