మంగళవారం, జులై 05, 2022

గుడిపూడి శ్రీహరి ...

"ఆకాశవాణి.. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.. గుడిపూడి శ్రీహరి.." రేడియో ట్యూనింగ్ లో కృత్యాద్యవస్థ మీద హైదరాబాద్ కేంద్రం తగిలిన రోజుల్లో గరగరమంటూ వినిపించేదీ గొంతు. గరగర రేడియోది. మిగిలిన వాళ్ళు బహు గంభీరంగా వార్తలు చదివితే, ఈ గొంతు మాత్రం మధ్యలో చిరు దగ్గులు, సవరింపులు వినిపించేది. పత్రికల్లో సినిమా రివ్యూల కింద గుడిపూడి శ్రీహరి అనే పేరు కనిపించేది. ఇద్దరూ ఒక్కరే అని తర్వాతెప్పుడో తెలిసింది. రేడియో వార్తల మీద, సినిమా రివ్యూల మీదా తనదైన ముద్ర వేసిన గుడిపూడి శ్రీహరి ఇకలేరన్న వార్త ఉదయాన్నే తెలిసింది. అప్పటి నుంచీ ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. ఇంతకీ, ఆయనతో నాకు ఎలాంటి ప్రత్యక్ష పరిచయమూ లేదు. 

సినిమా వెబ్సైట్లు మొదలయ్యాక కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనో, విడుదలకు కొన్ని గంటల ముందో రివ్యూలు వచ్చేస్తున్నాయి కానీ, అంతకు ముందు వరకూ ఈ శుక్రవారం సినిమా విడుదలైతే వచ్చే గురువారం మార్కెట్లోకి వచ్చే సినిమా పత్రికలో రివ్యూ వచ్చేది. ఈలోగా ఉత్సాహవంతులు సినిమా చూసేయడమే కాక, మంచిచెడ్డల్ని గురించి చర్చోప చర్చలు కూడా పూర్తి చేసేసే వాళ్ళు. సినిమా టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉన్న రోజులవి. అదుగో, అలాటి చర్చల్లో "గుడిపూడి శ్రీహరి రివ్యూలో ఈ పాయింట్ ఉంటుంది చూడు" అన్న మాట కొంచం తరచుగానే వినిపిస్తూనే ఉండేది. అంత పాపులర్ ఆయన రివ్యూలు. 

ఓ ఇరవయ్యేళ్ళ క్రితం దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఓ సినిమా పత్రిక్కి  ఇచ్చిన ఇంటర్యూని సెలూన్ నిరీక్షణలో చదివినప్పుడు, ఆయన చిన్నప్పుడు వాళ్ళ మిత్రుల మధ్యనా ఇలాంటి చర్చలే జరిగేవనీ, శ్రీహరి రివ్యూల వల్ల 'సినిమా' మీద ఆయనకి పూర్తి అవగాహన కలిగిందని తెలిసి ఆశ్చర్యపోయాను. సినిమా అంటే ఆసక్తి ఉన్నవాళ్లందరికీ శ్రీహరి పేరు బాగా పరిచయమే అని అర్ధమయ్యింది. కేవలం నటీ నటుల నటన గురించి మాత్రమే రాసి ఊరుకోకుండా, సాంకేతిక విభాగాలన్నింటి పనితీరునీ పరామర్శించడం,  బాగాలేని చోట చిన్న చిన్న చురకలు వెయ్యడం శ్రీహరి రివ్యూల ప్రత్యేకత. ఆంధ్రభూమి దినపత్రిక 'వెన్నెల' అనే సినిమా సప్లిమెంట్ ని ప్రారంభించి బొత్తిగా నిర్మొహమాటమైన రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టే నాటి వరకూ ఈ చురకలే వాతల్లా అనిపించేవి. 

పరిశీలన వల్ల గమనించిన విషయం ఏమిటంటే, ఉషాకిరణ్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలని రివ్యూ చేసే విషయంలో శ్రీహరి ఆచితూచి వ్యవహరించే వాళ్ళు. మొహమాటం బాగానే కనిపించేది. అదే చిన్న సంస్థలు, కొత్త సంస్థల సినిమాలైతే చెలరేగి పోయేవాళ్లు. ఇలా చెలరేగి పోయే క్రమంలో బాగున్న సినిమాలనీ రివ్యూలో చెండాడేసిన సందర్భాలు బోలెడు. నాకు బాగా గుర్తున్న సినిమా లయ-వేణు తొట్టెంపూడిలని నాయికా నాయకులుగా పరిచయం చేస్తూ విజయ భాస్కర్ దర్శకత్వంలో వేణు బంధువులు నిర్మించిన 'స్వయంవరం' సినిమా. రివ్యూ చదివే నాటికే సినిమా చూసేశా (శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి, ఆదివారం మధ్యాహ్నం 'టాక్ ఆఫ్ ది టౌన్' ప్రోగ్రాం లో యాంకర్ ఝాన్సీ నుంచి మంచి రివ్యూ వచ్చింది ). శ్రీహరి రివ్యూ నిరాశ పరిచింది. 

హైదరాబాద్ రోజుల్లో, బీకే గూడ లో ఉన్న శ్రీహరి ఇంటిముందు నుంచి చాలాసార్లే వెళ్ళాను. హౌసింగ్ బోర్డు వాళ్ళ ఎమ్మైజి (మిడిల్ ఇన్కమ్ గ్రూప్) ఇల్లు. గేటు లోపల ఎడమవైపు కార్ పార్కింగ్, కుడివైపు ఖాళీ స్థలం. మారుతీ కారుని షెడ్లోనుంచి తీస్తూనే, షెడ్లో పెడుతూనో, లేదా ఖాళీ స్థలంలో పడక్కుర్చీ వేసుకుని కూర్చుని పేపరు చదువుతూనో కనిపించే వాళ్ళు. "ఓసారి ఆగి, గేటు తీసుకుని వెళ్లి పలకరిస్తే..." అన్న ఆలోచన చాలాసార్లే వచ్చింది కానీ, ఆచరణలో పెట్టలేదు. అప్పట్లోనే ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' కి ఆయన రాసే సినిమా రివ్యూలు, సాంస్కృతిక కార్యక్రమాలకి సంబంధించిన ఇంటర్యూలు వగయిరా చదవడం తటస్థించింది. చాలా సినిమాలకి తెలుగులో రాసిన రివ్యూలనే ఇంగ్లిష్ లో అనువదించి ఇచ్చేవారు కానీ, కొన్ని సార్లు మాత్రం వేర్వేరుగా రాసేవాళ్ళు. అలాంటప్పుడు తెలుగులో కనిపించని విమర్శ ఇంగ్లిష్ రివ్యూల్లో (వైస్-వెర్సా గా కూడా) కనిపిస్తూ ఉండేది. 

శాస్త్రీయ సంగీత, నృత్య రంగ ప్రముఖులందరినో శ్రీహరి చేసిన ఇంటర్యూలు 'ది హిందూ' లో చదవగలిగాను. ఆ రంగాల మీద ఆయనకున్న పట్టు అర్ధమయ్యింది. తెలుగులో రాసిన వీక్లీ కాలమ్ 'హరివిల్లు' కొన్నిసార్లు ఆపకుండా చదివిస్తే, మరికొన్ని సార్లు మొదటిపేరా తర్వాత దృష్టి మరల్చేసేది. సినిమా నిర్మాణం లో లాగానే రివ్యూ రచనలోనూ ఒక్కసారిగా మార్పులు వచ్చి పడిపోవడం, నాణ్యత కన్నా వేగం ప్రధానం అయిపోవడంతో శ్రీహరి రివ్యూలు పత్రికల నుంచి మెల్లగా కనుమరుగయ్యాయి. యూట్యూబు చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు కానీ వాటిలో నేను చూసినవి తక్కువ.  కొత్తతరం రివ్యూయర్లు వెల్లువలా వచ్చారు, వాళ్ళలో శ్రీహరిలా సుదీర్ఘ కాలం అదే పని చేసే వాళ్ళూ, అంత పేరు తెచ్చుకోగలిగే వారూ ఎందరున్నారన్నది కోటి రూపాయల ప్రశ్న. తెలుగు సినిమా రివ్యూ మీద తనదైన ముద్ర వేసిన గుడిపూడి శ్రీహరికి నివాళి. 

2 కామెంట్‌లు:

  1. తెలుగు సినిమా సమీక్ష అనగానే నాకు గుర్తొచ్చేది ఈయనొక్కరే. ఆరోజుల్లో అడపాదడపా వేరే వాళ్ల రివ్యూలు చదివినా ఇప్పుడా పేర్లేవీ అసలు గుర్తే లేవు.


    వారికి నివాళి .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ, ఏళ్ళ తరబడి సమీక్షలు రాశారు మరి.. ధన్యవాదాలు..

      తొలగించండి