సోమవారం, సెప్టెంబర్ 30, 2019

సిమ్లా మిర్చి కూర

సిమ్లా మిర్చితో చేసే బజ్జీలు భలే రుచిగా ఉంటాయి. మామూలు మిరపకాయల్లో ఉండే కారం వాటిలో ఉండదు కదా, కమ్మని రుచితో మరిన్ని తినాలనిపిస్తాయి. కానయితే శనగపిండి, డీప్ ఫ్రై ఇవన్నీ చూడగానే డాక్టరు, లెక్చరు గుర్తొస్తాయి. తక్కువ పిండి, నూనెతో ఇంచుమించు బజ్జీ రుచితో ఉండే వంటకం ఒకటి ఆమధ్య ఒక చోట రుచి చూశాను. హోస్టుని అడిగి రెసిపీ జ్ఞాపకం పెట్టుకున్నాను. అవకాశం దొరకడంతో వండేశాను. ఆ వంటకం పేరే సిమ్లా మిర్చి కూర. మిర్చి బజ్జీకి కావాల్సిన దినుసులే. ఎటొచ్ఛీ మిరపకాయలు మినహా మిగిలినవన్నీ తక్కువ పరిమాణంలో సరిపోతాయి.  

మార్కెట్ నుంచి మిరపకాయలు ఎంచి తెచ్చుకోవడం (అన్నీ దాదాపు ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి) వరకూ బాగానే జరిగిపోయింది కానీ, అసలు కథ ఆ తర్వాతే మొదలయ్యింది. గుత్తి వంకాయ కూరకి వంకాయ ముచికలు సగానికి కోసినట్టుగా ఈ మిరపకాయలకి కూడా ముచికలు కొయ్యాలి. ఆ తర్వాత ఒక నిలువు చీలిక పెట్టి లోపలున్న గింజలన్నీ తీసేయాలి. వినేప్పుడు 'ఇదెంతపని' అనిపించింది కానీ, దిగాకే లోతు తెలిసింది. డాక్టర్లు సర్జరీ చేసినంత నేర్పుగా అనడం అతిశయోక్తిలా వినిపిస్తుందేమో కానీ, ఇంచుమించు అంత నేర్పూ అవసరం. 


మిర్చి విరిగిపోకండా, మొత్తంగా చీలిపోకుండా చూసుకుంటూనే, గింజలన్నీ బయటికి తెచ్చేయాలి. నేనైతే, మొత్తం నాట్లు పెట్టే పనయ్యాక, ఒక్కో మిర్చీకి షవర్ బాత్ చేయించాను. గింజల్ని వదుల్చుకున్న మిర్చీలన్నిటినీ ఓ చిల్లుల బుట్టలో వాడేసి, తర్వాత పనికి ఉపక్రమించాను. (ఈ స్టెప్పుని నేను సరిగ్గా వినకపోవడం వల్ల హోస్టు గారికి ఫోన్ చేసి మరోసారి కనుక్కోవాల్సి వచ్చింది, ఆవిడ పాపం ఓపిగ్గా మళ్ళీ చెప్పారు). ఇంతకీ ఇప్పుడు చేయాల్సిన పని స్టఫింగ్ రెడీ చేసుకోవడం. నేను చేసిన పధ్ధతి చెబుతున్నాను కానీ, ఇలా మాత్రమే చేయాలన్న రూలేమీ లేదు. ఈ స్టఫింగ్ రుచులలో ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు మార్పులు చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది (ఇది కూడా ఆవిడ మాటే). 

ముందుగా ఓ చిన్న కప్పులో చింతపండు తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాను. స్టవ్ మీద బాండీ వేడి చేసి, తగినంత శనగపిండిని దోరగా వేయించాను. నూనె అక్కర్లేదు, డ్రై రోస్టు సరిపోతుంది. వేగిన పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో వాము, ఉప్పు, కారం తగు పాళ్ళలో వేసి కలిపాను. (మొన్నామధ్య నేను చేసిన సాంబారు మా పనామెకి ఇస్తే, మర్నాడొచ్చి "ఉప్పెక్కువయ్యింది, అంతంత ఉప్పు తినడం ఒంటికి మంచిది కాదు" అని కుండ బద్దలు కొట్టేసింది. ఆమె 'సంసారం ఒక చదరంగం' లో చిలకమ్మలాగా మా  విషయాల్లో కొంచం చనువు తీసేసుకుంటూ ఉంటుంది, ఏమీ చేయలేం). ఈ మిశ్రమాన్ని చెంచాతో బాగా కలిపి పక్కన పెట్టాను. 

నానిన చింతపండు నుంచి రసం తీసి, ఆ రసాన్ని పిండిలో కలిపాను. మిశ్రమాన్ని గరిటజారుగా చేయడానికి కొంచం నీళ్లు కూడా కలిపి రుచి సరిచూసుకోవడంతో రెండో అంకం పూర్తయ్యింది. చివరి స్టెప్పు దగ్గరికి వస్తే, ఫ్లాట్ గా ఉన్న దోశల పెనం స్టవ్ మీద పెట్టి, వేడెక్కుతూ ఉండగా ఓ మూడు చెంచాల నూనె వేసి, ఆ నూనె పెనమంతా పరుచుకునేలా కదిపాను. స్టవ్ సిమ్ లో ఉంచి, ముందుగా సిద్ధం పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని (మాలతీ చందూర్ గారి 'ముందుగా తరిగిపెట్టుకున్న కూర ముక్క'ల్లాగా) ఒక్కో మిర్చి లోనూ కూరి - ఒక్కో మిర్చిలో ఒక్కో చిన్న చెంచాడు చొప్పున వేశా - పెనం మీద పరిచాను. ఇక మిగిలింది సూపర్వైజింగ్ పనే. 


అప్పుడప్పుడు మిర్చీలని కదుపుతూ,  అడుగువైపున వేగిన వాటిని తిరగేస్తూ, రెండు పక్కలా వేగినవాటిని పెనం మీంచి తీసేసి వేరే బౌల్ లోకి మారుస్తూ అరగంట గడిపితే ఎర్రెర్రని సిమ్లా మిర్చీ కూర నోరూరిస్తూ రెడీ అయిపోయింది. కాస్త నెయ్యి తగిల్చిన వేడన్నం ముద్దలు, మిర్చీ కాంబినేషన్ భలేగా కుదిరింది. మా హోస్టు ముద్దపప్పుతో వడ్డించారు కానీ, విడిగా అన్నంతో కూడా కూర బావుంది. ఉప్పుకారాల పాళ్ళు సరిపోయినట్టు అనిపించడంతో పనామెకి ఇచ్చే ధైర్యం చేశాం. చెప్పకపోడమేం, ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో అని గుండెలు బితుకు బితుకు మంటున్నాయి. 

10 కామెంట్‌లు:

  1. కారంగా లేని బజ్జి లు ఎలా తింటారండీ బాబు

    రిప్లయితొలగించండి
  2. నోరూరేలా రాశారు. ఫీడ్ బేక్ బ్రహ్మాండంగా వచ్చుండాలి.

    రిప్లయితొలగించండి
  3. @అజ్ఞాత: అలా అలవాటైపోయిందండీ మరి.. @ఉష: పేరు వేరు తప్ప ప్రాసెస్ ఒకటే అంటారు.. ధన్యవాదాలండీ. 

    రిప్లయితొలగించండి
  4. @ స్వాతి: తప్పక ప్రయత్నించండి. ధన్యవాదాలు. 
    @కొత్తావకాయ: "మీరు మిరపకాయ బజ్జీలు తినలేరు కాబట్టి ఇలా చేసుకున్నారా" ..ఇదండీ ఫీడ్ బ్యాక్.. ధన్యవాదాలు. 

    రిప్లయితొలగించండి
  5. ఏదైనా భోజనప్రియులు వంటచేసే విధానం వివరించేటప్పుడు వీక్షకుల నోళ్ళను ఊరించి ఇప్పుడే తినేయాలి అని అనుకునేట్టు చేస్తారు.

    రిప్లయితొలగించండి
  6. అంతా బానే ఉంది కానీ ఒక్కొక్క మిరపకాయని పెనం మీద రెండు వైపులా తిప్పి వేయించడం అంటే పెద్ద పనే. ప్రయత్నించి చూస్తాను.గింజలు ఉంచచ్చు ఏమోనండీ. పెద్ద కారం ఏం ఉండవుగా. కాకపోతే పెనం మీద కాల్చేటప్పుడు వేగుతాయో లేదో.

    రిప్లయితొలగించండి
  7. @శిశిర: అబ్బే, వన్ బై వన్ కాల్చక్కర్లేదండి, పెనం పట్టినన్ని మిర్చీలు ఒకేసారి పరిచి కాల్చేయొచ్చు. కాకపోతే, లో ఫ్లేమ్ లో చేయాలి కాబట్టి కొంచం టైం పడుతుంది. గింజలు కారం ఉండవు కానీ, చేదు ఉండే అవకాశం ఉంది. అదీ సమస్య. చీలిక పెట్టాక, ఒక్కో మిర్చీని టాప్ నీళ్ల కింద స్నానం చేయించి, వాడేయడం ద్వారా గింజల సమస్య అధిగమించొచ్చు అని నేను కనుక్కున్న సంగతి. అల్ ది బెస్ట్ మీ వంటకి :) ..ధన్యవాదాలు. 

    రిప్లయితొలగించండి