టైటిల్ కోసం హిట్ పాటల పల్లవులు అయిపోయాయి, ఇప్పుడిక అన్నమాచార్య
కీర్తనల వంతు కాబోలు అనుకున్నా 'జ్యో అచ్యుతానంద' టైటిల్ చూడగానే.
సినిమాకీ, టైటిల్ కీ పెద్దగా సంబంధం ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ, చక్కని
టైటిల్ కి వంద శాతం న్యాయం చేస్తూ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ రూపొందించిన
సినిమా ఓ సకుటుంబ కథా చిత్రం. మెలోడ్రామాని కాక, సెంటిమెంట్ ని ఇష్టపడే
వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఐదు
డ్యూయెట్లు మరియు ఒక ఐటెం సాంగ్ మాత్రమే అనుకునే వాళ్ళు ఈ సినిమా ఆడుతున్న
ధియేటర్ దరిదాపులకు వెళ్లకపోడమే మంచిది.
అన్నదమ్ముల కథ
అనగానే నాటి 'అన్నదమ్ముల అనుబంధం' నుంచి మొన్నటి 'సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు' వరకూ గుర్తు రావడం సహజం. కానైతే ఈ సినిమా ప్రత్యేకం.
కాసింత లాజిక్ మిస్సయినా ఇందులో కథ ఉంది. ఆ కథని మింగేసే స్టార్లు
లేకపోవడం, అన్నదమ్ములుగా నటించిన ఇద్దరూ 'నటులు' కావడం (స్టార్లు
కాకపోవడం), ఎక్కడా విసిగించని కథనంతో పాటుగా బూతు ఏమాత్రం లేని హాస్యం
ఉండడమే ఆ ప్రత్యేకత. జ్యోత్స్న(రెజీనా కసాండ్రా) అనే అమ్మాయిని ప్రేమించిన
అన్నదమ్ములు అచ్యుతరామారావు (నారా రోహిత్), ఆనందవర్ధనరావు (మూల్పూరి
నాగశౌర్య)ల కథ ఇది. చాలా సిన్సియర్ గా జ్యోత్స్నని ప్రేమించేసిన
అన్నదమ్ములిద్దరూ, ఆమెకోసం ఒకరి కాలర్ ఒకరు పట్టుకునే స్టేజికి వచ్చేశాక,
వీళ్ళిద్దరినీ కాదని, ఆమె పై చదువులకోసం విదేశాలకి వెళ్ళిపోతుంది.
అన్నదమ్ములిద్దరూ
పెళ్లిళ్లు చేసుకుని జీవితాల్లో స్థిరపడే నాటికి జ్యోత్స్న మళ్ళీ
ఊడిపడుతుంది. ఒకప్పుడు వీళ్ళ ప్రేమని తిరస్కరించిన ఆమె, ఇప్పుడు
వాళ్ళిద్దరికీ కూడా ప్రపోజ్ చేస్తుంది. ఆమె ఎందుకలా చేసింది అన్న ప్రశ్నకి
జవాబుతో పాటు, అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఏం చేశారు అన్నది సినిమాకి
ముగింపు. కథ కన్నా కూడా కథనం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు దర్శకుడు. ఫలితంగా
సినిమా చాలా హాయిగా సాగిపోయింది. మొదటిసగం మొత్తం నవ్వుల్లో ముంచి
తేలిస్తే, రెండో సగంలో హాస్యంతో సెంటిమెంట్ పోటీపడింది. నవ్వినా ఏడ్చినా
కన్నీళ్లే వస్తాయని అప్పుడెప్పుడో ఆత్రేయ చెప్పిన మాటని నిజం చేసి
చూపించాడు అవసరాల శ్రీనివాస్.
రోహిత్,
నాగశౌర్య అన్నదమ్ములు అని వినగానే 'బాబాయ్ అబ్బాయ్ లా ఉంటారేమో' అని
అనుమానించాను కానీ, చూస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది కలగలేదు. కానైతే,
రోహిత్ ఫిజిక్ మీద శ్రద్ధ పెట్టడం అత్యవసరం. లేని పక్షంలో కేరక్టర్
ఆర్టిస్ట్ గా ప్రమోషన్ కొట్టేసే అవకాశాలు మరీ పెరిగిపోయాయి. అన్నదమ్ములుగా
వీళ్ళిద్దరూ అతికినట్టుగా సరిపోయారు. సిగరెట్ షేర్ చేసుకోడం మొదలు, అమ్మాయి
కోసం కొట్టుకోడం వరకూ ఎక్కడా అతి అనిపించలేదు. అలాగే, వాళ్ళ
వ్యక్తిత్వాల్లో వైరుధ్యాలని డైలాగులు అవసరం లేకుండా ప్రదర్శించి
మెప్పించారు. మొదటి సగంలో రెజీనా నటనకి వంక పెట్టడానికి లేదు కానీ, రెండో
సగంలో అక్కడక్కడా అతి అనిపించింది. ఆమె పాత్ర కూడా కొంతమేర నేలవిడిచి సాము
చేసింది. హీరోల తల్లిగా సీత, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ళ భరణి కనిపించారు.
ఇంటివాళ్లతో అంత పెద్ద మాట పట్టింపు వచ్చినా భరణి ఏళ్లతరబడి ఇల్లెందుకు ఖాళీ చేయలేదన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. హీరోల భార్యలకీ, రెజీనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ సృష్టించే అవకాశం ఉన్నా దర్శకుడు ఎందుకో ఆ జోలికి వెళ్ళలేదు. కొడుకు పుట్టినరోజుకి తండ్రి ఓ తెలుగు నవలని కానుకగా ఇవ్వడంతో పాటు, ఆ నవల చుట్టూ కొన్ని సన్నివేశాలు అల్లడం ఈతరం దర్శకులు ఎవ్వరూ ఇప్పటివరకూ చేయని ప్రయత్నం. నా వరకూ చాలా బాగా నచ్చేసిన సీక్వెన్సు ఇది. మరోసారి పేరు మార్చుకున్న సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ పనిమీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదనిపించింది. ముఖ్యంగా రెండోసగంలో సన్నివేశాలకి, సంగీతానికీ పొత్తు కుదరని ఫీలింగ్. పాటలు, నేపధ్య సంగీతం గుర్తుండిపోయే విధంగా ఉంటే సినిమా మరో మెట్టు పైకెక్కి ఉండేది.
ఇంటివాళ్లతో అంత పెద్ద మాట పట్టింపు వచ్చినా భరణి ఏళ్లతరబడి ఇల్లెందుకు ఖాళీ చేయలేదన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. హీరోల భార్యలకీ, రెజీనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ సృష్టించే అవకాశం ఉన్నా దర్శకుడు ఎందుకో ఆ జోలికి వెళ్ళలేదు. కొడుకు పుట్టినరోజుకి తండ్రి ఓ తెలుగు నవలని కానుకగా ఇవ్వడంతో పాటు, ఆ నవల చుట్టూ కొన్ని సన్నివేశాలు అల్లడం ఈతరం దర్శకులు ఎవ్వరూ ఇప్పటివరకూ చేయని ప్రయత్నం. నా వరకూ చాలా బాగా నచ్చేసిన సీక్వెన్సు ఇది. మరోసారి పేరు మార్చుకున్న సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ పనిమీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదనిపించింది. ముఖ్యంగా రెండోసగంలో సన్నివేశాలకి, సంగీతానికీ పొత్తు కుదరని ఫీలింగ్. పాటలు, నేపధ్య సంగీతం గుర్తుండిపోయే విధంగా ఉంటే సినిమా మరో మెట్టు పైకెక్కి ఉండేది.
ఈ
మధ్యకాలంలో చిన్న బడ్జెట్లో చక్కని సినిమాలు నిర్మిస్తున్న 'వారాహి' సంస్థ
అందించిన సినిమా ఇది. ఇప్పటివరకూ నటుడిగా హాస్యాన్ని, విలనీని
ప్రదర్శించిన అవసరాల శ్రీనివాస్ తనలో దర్శకుణ్ణి పూర్తిగా
ఆవిష్కరించుకున్నాడని చెప్పాలి. పంచ్ ల కోసం పాకులాడకుండా, సందేశాలివ్వాలని
ఆయాస పడిపోకుండా అవసరాల రాసుకున్న సంభాషణలు సన్నివేశాలని అలవోకగా
నడిపించేయడమే కాక, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. రెండోసగంలో ఫైటింగ్
సీన్ చాలా కృతకంగా అనిపించింది.మొదటిసగం మీద పెట్టిన శ్రద్ధ రెండోసగం లోని
ఓ ఇరవై నిమిషాల మీద పెట్టి ఉంటే వంక పెట్టడానికి వీల్లేని సినిమా వచ్చి
ఉండేది కదా అనిపించింది. అయితే, దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మీద అంచనాలని
'జ్యో అచ్యుతానంద' బాగా పెంచేసిందని చెప్పక తప్పదు.
చక్కటి రివ్యూ మురళి గారు. నన్ను అడిగితే మాత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం అంటాను, ఎందుకంటే ఇది "తెలుగు" చిత్రం కాబట్టి. "సంతోషంగా ఎటూ లేరూ కనీసం సుఖంగా అయినా ఉండండి చాలు" అన్న ఒక్క వాక్యం చాలు అవసరాలకి భాష మీద ఉన్న మక్కువ, పట్టు, గౌరవం తెలియచెప్పటానికి. అర్థంలేని ప్రాసలూ, వెకిలి చేష్టల హాస్యం ఇవేవీ లేకుండా మనింటి పక్కన జరిగిన కథలాగ ఎంత హాయిగా ఉందో. మధ్యతరగతి అబ్బాయిల్లాగా, మధ్యతర్గతి మగవాళ్ళలాగ ఎంత చక్కగా ఇమిడిపోయారో శౌర్య, రోహిత్ కూడా. సువర్ణ పాట, రెజినా నటన రెండూ మాత్రం పంటి కింద రాళ్ళే. ఐనా కూడా తెలుగుని ప్రేమించేవాళ్ళు మాత్రం చూడాల్సిన చిత్రమే.
రిప్లయితొలగించండిCinema bagundi second half starting lo konchem illogical scenes vachina kuda avasarala adhbutanga punjukunnadu. oka manchi cinema chusanu. avasarala oohalu gusagusalade taruvatha malli oka manchi cinema andincharu
రిప్లయితొలగించండిపెంపకం సరిగ్గా లేదు కాబట్టి పంపకం అయిన సరిగ్గా ఉండాలని, ఎనిమిది రూపాయలకే ఇన్ని ఇస్తున్నాడంటే గొప్పే కదరా లాంటి సంభాషణలు, ఆఖర్న నాన్న స్థానంలోకి రాడానికి నువ్వు చేసిన ప్రయత్నం అని చెప్పే డైలాగులూ,సనివేసాలు ఈ సినిమాని నిలబెట్టేసాయండి.తెలుగు సినిమాకి అవసరాల అవసరం చాలానే ఉంది
రిప్లయితొలగించండిచక్కటి సమీక్ష. అయితే సినిమా చూడాల్సిందే.
రిప్లయితొలగించండి@లక్ష్మి: మొదటి సగంలో పర్లేదు కానీ, రెండో సగంలో కొన్నిచోట్ల రెజీనా పరీక్షించిందండీ.. సువర్ణ పాట పిక్చరైజేషన్ నచ్చింది నాకు.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@అశోక్: అవునండీ.. ధన్యవాదాలు
@శ్రీనివాస్ పప్పు: ఒప్పుకుంటానండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@సీబీరావు: ధన్యవాదాలండీ..