మధురాంతకం నరేంద్ర పేరు చెప్పగానే 'కుంభమేళా' 'రెండేళ్ళ పద్నాలుగు' లాంటి కథా సంకలనాలు, 'భూచక్రం,' 'అమెస్టర్
డాంలో అద్భుతం' లాంటి నవలలూ గుర్తొస్తాయి. మూడున్నర దశాబ్దాలుగా తన
ప్రవృత్తి అయిన తెలుగు సాహిత్య వ్యాసంగాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న ఈ
ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు వెలువరించిన తాజా కథా సంకలనం 'వెదురుపువ్వు
మరికొన్ని కథలు.' మొత్తం పదహారు కథలున్న ఈ సంకలనంలో మొదటి రెండూ 1985 లో
ప్రచురితమైనవి కాగా, మిగిలిన పద్నాలుగు కథలూ గడిచిన పుష్కర కాలంలో తెలుగు
వారపత్రికల్లోనూ, దినపత్రికల ఆదివారం అనుబంధాల్లోనూ అచ్చయినవి.
'వెదురుపువ్వు'
సంకలనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో
కనిపిస్తున్న అన్ని ధోరణులకి చెందిన - ఫెమినిజం మొదలు పోస్ట్-మోడర్నిజం
వరకూ - కథలూ ఈ సంకలనంలో కనిపిస్తాయి. వీటన్నింటితో పాటుగా, తాత్విక చింతనా,
కళాత్మక అభివ్యక్తీ ప్రతికథలోనూ దర్శనం ఇస్తాయి. సంకలనంలో తొలికథ
'మళ్ళీయెప్పుడో.. యెక్కడో..' మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఉనికిలోకి రాని
కాలంలో (అసలలాంటి కాలం ఒకటి ఉందా అని ఇప్పటి తరం ఆశ్చర్యపోతుంది బహుశా)
పెళ్లి తర్వాత విడిపోయి, మళ్ళీ కలుసుకునే అవకాశాన్ని ఎప్పుడో తప్ప
దక్కించుకోలేని 'గడిచిన తరం' స్త్రీల కథ. ముప్ఫయ్యేళ్ళ నాటి తిరుపతిని
కళ్ళకి కట్టేస్తారు రచయిత.
రెండో కథ 'అమ్మ అంటే ఏమిటి
మమ్మీ?' అప్పట్లో బాగా విస్తరించడం మొదలుపెట్టిన ప్రైవేటు రెసిడెన్షియల్
స్కూళ్ళ పనితీరు మీద ఓ వ్యంగ్యోక్తి. శీర్షిక చూడగానే అర్ధమయిపోయే కథని,
ఒక్క అక్షరం కూడా విడవకుండా చదివించేది కథనమే. నరేంద్ర 2003 లో రాసిన కథ
'రాంషా గారింట్లో రాణి.' తొలిప్రచురణ అప్పుడు చదివినా, ఇప్పుడు మళ్ళీ చదివి
అప్పటి ఆలోచనలని జ్ఞాపకం చేసుకోడం బాగుంది. ప్రైవేటు కాలేజీలతో పోటీ పడలేక
మూతపడిపోయే స్థితికి చేరుకున్న ఎయిడెడ్ కాలేజీల స్థితిని ఇతివృత్తంగా
తీసుకుని రాసిన 'రేపటి చరిత్ర' కథ చరిత్ర మీద ఆసక్తి ఉన్న వాళ్లకి మరీ మరీ
నచ్చుతుంది. కథలో రచయిత పెట్టిన క్విజ్ కి ముందుమాటలో జవాబిచ్చేశారు కేతు
విశ్వనాథ రెడ్డి!!
ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందీ, ఇక మీదట
ఎప్పుడు నరేంద్రని తల్చుకున్నా మొదట గుర్తొచ్చేదీ 'సద్గతి' కథ. పదిహేడు
పేజీల ఈ కథ అక్షరాలా ఊపిరి బిగపట్టి..మునివేళ్ళ మీద నిలబెట్టి
చదివిస్తుంది. మృత్యువు నేపధ్యంగా సాగే కథ అవ్వడం వల్ల మరీ మరీ నచ్చేసింది
నాకు. ఈ కథ చదివాక 'మృత్యువు సమవర్తి' అన్న మాట ఎక్కడ వినిపించినా
అప్రయత్నంగానే ఓ నవ్వు వచ్చేస్తుంది. ఎక్కడా రచయిత కనిపించకుండా, పాత్రలు
మాత్రమే కనిపించడం, బిగువైన అల్లిక, ఊహాతీతమైన ముగింపు కారణంగా ఓ గొప్ప
కథని చదివిన అనుభూతిని పాఠకులకి కలిగిస్తుంది. శీర్షికలో వ్యంగ్యోక్తి
అర్ధం కావాలంటే కథని పూర్తిగా చదవాల్సిందే. ఇదే ఇతివృత్తాన్ని మరో నేపధ్యం
నుంచి రాసిన కథ 'వొక మైనారిటీ కథ.' జీవిత సత్యాలని ఇంత సులువుగా చెప్పొచ్చా
అనిపిస్తుందీ కథ ముగించాక.
కార్పొరేట్ చదువుల కారణంగా
పిల్లలకన్నా తల్లిదండ్రులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారన్నది నిజం. ఈ
నిజానికి కథా రూపం ఇస్తే అదే 'యుద్ధకాండ.' ఉలికిపాటుకి గురిచేసే ముగింపు ఈ
కథని ఓ పట్టాన మర్చిపోనివ్వదు. ఇలాంటిదే మరో కథ 'గాలిపాట.' ఇక,
'రెండురాగాలు ఒకపాట,' 'నేను మొలకెత్తిన నేల' ఈ రెండూ రచయిత డైరీలో పేజీల్లా
అనిపిస్తాయి. 'వెదురుపువ్వు' కథ చదివిన ప్రతిసారీ ఒక్కోలా అర్ధమయ్యే కథ,
పాఠకుల మనఃస్థితిని అనుసరించి. 'చతుర్భుజం' కథ చదువుతున్నంత సేపూ
బుచ్చిబాబు 'నిరంతర త్రయం' గుర్తొస్తూనే ఉంది. కథనంతో కట్టిపడేసే మరో కథ
'పరమపద సోపానం.' వ్యంగ్య రస ప్రధానంగా సాగే స్త్రీవాద కథ 'చిటికెడు
చక్కెర' కాగా సంపద వెంట పరుగులని చిత్రించే కథ 'పచ్చల శంఖం-యేనుగు పగడం.'
సంపుటంలో
చివరిదైన 'చివరి ఇల్లు' కథ గతేడాది 'కథ' సంకలంలో చోటు చేసుకుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలకి దూరంగా ఒంటరి జీవితం గడిపిన వృద్ధ జంట కథ.
వాళ్ళ పిల్లలు దూరాన ఉంటే, ఆ ఇంట్లో పనికి కుదిరి ఆ జంటకి పదిహేనేళ్ళ పాటు
సేవలు చేసిన అమ్మాయి దృష్టి కోణం నుంచి వినిపించే కథ. గడిచిన నాలుగైదు
దశాబ్దాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులని ప్రస్తావించిన కథ. ఏ కథలోనూ
రచయిత ప్రవేశించక పోవడం, భావజాలాల చట్రాల్లో కథల్ని ఇరికించే ప్రయత్నం
చేయకపోవడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. మళ్ళీ మళ్ళీ చదివించే, ఓ
పట్టాన మర్చిపోనివ్వని కథలున్న 'వెదురుపువ్వు' కథా సాహిత్యాన్ని ఇష్టపడే
వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 206, వెల
రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి