నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి కృష్ణ చంద్ర, గంగాజలి దంపతులకి
ఇద్దరు కూతుళ్ళు సుమన్, శాంత. తండ్రిది ఉన్నతోద్యోగం కావడంతో చాలా గారాబంగా
పెరిగి పెద్దయ్యారు ఇద్దరూ. చూస్తుండగానే సుమన్ కి పెళ్లీడు వచ్చేసింది.
నెలజీతం తప్ప, కృష్ణచంద్రకి పై సంపాదన అలవాటు లేకపోవడంతో వెనకేసింది ఏమీ
లేదు. సుమన్ అందచందాలు చూసి వరుళ్ళు క్యూ కడతారనుకున్న కృష్ణచంద్రకి వాస్తవ
పరిస్థితి అర్ధం కాడానికి ఎన్నాళ్ళో పట్టలేదు. అక్రమ మార్గంలో సంపాదిస్తే
తప్ప కూతుళ్లిద్దరికీ పెళ్లి చేసి పంపడం అసాధ్యమని తేలిపోవడంతో
అక్రమార్జనకి మానసికంగా సిద్ధ పడతాడు. డబ్బు వస్తుందన్న భరోసాతో సుమన్ కి
సంబంధం సిద్ధం చేసి ఉంచుతాడు.
కృష్ణచంద్ర తలచినట్టుగానే
డబ్బు వచ్చింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో, అతను లంచం
తీసుకున్న విషయం పై అధికారులకి ఫిర్యాదు వెళ్ళడంతో పెళ్లి ముహూర్తానికి
ముందే కృష్ణచంద్ర అరెస్టు అవుతాడు. సుమన్ పెళ్లి ఆగిపోతుంది. వచ్చిన డబ్బు
కోర్టు కేసుకి ఖర్చైపోయాక అతనికి జైలు శిక్ష పడుతుంది. గంగాజలి తన
పిల్లలిద్దరితో అన్న ఉమానాథ్ ఇంటికి చేరుతుంది. అంతంతమాత్రం సంసారి అయిన
ఉమానాథ్ చెల్లెలిమీద ప్రేమతో ఆ కుటుంబం బాధ్యత తీసుకునేందుకు సిద్ధ పడతాడు.
ఓ చిరుద్యోగి గజాధర్ తో సుమన్ పెళ్లి జరిపిస్తాడు. ఒక్కసారిగా తన
జీవితం తల్లకిందులైపోవడం తట్టుకోలేకపోతుంది సుమన్. అప్పటివరకూ విశాలమైన
భవంతిలో విలాసంగా జీవించిన సుమన్ ఓ మురికి వాడలో చిన్న ఇంటిలో
సర్దుకోడానికి చాలా కష్ట పడుతుంది. భర్త సంపాదనతో నెల గడపడం కష్టమవుతూ
ఉంటుంది. ఎదురింట్లో నివాసం ఉండే వేశ్య భోలీ బాయి తోనూ, ప్లీడరు పద్మసింహ
భార్య సుభద్రతోనూ స్నేహం కుదురుతుంది సుమన్ కి. ఇద్దరిలోనూ భోలీబాయి ఆమెని
ఎంతగానో ఆకర్షిస్తుంది. ఊళ్ళో గౌరవనీయులంతా భోలీ ఇంటికి రావడం, ఆమె పాటని
ప్రశంసించడం, ప్రాపకం కోసం పాకులాడడం ఇవన్నీ ఆశ్చర్య పరుస్తాయి సుమన్ ని.
హోలీ
పండుగ సందర్భంగా పద్మసింహ తన ఇంట్లో భోలీ బాయి కచేరీ ఏర్పాటు చేయడంతో,
తప్పక రమ్మని సుమన్ ని ఆహ్వానిస్తుంది సుభద్ర. గజాధర్ కి మాటమాత్రమైనా
చెప్పకుండా ఆ వేడుకకి హాజరవుతుంది సుమన్. వేడుక పూర్తయేసరికి అర్ధరాత్రి
అవుతుంది. సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చిన గజాధర్ కి సుమన్ ఏమయ్యిందో
అర్ధం కాదు. అసహనం కాస్తా అనుమానంగా మారుతుంది. సరిగ్గా అప్పుడే ఇంటికి
తిరిగి వచ్చిన సుమన్ ని ఇంట్లోకి రానివ్వనంటాడు. సుమన్ కూడా పట్టుదలకి పోయి
సుభద్ర ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చిన సమస్య కారణంగా ఏం చెయ్యాలో
తెలియని స్థితిలో ఉన్న సుమన్ ని భోలీ బాయి ఆదరిస్తుంది.
సుమన్ సమస్యలన్నీ తీరిపోవాలంటే
ఆమె సుమన్ బాయి గా మారిపోవడం ఒక్కటే పరిష్కారం అని చెబుతుంది భోలీ. అంతే
కాదు, రూపలావణ్యాలున్న సుమన్ కి ఆటా పాటా నేర్పేందుకు సిద్ధ పడుతుంది. ఓ
పక్క గజాధర్, మరో పక్క పద్మసింహ సుమన్ కోసం వెతుకుతూ ఉండగానే ఆమె దాల్ మండీ
లో సుమన్ బాయిగా అవతరిస్తుంది. గజాధర్ నగరంనుంచి మాయమైపోతాడు. సుమన్
జీవితం అలా మారడానికి తనే కారణం అన్న చింత పద్మసింహని నిలువనివ్వదు.
ఫలితంగా, నగరంలో ఉన్న వేశ్యలందరినీ సంస్కరించే కార్యక్రమానికి నడుం
బిగిస్తాడు. ముందుగా దాల్ మండీ ఖాళీ చేయించి వాళ్ళందరినీ నగర శివార్లకి
తరలించడం మొదటి కార్యక్రమం. ఆ తర్వాత వాళ్లకి కొత్త జీవితం
ప్రారంభించడానికి అవసరమయ్యే కృషి చేయాలన్నది ఆలోచన.
పద్మసింహ
ప్రయత్నాలు సాగుతూ ఉండగానే, అతని ఇంట చదువుకోడానికి వచ్చిన అన్న కొడుకు
సదన్ సింహ సుమన్ తో పీకలోతు ప్రేమలో మునిగిపోతాడు. సదన్, పద్మసింహ బంధువని
పసిగట్టిన సుమన్ అతన్ని దూరంగానే ఉంచుతుంది. పద్మసింహ ప్రయత్నాలు ఫలించాయా?
సుమన్ చేసిన పని ఆ కుటుంబంమీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? గజాధర్
ఏమయ్యాడు? తన జీవితానికి సంబంధించి సుమన్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఈ
ప్రశ్నలకి జవాబు ప్రేమ్ చంద్ రాసిన నవల 'సేవాసదన్.' గంగా నదిని కథలో ఓ
పాత్రగా మలిచిన రచయిత చాతుర్యం పాఠకులని ఆశ్చర్య పరుస్తుంది. కుటుంబ
బంధాలు, సంఘ మర్యాదలు, సాంఘిక విలువలు, నైతికతకి సంబంధించి లోతైన చర్చ
చేశారీ నవలలో. పోలు శేషగిరి రావు తెలుగు అనువాదం సరళంగా ఉంది. (సాహితి
ప్రచురణ, పేజీలు 280, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
రిప్లయితొలగించండిసస్పెన్స్ ని సరియైనచ చోట సరిగ్గా కనిబెట్టి కథ ని ఆపి , చదవడానికి ప్రోత్సాహకరం గా చేసేసారు ! సెహ భేష్ !
ప్రేమ చందుని కలమున ప్రేరణగొని
వచ్చె సేవా సదనముగ ! వారు కథల
రేడు ! సముచిత పరిచయ రేఖ నిచట
నెమలి కన్నువారి చలువ నెమ్మిరిగన !
చీర్స్
జిలేబి
@జిలేబీ: అలా కుదిరిందండీ.. ప్రేమ్ చంద్ కి జైహో.. మీకు ధన్యవాదాలు!!
రిప్లయితొలగించండి