(మొదటి భాగం తర్వాత)
వసుధ చెప్పిన కథ:
"ఏ ముహూర్తాన మీ నాన్న వసుధ అని పేరు పెట్టారో కానీ, నిజంగానే భూదేవికున్నంత ఓర్పే తల్లీనీకు.." అమ్మ ఉన్నన్నాళ్ళూ ఈమాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. నాతో అనడమే కాదు, అందరితోనూ ఇదే మాట చెబుతూ ఉండేది. ఏమాటకామాట, తనకి సహనం బాగా తక్కువ. నాన్న సర్దుకుపోయేవారు.. అలాగే నేనూను. అక్కకి మాత్రం అమ్మ పోలికే. అందుకేనేమో, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఎందుకో అందుకు గొడవ పడుతూనే ఉండేవారు.
అమ్మ వల్ల కొంత, మొదట్లో తరచూ బావగారితో గొడవలు పడి
పుట్టింటికి వచ్చేసే అక్కని చూశాక మరికొంత, భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో
నాకంటూ కొన్ని ఆలోచనలు స్థిరపడ్డాయి నా పెళ్లి నాటికే. నన్ను కట్టుకున్న
వాడికి పిల్లిని పులిగా మార్చే ప్రతిభ పుష్కలంగా ఉందని తెలుసుకోడానికి
ఎక్కువ సమయం పట్టలేదు.
అక్క కాపురం ఓ కొలిక్కి వచ్చిందని ఊపిరి
పీల్చుకుంటున్న అమ్మా నాన్నలకి నా విషయాలు చెప్పి బాధ పెట్టదలచుకోలేదు.
అదీకాక, అప్పటికే వాళ్ళిద్దరి ఆరోగ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అక్కతో
నా సంగతులు పంచుకోవడం ఇష్టంగా అనిపించేదికాదు.
వసంత్ తో నా పెళ్లి
నిశ్చయమయినప్పుడు "ఇద్దరి పేర్లూ భలేగా కలిశాయే.." అన్నారు నా
స్నేహితురాళ్ళు. పైకి చెప్పకపోయినా మనసులో నేనూ అదే మాట అనుకున్నాను.
కాపురం సజావుగా సాగడానికి పేర్లొక్కటీ కలిస్తే చాలదని తెలీదుకదా అప్పట్లో.
నన్ను భార్యగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడని వాడితో ఎనిమిదేళ్ళు
కాపురం చేశాను.
చదువు లేక కాదు.. ఆర్ధిక స్వతంత్రం లేక అంతకన్నా కాదు..
కాపురాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదల, అమ్మానాన్నలని బాధ పెట్టకూడదన్న
ఆలోచన, నా ఇంటి విషయాలు నాలుగ్గోడలు దాటి బయటికి వెళ్ళకూడదన్న తపన.. ఇవన్నీ
నన్ను వసంత్ తో కలిసి ఉండేలా చేశాయి.
ఇప్పుడు వెనక్కి తిరిగి
చూసుకున్నప్పుడు కూడా అన్నేళ్ళు వసంత్ ని భరించినందుకు నాకెలాంటి
పశ్చాత్తాపమూ కలగదు. ఇప్పుడు జరగాల్సిన విడాకులు కూడా వీలైనంత ప్రశాంతంగా
జరిగిపోవాలని నా కోరిక. అందుకే, వసంత్ పెట్టే కండిషన్స్ ని
వ్యతిరేకించడంలేదు నేను. అక్క, నా లాయర్ ఫ్రెండ్ శాంతి ఇద్దరూ కూడా నన్ను
కేకలేస్తున్నారు - స్త్రీగా నా హక్కులని నేను వినియోగించుకోవడం లేదని.
కానీ, నా దృష్టిలో ఈ కర్మకాండ హక్కులకి సంబంధించింది కాదు.
పెళ్ళయ్యి ఏడాది
తిరక్కుండానే తొలిచూలు. పుట్టింటికి పంపడానికి ససేమిరా అన్నాడు వసంత్.
అమ్మకీ, నాన్నకీ నేనే సర్ది చెప్పుకున్నాను. ఏమనుకున్నారో తెలీదు కానీ,
డాక్టర్ ఇచ్చిన డేట్ నాటికి వాళ్ళే నా దగ్గరికి వస్తామని చెప్పారు. నెల
ముందుగానే ప్రిమెచ్యూర్ డెలివరీ. పురిట్లోనే మగబిడ్డని పోగొట్టుకున్న
దుఃఖం. అంతకు మించి, ఆ సమయంలో వసంత్ ప్రవర్తన నన్నెంత కుంగదీసిందో
చెప్పలేను. అతని ధోరణిని సరిపెట్టుకోడానికి ఎప్పటికప్పుడు నాతో నేను పెద్ద
యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది.
కొంత కాలానికి, ఉన్నట్టుండి నాన్న
కన్నుమూశారు. అమ్మకన్నా, అక్క కన్నా నాకు నాన్నే దగ్గర. ఎప్పుడూ గంటల తరబడి
ఆయనతో మాట్లాడింది లేదు. కానీ, ఆయన నా చేతిని తన చేతిలోకి తీసుకున్నా, నా
భుజం మీద చేయి వేసినా నాతో మాట్లాడుతున్నట్టూ, ధైర్యం ఇస్తున్నట్టూ ఉండేది.
అలాంటిది ఆయన దూరమయ్యేసరికి ఏకాకిని అయిపోయిన భావన.
నిజానికి వసంత్ కీ
నాకూ మానసికమైన దగ్గరతనం ఏనాడూ లేదు. కానీ, ఆ సమయంలో వసంత్ తో కూడా దూరం
పెరుతోన్నట్టు అనిపించింది. చెప్పలేనంత నిస్సత్తువ. అభద్రత తాలూకు
నిస్సత్తువ. వసంత్ తో కలిసి మిగిలిన జీవితం గడపాలంటే మా ఇద్దరి మధ్యా ఓ
బంధం ఉండాలనిపించింది. బిడ్డని కనడం కోసం సిన్సియర్ గా ప్రయత్నాలు మొదలు
పెట్టాను.
ఈసారి ఆరో నెల వస్తూనే అమ్మని నా దగ్గరికి తీసుకొచ్చేశాను, వసంత్
అయిష్టాన్ని పట్టించుకోకుండా. తనూ ఊరుకోలేదు, తనేమిటో అమ్మకి చూపించాడు. ఆడపిల్ల పుట్టేనాటికి నా కాపురం తాలూకు నిజ రూపం అమ్మకి పూర్తిగా
అర్ధమయ్యింది. వసంత్ ఇష్టానికి విరుద్ధంగా అమ్మని తీసుకురావడాన్ని నా విజయం
అనుకున్నట్టున్నాను, పాపకి విద్య అని పేరు పెడదాం అన్నాను. చిన్నప్పటి
నుంచీ ఆ పేరంటే నాకు చాలా ఇష్టం.
"బీ టెక్ సెకండియర్లో నేను లాడ్జికి
తీసుకెళ్ళిన గర్ల్ ఫ్రెండ్ పేరు విద్య.. నా కూతురికి ఆ పేరెలా పెడతాను
చెప్పు?" అని నవ్వుతూ అడిగి, "పాప పుట్టగానే పేరు పెట్టేశాను.. నవ్య"
అన్నాడు, నా జవాబు కోసం చూడకుండా.
అక్కకి యాక్సిడెంట్ అయిందని ఫోన్
రావడంతో, అమ్మని నేనే బలవంతంగా అక్క దగ్గరికి పంపాను, పిల్లలతో
బావగారొక్కరూ ఇబ్బంది పడతారని. రోజులు గడిచే కొద్దీ వసంత్ ని భరించడం నా
శక్తికి మించిన పని అయిపోయేది. పంటి బిగువున రోజులు లాక్కొచ్చేదాన్ని.
ఎందుకో అందుకు నన్ను కవ్వించి, కయ్యానికి కాలు దువ్వాలని ప్రతి పూటా
ప్రయత్నాలు చేసేవాడు. ఇల్లు, ఆఫీసు, పిల్ల.. ఈ మూడింటి తర్వాత ఇక నాకు
శక్తి మిగిలేది కాదు.
తనని కూర్చోబెట్టి మాట్లాడడానికి ఎన్నో ప్రయత్నాలు
చేశాను. నేను చెప్పేదంతా శ్రద్ధగా వినేవాడు. మర్నాటి నుంచీ నా మాటల్ని
వ్యంగ్యంగా గుర్తు చేసేవాడు. తెగేదాకా లాగుతున్నాడనీ, తనకి కావాల్సింది
తెగడమేననీ అర్ధమయిపోయింది.
ఉన్నట్టుండి అక్క దగ్గర నుంచీ ఫోన్. ఉరుము లేని
పిడుగులాంటి వార్త. అమ్మ ఇక లేదని అర్ధం అవ్వడానికి కొంత సమయం పట్టింది
నాకు. కార్యక్రమాలన్నీ అయ్యాక అక్క నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని చాలాసేపు
మాట్లాడింది. చివర్రోజుల్లో అమ్మ నాకోసమే బెంగ పెట్టుకుందిట. తను
ప్రత్యక్షంగా చూసిన సంగతులన్నీ అక్కకి పూస గుచ్చినట్టు చెప్పింది అమ్మ.
"అమ్మానాన్నా లేరని అధైర్య పడకు వసుధా.. నీకు నేనున్నాను.. నువ్వు ఏ
నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తాను" అని మరీ మరీ చెప్పి పంపింది అక్క.
అక్కడినుంచి వచ్చిన కొద్ది రోజులకే నేను నిర్ణయం తీసేసుకోవాల్సి వచ్చింది.
అక్క తనిచ్చిన మాట తప్పలేదు. లీగల్ సపోర్ట్ కోసం నా ఫ్రెండ్ శాంతిని
కలిశాను. గోపాల్ ని మొదటిసారిగా చూసింది అక్కడే. ఒక మగవాడు డైవోర్స్ కేసు
ఫైల్ చేయడానికి లేడీ లాయర్ ని ఎంచుకోడం, అందుకు మా శాంతి ఒప్పుకోవడం కొంచం
ఆశ్చర్యం అనిపించినా, శాంతితో ఆ విషయం మాట్లాడే సందర్భం కాదది. వసంత్ అనే
పెద్ద చిక్కు లోనుంచి బయట పడాలి ముందు.
శాంతి అసిస్టెంట్ చేసిన పొరపాటు
వల్ల గోపాల్ ఫైల్ ని ఇంటికి తెచ్చుకున్నాను ఒకరోజు. చదవడం మొదలు పెట్టగానే
తెలిసిపోయింది, అది నా కేసుకి సంబంధించింది కాదని. కానీ, ఆసక్తిగా
అనిపించడంతో తప్పని తెలిసీ పూర్తిగా చదివేశాను. నాన్ననీ, బావగారినీ చూసిన
నేను కేవలం వసంత్ కారణంగా మగవాళ్ళ మీద నమ్మకం కోల్పోయాను అని చెప్పను.
కానీ, గోపాల్ కేసు చదివాక అతని లాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్న ఆశ్చర్యం
కలిగింది.
మర్నాడు శాంతి ఆఫీసులో తెలిసింది, మా ఇద్దరి ఫైల్స్ తారుమారు
అయ్యాయని. అంటే, నా కేసు మొత్తం అతనికి తెలుసన్నమాట. నాకన్నా అతనే ఎక్కువ
ఇబ్బంది పడ్డాడు. నేనే పలకరించి మాట్లాడాను, మామూలు విషయాలు. తర్వాత
ఉండబట్టలేక శాంతిని అడిగేశాను గోపాల్ విషయం. తను మరికొన్ని వివరాలు
చెప్పింది. గోపాల్, నేనూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని అర్ధమయ్యింది.
గోపాల్ కి సిద్దూ కావాలి, కానీ పొందలేడు. వసంత్ కి నవ్య అక్కర్లేదు.
"ఎక్కడున్నా నా కూతురే" అనేశాడు. అలా చూస్తే, గోపాల్ కన్నా నా పరిస్థితే
మెరుగ్గా ఉంది. ఓ పక్క మా కేసులు ఓ కొలిక్కి వస్తుండగానే మా పరిచయం
స్నేహంగా మారింది. అతను పది మాటలు మాట్లాడితే అందులో కనీసం నాలుగు సిద్దూ
గురించి అయి ఉంటాయి.
మొదట్లో అతను సిద్దూ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నేను
పోగొట్టుకున్న బిడ్డ జ్ఞాపకం వచ్చి బాధ కలిగేది. మరికొన్నాళ్ళు వసంత్
నవ్యని ఎలా చూసేవాడో గుర్తొచ్చేది. ఇప్పుడిప్పుడు, అతనికి అందని పండైన
బిడ్డ సాంగత్యం, నాకు మాత్రం అందుతోంది కదా అన్న ఆలోచన వస్తోంది.
మనకిష్టమైన వాళ్ళు ఆకలితో ఉంటూ ఉండగా, మనం పంచ భక్ష్య పరమాన్నపు విస్తరి
ముందు కూర్చోడం లాంటి పరిస్థితి ఇది.
అవును, గోపాల్ ని నేను ఇష్ట
పడుతున్నాను. అతనితో జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని వదులుకోను. అతన్ని
సంతోష పెట్టడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే.. కానీ, అదంత సులభమేనా?
గోపాల్ సంతోషం సిద్దూతో ముడిపడి ఉందని నాకు బాగా తెలుసు. వాడు ఎదురుగా ఉంటే
అతనికి ఇంకేమీ అక్కర్లేదు. బహుశా నేను కూడా అవసరం లేదేమో అనిపిస్తూ
ఉంటుంది ఒక్కోసారి గోపాల్ ని చూస్తే. వాడిని తెచ్చివ్వడమో, గోపాల్ ని మరిపించడమో
నావల్ల అయ్యే పనేనా? బాబూ సిద్దూ..ఎలా సంపాదించనురా నిన్ను? నా కడుపున
ఎందుకు పుట్టలేదురా సి..ద్దూ..
(అయిపోయింది)
భూదేవి అంత ఓర్పున్న భార్యను వదులుకోడానికి సిద్ధపడిన వసంత్ చెప్పే కధ కోసం ఎదురుచూస్తున్నా !
రిప్లయితొలగించండిvery nice story sir
రిప్లయితొలగించండిమరేమో సంసారంలో సరిగమలు-మధురిమలు గరగరలు-చురచురలుగా మారటానికి గయ్యాళి భార్య, జగడాల భర్తే ఉండనవసరం లేదండీ. మరోరకం ఉంటారు ఇంటికి ఇనప శీల పొరుక్కి బంగారపు శీల, చూసే వారికి వీరు విస్తరి నిండా వడ్డించిన విందు భోజనమే కనిపిస్తుంది కానీ ఒక మూలగా వేసిన ఉమ్ము మాత్రం కనిపించదు. కథ బాగుంది కాని పాత్రలు మరింత బలంగా ఉంటే మురళి గారి కలం పదునుకి మరింత రక్తి కట్టేదేమో అని.... తొందరపడి ముందుగానే కూసేసానా?? Errr
రిప్లయితొలగించండిఅవతల మనిషి ఇలా అనుకుంటున్నారని మనమే ఏదో ఊహించేసుకుంటాం. ఈ అనుకోవడంతో చాలా సార్లు అనవసర సంఘర్షణకు లోనవుతాం. కథ చాలా బావుంది మురళి గారు.
రిప్లయితొలగించండికథ బాగుంది మురళి గారు. ఈ కథ కి కామా కాకుండా ఫుల్స్టాప్ ఉంటే బాగుండు అనిపిస్తోందండి. వాళ్ళిద్దరూ ఓపెన్ గా మాట్లాడేసుకొని హాయిగా జీవితం పంచుకొని ఇద్దరూ కలిసి, ఒకరికొకరు తోడుగా సిద్దూ ప్రేమ కోసం నిరీక్షిస్తే ....ఎప్పటి కైనా మంచిరోజులు రాకబోవుకదా...అనిపిస్తుందండి నాకు:) నాకు పక్కా సుఖాంతం కథలే ఇష్టం:)
రిప్లయితొలగించండిముగింపు సుఖాంతమే అనుకోమని మా ఊహకి వదిలేసినట్లేనాండి :-) నాకు ఎందుకో మిగిలిన ఇద్దరి వర్షన్స్ కూడా వినాలనిపించింది... ఎప్పటిలాగే మీ నెరేషన్ బాగుందండి.
రిప్లయితొలగించండినాకు అసంపూర్తిగా అనిపిస్తుంది మిగిలిన వారివి కూడా వినాలని కాసింత ఉచిత సలహా పడేయాలని :) అనిపిస్తుంది.
రిప్లయితొలగించండి'వాడి' కథకనుక ఇక్కడితో ఆపడమే సబబుగా అనిపిస్తోంది కానీ ఇప్పుడు ఒకరిగురించి మరొకరికి ఎవరు చెప్తారు? లాయర్ ఫైల్ లాంటి పొరపాటు మరోటేదో జరగాలని ఆశించడమేనా?
రిప్లయితొలగించండిరెండవభాగంలో మీ శైలి కథనం కించిత్ లోపించినా, కథావస్తువుకున్న బలం చదివించిందండీ.
@నీహారిక: అయ్యో.. వసంత్ ఒదులుకోలేదండీ.. భార్యే అతన్ని వదిలించుకుంది.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@నీలకంఠ: ధన్యవాదాలండీ..
@లక్ష్మి: పబ్లిష్ బటన్ నొక్కాక తొలి పాఠకుణ్ణి, మొదటి విమర్శణ్ణీ కూడా నేనేనండీ.. కాబట్టి 'తొందర పడడం' ఏమీ లేదు.. నిర్మొహమాటంగా మీ అభిప్రాయం పంచుకోండి.. సద్విమర్శ చాలా అవసరం.. ధన్యవాదాలు..
@జ్యోతిర్మయి: అంతరంగాన్ని చదవడం అన్నది అన్ని వేళలా, అందరి విషయంలోనూ సాధ్యపడే పని కాదు కదండీ మరి.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@జయ: ముగింపు పూర్తిగా మీ ఇష్టమండీ.. ఎవరికెలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు :) ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: మిగిలిన ఇద్దరి వెర్షన్స్ అంటే మరో కథ అవుతుందేమో నండీ.. ఈసారెప్పుదైనా ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు..
@హిమబిందు: హహహా.. కథాంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంతవరకూ చాలు అనిపించిందండీ.. మిగిలిన ఇద్దరిదీ మరో కథ అవుతుందేమో, చూద్దాం.. ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: నిజమేనండీ.. రెండో భాగం బాగా అరిగిపోయిన ఫెమినిస్టు కథలాగా ఉంది.. మరికొంచం శ్రద్ధ పెట్టాల్సిందేమో కథనం మీద.. ధన్యవాదాలు..
బాగా అరిగిపోయిన ఫెమినిస్టు కథ... మంచి ప్రయోగం... :)
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: బహుకాల దర్శనం!! ఉన్నమాటే కదండీ మరి.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి