వర్షాకాలం, శీతాకాలాలతో పోలిస్తే వేసవిలో దొరికే కాయగూరలు బాగా
తక్కువ. పైగా, మండే ఎండల్లో మసాలా వంటలు తినడమే కాదు, వండడమూ కష్టమే.
ఈకాలంలో దొరికే వాటిలో సాధ్యమైనంత సింపుల్ గా వండుకు తినగలిగే కూరల్లో
అరటికాయ ఒకటి. మామూలుగా అయితే నవనవలాడే అరటికాయలు చూడగానే బజ్జీలో, వేపుడో
గుర్తొస్తాయి. కూరల్లో అయితే మొదటి ఓటు పులుసుకూరకే. కానీ, వేసవిలో ఇవేవీ
కుదరవు. కాబట్టి, ఉప్మాకూర బెస్ట్ చాయిస్. పేరు చూడగానే ఎలా వండాలో ఓ ఐడియా
వచ్చేసి ఉంటుంది కదూ..
ముందుగా ఓ గిన్నెలో నీళ్ళు తీసుకుని
స్టవ్ మీద పెట్టాలి. నీళ్ళు కొంచం వేడెక్కుతూ ఉండగానే కొంచం పసుపు
వేసేసుకోవాలి. చేతిక్కాస్త చవుర్రాసుకుని అరటికాయ చెక్కు తీసుకుని, సమంగా
ముక్కలు కోసుకుని పొంగుతున్న నీళ్ళలో వేసేయాలి. నీళ్ళు పొంగి స్టవ్ మీద
పడకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు. పది నిమిషాల్లో అరటికాయ ముక్కలు చక్కగా
ఉడికిపోతాయి. స్టవ్ కట్టేసి, గిన్నెలో మిగిలిన నీళ్ళని వంపేసి, ముక్కల్ని
ఆరనివ్వాలి. ఈ పని అయ్యిందంటే, సగం వంట అయిపోయినట్టే.
వండుతున్నది
బొత్తిగా మసాలాలు లేని సాత్వికమైన కూర కాబట్టి, అలనాటి 'మల్లీశ్వరి' పాటలు
వినొచ్చు. 'మిస్సమ్మ' లేదా 'గుండమ్మ కథ' పాటలైనా పర్లేదు. నాలుగు పాటలు
అయ్యేసరికి కూర రెడీ అయిపోతుంది. వంటలో రెండో మరియు చివరి భాగానికి వస్తే,
ఉల్లిపాయ పెద్దదయితే ఒకటి, చిన్నవైతే రెండు మరీ సన్నగా కాకుండా తరిగి పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ఉప్మా కోసం సిద్ధం పెట్టుకున్నట్టే తరిగి
పెట్టేసుకోవాలి. పోపు సరంజామాతో పాటు, నాలుగు కర్వేప రెబ్బలు, ఓ చిన్న
నిమ్మకాయ పక్కన పెట్టేసుకుంటే కూర వండేందుకు సిద్ధం అయిపోవచ్చు.
స్టవ్ వెలిగించి, బాండీ వేడెక్కగానే రెండు చెంచాల నూనె వేసి అల్లం ముక్కలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్న సెగ మీద వేగనివ్వాలి. సగం వేగాక పచ్చిమిర్చి, కర్వేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి గరిటెతో తిప్పాలి.
నాలుగైదు నిమిషాలు సన్నని సెగమీదే వేగనిచ్చి, నీళ్ళు వంపేసిన అరటికాయ
ముక్కల్ని బాండీ లోకి బదలాయించి బాగా తిప్పాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం
ఫ్లేం కి మార్చి, బాండీ మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత
తీస్తే, కూర మరీ పొడి పొడిగానూ బాగా ముద్దగానూ కాకుండా మధ్యస్తంగా
వస్తుంది.
అరటి, ఉల్లి ముక్కల మధ్య బంధాన్ని బలపరచడంతో
పాటు, కూరకి రుచి ఇవ్వాలంటే ఉప్పు తప్పనిసరి. తగినంత ఉప్పును కూరంతా జల్లి,
మరోసారి బాగా కలిపి, మూత పెట్టి రెండు నిమిషాలు స్టవ్ ని సిమ్ లో ఉంచాలి.
మూత తీసి, మళ్ళీ ఓసారి కలిపి స్టవ్ కట్టేయాలి. దీనితో కూర చాలావరకూ
పూర్తయినట్టే. పూర్తిగా అవ్వాలంటే మాత్రం, బాండీలో కూర చల్లారే వరకూ ఆగాలి.
కూర బాగా చల్లారింది అనిపించుకుని, నిమ్మకాయ సగానికి కోసి, గింజలు తీసేసి,
రసాన్ని కూర మీద పిండి బాగా కలిపితే కూర సిద్ధం.
ముందుగా
చెప్పినట్టుగా ఇది వేసవికి సరిపోయే సింపుల్ వంటకం. అలా అని మిగిలిన
కాలాల్లో చేసుకోకూడదు అనేమీకాదు. అరటికాయ దొరకడమే ఆలస్యం, చేసేసుకోవచ్చు.
అన్నంతో పాటు, రోటీలోకీ బావుంటుంది. ముక్కలు ఉడికించేందుకు సరిపడేన్ని
నీళ్ళే తీసుకుంటే, ఉడికాక నీళ్ళు వంపే పని ఉండదు. తరిగిన ముక్కలు ముందు
చన్నీళ్ళలో వేసి, అటుపై వేన్నీళ్ళలోకి మార్చే కన్నా, అప్పటికప్పుడు తరిగి వేడి
నీళ్ళలో వేసేయడం వల్ల ముక్కలు అస్సలు రంగు మారవు. కూర బాగా కలర్ఫుల్ గా
రావాలి అనుకుంటే ఉప్పు వేసేప్పుడు మరికొంచం పసుపు జోడిస్తే సరిపోతుంది. పెద్దవాళ్ళతో పాటు పిల్లలకీ నచ్చే కూర ఇది.