ఆత్మకథల్లో ఏదో తెలియని రుచి ఉంది. చదువుతూ ఉండగా ఎక్కడో ఏ సంఘటనో
చిరపరిచితమన్న భావన కలుగుతుంది. ఏ స్పందనో, మరే ఇతర ఆసక్తో ఆశ్చర్యాన్ని
కలిగిస్తుంది. అతని స్నేహబృందంలో ఒకరో, కొందరో అంతకు పూర్వమే సాహిత్యం
ద్వారా పరిచయం అయిన వాళ్ళయి ఉంటారు. లేదూ, అతడు జీవించిన స్థల కాలాదుల మీద
తెలియని మోజు ఏదో లోపలెక్కడో ఉండి ఉంటుంది. అదిగో, అక్కడి నుంచీ ఆ రచయిత ఆత్మీయుడైపోయి పుస్తకాన్ని ఆపకుండా చదివించేస్తాడు. అలాంటి అనుభవాన్ని తాజాగా కలిగించిన రచయిత ఆచంట జానకిరామ్.
దేశ
స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో వాటిని దూరం నుంచే చూస్తూ తన
బాల్యాన్నీ, యవ్వనాన్నీ గడిపి, దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే - తన నలభై
ఐదో ఏట - తన జీవితంలో ఓ కొత్త వెలుగుని నింపుకున్న జానకిరామ్ ఆత్మకథా
సంపుటాలు -- 'నా స్మృతిపథంలో...,' 'సాగుతున్న యాత్ర' -- కలిపి
ప్రచురింపబడిన బృహత్ గ్రంధాన్ని చదివే అవకాశం అనుకోకుండా దొరికింది.
స్వతంత్ర పోరాట విశేషాలతో పాటు, నూరేళ్ళ నాటి తెలుగు సమాజపు తీరు తెన్నులు,
భావకవిత్వపు తొలి, మలి దశలూ, తెలుగు రేడియో పుట్టు పూర్వోత్తరాలతో పాటు
అనేక విషయాలని సాధికారికంగా ప్రకటించిన గ్రంధమిది.
నాటి
వైద్య ప్రముఖుడు ఆచంట లక్ష్మీపతి ముద్దుబిడ్డ జానకిరామ్ అత్యంత
సుకుమారుడు, సౌందర్యోపాసకుడు. విఖ్యాత రచయిత బుచ్చిబాబు మాటల్లో చెప్పాలంటే
'సౌందర్యం కోసం సౌకర్యాన్ని త్యాగం చేయగల కళాజీవి.' అనిబిసెంట్ కి
ప్రత్యక్ష శిష్యుడు. ఉన్నత విద్యాభ్యాసం, ఉన్నత వర్గాల వారి సాహచర్యం.
కొన్నేళ్ళ ఉద్యోగ జీవితం తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ సెక్రటరీ పని. తెలుగు
దేశం నలుమూలలా కారులో కలియతిరుగుతూ పెద్ద పెద్దవారందరినీ పరిచయం చేసుకుంటూ,
వారిచేత ఇన్సూరెన్స్ చేయించి కంపెనీని అభివృద్ధిలోకి తేవాల్సిన బాధ్యత.
అటుపై తెలుగు రేడియోకి తొలి ప్రయోక్త, కార్యక్రమ రూపకర్త.. వీటన్నింటితో
పాటు చిత్రకారుడు, కవి, రచయిత, సాహితీ విమర్శకుడు..
చిన్నతనంలోనే
తల్లిని పోగొట్టుకున్న జానకిరామ్ కి తండ్రి దగ్గరా, అక్కయ్య దగ్గరా చేరిక
ఎక్కువ. అడయార్ కాలేజీ ప్రిన్సిపాల్ జేమ్స్ కజిన్స్ ప్రభావం అత్యధికం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, పిలకా గణపతి శాస్త్రి,
మల్లంపల్లి సోమశేఖర శర్మ, కొంపెల్ల జనార్ధన రావు, దుర్గాబాయి దేశ్ ముఖ్,
కమలాదేవి చటోపాధ్యాయ, గూడవల్లి రామబ్రహ్మం, తాపీ ధర్మారావు, త్రిపురనేని
గోపీచంద్, ఎన్నార్ చందూర్, మాలతీ చందూర్...ఇంకా ఎందరో, ఎందరెందరో.. వీరందరూ
జానకిరామ్ కి ఆత్మీయులు. వీరిలో ఎవరిని కలవడానికి వెళ్ళినా దోసెడు
కలువలో, బుట్టెడు గులాబులో లేకుండా వెళ్ళలేదు జానకిరామ్. మడత నగలని తెల్ల
బట్టలూ, పల్చని సుగంధం జానకిరామ్ సంతకం.
పుస్తకం చదవడం మొదలు పెట్టాక ఈ సున్నిత హృదయుడితో స్నేహం కలవడానికి ఎన్నో పేజీలు పట్టదు. అటు తర్వాత, "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అన్నట్టుగా జానకిరామ్ బాధ పాఠకుల బాధ అయిపోతుంది.
కుటుంబలో ఒక్కొక్కరూ స్వరాజ్య సాధన కోసం జైలుకి వెళ్తూ ఉంటే, తండ్రికిచ్చిన
మాట కోసం తను మాత్రం ఉద్యమానికి దూరంగా ఉండి జానకిరామ్ అనుభవించిన బాధ
అంచనాకి అందుతుంది. కానీ, అటుపై జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలని గురించి
చెప్పకుండా చెబుతూ వాటి తాలూకు బాధని మాత్రం అక్షరమక్షరం పంచుకున్నప్పుడు ఆ
బాధలో పూర్తిగా మమేకం కావడం కొంచం కష్టమే. ఆ సున్నితత్వం ఆశ్చర్య
పరుస్తుంది, కేవలం ఒక్కసారి కాదు.. అనేకసార్లు. "ఇంత సున్నితంగా ఉండడం
సాధ్యమా?" అన్న ప్రశ్న రాకుండా ఈ పుస్తకం పూర్తవ్వదు.
కృష్ణశాస్త్రి
వచనంలో ఆవేశం, కవిత్వంలో సౌకుమార్యం ఉంటాయని చెబుతూ, ఆ సౌకుమార్యమే తనకి
ఇష్టమని చెబుతారు జానకిరామ్. బాపిరాజు బహుముఖ ప్రజ్ఞని పరిచయం చేస్తూ, సగం
మాత్రమే పూర్తి చేసిన సింహ తలాటం డిజైన్ ని కళ్ళముందు ఉంచుతారు. చలం, పాకాల రాజమన్నార్ రచనల్లో తీవ్రతని గురించి చెబుతూనే, వారి సాంగత్యం తాలూకు ప్రత్యేకతని వివరిస్తారు. సొంత కారులో షికార్లు, బెజవాడ గోపాలరెడ్డి పెళ్లి వేడుకలు
లాంటివి అక్కడక్కడా కనిపించే ఆటవిడుపులు. తొలినాటి రేడియో కబుర్లయితే
చకచకా సాగిపోతాయి. తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేసిన నాటకం 'అనార్కలి'
కబుర్లు, మరీ ముఖ్యంగా కృష్ణశాస్త్రి చేత 'శర్మిష్ఠ' రేడియో నాటకం రాయించేందుకు చేసిన మహా ప్రయత్నం.. ఇవన్నీ ఇంకెవరు చెప్పినా ఇంత బాగుండవేమో అనిపిస్తుంది.
పుస్తకంలో
బాగా ఆసక్తి కలిగించేవి రెండు విషయాలు. జానకిరామ్ సున్నితత్వం,
జ్ఞాపకశక్తి. జీవితం ఎన్ని పరీక్షలని పెట్టినా తన సున్నితత్వాన్ని
ఇసుమంతైనా వదులుకోని అదృష్టవంతుడు పరిచయమవుతాడు ఈ పుస్తకం ద్వారా. ఇక,
నెమరువేత విషయానికి వస్తే రాసే నాటికి ఎప్పటెప్పటి క్రితమో జరిగిన విషయాలను ఎంతో వివరంగా.. నిన్ననో మొన్ననో జరిగాయా అనిపించేట్టు రాయడం జానకిరామ్ ప్రత్యేకత. రాసిన సంఘటనకి సంబంధించి ప్రతి చిన్న వివరాన్నీ ఎంత జాగ్రత్తగా పొందుపరిచారంటే,
అక్షరాలా కళ్ళముందు జరిగినట్టే అనిపిస్తాయి. ఐదువందల నలభై ఎనిమిది పేజీల
పుస్తకం 'అప్పుడే అయిపోయిందా' అనిపించిందంటే అది రచయిత ప్రతిభే. చదివే
అలవాటున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది. (రాజాచంద్ర ఫౌండేషన్
ప్రచురణ, సాహితి ప్రచురణలు పంపిణీ, వెల రూ. 200).
i heard about this book that it is very good to read.where can we get this book whether it is available online?
రిప్లయితొలగించండి@SESHA CHALAPATI: కొత్త ప్రింట్ దొరకడం లేదండీ.. ఎమెస్కో ద్వారా త్వరలోనే రావొచ్చని వినికిడి.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిమీరు ఈ టపా ప్రచురించక ముందు ఈ పుస్తకం గురించి ప్రయత్నిస్తే దొరకటం లేదని చెప్పారు. మీ టపాలో వివరాలు తెలిపితే పుస్తకం సేకరించి అందచేశారు. యివ్వాళే పుస్తకం చేరింది. దూరంగా వున్న మాలాంటి వారికి మీరు ఒక పెన్నిధి. మరిన్ని మంచి పుస్తకాలు గురించి మాకు తెలియచేస్తూ వుండండి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@leo: ఓహ్.. పుస్తకం దొరికిందన్న మాట అయితే!! తప్పకుండానండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి