ఎందుకో తెలియదు కానీ, తెలుగు నవల తొలినాళ్ళ నుంచీ పట్నవాసం మీద మోజు
పెంచుకుంది. నూటికి ఎనభై శాతం జనం పల్లెల్లో ఉంటున్నా, వాళ్ళలో అత్యధిక
శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవితం గడుపుతున్నా, పల్లెటూరి ఇతివృత్తాలు,
వ్యవసాయపు నేపధ్యాలూ తెలుగు నవలల్లో కనిపించడం అరుదు. ఉన్నవ లక్ష్మీనారాయణ
పంతులు 'మాలపల్లి,' డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి,' సి. సుజాత
'సుప్త భుజంగాలు,' చంద్రలత 'రేగడివిత్తులు' తర్వాత ఇదిగో ఇన్నాళ్ళకి "ఓ
తీరగ్రామం-యాభయ్యేళ్ళ కథ" అంటూ వచ్చారు నల్లూరి రుక్మిణి తన 'ఒండ్రుమట్టి'
నవలతో.
కథాస్థలం గుంటూరు జిల్లాలో కృష్ణాపురం అనే గ్రామం. సముద్రానికి దగ్గరగా ఉండి, తరచుగా తుఫానులని, ఉప్పు గాలుల్ని ఎదుర్కొనే ఆ గ్రామం లో ప్రధాన వృత్తి వ్యవసాయం. జమీందారు అధీనంలో ఉండే పొలాలని 'పాలి' కి తీసుకుని వ్యవసాయం చేసే రైతాంగం అంతా కమ్మ కులస్తులు. పొలాల్లో పనిచేసే రైతు కూలీలు మాల, మాదిగ కులస్తులు. యాభయ్యేళ్ళ నవల అని రచయిత్రి చెప్పినప్పటికీ దాదాపు ఏడు దశాబ్దాల కథాకాలం కనిపిస్తుంది. ఈ ఏడు దశాబ్దాలలో జమీందారు-భూమి, జమీందారు-రైతు, రైతు-కూలీ సంబంధాల్లో వచ్చిన మార్పులని వామపక్ష దృక్కోణం నుంచి నిశితంగా చిత్రించిన నవల ఇది.
కృష్ణాపురం రైతులు సజ్జలు, జొన్నలు పండించుకుంటూ, తమకి కావాల్సిన బట్టలు తామే నేసుకుంటూ బతికిన రోజుల నుంచి, పొగాకు పంటతో లాభాలు గడించి, యంత్రాలతో పనులు చేయించుకునే 'అభివృద్ధి' దశవరకూ సాగుతుంది కథ. వర్తమానం (1985) తో మొదలు పెట్టి గతంలోకి వెళ్లి (1920 ప్రాంతం) మళ్ళీ వర్తమానంలో ముగిసే ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని ఉపయోగించిన రుక్మిణి వ్యవసాయం, గ్రామీణ జీవితంలో వచ్చిన మార్పులని సునిశితంగా అక్షరబద్ధం చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన కృష్ణాపురం గ్రామం కథని మలుపు తిప్పిన సంఘటనలు రెండు. మొదటిది, నిజాం సాగర్ నిర్మాణం అనంతరం కొందరు రైతులు నైజాం ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ భూములు కొనుక్కొని వ్యవసాయం ఆరంభించడం కాగా, రెండోది కృష్ణాపురం రైతాంగానికి పొగాకు పంట పరిచయం కావడం.
చిన్నకారు రైతు కోటయ్య కుటుంబకథ ద్వారా కృష్ణాపురం కథ
చెప్పారు రచయిత్రి. జమీందారు కృష్ణస్వామి దగ్గర భూమిని 'పాలి' కి తీసుకుని
జొన్నలు పండించే కోటయ్యకి ముగ్గురు కొడుకులు - తిరపతయ్య, అమరయ్య, వెంకయ్య.
కొత్తని ఆహ్వానించే తత్త్వం ఉన్న అమరయ్య ఊళ్ళో కొందరు రైతులతో కలిసి నైజాం
ప్రాంతానికి వెళ్లి అక్కడ కారుచౌకగా వస్తున్న రాళ్ళు, రప్పలతో నిండిన
భూమిని కొని, ఏళ్ళ తరబడి శ్రమించి దానిని వ్యవసాయ యోగ్యం గా మారుస్తున్న
తరుణంలోనే, మిగిలిన ఇద్దరు కొడుకుల సాయంతో కొత్తగా వచ్చిన పొగాకు నాటి
లాభాలు రుచి చూస్తాడు కోటయ్య. కుటుంబంలో పెళ్ళిళ్ళు, మరణాలు, ప్రకృతి
వైపరీత్యాల వచ్చే పంట నష్టాలు వీటన్నింటినీ తట్టుకుంటూ ఇటు కృష్ణాపురం
లోనూ, అటు నైజాము లోనూ భూములు బలపరుచుకున్న కోటయ్య కుటుంబం ఊళ్ళో పెద్ద
రైతు కుటుంబాల్లో ఒకటిగా ఎదిగిన క్రమాన్ని చూడొచ్చు ఈ నవలలో.
అమరయ్య కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై పార్టీ పనుల్లో తిరుగుతూ ఉండడంతో తిరపతయ్య తమ్ముడి కుటుంబానికి తోడుగా నైజాంకి మారతాడు. కృష్ణాపురం లో స్వతంత్ర పోరాటం, నైజాం లో నిజాం వ్యతిరేక పోరాటం దాదాపు ఏకకాలంలో సాగుతాయి. ఈ రెండు పోరాటాల తోనూ సంబంధం కలిగి ఉంటాడు అమరయ్య. అతని కొడుకు చంద్రానిదీ తండ్రి దారే. అన్నదమ్ములలో చివరివాడైన వెంకయ్య కొడుకు భాస్కరం కృష్ణాపురంలో భూస్వామిగా ఎదుగుతాడు. అతని తరం వచ్చేసరికి రైతు-కూలీ సంబంధాల్లో విపరీతమైన మార్పు వస్తుంది. ఆత్మగౌరవ పోరాటాలు కూలీల్లో విశ్వాసం పెంచితే, వారి ఆత్మవిశ్వాసం మీద రైతాంగానికి మొదలైన అసంతృప్తి పెరిగి, పెద్దదై దళితుల ఊచకోత కి దారితీసిన పరిస్థితులని వివరిస్తారు రుక్మిణి.
మొత్తం 384 పేజీలున్న ఈ నవల కొన్ని తరాల వ్యవసాయ జీవితాలని, ఎన్నో పోరాటాలనీ కళ్ళముందు నిలిపింది. రైతుల వలస 'రేగడివిత్తులు' ని జ్ఞాపకం చేస్తే, నిజాం వ్యతిరేక పోరాటాలు, అప్పటి రాజకీయాలు 'లోపలి మనిషి' 'నిర్జన వారధి' పుస్తకాలని గుర్తు చేశాయి. అయితే, దీనిని ఒక సమగ్ర నవలగా అంగీకరించడానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణాపురం రైతు జీవితాలని చిత్రించినంత నిశితంగా నైజాం జీవితాలని చిత్రించక పోవడం ఒక కారణం కాగా, కమ్యూనిష్టు పోరాటాలు కథలో పూర్తి స్థాయిలో భాగం కాకపోవడం మరొకటి. అప్పటివరకూ కనిపించిన పాత్రలు ఉన్నట్టుండి మాయమైపోయి, పార్టీ సిద్ధాంతాలు అనేక పేజీల్లో కనిపించడం, ఆ తర్వాతే పాత్రలు కనిపించడం లాంటివి పరిహరించి ఉండాల్సింది.
కథలో, సిద్ధాంతాలని భాగం చేయడంలో మరికొంచం శ్రద్ధ చూపిస్తే బాగుండేది అనిపించింది. ఈ నవల పూర్వ రంగాన్ని గురించీ, నవల కోసం ఐదేళ్ళ పాటు తను చేసిన కృషిని గురించీ వివరంగా రాశారు రుక్మిణి తన ముందుమాటలో. కళ్యాణరావు, ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాటలు నవలని సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపకరిస్తాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యన భౌగోళికంగా ఉన్న మార్పులు, సాంస్కృతిక మార్పులపై వాటి ప్రభావాలని గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు రచయిత్రి. మొత్తం మీద చూసినప్పుడు అభినందించి తీరాల్సిన ప్రయత్నం. (విప్లవ రచయితల సంఘం ప్రచురణ, వెల రూ. 170, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).