గురువారం, డిసెంబర్ 08, 2011

నేను తిరిగిన దారులు

కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు నేను రాసిందే మళ్ళీ చదువుతున్నానేమో అనిపించింది. కొన్ని అనుభవాలని చదువుతున్నప్పుడు అవన్నీ నాక్కలిగినవే అని పదే పదే గుర్తొచ్చింది. 'ఇంకా ఏమేం రాసి ఉండొచ్చు?' అన్న ఆసక్తి, ఆసాంతమూ పుస్తకాన్ని వదలకుండా చదివేలా చేసింది. పుస్తకం పేరు 'నేను తిరిగిన దారులు.' నదీనదాలూ, అడవులు, కొండలు అనేది ఉప శీర్షిక. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు. ఇది ఒక యాత్రా చరిత్ర.

కవి, రచయిత, సాహితీ విమర్శకుడిగా పేరున్న చినవీరభద్రుడు ఓ నిరంతర ప్రయాణికుడు కూడా. ప్రదేశాలని చూడడం కన్నా, ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడే ప్రయాణికుడు. ("కారు అద్దం నుంచి ప్రదేశాలని మాత్రమే చూడగలం, ప్రపంచాన్ని కాదు" అంటుంది జానకి..) ఈ కారణం వల్లనే కావొచ్చు, బాగా తెలిసిన ప్రదేశాలని సైతం అతని కళ్ళతో చూసినప్పుడు ఓ కొత్త ప్రపంచం కనిపించింది.. వెంటాడింది... వెంటాడుతూనే ఉంది...

మొత్తం పుస్తకాన్ని యాత్రా కథనాలు, యాత్రానుభవాలు, యాత్రాలేఖలు అన్న మూడు విభాగాలుగా విభజించారు వీరభద్రుడు. వీటిలో యాత్రా కథనాల్లో కొంత కల్పననీ, నాటకీయతనీ జోడించగా, యాత్రానుభవాలని ఉన్నవి ఉన్నట్టుగా పంచుకున్నారు. యాత్రా లేఖలు విభాగంలో ఢిల్లీ పర్యటనలో ఉండగా ఇంటికి రాసిన ఉత్తరాలలో కొన్ని భాగాలని ప్రచురించారు. ఓ స్థలాన్నో, సంఘటననో చూసినప్పుడు ఆ క్షణంలో తనకి కలిగిన స్పందనని లేఖలుగా అక్షరబద్ధం చేశారు.

'అరకులోయ దారుల్లో..' 'శివ సాన్నిధ్య సుఖం' 'పాపికొండల నడుమ..' ఈ మూడూ యాత్రా కథనాలు. మూడూ కూడా ఇండియా టుడే పత్రికలో అచ్చయినవే. అరకులోయ చూడడానికి వెళ్ళిన మిత్ర బృందం, కేవలం ప్రకృతిని చూసి, ప్రేమలోపడి తిరిగి వచ్చేయకుండా, అక్కడి గిరిజనుల జీవితాలని గురించి తెలుసుకున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. కలిసి భోజనం చేశారు. కష్టసుఖాలు మాట్లాడారు. అడవికి వెళ్ళడం "నా ఇంటికి నేనే అతిధిగా పోవడం లాంటిది" అంటారు రచయిత.



కేవలం శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత మాత్రానే పునర్జన్మ ఉండదని ఓ నమ్మిక. మరి అంత గొప్ప శ్రీశైలంలో చూసి తీరవలసింది మల్లికార్జునుడి ఆలయం ఒక్కటేనా? దీనికి జవాబు 'కాదు' అని చెబుతుంది 'శివ సాన్నిధ్య సుఖం.' ఇక మూడో కథనం 'పాపికొండల నడుమ' గురించి ఎంత చెప్పినా తక్కువే. "పాపి కొండల్ని చూడడం ఒక అనుభవం. అవి వాల్మీకి వర్ణించినట్టుగా ఏనుగుల్లా ఉన్నాయనో, భూమిని చీల్చుకు వచ్చిన పర్వతాల్లా ఉన్నాయనో అనుకోవడంలో తృప్తి లేదు. వాటి ఉనికిలో భూమి ఆవిర్భావంలోని ఉద్వేగభరిత క్షణమేదో ఉంది. వాటి ఆకృతుల్లో అదృశ్య దైవ హృదయంలోని కాల్పనిక కౌశలమేదో ఉంది," లాంటి ఏ కొన్ని వాక్యాలనో మాత్రమే ప్రస్తావించి ఊరుకోవడం ఎంత కష్టం!!

యాత్రానుభవాల్లో ఇంగ్లండ్ యాత్రని గురించి సవివరంగా రాశారు వీరభద్రుడు. ఇది ముందుగా ప్లాన్ చేసుకుని రాసింది కావడం వల్ల ఓ పూర్తి స్థాయి ట్రావెలోగ్ అయ్యింది. గత వైభవాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నా, ఆ గాంభీర్యాన్ని నిలుపుకోవడం కోసం బ్రిటన్ చేస్తున్న ప్రయత్నాలనీ, ఆ క్రమంలో ఎదురవుతున్న ఒడిదుడుకులనీ తనదైన దృష్టికోణంలో ఆవిష్కరించారు రచయిత. "నిస్సందేహంగా ఇది నా జీవితంలో గొప్ప యాత్ర. నా జీవితమంతా ప్రయాణాల్లో గడిచిపోయిన మాట నిజమే. కానీ ఈ యాత్రతో నేను ప్రపంచ పధికుణ్ణయ్యాను," అని ప్రకటించారు.

బృందావనంలో ఆరగించిన నవనీత ప్రసాదం రుచిని 'హే గోవింద హే గోపాల' వ్యాసంతో పంచి, గోదావరి జన్మస్థలాన్ని చూడబోతున్న సమయంలో తనకు కలిగిన వివశత్వాన్ని 'త్రయంబకం యజామహే' కథనంలో ఆవిష్కరించారు వీరభద్రుడు. చలం రచనలగురించీ, వాటితో తనకున్న అనుబంధాన్ని గురించి మాత్రమే కాక, రమణ మహర్షిని గురించి భారతీయ తాత్వికతని గురించీ వివరంగా రాశారు 'అరుణగిరి దర్శనం' వ్యాసంలో. శ్రావణ బెళగొళ, హళెబీడు, బేలూరుల్లో 'రాళ్ళలో చెక్కిన కావ్యాల'ని పరిచయం చేస్తూ "హళెబీడు మను చరిత్ర లాంటి కావ్యమైతే, బేలూరు వసుచరిత్ర లాంటిదంటాను," అన్నారు. యాత్రానుభావాల్లో చివరిదైన 'ఆదిమానవుడూ, పూర్ణమానవుడూ' ఒక లోతైన వ్యాసం.

ప్రయాణాలని ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన ఈ పుస్తకం ఆద్యంతమూ ఆసక్తికరంగా చదివిస్తుంది. అనేక విషయాలని గురించి మన దృష్టి కోణాన్ని విశాలం చేసుకోడానికి పనికొచ్చే విశ్లేషణలు కథనాల్లో అంతర్భాగమయ్యాయి. "తమ చుట్టూ ఉండే మనుషుల గురించి ఆలోచించే మనుషులు భారత దేశానికి ఎక్కువ అవసరం" అంటారు రచయిత 'ఢిల్లీ నుంచి ఉత్తరాలు' లో. ఈ పుస్తకం చదివాక ప్రదేశాల గురించి మాత్రమే కాక, ప్రపంచాన్ని గురించి చిన్నగా అయినా ఓ ఆలోచన మొదలవుతుంది. దీనిని రచయిత విజయంగానే భావించాలి. ('శ్రీ' ప్రచురణలు, పేజీలు 208, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులూ. ...కవర్ డిజైన్ తో పాటు లోపలి స్కెచ్ లూ రచయిత వేసినవే కావడం విశేషం!)

ఆదివారం, డిసెంబర్ 04, 2011

సుందరానికి పాతికేళ్ళు

సుందరం... తెలుగు తెర మీద ఓ నవ్వుల సంతకం... చేతిలో విద్య ఉన్నా దానిని ఉపయోగించని బద్ధకం అతని సొంతం. పావలాకాసంత పుట్టుమచ్చతో ఉండే పద్మినీ జాతి స్త్రీ దొరికితే చాలు, దశ తిరిగిపోతుందంటే నమ్మేసే అమాయకత్వమూ అతనికే సొంతం. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు నమ్మేసి, సదరు స్త్రీకోసం జరిపే వెతుకులాటలో అష్టకష్టాలు ఎదురైనా, చివరికి ప్రాణాల మీదకి వచ్చినా వెనుదీయని మూర్ఖత్వంలాంటి మొండితనం అచ్చంగా సుందరానికి మాత్రమే సొంతం. అంతేకాదు, కబుర్లతో ఆడపిల్లల్ని బుట్టలో పడేయగలిగే ప్రావీణ్యమూ, ప్రాణభయంతో గజగజలాడే పిరికితనమూ కూడా సుందరానివే. అలాంటి సుందరం పుట్టి ఇవాల్టికి పాతికేళ్ళు!!


'మంచుపల్లకీ' తో మొదలు పెట్టి, 'సితార' 'అన్వేషణ' మీదుగా ప్రయాణించి 'ప్రేమించు-పెళ్ళాడు' తీసేనాటికి కళాత్మక దర్శకుడిగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు వంశీ. 'ప్రేమించు-పెళ్ళాడు' పర్లేదనిపించినా, తర్వాత వచ్చిన 'ఆలాపన' ఘోర పరాజయం పాలవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూటు మార్చి కేవలం హాస్యాన్ని మాత్రమే నమ్ముకుని, రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ తీసిన లో-బడ్జెట్ సినిమా 'లేడీస్ టైలర్' ...కథానాయకుడు సుందరం. కోనసీమలో గోదారి ఒడ్డున ఓ పల్లెటూళ్ళో పెంకుటింటి ఎత్తరుగుల మీద కుట్టు మిషన్ పెట్టుకున్న సుందరానిది జాకెట్లు కుట్టడంలో అందెవేసిన చెయ్యి.

అయితే ఏం లాభం? కష్టపడడానికి ఏమాత్రం ఇష్ట పడడు సుందరం. అసిస్టెంట్ సీతారాముడూ (శుభలేఖ సుధాకర్), ఊరూరూ తిరిగి జాకెట్ ముక్కలు అమ్ముకునే బట్టల సత్యం (మల్లికార్జున రావు) ఎంత మొత్తుకున్నా తన విద్య ఉపయోగించడు సరికదా, తనకి అదృష్టం వచ్చి పడుతుందనే నమ్మకంతో రోజులు గడిపేస్తూ ఉంటాడు. టైటిల్స్ పడుతుండగానే నేపధ్యంలో వినిపించే 'సూర్యుడు సూదులెట్టి పొడుస్తున్నాడు లేద్దూ.. ' పాట ద్వారా సుందరం స్వభావాన్ని పటం కట్టేస్తాడు దర్శకుడు. సినిమా కథలో పడగానే ఆ ఊరికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు (రాళ్ళపల్లి), కుడి తొడమీద పావలా కాసంత పుట్టుమచ్చ ఉన్న పద్మినీజాతి స్త్రీని పెళ్ళి చేసుకుంటే సుందరానికి రాజయోగం పడుతుందని నమ్మబలుకుతాడు.

పద్మినీజాతి స్త్రీ వేట మొదలు పెట్టిన సుందరానికి ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది వెంకటరత్నం (ప్రదీప్ శక్తి). ఆడపిల్లలతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి ఓ కేసులోనే జైల్లో ఉన్న వెంకటరత్నం మూడు నెలల్లో విడుదలవుతాడు. అతగాడు వచ్చేలోగానే సుందరానికి పద్మినీజాతి స్త్రీ దొరకాలి. ఆమెని వెతికి పట్టుకోడానికి సుందరం పడే తిప్పలు, అందులోనుంచి పుట్టే హాస్యమే తర్వాతి రెండుగంటల సినిమా. వంశీ మార్కు హడావిడి ముగింపుతో శుభం కార్డు పడుతుంది. వంశీ మిగిలిన సినిమాల్లా కాకుండా, కుటుంబంతో కలిసి చూడలేని సినిమా ఇది.

సుందరం పాత్రలో రాజేంద్రప్రసాద్ అలవోకగా ఒదిగిపోయాడు. ఇక మల్లికార్జునరావుకైతే 'బట్టల సత్యం' పేరు జీవితాంతమూ కొనసాగింది. అర్చన, సంధ్య, దీపలతో పాటుగా వై.విజయ కూడా రాజేంద్రప్రసాద్ సరసన ఓ నాయిక ఈ సినిమాలో!! వంశీ-భరణి కలిసి స్క్రిప్ట్ రాయగా, సంభాషణలని భరణి సమకూర్చారు. చివరినిమిషంలో వాటికి తన మార్కు మార్పు చేర్పులు చేశారు వంశీ. నాయికల్లో అర్చనకి ఎక్కువ మార్కులు పడ్డాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి హీరో సంగీతమే. ఇళయరాజా స్వరాలు ఆంధ్ర దేశాన్ని ఎంతగా ఊపేశాయంటే, ఊరూరా మారుమోగాయి ఈ పాటలు. ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. రెప్పపాటులో పదులకొద్దీ ఫ్రేములు మారే చిత్రీకరణ సైతం గుర్తుండిపోతుంది.

శృతి మించని శృంగారాన్ని, హాస్యంతో రంగరించి వంశీ చేసిన ఈ వెండి తెర ప్రయోగం నిర్మాతలకి కాసులు కురిపించింది. హాస్య దర్శకుడిగా వంశీ మీద చెరగని ముద్ర వేసింది. అంతేకాదు, బూతు సినిమా దర్శకుడన్న పేరునీ తెచ్చిపెట్టింది. "నా జీవితంలోనూ, నా రచనలలోనూ ఎక్కడా హాస్యం లేదు.. జీవిక కోసం ఒక వృత్తిని అనుకున్నాక, అందులో కొనసాగడానికి ఇష్టంలేకపోయినా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అలా చేసిందే 'లేడీస్ టైలర్' సినిమా" అని చాలాసార్లే చెప్పారు వంశీ. ఇది వంశీ ఇష్టపడి తీసింది కాకపోయినా, మనసు పెట్టి తీసిన సినిమా అని తన సినిమాలు అన్నీ చూసిన వాళ్లకి ఇట్టే అర్ధమవుతుంది.

నేటివిటీ పట్ల వంశీకి ఉన్న మక్కువ ఎంతటిదో ఈ సినిమా చూసిన వాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు. ఇళ్ళు, వీధులు మాత్రమే కాదు, కథా స్థలంలో వినిపించే నుడికారాలూ, కనిపించే ఆప్యాయతలూ కూడా సునిశితంగా తెరకెక్కించారు. సుందరం ఎక్కడా హీరో అనిపించడు. మన ఊరి టైలర్ లాగానే అనిపిస్తాడు. అలాగే, వెంకటరత్నంతో సహా ఏ పాత్రా అసహజం అనిపించకపోవడం ఈ సినిమా ప్రత్యేకత. అందుకే కావొచ్చు, చూసిన ప్రతిసారీ సినిమాలో లీనమైపోతాం. సుందరం మాటాడే 'జ' భాష, హిందీలా ఏమాత్రమూ వినిపించని హిందీ, అతగాడి వెంటపడే అమ్మాయిలు, సుందరం రాజైతే తను సేనాపతి అయిపోయి, బట్టలమ్మేసుకోవాలని కలలుకనే సత్యం...ఇలా సినిమా అంతా పొరుగింటి కథలాగే అనిపిస్తుంది. బహుశా అదే ఈ సినిమా విజయ రహస్యం.

 
విషాదం, సంఘర్షణ నుంచే హాస్యం పుడుతుందని చార్లీ చాప్లిన్ మొదలు చాలామందే చెప్పారు. 'లేడీస్ టైలర్' రూపకల్పన వెనుక కూడా అలాంటి విషాదం, సంఘర్షణ ఉన్నాయి. ఈ మధ్యనే ప్రచురించిన 'మా దిగువ గోదారి కథలు' సంకలనంలోని 'బేబీ.. ఓ మాసిపోని జ్ఞాపకం' కథలో ఆ సంఘర్షణని రేఖామాత్రంగా ప్రస్తావించారు వంశీ. ఐదేళ్ళ క్రితం రాజ్పల్ యాదవ్ కథానాయకుడిగా హిందీలోకి రీమేక్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో వంశీ ఉన్నట్టుగా భోగట్టా. మొదట రవితేజతోనూ, తర్వాత అల్లరి నరేష్ తోనూ అనుకున్న 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' ప్రాజెక్ట్ లో హీరోగా ప్రస్తుతం సునీల్ పేరు వినిపిస్తోంది. రాబోయే ఆ సినిమా మరో పాతికేళ్ళ తర్వాత కూడా తల్చుకునేటంతటిది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...