బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలలో స్థిరపడిన వాళ్ళు సైతం కొన్ని నమ్మకాల విషయంలో యెంత మొండిగా, ఏకపక్షంగా వ్యవహరిస్తారో వివరించే కథ 'వాల్ పేపర్.' వివినమూర్తి రాసిన ఈ కథ నాలుగేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయ్యింది. తన అమ్మ, నాన్నల పెళ్లి ప్రపోజల్ మొదలు, తన బాల్యం వరకు జరిగిన సంఘటనలను ఓ పిల్లవాడు చెబుతూ ఉంటాడు. తను పుట్టని క్రితం జరిగిన సంగతులు కూడా పిల్లవాడు చెబుతూ ఉండడం కొంచం తికమక పెట్టినా, ఒక్కసారి కథలోకి వెళ్ళాకా లీనమై చదువుతాం.
పిల్లవాడి తల్లి, తండ్రి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తూ ఉంటారు. కంప్యూటర్ 'లాన్' ద్వారా పెళ్లి ప్రపోజల్ పెడతాడు తండ్రి. ఒకరి కెరీర్ కి ఒకరు అడ్డు రాకూడదు, ఒకరి వ్యక్తిగత స్వేచ్చ కి మరొకరు ఇబ్బంది కలిగించ కూడదు లాంటి కండిషన్స్ తో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పిల్లవాడు తల్లి కడుపులో ప్రవేశించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మొదటిసారి ప్రెగ్నెన్సి వచ్చినప్పుడు, కెరీర్ కి అడ్డంకి అవుతుందని వద్దనుకుంటారు. తర్వాత ప్రమోషన్, ఇల్లు కట్టడం ఈ గొడవల్లో పిల్లల విషయం పట్టించుకోరు. పిల్లవాడి నాయనమ్మ మనవడిని ఎత్తుకోవాలని పట్టుదలతో ఉండడంతో మన కథానాయకుడు తల్లి గర్భం లో ప్రవేశిస్తాడు.
ఇక పిల్లవాడి తల్లిదండ్రుల హడావిడి అంతా, ఇంతా కాదు. ఇంటర్నెట్ లో పిల్లల పెంపకం గురించి వివరాలు డౌన్ లోడ్ చేసుకోడం నుంచి ఓ కార్పోరేట్ హాస్పిటల్ లో డెలివరి ఏర్పాట్ల వరకు.. క్షణం తీరిక ఉండదు ఇద్దరికీ. తల్లి, తండ్రి, పుట్టబోయే పిల్లవాడి గ్రహాలు కలిసే విధం గా జాతక చక్రం వేయించి ఆ ప్రకారం డెలివరి కి ముహూర్తం నిర్ణయిస్తాడు తండ్రి. పిల్లవాడి తాత ఓ రిటైర్డ్ స్కూల్ మాస్టారు. ఆయనకీ జాతకాల మీద నమ్మకం లేదు. జరుగుతున్న తంతుని నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు ఆయన.
అనుకోని విధంగా ఏడో నెలలోనే ప్రసవం జరుగుతుంది. డాక్టర్లు పిల్లవాడిని ఇంక్యుబేటర్ లో ఉంచి బతికిస్తారు. ఐతే యెంత కష్టపడ్డా తల్లిని మాత్రం రక్షించలేక పోతారు. చెడ్డ ముహూర్తంలో కొడుకు పుట్టడం వల్లనే తన భార్య చనిపోయిందని మనస్పూర్తిగా నమ్ముతాడు తండ్రి. పిల్లవాడి ముఖం చూడడానికి కూడా ఇష్ట పడడు. రెండో పెళ్ళికి ఒప్పుకోడు. చనిపోయిన భార్య ఫోటోలు తన కంప్యుటర్ లో వాల్ పేపర్స్ గా సెట్ చేసుకుని ఆమె స్మృతి లోనే గడుపుతూ ఉంటాడు. పిల్లవాడి తాత తనే తల్లీ తండ్రీ అయ్యి పిల్లవాడిని సాకుతూ ఉంటాడు. పిల్లవాడికి నక్సలైట్ ఉద్యమంలో మరణించిన నేత 'సత్యం' పేరు పెడతాడు.
పెద్దవాడవుతున్న సత్యం తండ్రికి దగ్గర కావాలనుకుంటాడు. తాతయ్య మినహా ఇంకెవరూ అతనితో మాట్లాడారు. ఒకసారి గొడవ చేసి తాతయ్యతో కలిసి వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తాడు సత్యం. అక్కడ తాతయ్యకి ఆరోగ్యం పాడవుతుంది. సత్యం తండ్రికి పట్టరాని కోపం వస్తుంది. 'నా భార్యని చంపావు.. నా తండ్రిని కూడా చంపుతావా' అని పిల్లవాడి మీద విరుచుకు పడతాడు. ఎంత ప్రయత్నించినా తండ్రికి దగ్గర కాలేకపోతాడు సత్యం. రోజులు గడుస్తూ ఉంటాయి.
ఒక రోజు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్తాడు సత్యం. ఇయర్ ఫోన్స్ వింటూ లాప్ టాప్ మీద పని చేసుకుంటున్నతండ్రి మౌనంగా సంతకం చేసి ఇచ్చేస్తాడు. తను ఫస్ట్ రాంక్ సాధించిన విషయం తండ్రి గుర్తించకపోవడంతో అది చెప్పడం కోసం అతని మోకాలిని తాకుతాడు సత్యం. పని డిస్టర్బ్ కావడంతో సహనం కోల్పోయిన తండ్రి సత్యాన్ని బాగా కొడతాడు. తాతయ్య చూసి, అడ్డుపడి సత్యాన్ని హాస్పిటల్ కి తీసుకెళతాడు. మగతలో సత్యం కలవరిస్తూ ఉంటాడు.. "నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను తాతయ్యా..అప్పుడు నేను కూడా నాన్న కంప్యుటర్ లో వాల్ పేపర్ అవుతా...."
2006 లో విడుదలైన కొన్ని కథా సంకలనాలలో ఈ కథని చేర్చారు..
చాలా బాగుంది సార్
రిప్లయితొలగించండిఅందించినందుకు కృతజ్ఞతలు
jayabharath
very nice.
రిప్లయితొలగించండిచాలా చాలా బాగుంది కథ!
రిప్లయితొలగించండి"పుట్టబోయే పిల్లవాడి గ్రహాలు కలిసే విధం గా జాతక చక్రం వేయించి ఆ ప్రకారం డెలివరి కి ముహూర్తం నిర్ణయిస్తాడు తండ్రి. "
ఇంతకు ముందు పిల్లాడు పుట్టిన తర్వాత గ్రహాలు చూసి జాతకం రాసేవారు. ఇప్పుడు జాతకం రాసి పిల్లాడ్ని కనే టైం నిర్ణయిస్తున్నారు... hmm!
చాలా బావుందండీ కధ .ముగింపు మనసును కదిలించేలా ఉంది .కాని కండిషన్స్ తో ఒక అగ్రిమెంట్ లాగా చేసుకున్న పెళ్లిని , భార్యనూ పిల్లవాడి తండ్రి గౌరవించి మళ్ళీ పెళ్లి చేసుకోక పోవడం కొద్దిగా వాస్తవానికి దూరంగా అనిపించింది .
రిప్లయితొలగించండిఆ కథ జ్యోతిలో చదివినప్పుడు చాలాసేపు ఏడ్చాను ,నాకు సాఫ్ట్ వేర్ వుద్యోగాస్తుల మీద కూడా ఒక స్టేజి లో అయిష్టత ఏర్పడింది .కథ ఐన మనస్సు కదిలిపోయేల చేసాడు రచయిత.మంచి కథ పరిచయం చేసారు.
రిప్లయితొలగించండి@జయభరత్, అరుణాంక్, చైతన్య : ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@పరిమళం: అతనికి భార్య ఉన్నప్పటి కన్నా, ఆమె పోయాకే ఆమె మీద ప్రేమ పెరిగిందని అనిపించిందండి నాకు.. ధన్యవాదాలు..
@చిన్ని: నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యానండి ఆ కథ చదివి.. ధన్యవాదాలు.