మంగళవారం, మార్చి 31, 2009

దేవుడి పెళ్లి

ఉగాది మర్నాడు మా శివుడి కళ్యాణం. ఉదయాన్నే లౌడ్ స్పీకర్లో భక్తి పాటలు నిద్ర లేపాయి. ఓ గంట సేపు బాగానే ఉంది కాని, తరువాత మొదలయ్యాయి తిప్పలు. సినిమా పాటలు మొదలు పెట్టి ఇక ఆపరే.. పోనీ అవైనా వినసొంపుగా ఉన్నాయా అంటే అదీ లేదు. గుడి మా ఇంటికి మరీ దగ్గర కావడంతో మైక్ బాధ తప్పలేదు. కొబ్బరాకుల పందిరి స్థానం లో షామియానా వచ్చింది. సీరియల్ బల్బులతో మల్లె పందిరీ అవీ అల్లలేదు కానీ లైటింగ్ బాగానే ఏర్పాటు చేశారు. గణపతి పూజ అవీ మధ్యాహ్నమే కానిచ్చేశారు. సాయంత్రం పల్లకిలో ఊరేగింపు. బ్యాండ్ మేళం తో..

ఊరేగింపు పూర్తయ్యాక రాత్రి పదింటికి కళ్యాణం మొదలైంది. కిందటి సంవత్సరం కళ్యాణం చూడడం కుదరలేదు. ఈ యేడాది వచ్చిన మార్పు ఏమిటంటే ఎప్పుడూ కళ్యాణం చేయించే పెద్దాయన స్థానం లో, వయసులో ఆయన కన్నా చిన్న వాడైన మరో పంతులు గారు వచ్చారు. కళ్యాణం వేళకి బ్యాండు వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఈ సంవత్సరం వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా.. బాణాసంచా కూడా బాగా కాల్చారు. ఇన్ని మార్పులు ఏమిటా అని ఎంక్వయిరీ చేస్తే తెలిసిందేమిటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మారారని.. కొత్తగా వచ్చినాయన అన్నీ దగ్గరుండి శ్రద్ధగా చేయిస్తున్నారని.

చాలా సంతోషంగా అనిపించింది ఏర్పాట్లు చూసి. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఎక్కువమంది కొత్తగా ఎన్నికైన కమిటి చైర్మన్ బంధువులు, మిత్రులు. ఈవో కూడా భక్తుల్లో కూర్చున్నారు. దానితో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు దగ్గర ఉండి ఏర్పాట్లన్నీ శ్రద్ధగా చేశారు. మా చిన్నప్పుడు ఓ రెండు మూడు కుటుంబాల వాళ్ళం మాత్రమే కళ్యాణం టైం కి వెళ్ళేవాళ్ళం. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో, వీరణాల వాయిద్య నేపధ్యంలో కళ్యాణం జరిగేది. గణపతి పూజ నుంచి మొదలు పెట్టేవారేమో, మొత్తం తంతు పూర్తయ్యేసరికి తెల్లవారిపోయేది. ఆ వంకతో మేము మర్నాడు బడి యెగ్గొట్టేసే వాళ్ళం.

పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పట్టు బట్టల్లో మెరిసిపోతున్నారు. మండపం నిండుగా జనం ఉన్నా అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. పంతులుగారికి కూడా ఉత్సాహం వచ్చినట్టు ఉంది. మంత్రాలకి అర్ధం చెబుతూ, జరుగుతున్న తంతు ఎందుకో వివరిస్తూ చాలా ఓపికగా జరిపించారు. పాదుకలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి నీళ్ళతో కడిగారు.. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అన్నమాట. ఆ తర్వాత జీలకర్ర-బెల్లం. పంతులు గారు, మా పూజారి గారు పార్వతి పరమేశ్వరుల తలలపై వాటిని ఉంచారు.

వధూవరుల తాత , తండ్రుల వివరాలు, వారి గోత్రాలు, ఋషులు అన్నీ ప్రవర రూపంలో చదివారు. 'నిర్గుణ నిరాకార..' అంటూ చదువుతుంటే వినడానికి భలే ముచ్చటగా అనిపించింది. పార్వతీ దేవికి మూడు మంగళ సూత్రాలు. మనుషులకైతే రెండే కాని, దేవతలకి మూడు సూత్రాలు ఉండాలట. తలంబ్రాలు పోస్తుంటే వీరణాల వాళ్ళు, బ్యాండు వాళ్ళు పోటీ పడ్డారు. 'పందిట్లో పెళ్లవుతున్నాదీ ..' లాంటి పాటలన్నీ వాయించేశారు బ్యాండ్ వాళ్ళు. మరో పక్క బాణాసంచా. ఆ హడావిడి చూసి 'జరుగుతున్నది మన దేవుడి పెళ్లేనా' అని సందేహం వచ్చింది.

భక్తులు తెచ్చిన మల్లె దండలూ, గులాబి మాలలూ అలంకరించేయడంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురూ మిలమిలా మెరిసిపోయారు. తలంబ్రాల బియ్యం కోసం భక్తులు పోటీ పడ్డారు. అరటి పళ్ళతో పాటు, పులిహోర ప్రసాదాన్ని అందరికీ పంచారు పూజారి గారు. ఈవో, ఆయన స్టాఫ్ వచ్చిన భక్తులందరికీ వీడ్కోలు ఇచ్చారు. మా దేవుడికి చాలా ఆదాయం ఉన్నా ఆయన కళ్యాణం ఇంత వైభవంగా ఎప్పుడూ జరగలేదు. ఓ అధికారి తన విధి నిర్వహణలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఏటా జరిగే వేడుకకే కొత్త కళ వచ్చింది.

సోమవారం, మార్చి 30, 2009

సిరిబొమ్మ

ఉగాది రోజు ఉదయాన్నే అమ్మవారి గుడి దగ్గర హడావిడి మొదలైంది. లౌడ్ స్పీకర్లతో మైక్ పెట్టేశారు. ఆరోజు అమ్మవారి తీర్ధం. తీర్ధం రోజు ఉదయమే ఇంటింటికి అమ్మవారి 'చల్ల ఘటం' వస్తుంది. గుడి పూజారి ఓ పెద్ద ఇత్తడి గిన్నె కి చుట్టూ వేపాకులు కట్టి ఓ పెద్ద పసుపు ముద్ద పెట్టి భజంత్రీలతో ఇల్లిల్లూ తిరుగుతాడు. ఇంటి ముందుకు చల్ల ఘటం వచ్చినప్పుడు ఓ బిందెడు నీళ్ళలో మజ్జిగ కలిపి ఉంచి, గుమ్మంలో ఎత్తు పీట వేసి ఉంచాలి.

పూజారి ఆ పీట మీద కూర్చుని గిన్నెని నెత్తిమీద పెట్టుకుంటాడు. బిందెడు నీళ్ళనూ గిన్నెలో పోయాలి. అప్పుడు అతను గిన్నెలో నీళ్ళు కొన్ని ఖాళీ బిందెలో పోసి, మరి కొన్ని ఇంట్లోకి గుమ్మంలో నుంచే చల్లుతాడు. చల్ల ఘటం ఊరేగింపు మద్యాహ్నం వరకు జరుగుతుంది. ప్రతి ఇంటి ముందు పూజారి తడిసి ముద్ద కావాల్సిందే. మా గుడి పూజారి ఈ సంవత్సరం చల్ల ఘటాన్ని లెక్చరర్ గా పని చేస్తున్న వాళ్ళ అబ్బాయికి అప్పగించాడు.

చల్ల ఘటం వచ్చి వెళ్లాకే ఇళ్ళలో భోజనాలు. భోజనం కాగానే తీర్దానికి ప్రయాణం. చిన్నప్పుడైతే ఉదయం నుంచి ప్రతి గంటకీ ఓ సారి తీర్ధం వెళ్లి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అంత ఆసక్తి లేకపోయింది. అమ్మవారి గుళ్ళో దర్శనం చేసుకున్నాక, తీర్ధం లో షాపింగ్. నేను మరీ 'కొత్త బిచ్చగాడి' తరహాలో హడావిడి చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇతకీ తీర్ధం లో కొనడానికి ఏమీ కనిపించ లేదు. చుట్టూ పక్కల ఉండే పిల్లలకి ప్రెజెంట్ చేయడం కోసం కొన్ని బొమ్మలు మాత్రం కొన్నాను.

తీర్ధం లో స్నేహితులతో బాతాఖానీ వేస్తుండగానే సిరిబొమ్మ ఊరేగింపుకి బయలుదేరింది. అమ్మవారి కావలిదారుని సిరిబొమ్మ అంటారు. చేతిలో కత్తితో చిన్న పిల్లలు జడుసుకునేలా ఉంటుంది ఆ బొమ్మ. పండుగ రోజు మాత్రం అందరికీ వినోదించే సాధనం. సిరిబొమ్మ అలా బయలుదేరగానే అందరు అరటిపళ్ళ కొట్ల మీద పడ్డారు. గుడి ఎదురుగా నా ఫ్రెండ్ ఒకడు షాప్ పెట్టాడు.

ఓ గంటలో ఊరేగింపు పూర్తి చేసి సిరిబొమ్మ ని తీసుకొచ్చారు. గుడి ఆవరణలో ఓ చెక్క స్థంభాన్ని పాతి దాని చివర్న మరో కర్రని అడ్డంగా కట్టారు, ఏడు అంకెలా. ఈ రెండో కర్ర చివర సిరిబొమ్మని కట్టి తాడు సాయంతో గుండ్రంగా తిప్పడం మొదలు పెట్టారు. జనం అంతా గాలిలో తిరుగుతున్న సిరిబొమ్మని అరటి పళ్ళతో కొడుతున్నారు. కొన్ని పళ్ళు సిరిబొమ్మకి, మరి కొన్ని చూస్తున్న వాళ్లకి తగులుతున్నాయి. నా ఫోన్ లో ఉన్న కెమేరాతో ఫోటోలు తీసే ప్రయత్నం చేశాను. పరాకుగా ఉన్నానేమో ఓ అరటి పండు ఎక్కడినుంచో వచ్చి నా చాతి మీద తగిలింది.

కాసేపు సిరిబొమ్మని గాలిలో తిప్పి కిందకి దించేశారు. గాలిలో ఉండగా అరటి పళ్ళతో కొట్టలేక పోయిన చిన్న పిల్లలు కిందకి దించిన బొమ్మ మీద పళ్ళు విసరడం మొదలు పెట్టారు. సిరిబొమ్మని శుభ్రంగా తుడిచి గుడిలో పెట్టేశారు. గుడి ఆవరణ అంతా అరటి పళ్ళతో నిండి పోయింది. సిరిబొమ్మ ని కొట్టడం పూర్తైతే తీర్ధం కూడా ముగిసినట్టే. షాపుల వాళ్ళు మాత్రం చీకటి పడే వరకు ఎదురు చూస్తారు, ఎవరైనా రాకపోతారా కొనడానికి అని.

ఆదివారం, మార్చి 29, 2009

తరం మారుతోంది..

దాదాపు పదిహేనేళ్ళ తర్వాత మా ఊరి అమ్మవారి జాతర చూశాను. ఈ పదిహేనేళ్ళలో కొన్ని ఉగాదులు మా ఊళ్ళో జరుపుకున్నాను.. ఉగాది రోజు ఉదయాన్నే ఊళ్ళో దిగి, సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ.. ఈసారి మాత్రం ముందస్తుగానే ప్లాన్ చేసుకోడం వల్ల పండుగను బాగా ఆస్వాదించ గలిగాను. ఉగాదికి రెండు రోజుల ముందు సాయంత్రం భోజనం కానిచ్చి, పంట పొలాల మధ్యలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్లాను, గతాన్ని నెమరు వేసుకుంటూ..

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ లో గుడి మెరిసిపోతోంది.. జనం మాత్రం పల్చగా ఉన్నారు. గుడి అరుగు మీద కూర్చుని కొందరు 'పెద్ద మనుషులు' లెక్కలు చూసుకుంటున్నారు. వాళ్ళలో కొందరు నాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. గుడి ఆవరణలో ఎరువుల బస్తాల సంచులతో కుట్టిన బరకాలు పరిచారు. గుడి అరుగు మీద కొందరు పిల్లలు కూర్చున్నారు. బరకాల చుట్టూ, కొంచం వెనకగా పంట కాలువ గట్టుమీద నిలబడి మరికొందరు జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నారు.

వ్యవసాయం చేసే వాళ్ళందర్నీ ఒక దగ్గరికి చేర్చే వేడుక మా ఊరి జాతర. కుండలు చేసే కుటుంబానికి చెందిన వాళ్ళు గుడి నిర్వహిస్తారు. అమ్మవారు వడ్రంగం పని చేసే వారి ఇంటి ఆడపడుచు. కాబట్టి వాళ్ళు దగ్గర లేనిదే ఏ కార్యక్రమం ప్రారంభం కాదు. జాతర నిర్వహించాల్సిన బాధ్యత రైతులది. ఖర్చు మొత్తం రైతులంతా పంచుకోవాలి. వ్యవసాయ పనులు చేసే కూలీలకి ఈ జాతర ఓ ఆట విడుపు. ఏ వినోదం లేని రోజుల్లో అతి పెద్ద వినోదం. చిన్నప్పుడు అర్ధం కాలేదు కాని, ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవుతోంది.. జాతర వెనుక ఎంత చక్కని ఉద్దేశ్యం ఉందో..

ఎనమండుగురు 'ఆసాదులు' నృత్యం చేస్తున్నారు.. డోలు, సన్నాయి వాద్యాలకి అనుగుణంగా. నృత్యం తో పాటు మధ్య మధ్యలో నోటి నుంచి పెద్ద తాడు తీయడం, బ్లేళ్ళు తినడం లాంటి ట్రిక్కులు చేసి చూపిస్తున్నారు. మా చిన్నప్పుడు నోరంతా తెరుచుకుని వాళ్ళ విన్యాసాలు చూసేవాళ్ళం. ఇప్పుడు బాగా చిన్నపిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళు చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. కొందరు యువకులు ఓ చోట నిలబడి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలు, ప్రజారాజ్యం, డీఎస్సీ నోటిఫికేషన్.. ఇలా రకరకాల విషయాలు. అతి కొద్ది మంది మాత్రం నన్ను గుర్తు పట్టి పలకరింపుగా నవ్వారు.

గుండాట లేదు.. కనీసం కాఫీ హోటల్ కూడా లేదు. జనం లేకపోవడంతో గిట్టుబాటు కాక వాళ్ళెవరూ రావడం లేదట. నేను మా 'పెద్ద మనుషుల' దగ్గరికి వెళ్లాను. జనం వచ్చే ప్రోగ్రాములు పెట్టొచ్చు కదా అని చనువుగా కోప్పడ్డాను. వాళ్ళ కష్టాలు వాళ్ళవి. రికార్డింగ్ డాన్స్ పెడితే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనం వస్తారు, కానీ పోలీసులు ఒప్పుకోరు. "డాన్స్ అమ్మాయిలకి ఎంత ఇస్తామో, పోలీసులకి కూడా అంత ఇవ్వాలి.. డబ్బు ఖర్చు పెట్టినా ప్రోగ్రాం జరుగుతుందన్న గ్యారంటీ లేదు.." అన్నాడో మిత్రుడు. "ఈసారి స్పెషల్ డప్పులు.. వస్తాయి చూడు.." అన్నాడు తనే.. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పంటలు, రాజకీయాల మీదుగా చర్చలు సాగుతుండగా డప్పుల వాళ్ళు వచ్చేశారు ఓ వాన్ లో.

అప్పటివరకు ఆసాదుల డాన్స్ చూసిన వాళ్ళంతా డప్పుల వాళ్ళ చుట్టూ మూగిపోయారు. నెమ్మదిగా జనం పెరిగారు. మా గణేష్, మరికొందరు మిత్రులు వచ్చారు. అందరం చిన్నప్పటి రోజులకి వెళ్ళిపోయాం. అప్పట్లో ఏనుగులు, లొట్టి పిట్టలు, గేదెల డాన్స్, రమడోలు ఇలాంటివన్నీ ఉండేవి. మేము కబుర్లలో ఉండగానే డప్పుల వాళ్ళు ప్రదర్శన మొదలు పెట్టేశారు. డప్పుల తో పాటు వంటికి కిరోసిన్ రాసుకుని, నిప్పుతో కాల్చుకోడం, ఒకరి భుజాలపై మరొకరు నిలబడి డప్పు కొట్టడం.. ఇలా రిస్కుతో కూడిన విన్యాసాలు. ఒళ్ళు గగుర్పొడిచేలా.. జనం లేకపోవడం తో ఆసాదులు డాన్స్ ఆపేసి, గుడి వెనక్కి వెళ్లిపోయారు చుట్టలు కాల్చుకోడానికి.

అర్ధరాత్రి దగ్గర పడుతుండగా గుడి పూజారి అందర్నీ తొందర పెట్టాడు.. ఊరేగింపు మొదలు పెట్టాలని. ఆసాదులంతా 'గరగలు' నెత్తిమీద పెట్టుకుని ఒళ్ళు మరచి ఆడడం మొదలు పెట్టారు. సాంబ్రాణి మేఘాలు దట్టంగా అలముకున్నాయి. వచ్చిన జనంలో సగం మంది ఇంటి దారి పట్టారు. ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళకి పూనకాలు వస్తాయని సందేహించాం కాని, పూజారి భార్య వాళ్లకి వేపాకు వేసిన మంచినీళ్ళు తాగించి చల్ల బరచేసింది. ముందుగా డప్పుల వాళ్ళు, వెనుక ఆసాదులు, ఆ వెనుక పూజ ఘటం.. ఇలా ఊరేగింపు మొదలైంది.

ఊరేగింపులో ఎక్కువమందిని ఆకర్షించేది 'గవాట.' వాడుక భాషలో చెప్పాలంటే అమ్మవారికి కోడిపెట్టని బలి ఇవ్వడం. ఇది ఎలా జరుగుతుందంటే గరగ నెత్తిమీద పెట్టుకున్న ఆసాదుకి కోడిపెట్టని వాసన చూపించి అతన్ని దాన్ని అందుకోవల్సింది గా కవ్విస్తారు. ఆసాదుని ఇద్దరు కుర్రాళ్ళు కంట్రోల్ చేస్తారు. మరో కుర్రాడు కోడిపెట్ట తో పరిగెడతాడు..అందీ అందకుండా అందిస్తూ.. ఆసాదు కోడిపెట్టని అందుకునే వరకు ఇది కొనసాగుతుంది. ఊరి ముఖ్య కూడళ్ళలో గవాట జరుగుతుంది. కాసేపు చూసి, మా ఇంటి వరకు ఊరేగింపుతో కలసి వచ్చి, మిత్రులకి బై చెప్పి ఇంట్లోకి నడిచా..

మంగళవారం, మార్చి 24, 2009

గడిచిపోయిన వసంతం

అసలు అందరూ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు 'ఉగాది' జరుపుకుంటారు కానీ, మా ఊరికి ఉగాది కళ ఓ నాలుగు రోజులు ముందుగా వచ్చి రెండు వారాలు కొనసాగేది. ఉగాదికి రెండు రోజుల ముందు మా గ్రామ దేవత గుళ్ళో జాతర. చాలా వైభవంగా జరిగేది మా చిన్నప్పుడు. పెద్ద పెద్ద కళ్ళతో ఉండే అమ్మవారి విగ్రహం చూసి భయం అనిపించినా జరిగే సంబరాలు చాలా సరదాగా ఉండేవి. గరగ నృత్యాలు పోటాపోటీ గా జరిగేవి. వాటితో పోలిస్తే ఇప్పటి శిల్పారామం గరగ నృత్యాలు జస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ అంతే. ఇవి కాకుండా లొట్టిపిట్టలు, పులి వేషాలు భలే గమ్మత్తుగా ఉండేవి. నిద్ర ఆపుకుని, రెప్పవెయ్యకుండా చూసేవాళ్ళం. అర్ధరాత్రి వరకు గుడి దగ్గర డ్యాన్సు లు చేసి అప్పుడు ఊళ్లోకి బయలుదేరే వాళ్ళు. జంతు బలి ఉండేది కాని, పిల్లల్ని చూడనిచ్చేవాళ్ళు కాదు.

జాతర మర్నాడు శుబ్బరంగా నిద్రపోయే వాళ్ళం. ముందు రోజు రాత్రంతా మేలుకొని ఉండే వాళ్ళం కాబట్టి, ఇంట్లో ఏమి అనేవాళ్ళు కాదు. టైలర్ ని వేధించి బట్టలు కుట్టించి తెచ్చుకోవడం లాంటి చిన్న చిన్న పనులు మాత్రం ఉండేవి. పచ్చడి కోసం వేప పువ్వు కోయాలని సరదా ఉండేది కాని, పిల్లలు కోయ కూడదు అనే వాళ్ళు. పగలంతా పడుకున్నా, రాత్రి త్వరగా నిద్రపోయేవాళ్ళం. మర్నాడు ఉదయమే లేవాలి కదా.. తలంటి స్నానానికి. ఉగాది పచ్చడి తినేసి, కొత్త బట్టలేసుకుని ఊరి మీద షికారుకి. 'పండగ పూటా పిల్లల్ని ఏమి అనకూడదు' అనే నియమం ఉండేది కాబట్టి బోలెడంత స్వేచ్చ. ఊరిమీద తిరగడానికి ఎంత టైమూ సరిపోయేది కాదు.

మద్యాహ్నం నుంచి అమ్మవారి గుడి దగ్గర తీర్ధం. వ్యాపారులు షాపులు పెట్టుకుంటుండగా వెళ్లి సర్వే చేసి వచ్చేవాళ్ళం. మొత్తం ఎన్ని షాపులు, కొత్త వస్తువులు ఏమిటి, ఏమేం కొనుక్కోవాలి, ఇంట్లో ఎన్ని డబ్బులు అడగాలి.. ఇత్యాదులన్నీ తెలుసుకోడానికి. సినిమా పాటల పుస్తకాల మొదలు, రైలు, కారు బొమ్మల వరకు చాలా ఉండేవి, మమ్మల్ని కన్ఫ్యుస్ చేయడానికి. నాకైతే హైదరాబాద్ నుంచి బొమ్మలు వచ్చేవి కాబట్టి వాటి మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. తీర్ధంలో సాయంత్రం 'సిరిబొమ్మ' వేడుక. చెక్కతో చేసిన సిరిబొమ్మ అమ్మవారి కావలి దారు. ఓ తాడు తో కట్టి గాలిలో గిరగిరా తిప్పుతుంటే అందరూ ఆ బొమ్మని అరటిపళ్ళ తో కొడతారు. మేము కొడితే అటువైపు ఉన్నవాళ్ళకి తగిలేది. గబుక్కున పక్కకి తప్పుకునే వాళ్ళం, దెబ్బ తిన్న వాళ్ళు మమ్మల్ని చూడకుండా.

చైత్ర శుద్ధ విదియ మా ఊళ్ళో శివుడి కళ్యాణం. ఐదు రోజుల వేడుక. తిధి ద్వయం వస్తే ఉగాది రోజు రాత్రే కళ్యాణం. అక్కడ మన హాజరు తప్పనిసరి. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని ఊరికే అన్నారా? గుడి ముందు పెద్ద పందిరి. లైటింగ్, మైక్ ఉండేవి. మైకతన్ని బతిమాలి మనకి కావాల్సిన పాటలు వేయించు కోవడం. సాయంత్రం దేవుడి ఊరేగింపు.. ఆ తర్వాత కళ్యాణం. ప్రసాదాలు తీసుకుని ఇల్లు చేరేసరికి అర్ధ రాత్రి దాటేది. మర్నాటి నుంచి రోజూ సాంస్కృతిక ప్రదర్శనలు. నాటకాలు, రికార్డింగ్ డాన్సులు, వీధిలో తెర కట్టి సినిమాలు.. రంగాప్రసాద్ బజ్జీల షాప్ ఉండేది ప్రతి రోజూ. ఇది కాకుండా సోడాలు, చిరుతిళ్ళు అమ్మే షాపులు వెలిసేవి, ప్రోగ్రాం ని బట్టి.. చుట్టుపక్కల ఊళ్ళనుంచి కూడా జనం వచ్చే వాళ్ళు. చివరి రోజు అన్న సంతర్పణ. దగ్గర ఉండి వంటలు చేయించడం, వడ్డించడం. మనకి మంచినీళ్ళు పోసే ఛాన్స్ మాత్రమే దొరికేది. అయినా అది మాత్రం వడ్డించడం కాదూ..?

శివుడి గుడిముందు పందిరి తీయగానే, ఇటు పక్క ఉన్న రాముడి గుడి ముందు పందిరి వెలిసేది. శ్రీరామ నవమి హడావిడి. రాముడి గుడి ఓ కుటుంబానిది. నవమి వేడుక వాళ్ళే చేసేవాళ్ళు. పెద్దయ్యాక హైదరాబాద్ లో బిర్లా టెంపుల్ చూసి, మనూళ్ళో ఫలానా వాళ్ళు రాముడి గుడి కట్టించినట్టుగానే ఇక్కడ బిర్లా వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడు అన్నమాట అనుకున్నాను. రాముడి గుడి వాళ్ళు కొందరిని మాత్రమే పిలిచేవాళ్ళు. మాకు వాళ్ళతో దూరపు బంధుత్వం కూడా ఉండడంతో తప్పక పిలుపు వచ్చేది. ఓ సారి రాముడి కళ్యాణం కోసమని తీర్ధం లో గోళ్ళ రంగు కొనుక్కుని నేనే వేసుకున్నా. అది చూసి అందరూ నవ్వడమే. గోరింటాకులా వేలికి సగం వరకు పూసుకుంటే చూసే వాళ్లకి నవ్వు రావడం సహజమే కదా..

రాముడి గుడిలో వడపప్పు, పానకం తో పాటు, మద్యాహ్నం గుడిలోనే భోజనాలు ఉండేవి. ఈ గుడి వాళ్లకి కొంచం భక్తి భావాలు ఎక్కువ. బుర్రకథ, హరికథ లాంటి ప్రోగ్రాములు పెట్టేవాళ్ళు. ఆ కథలు చెప్పే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళం.. వచ్చింది మొదలు, వెళ్ళే వరకు వాళ్ళని రెప్ప వేయకుండా చూడడం అన్నమాట. ఆ ఇంటి తర్వాతి తరానికి భక్తి అంతగా లేకపోవడం తో గుడి పాడు బడింది. ఓ గాలివానకి కూలిపోయింది. అలా నవమి వేడుకలు కళ్ళముందే మాయమయ్యాయి. జాతర, కళ్యాణం సందర్భంగా వేసే కార్యక్రమాల్లోనూ చాలా మార్పులు వచ్చేశాయి.

చాలా ఏళ్ళ తర్వాత పండక్కి ఊరికి వెళ్తున్నా.. జాతర, తీర్ధం, కళ్యాణం చూసి రావడానికి. జాతర చూసైతే చాలా సంవత్సరాలు అయ్యింది. 'మన చిన్నప్పటిలా లేదు..' అని స్కూల్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. 'మనం కూడా మన చిన్నప్పటిలా లేము కదా..' అంటూ ఉంటాను నేను. వచ్చాక ఆ వివరాలతో మరో టపా రాస్తాను. అందరికి ఉగాది శుభాకాంక్షలు.

సోమవారం, మార్చి 23, 2009

శంకరాభరణం

తులసి (మంజు భార్గవి) తన కొడుకు శంకరాన్ని తీసుకుని గోష్పాదాల రేవులో లాంచీ దిగుతుంది. శంకర శాస్త్రి (సోమయాజులు) అప్పుడే గోదావరి లో స్నానం ముగించి, సంధ్య వార్చి ఇంటికి తిరుగుముఖం పడతాడు. రేవు మెట్ల మీద పడ్డ ఆయన పాద ముద్రలకి భక్తితో నమస్కరిస్తుంది తులసి. 'శంకరాభరణం' సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ సీన్ తప్పక గుర్తుంటుంది. తులసి కి శంకర శాస్త్రికి ఉన్న అనుబంధం ఎలాంటిదో ఈ ఒక్క సీన్ లోనే చూపించాడు దర్శకుడు.

ఈ సీన్ చిత్రీకరణ అనుకున్నంత సులువుగా జరగలేదు. సోమయాజులు నడిచి వెళ్తున్నారు.. మంజుభార్గవి నమస్కరించి షాట్ ఓకే అయ్యేలోగా ఆ ముద్రలు ఎండకి ఆరిపోతున్నాయి. సోమయాజులు ని ఎన్నిసార్లు నడిపిస్తారు? అప్పుడు దర్శకుడు కే. విశ్వనాధ్ తన సహాయకులకి ఓ సూచన ఇచ్చారు. ఆ సూచన ప్రకారం వాళ్ళు సోమయాజులు కాళ్ళకి కొబ్బరి నూనె రాసి నడిపించారు.. ఆ ముద్రలకే మంజు భార్గవి నమస్కరించింది.

'ఏ తీరుగా నను దయచూసెదవో' పాట షూటింగ్. చిన్న పిల్లవాడు శంకరం ఆ పాట పాడుతుంటే శాస్త్రి గారమ్మాయి శారద (రాజ్యలక్ష్మి) వాడివంక ప్రేమగా చూడాలి. షాట్ తీయబోతుంటే, రాజ్యలక్ష్మి ముఖం అలసటగా ఉండడం గమనించారు విశ్వనాధ్. ఆమెని ఓ గంట నిద్రపోయి రమ్మని ఈ లోగా వేరే సీన్స్ షూట్ చేశారు. విశ్రాంతి తీసుకుని వచ్చిన రాజ్యలక్ష్మి ముఖం తేటగా ఉండడం తో ఆ సీన్ తీశారు.

పెళ్లి చూపుల్లో 'సామజ వర గమనా' పాట స్వరం తప్పు పాడాక, శారద పశ్చాతాపం తో తండ్రి దగ్గర తప్పు సరరించుకుని పాడే సీన్ తీస్తే ఆ రోజుకి షూటింగ్ అయిపోతుంది. కాని కరెంట్ పోయి చాలా సేపటి వరకు కరెంట్ రాలేదు. సాయంత్రం ఏడు దాటడంతో ఇక షూటింగ్ ఉండదని అనుకున్నారు అందరు.. ఐతే కరెంట్ వచ్చాక షూటింగ్ పూర్తి చేశారు.

'శంకరాభరణం' పాటలన్నీ వేటూరే రాశారు. విశ్వనాధ్ కథ చెప్పగా విని 'ఓంకార నాదాను సంధానమౌ..' పాటను అప్పటకప్పుడే ఆశువుగా చెప్పేశారు. ఐతే షూటింగ్ మొదలైపోయినా చివరిపాట పూర్తి కాలేదు. మహదేవన్ డేట్స్ దొరక్కపోవడం వల్ల. అనారోగ్యం తో ఆస్పత్రిలో చేరిన వేటూరి హాస్పిటల్ బెడ్ మీద పడుకునే ఆ పాట డిక్టేట్ చేశారు.

ఇక రికార్డింగ్ ఐతే 'ఓంకార నాదాను' తోనే మొదలు పెట్టారు. రికార్డింగ్ కి రాలేనని జానకి చివరి నిమిషంలో కబురు చేశారు. పాటలో తను పాడే భాగం చాలా తక్కువగా ఉండడమే కారణం. బాలు ఆవిడని కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. 'సామజవరగమనా' పాట రికార్డింగ్ పూర్తయ్యాక జానకి 'మంచిపాట దొరికింది' అని సంతోష పడ్డారు.

'శంకరా నాద శరీరా పరా' షూటింగ్ మద్రాస్ దగ్గరలో ఉన్న ఒక శివాలయంలో.. విజయ స్టూడియో నుంచి చెత్తని కిలోల్లెక్కన కొనుక్కొచ్చారు. వర్షం ఎఫెక్ట్ కోసం తెచ్చిన ఫైర్ ఇంజిన్ సరిగా పని చేయకపోవడంతో సోమయాజులు ని చాలా సార్లు తడపాల్సి వచ్చింది. 'ఈ దేహాన్ని మీకు అప్పగించేశాను.. మీ ఇష్టం' అన్నారాయన నవ్వుతూ. ఆ పాటలో మెరుపుల ఎఫెక్ట్ కోసం కొవ్వొత్తులని వెలిగించి ఆర్పారు. 'దొరకునా ఇటువంటి సేవ' పాట ని రాజమండ్రి లో రెండు రోజులపాటు అవిశ్రాంతం గా తీశారు. ప్రొడక్షన్ వాళ్ళంతా తిండి, నిద్ర లేక వేల్లాడబడి పోయారు.

నేను 'శంకరాభరణం' షూటింగ్ కనీసం ఒక్క సీన్ కూడా చూడలేదు. మరి ఈ విశేషాలన్నీ ఎక్కడివంటే ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేసిన వంశీ రాసిన 'వెండితెర నవలలు' అన్న పుస్తకం లోవి. 'శంకరాభరణం' తో పాటు 'శుభోదయం' 'సీతాకోక చిలుక' 'అన్వేషణ' సినిమాల కథల్ని వంశీ మార్కులో చదవొచ్చు. సాహితి ప్రచురణలు ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 100.

ఆదివారం, మార్చి 22, 2009

వాల్ పేపర్

బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలలో స్థిరపడిన వాళ్ళు సైతం కొన్ని నమ్మకాల విషయంలో యెంత మొండిగా, ఏకపక్షంగా వ్యవహరిస్తారో వివరించే కథ 'వాల్ పేపర్.' వివినమూర్తి రాసిన ఈ కథ నాలుగేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయ్యింది. తన అమ్మ, నాన్నల పెళ్లి ప్రపోజల్ మొదలు, తన బాల్యం వరకు జరిగిన సంఘటనలను ఓ పిల్లవాడు చెబుతూ ఉంటాడు. తను పుట్టని క్రితం జరిగిన సంగతులు కూడా పిల్లవాడు చెబుతూ ఉండడం కొంచం తికమక పెట్టినా, ఒక్కసారి కథలోకి వెళ్ళాకా లీనమై చదువుతాం.

పిల్లవాడి తల్లి, తండ్రి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తూ ఉంటారు. కంప్యూటర్ 'లాన్' ద్వారా పెళ్లి ప్రపోజల్ పెడతాడు తండ్రి. ఒకరి కెరీర్ కి ఒకరు అడ్డు రాకూడదు, ఒకరి వ్యక్తిగత స్వేచ్చ కి మరొకరు ఇబ్బంది కలిగించ కూడదు లాంటి కండిషన్స్ తో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పిల్లవాడు తల్లి కడుపులో ప్రవేశించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మొదటిసారి ప్రెగ్నెన్సి వచ్చినప్పుడు, కెరీర్ కి అడ్డంకి అవుతుందని వద్దనుకుంటారు. తర్వాత ప్రమోషన్, ఇల్లు కట్టడం ఈ గొడవల్లో పిల్లల విషయం పట్టించుకోరు. పిల్లవాడి నాయనమ్మ మనవడిని ఎత్తుకోవాలని పట్టుదలతో ఉండడంతో మన కథానాయకుడు తల్లి గర్భం లో ప్రవేశిస్తాడు.

ఇక పిల్లవాడి తల్లిదండ్రుల హడావిడి అంతా, ఇంతా కాదు. ఇంటర్నెట్ లో పిల్లల పెంపకం గురించి వివరాలు డౌన్ లోడ్ చేసుకోడం నుంచి ఓ కార్పోరేట్ హాస్పిటల్ లో డెలివరి ఏర్పాట్ల వరకు.. క్షణం తీరిక ఉండదు ఇద్దరికీ. తల్లి, తండ్రి, పుట్టబోయే పిల్లవాడి గ్రహాలు కలిసే విధం గా జాతక చక్రం వేయించి ఆ ప్రకారం డెలివరి కి ముహూర్తం నిర్ణయిస్తాడు తండ్రి. పిల్లవాడి తాత ఓ రిటైర్డ్ స్కూల్ మాస్టారు. ఆయనకీ జాతకాల మీద నమ్మకం లేదు. జరుగుతున్న తంతుని నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు ఆయన.

అనుకోని విధంగా ఏడో నెలలోనే ప్రసవం జరుగుతుంది. డాక్టర్లు పిల్లవాడిని ఇంక్యుబేటర్ లో ఉంచి బతికిస్తారు. ఐతే యెంత కష్టపడ్డా తల్లిని మాత్రం రక్షించలేక పోతారు. చెడ్డ ముహూర్తంలో కొడుకు పుట్టడం వల్లనే తన భార్య చనిపోయిందని మనస్పూర్తిగా నమ్ముతాడు తండ్రి. పిల్లవాడి ముఖం చూడడానికి కూడా ఇష్ట పడడు. రెండో పెళ్ళికి ఒప్పుకోడు. చనిపోయిన భార్య ఫోటోలు తన కంప్యుటర్ లో వాల్ పేపర్స్ గా సెట్ చేసుకుని ఆమె స్మృతి లోనే గడుపుతూ ఉంటాడు. పిల్లవాడి తాత తనే తల్లీ తండ్రీ అయ్యి పిల్లవాడిని సాకుతూ ఉంటాడు. పిల్లవాడికి నక్సలైట్ ఉద్యమంలో మరణించిన నేత 'సత్యం' పేరు పెడతాడు.

పెద్దవాడవుతున్న సత్యం తండ్రికి దగ్గర కావాలనుకుంటాడు. తాతయ్య మినహా ఇంకెవరూ అతనితో మాట్లాడారు. ఒకసారి గొడవ చేసి తాతయ్యతో కలిసి వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తాడు సత్యం. అక్కడ తాతయ్యకి ఆరోగ్యం పాడవుతుంది. సత్యం తండ్రికి పట్టరాని కోపం వస్తుంది. 'నా భార్యని చంపావు.. నా తండ్రిని కూడా చంపుతావా' అని పిల్లవాడి మీద విరుచుకు పడతాడు. ఎంత ప్రయత్నించినా తండ్రికి దగ్గర కాలేకపోతాడు సత్యం. రోజులు గడుస్తూ ఉంటాయి.

ఒక రోజు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్తాడు సత్యం. ఇయర్ ఫోన్స్ వింటూ లాప్ టాప్ మీద పని చేసుకుంటున్నతండ్రి మౌనంగా సంతకం చేసి ఇచ్చేస్తాడు. తను ఫస్ట్ రాంక్ సాధించిన విషయం తండ్రి గుర్తించకపోవడంతో అది చెప్పడం కోసం అతని మోకాలిని తాకుతాడు సత్యం. పని డిస్టర్బ్ కావడంతో సహనం కోల్పోయిన తండ్రి సత్యాన్ని బాగా కొడతాడు. తాతయ్య చూసి, అడ్డుపడి సత్యాన్ని హాస్పిటల్ కి తీసుకెళతాడు. మగతలో సత్యం కలవరిస్తూ ఉంటాడు.. "నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను తాతయ్యా..అప్పుడు నేను కూడా నాన్న కంప్యుటర్ లో వాల్ పేపర్ అవుతా...."

2006 లో విడుదలైన కొన్ని కథా సంకలనాలలో ఈ కథని చేర్చారు..

శుక్రవారం, మార్చి 20, 2009

ఎన్ని..కల..లో

న్యూస్ పేపర్లు, టీవీ చానళ్ళు, వెబ్ సైట్లు, బ్లాగులు..ఎక్కడ చూసినా ఒకే అంశం మీద చర్చలు.. త్వరలో జరగ బోతున్న ఎన్నికల గురించి.. పార్టీలు, బలాబలాలు, కూటములు, తారాతోరణాలు.. వీటి గురించే వాదోప వాదాలు. వీటన్నంటి ప్రభావం అనుకుంటా.. రాత్రి నిద్ర పోబోతుంటే ఒక ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు తెలుగు, సైన్సు, సోషల్ సబ్జక్టుల్లో ప్రశ్న జవాబులు గుర్తొచ్చాయి.. ఎన్నికల గురించి ఆ తరహా లో ప్రశ్నలు, జవాబులు...

ప్రశ్న: ఎన్నికలు అనగా ఏమి? వివరింపుము?
జవాబు: ప్రజాస్వామ్య దేశములలో ఐదేళ్లకోసారి జరిగే ఒక ప్రక్రియను ఎన్నికలు అందురు. ఈ ప్రక్రియలో ప్రజలు తమ నాయకులను ఎన్నుకుందురు. ఎన్నికలలో గెలిచిన వారు నాయకులై ప్రజలను పాలింతురు.గెలుచుట కొరకు ఎన్నికలలో పోటీ పడే అభ్యర్ధులు ప్రజలకు పలు విధాలైన హామీలు ఇచ్చెదరు. ఆకాశమును దించు దుమని,నెలవంక ను తుంచుదుమని చెప్పుటకు సైతం వెనుకాడరు. అంతిమంగా ఎక్కువమంది ప్రజల ఓట్లు పొందినవారు రాబోవు ఐదేళ్ళ కాలానికి పాలకులవుదురు.ఐతే ఎన్నికలు ఐదేళ్ళ కొకపరి మాత్రమే జరుగ వలెనన్న నియమేమిదియూ లేదు. అవి రెండు,మూడేళ్లకూ జరుగవచ్చు.

ప్రశ్న: ప్రజాస్వామ్యం అనగానేమి?
జవాబు: ప్రజల చేత, ప్రజలకొరకు, ప్రజల యొక్క నాయకులను ఎన్నుకొనుట యే ప్రజాస్వామ్య మనే భావన విస్తృత వ్యాప్తిలో కలదు. ప్రజాస్వామ్యము నందు ప్రజలే ప్రభువులు అని కూడా అనుచూ ఉంటారు. ఐతే ఈ ప్రజల పాత్ర పరిమితమే అన్న భావన కూడా కలదు. రాచరికమునకు ప్రజాస్వామ్యము భిన్నమైనది. రాచరికమున, రాజు మరణించి నంతనే అతని కుమారుడు రాజవును. ప్రజాస్వామ్యమును, పాలకుడు మరణించిన యెడల, అతని కుమారుడు ఎన్నికలో గెలిచి నాయకుడు కావాల్సి ఉండును. ఈ ఎన్నిక నామ మాత్రము అన్న విషయము గమనింప దగినది.

ప్రశ్న: ప్రజలు అనగా ఎవరు? ప్రజలకు, ఓటర్లకు గల భేదములను వివరింపుడు?
జవాబు: ఒక దేశమునందలి మనుష్య జనాభా అంతా ఆదేశపు ప్రజలు. కులము, మతము, వర్ణము, వర్గము, స్త్రీ, పురుష, బాల, వృద్ధ భేదములు లేవు. ఐతే ఈ ప్రజలలో 18 సంవత్సరముల వయస్సు దాటిన వారందరూ ఓటర్లు. ఓటర్లందరూ ప్రజలే, కాని ప్రజలంతా ఓటర్లు కారు. నాయకులు,నాయకులు కాగోరువారు ఈ భేదమును కలలో సైతం మర్చిపోరు.. వీరు ప్రకటించు కార్యక్రమాలు,ఇచ్చు హామీలు అన్నీ ఓటర్లని ఉద్దేశించి ఉండును. ప్రకటనలలో మాత్రం వీరు ప్రజలకోసం పని చేయుచున్నాము అని చెప్పుచూ ఉందురు.

ప్రశ్న: ఓటర్ల ప్రత్యేకత ఏమి?
జవాబు: ప్రజాస్వామ్యమున ఎన్నికలు జరిగిన ప్రతిసారి, ఓటర్లు ఓటరు మహాశయులు, ఓటరు దేవుళ్ళు అవుదురు. కనీసం రెండు మూడు మాసములు నాయకులంతా వీరిని ఆకర్షించుటకు పడరాని పాట్లు పడుదురు. ఎండా కొండా లెక్క చేయక వీరి చుట్టూ తిరిగెదరు. వీరి పిల్లల చీమిడి ముక్కులను సైతం చిరు నవ్వుతో తుడిచెదరు. ఓటరుల కష్టములు చూసి నాయకుల గుండెలు కరుగును. ఓటరులు తమ కష్టములను తాత్కాలికముగా అయినా మరచిపోవలెననే తలంపుతో వారికి డబ్బు, సారాయి పంచెదరని వినికిడి. అందరు నాయకులనుంచీ కానుకలు స్వీకరించే స్వేచ్చ మరియు తమకి నచ్చిన వారికి మాత్రమే వోటు వేసే స్వేచ్చ ఓటర్లకు కలవు. దీనినే ప్రజాస్వామ్యము యొక్క సౌందర్యము (beauty of democracy)అని కూడా కొందరు అందురు.

ప్రశ్న: ఎన్నికలు పూర్తైన పిదప ఏమి జరుగును?
జవాబు: నాయకులకి పూర్తి విశ్రాంతి లభించును. ఊరూ వాడా తిరిగే శ్రమ తప్పును. మరల ఎన్నికలు ప్రకటించు వరకు నచ్చిన విధముగా సంచరించు స్వేచ్చ వారికి కలదు. ఎన్నికలలో ఓడినవారు తదుపరి ఎన్నికలలో గెలుచుటయే లక్ష్యముగా కృషి ప్రారంబింతురు.. కృషి అనగా అధికారములో ఉన్నవారిపై విమర్శలు కురిపించుట మాత్రమే.., ప్రజల కొరకు కష్టించి పని చేయుట కాదు. ఒకసారి ఎన్నికలు పూర్తైన పిదప, మరల ఎన్నికల సమయము వరకు ఓటరులను పలకరించు తీరిక, ఓపిక ఎవ్వరికీ కలుగవు.

...ఇలా జవాబులు రాస్తే ఎన్ని మార్కులు వస్తాయా అని ఆలోచిస్తున్నా...

బుధవారం, మార్చి 18, 2009

నాయికలు-కోకిల

కోకిల అనగానే ఏం గుర్తొస్తుంది? మెరిసే నల్లని చాయతో లేతాకుపచ్చని మావి కొమ్మల గుబురులో దాగి తీయని పాటలు వినిపించే ఓ పక్షి.. పెద్ద పెద్ద కళ్ళు, పల్చని పెదవులు, పట్టు కుచ్చు లాంటి పొడవైన కురులు, బాగా కాచిన పాలమీద కట్టే మీగడ తరక లాంటి దేహ ఛాయ, చిలుక పలుకులాంటి స్వరం కలబోసిన సౌందర్య రాసి పేరు కూడా కోకిలే.. ఈ కోకిల మామిడి కొమ్మల్లో స్వేచ్చగా విహరించే వనప్రియ కాదు.. కూలిపోబోతున్న రాజ మహల్లో పంజరం లాంటి కట్టుబాట్ల మధ్య ఒంటరి జీవితం గడుపుతున్న ఇరవయ్యేళ్ళ సుకుమారి.. రాజ్యాన్ని కోల్పోబోతున్న రాకుమారి.. వంశీ సృష్టించిన 'మహల్లో కోకిల.'

గోదారి ఒడ్డున ఉన్న వెంకట నారాయణపురం అనే పల్లెటూరి కోటలో జమీందారు గారి గారాల పట్టి కోకిల. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన కోకిల అన్న చందర్ తో కలిసి ఆ బంగ్లా లో ఉంటూ ఉంటుంది. ఆస్తులు కోల్పోతున్నా ఆచార, సంప్రదాయాలను కోల్పోడానికి ఇష్టపడని చందర్ కోకిలను పరదాల మాటునే పెంచుతాడు. అన్నగారంటే ఎడతెగని భయం కోకిలకి.. బంగ్లాలో ఇద్దరే ఉంటున్నా, అవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఆ అన్నా చెల్లెళ్ళు. కాలక్షేపం కోసం రకరకాల పక్షుల్ని పెంచుతూ ఉంటుంది కోకిల. ఆ పక్షులకి మాటలు నేర్పుతాడు చందర్. వాటిలో మనుషుల కనుగుడ్లు పీకి తినే ప్రమాదకరమైన అగ్గి పక్షి కూడా ఉంటుంది.

పైకి ఆచారాలు, సంప్రదాయాలు అంటూ మాట్లాడే చందర్ ఓ నర్సు 'మాయ' ని రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. ఆస్తులకి సంబంధిన చివరి కేసు కోర్టు లో ఉండగా ఈ నిజం కోకిలకి తెలుస్తుంది. అదే సమయంలో ఊరిలోకి వచ్చిన పగటివేషగాడు శివుడితో అనుకోని పరిస్థితుల్లో మాట్లాడుతుంది కోకిల. తన అన్నగారు కాకుండా ఆమె జీవితంలో మాట్లాడిన తొలి పురుషుడు శివుడు. తన బందిఖానా జీవితం గురించి, దానిమీద తనకి గల విరక్తి గురించి అతనికి వివరంగా చెబుతుంది. ఆమెకి బయటి ప్రపంచం చూపిస్తాడు శివుడు. కోర్టులో ఆస్తి పోగొట్టుకుని కోటకి తిరిగొచ్చిన చందర్ కి కోకిల విషయం తెలిసి శివుడిని హత్య చేయమని పురమాయిస్తాడు.

అగ్గి పక్షి చందర్ ని పొడిచి పొడిచి చంపుతుంది. తను రాజ వంశానికి చెందిన దాన్నన్న రహస్యం ఎక్కడా చెప్పొద్దని కోకిల నుంచి మాట తీసుకుని మరణిస్తాడు చందర్. మాయ తో కలిసి మద్రాసు చేరుకున్న కోకిల నర్తకి గా స్థిరపడుతుంది. మాయ మరణానంతరం, తన దగ్గర సెక్రటరీ గా చేరిన దేవదాస్ ప్రోత్సాహంతో సినిమాల్లో చేరుతుంది కోకిల. పెద్ద తారగా మారడంతో ఆమె గతం మీద పత్రికలకి ఆసక్తి పెరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తన గతం చెప్పాల్సివస్తుంది కోకిలకి. ఆమె జీవిత చరిత్ర సంచలనం సృష్టిస్తుంది.

శివుడు బతికే ఉన్నాడన్న నిజం తెలుస్తుంది దేవదాస్ కి. ఐతే కోకిల ఆ విషయం నమ్మదు. రాఘవరావు అనే వృద్ధుడిని వివాహం చేసుకుంటుంది ఆమె. యెంతో కష్టపడి శివుడి ఆచూకీ పట్టుకుంటాడు దేవదాస్. అతను వెంకట నారాయణ పురం లో ఉన్నాడని తెలుసుకుని కోకిలని అక్కడికి తీసుకెళతాడు. అక్కడకి వాళ్ళు చేరుకునేసరికే శివుడు మరణిస్తాడు. అతని దేహం పై పడి కోకిల మరణించడం నవల ముగింపు. ఇదే నవలకి చాలా మార్పులు చేసి 'సితార' సినిమా తీశాడు వంశీ.

ప్రముఖ నర్తకి కోకిల నృత్య ప్రదర్శనకి టిక్కెట్లు దొరకక దేవదాస్ అతని స్నేహితుడు తిలక్ వెనక్కి రావడంతో కథ ప్రారంభం అవుతుంది. తర్వాత దేవదాస్ కోకిల సెక్రటరీ గా చేరి ఆమెకేదో గతం ఉందని గమనించి, అది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కోకిలకి ఓ సినిమా అవకాశం రావడం, అది ఫ్లాప్ కావడం తో అటు నృత్యం, ఇటు సినిమాలు లేక ఆమె బికారి గా మారుతుంది. అనుకోకుండా దొరికిన మరో సినిమాతో ఆమె గొప్ప హీరోయిన్ అవుతుంది. ఈ క్రమం లో ఆమె గతం చెప్పాల్సివస్తుంది.

కోకిల మానసిక సంఘర్షణ నవల మొత్తం ఉంటుంది. పాఠకులకి కోకిల పాత్ర పట్ల ఆసక్తి, సానుభూతి కలుగుతాయి. ఆమె తన వంశ చరిత్రని తెలుసుకోవడం, శివుడితో బయటికి వెళ్ళడం గుర్తుండి పోతాయి. 'మంచుపల్లకీ' సినిమా ఫెయిల్ అయ్యాక ఎమెస్కో క్రౌన్ సిరిస్ వాళ్ళు పెట్టిన నవలల పోటీకి ఈ నవల పంపానని, బహుమతి గా వచ్చిన పది వేల రూపాయలు కొన్ని నెలలపాటు తన కుటుంబ ఖర్చులని గట్టెక్కించాయని తన 'ఫెయిల్యూర్ స్టొరీ' లో చెప్పాడు వంశీ. ఈ నవలతో పాటు సినిమా కూడా హిట్ అయ్యి, సినిమా రంగంలో వంశీ కి ఓ చోటు ఇచ్చింది.

వంశీ మార్కు వర్ణనలు నవల నిండా బోలెడు. ఐతే వర్తమానాన్ని రాయడానికి భవిష్యత్లా రాసే వంశీ అలవాటు ఒక్కటే ఇబ్బంది పెడుతుంది. 'ఆమె నాట్యం చేస్తోంది' అనడానికి బదులు 'ఆమె నాట్యం చేస్తుంది' అనడం లాంటివి. వంశీ మిగిలిన నవలలతో పోల్చినా ఈ నవల ప్రత్యేకమైనదే..చక్కని కథ, చిక్కని కథనం, సొంపైన వర్ణననలు ఆసాంతం చదివిస్తాయి. ఎమెస్కో ప్రచురించిన 'మహల్లో కోకిల' వెల రూ. 70. సినిమా చూసినప్పటికీ, సాహిత్యాభిమానులు చదవ దగ్గ నవల.

మంగళవారం, మార్చి 17, 2009

ఒక మలుపు

ఉదయం కరిగి మధ్యాహ్నం మొదలవుతున్న వేళ రోడ్డు పక్కన నెమ్మదిగా నడుస్తున్నా.. నా ఆలోచనలో నేను ఉన్నాను.. 'హూ..హా..' అన్న కేకలు వినిపించి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను. రోడ్డు మీద వరుసగా బస్సులు వెళ్తున్నాయి. బస్సులనిండా కిటకిటలాడుతూ టీనేజ్ విద్యార్ధులు. వేగంగా వెళ్తున్న బస్సుల్లోంచి చేతులు బయటికి ఊపుతూ ఆనందం ప్రకటిస్తున్నారు. మరికొందరు ఉత్సాహవంతులు కాగితాలు చించి రోడ్డు మీదకి విసురుతున్నారు.. రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళ మీద పడుతున్నాయి ఆ కాగితం ముక్కలు. కొందరు పాదచారులు విసుక్కుంటున్నారు. నాకు మాత్రం ఆ పిల్లల సంతోషం చూస్తె ఉత్సాహంగా అనిపించింది.

ఓ నాలుగు బస్సులు వెళ్ళాయి.. వాటి వెనుక మోటార్ సైకిళ్ళు.. ఒక్కో మోటార్ సైకిల్ పై ఇద్దరు, ముగ్గురు పిల్లలు.. అదే సంతోషం.. అవే కేకలు.. విషయం ఏమిటా అని ఆలోచిస్తుండగానే నా పక్క ఆయనతో వెనుకతను చెబుతున్నాడు ఇంటర్ మొదటి సంవత్సరం వాళ్లకి ఇవాల్టితో పరిక్షలు అయిపోయాయట. వీళ్ళు పరీక్ష రాసి వస్తున్నారన్న మాట.. అదీ ఆనందం. నిజమే..పరీక్షలు అయిపోవడం అంటే గుండెల మీద భారం దిగిపోడమే. నైట్ ఔట్లు, కంబైండ్ స్టడీస్, బిట్లు గుర్తుంచు కోడానికి చిట్కాలు, సులభంగా బొమ్మలు గీసే పద్ధతులు., పొడుగాటి ఈక్వేషన్లను కుదించుకుని కోడ్ భాషలో గుర్తుపెట్టుకోవడం.. అబ్బా చాలా పెద్ద పనులు..

ఈ పిల్లలంతా ఇప్పుడు ఏం చేస్తారు? బహుశా ఇంటికెళ్ళి భోజనం చేసి నిద్రపోతారు.. సాయంత్రం సినిమాలు, షికార్లు.. మరి రేపటినుంచి? అప్పుడు చూశాను ఆ బస్సుల వైపు.. ప్రైవేట్ కాలేజీలవి. తెలిసి పోయింది.. వీళ్ళంతా కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు అని.. రేపటినుంచో, ఎల్లుండి నుంచో వీళ్ళకి ఇంటర్ రెండో సంవత్సరం క్లాసులు మొదలవుతాయి. ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉండనే ఉంటుంది. ఇంకా ఐ.ఐ.టీ. కోచింగ్ తప్పనిసరి. ఇవాళ ఒక్క రోజే అన్నమాట వీళ్ళ సంబరాలు. రేపటినుంచి మళ్ళీ పుస్తకాలు, పాఠాలు, చదువులు, ట్యూషన్లు.. అమ్మ, నాన్నల పలకరింపులు కూడా ఎలా చదువుతున్నావు అని మాత్రమే.. వేలకి వేలు ఫీజులు కడుతున్నారు మరి.

నిజమే.. ఇంటర్మీడియట్ అనేది విద్యార్ధి జీవితం లో ముఖ్యమైన మలుపు. ఇప్పుటి నిర్ణయాలు అతని/ఆమె భవిష్యత్ ని శాసిస్తాయి. విద్యార్ధులే కాదు, తల్లిదండ్రులూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఐతే ప్రశ్న, ఈ జాగ్రత్త అన్నది కేవలం చదువు విషయంలో తీసుకుంటే సరిపోతుందా? మంచి మార్కులు, రాంకులు, సీట్లు, చదువు, ఇంటర్వ్యూ, ఉద్యోగం, మంచి జీతం.. ఇంతేనా.. ఇది కేవలం ఒక ఉద్యోగిని తయారు చేసే ప్రక్రియ. పిల్లలని కేవలం ఉద్యోగులుగా తయారు చేస్తే సరిపోతుందా? పరిపూర్ణ వ్యక్తులుగా, మంచి చెడులను తెలుసుకునే విచక్షణా శక్తి ఉన్నవారిగా తీర్చి దిద్దనవసరం లేదా?

టీనేజ్ చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో పిల్లలకి చదువుతో పాటు ఇంకా చాలా కావాలి. ముఖ్యంగా తల్లితండ్రుల ప్రేమతో కూడిన మార్గదర్శకత్వం. కోర్సుల ఎంపిక మాత్రమే కాదు, జీవితాన్ని చూడడానికి తమదైన దృక్కోణాన్ని ఏర్పరుచుకోడానికీ ఇది అవసరం. టీనేజ్ పిల్లలు ఎటెన్షన్ ని, ప్రేమని కోరుకుంటారు. ఇంట్లో ఇవి దొరకనప్పుడు బయట వెతుక్కుంటారు. టీనేజ్ ప్రేమల పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. దురదృష్టవశాత్తూ ఇప్పుడొస్తున్న సినిమాల్లో అధికశాతం టీనేజ్ పిల్లల ఎమోషన్స్ ని రెచ్చగొట్టేవే.

కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఈ విషయాలని ఆలోచించ గలుగు తున్నారు? తమ పిల్లల వ్యక్తిత్వ వికాసం గురించి ఆలోచిస్తున్నారు? సరైన సమయం లో తల్లితండ్రుల నుంచి తమకి కావలసినవి అన్నీ పొంద గలిగే పిల్లలు కేవలం ఉత్తమ ఉద్యోగులు గా మాత్రమే కాదు.. ఉత్తమ పౌరులు గానూ మార గలుగుతారు. మరి వీళ్ళలో ఎందరు తలిదండ్రులు ఆ దిశగా కృషి చేస్తారో..? ...బస్సులు, మోటార్ సైకిళ్ళు వెళ్తూనే ఉన్నాయి.. కాగితం ముక్కలతో రోడ్డంతా నిండిపోతోంది..

సోమవారం, మార్చి 16, 2009

తాతయ్య

నాకు ఐదో ఏడు రాగానే తన వళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు తాతయ్య. మా బంధువులందరినీ పిలిచారు. బడిలో మాస్టర్లు, పిల్లలు మా ఇంటికి వచ్చారు. పిల్లలందరికీ చాక్లెట్ల తో పాటు పెన్నులు, పుస్తకాలు పంచారు. నా చేత 'ఓం నమః శివాయః' దిద్దించారు తాతయ్య. "నేనే అక్షరాలూ, అంకెలు నేర్పించి అప్పుడు బడికి పంపుతాను" అని చెప్పారు మాస్టర్లతో. వాళ్ళు సరే అన్నారు. తాతయ్య మాటకీ ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు.. ఇంట్లోనే కాదు, ఊళ్ళో కూడా. మాస్టర్లకి ఆవేళ మా ఇంట్లోనే భోజనం. నాకు సంబంధించి, పుట్టిన రోజు కాకుండా జరిగిన మొదటి పండుగ అది.

"మూడు నెలల్లో రాయడం, చదవడం నేర్చుకుంటే నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తా.." అన్నారు తాతయ్య నాతో. హైదరాబాద్ లో మా అత్తయ్య వాళ్ళు, ఇంకా చాలా మంది బంధువులు ఉన్నారు. తాతయ్య తరచూ వెళ్లి వస్తూ ఉండేవాళ్ళు. హైదరాబాద్ వెళ్ళాలన్న కుతూహలం కన్నా, "మూడు నెలల్లో నువ్వు నేర్చుకోగలవా?" అన్న తాతయ్య చాలెంజ్ నన్ను ఉత్సాహ పరిచింది. ప్రతిరోజూ తాతయ్య పలక మీద అక్షరాలు రాసివ్వడం, నేను దిద్ది, చూడకుండా రాసి చూపించడం.. సరిగ్గా మూడు నెలలు గడిచేసరికి తాతయ్యకి చిన్న బాలశిక్ష చదివి వినిపించాను. తాతయ్య కూడా తన మాట నిలబెట్టుకున్నారు.. రెండువారాల పాటు హైదరాబాద్ అంతా తిప్పి. అమ్మనీ, నాన్ననీ విడిచిపెట్టి అన్నిరోజులు ఉండడం అదే మొదటిసారి.

తాతయ్య కి తొలి మగ సంతానం నాన్న.. ఆయన ఫస్ట్ బార్న్ ని నేను. మనవలు, మనవరాళ్ళందరిలో నేనంటే ప్రత్యేకమైన అభిమానం తాతయ్యకి. ఆయన దానినెప్పుడూ దాచుకోలేదు. నా నోటివెంట ఏమైనా వస్తే అది జరిగి తీరాలి. నేను అడిగింది ఏమైనా సరే ఇంటికి రావాల్సిందే. ఐతే ఈ వైభవం ఎన్నాళ్ళో సాగలేదు. తాతయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది. వైద్యం కోసం తరచూ హైదరాబాద్ వెళ్లి, అక్కడే ఎక్కువ కాలం ఉంటూ ఉండేవాళ్ళు. మేమిద్దరం ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. నా పేరున ఉన్న ఉత్తరం పోస్ట్ మాన్ బడికి తీసుకు వచ్చి ఇస్తే పిల్లలతో పాటు, మాస్టర్లూ ఆశ్చర్యపోయేవారు. పోస్టాఫీసు గురించి, ఉత్తరాల గురించీ పాఠమ్ చెప్పేటప్పుడు నన్ను ఉదాహరణగా చూపించేవాళ్ళు.

తను మా ఊరు వచ్చేముందు ఉత్తరంలో అడిగేవాళ్ళు.. నాకోసం ఏమేం తేవాలని. నా కోరికల లిస్టులో కణికెలు (బలపాలు), రంగు పెన్సిళ్ళు, నాలుగు రంగుల రీఫిళ్ళున్న పెన్ను ఉండేవి. అడక్కపోయినా బట్టలు, బొమ్మలు, తినుబండారాలూ వచ్చేవి. తాతయ్యకి చక్కెర వ్యాధి ఉండడంతో తనని తీపి తిననిచ్చేవారు కాదు ఇంట్లో. తనకి ఆసక్తి లేకపోయినా ఇంట్లో వాళ్ళు వద్దు అనేసరికి పట్టుదల పెరిగేది. నన్ను షికారుకి తీసుకెళ్ళి చాక్లెట్లు కొనిపెట్టి, నా దగ్గర అడిగి తీసుకుని తినేవాళ్ళు. "ఇంట్లో చెప్పద్దు" అని చెప్పి. ఆయన మాట మాత్రం నేను కచ్చితంగా వినేవాడిని. నేను నాన్నకి కోపం తెప్పించి దెబ్బలు తింటానని బాధ పడేవాళ్ళు. తాతయ్య ఉండగా నా వంటి మీద దెబ్బ పడేది కాదు. కానీ, తాతయ్య ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు కాదు.

తాతయ్య నేను పోట్లాడుకున్న సందర్భాలూ లేకపోలేదు. పట్టుదలలో ఇద్దరమూ సమానమే. తగ్గే వాళ్ళం కాదు. తీవ్రంగా పోట్లాడుకుని మాట్లాడుకోని సందర్భాలూ ఉన్నాయి. తను నాకు కొని ఇచ్చినవన్నీ వెనక్కి ఇచ్చెయ్య మనేవాళ్ళు. నేను మౌనంగా తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆయనకి బాగా కోపం పెరిగి పోయేది. నాన్న నన్ను కొడతానని బెదిరించి, తాతయ్యకి క్షమాపణ చెప్పించాలని చూసేవాళ్ళు. నేను దెబ్బలకి సిద్ధపడేవాడిని.

ఇద్దరం కలిసిపోయాక మళ్ళీ మామూలే. పుట్టిన రోజుకి, నాకు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు బహుమతి ఇచ్చేవాళ్ళు. తను ఊళ్ళో లేకపొతే స్కూలికి మనియార్డర్ వచ్చేది. అలాంటప్పుడు పోస్టుమాన్ నాచేత సంతకం పెట్టించుకుని డబ్బులు మాత్రం ఇంట్లో ఇచ్చేవాడు. నేను నవలలు చదువుతున్నానని తెలిసి ఎంతో బాధ పడుతూ ఉత్తరం రాశారు తాతయ్య. చదువు నిర్లక్ష్యం చేయొద్దని.

నేను హైస్కూల్లో ఉండగా మార్చి నెలలో ఒక మద్యాహ్నం ఇంటికి త్వరగా వచ్చేశా.. నాన్న బయటకి వెళ్ళారు. అమ్మ నాకు భోజనం పెడదాం అనుకుంటుండగా పోస్టుమాన్ వచ్చాడు 'టెలిగ్రాం' అంటూ.. సంతకం పెట్టమని కాగితం నాకిచ్చి విషయం అమ్మకి చెప్పేశాడు 'తాతయ్య పోయారని.' నేనే సంతకం చేశా, తాతయ్యే అక్షరాలు నేర్పించారని గుర్తు చేసుకుంటూ.. హైదరాబాద్ వెళ్ళేవరకు తాతయ్యతో జరిగిన ప్రతి సంఘటనా గుర్తొస్తూనే ఉంది. ఏడ్వాలని ఉన్నా కన్నీళ్లు రాని సందర్భం. మేము హైదరాబాద్ వెళ్ళేసరికే అంతా ఐపోయింది.. తాతయ్య లేరనే విషయం నమ్మడానికి చాలా సమయం పట్టింది. ఆ లోటు మరొకళ్ళు పూడ్చలేరనీ అర్ధమైంది.

రెండేళ్ళ క్రితం డాక్టర్ నాకు టెస్ట్ లు చేసి ''స్వీట్, ఆయిల్స్ తగ్గించండి' అని చెప్పినప్పుడు నాకెందుకో తాతయ్యే గుర్తొచ్చారు. ఆయన నా దగ్గరనుంచి చాక్లెట్లు తీసుకున్న దృశ్యం.. ఆయనకి చాక్లెట్లు ఇవ్వడం నుంచి, మరొకరి దగ్గర నుంచి నేను తీసుకునే దగ్గరికి వచ్చేశానా? 'కాలం వేళ్ళ సందుల నుంచి ఇసుకలా జారిపోవడం' ఏమిటో అనుభవం లోకి వచ్చినట్టు అనిపించింది. ఇవాళ తాతయ్య చనిపోయిన రోజు. ఉదయం నుంచీ ఏపని చేస్తున్నా ఆయన గుర్తొస్తూనే ఉన్నారు.

ఆదివారం, మార్చి 15, 2009

ఒక విందు కథ

ఒక స్నేహితురాలి నుంచి డిన్నర్ కి ఆహ్వానం వచ్చింది నిన్న. సందర్భం తన పుట్టిన రోజు. స్థలం ఓ ప్రముఖ రెస్టారెంట్. బయట తినడం వీలైనంత వరకు తగ్గించమని డాక్టరు సలహాలా కాకుండా కొంచం హెచ్చరింపు గానే చెప్పడంతో ఈ మధ్య బయటకి వెళ్ళడం తగ్గింది. ఈ రెస్టారెంట్ మాత్రం పూర్వాశ్రమం లో నేను చాలాసార్లు సందర్శించిందే. ఎప్పుడూ అతిధులతో కళకళ లాడుతూ ఉండేది. అలాంటిది వీకెండ్ రోజున కూడా పెద్దగా జనం కనిపించ లేదు.'ఔరా..ఆర్ధిక మాంద్యం ప్రభావం' అనుకున్నాను. ఐతే జనం పల్చబడడానికి అసలు కథ వేరే ఉందని అర్ధం అవడానికి కొంచం సమయం పట్టింది.

మేము మొత్తం ఆరుగురం స్నేహితులం ఓ గుండ్ర బల్ల చుట్టూ కూర్చున్నాం (రౌండ్ టేబిల్ అని వేరే చెప్పాలా?).. మేము ఆర్డర్ చెప్పేంతవరకు నక్షత్రకుడి తమ్ముడిలా మా వెంటపడ్డ సర్వరుడు తర్వాత పత్తా లేదు. మేమేమో ఆ విషయం పెద్దగా ఆలోచించకుండా కబుర్లలో పడ్డాం. కార్నర్ టేబిల్ అవడం, పెద్దగా జనం లేకపోవడంతో చర్చలు కాస్తా వాదనలోకి వెళ్ళాయి. కాసేపటికి టమాటా సూప్ వచ్చింది. పొగలు చిమ్ముతూ ఉంటుందనుకున్నది కాస్తా గోరువెచ్చగా అనిపించింది. సందర్భం కాదు కానీ నాకు 'గోరు వెచ్చని సూరీడమ్మా..' పాట గుర్తొచ్చింది. సూప్ కన్నా మా వాదనలే వేడిగా ఉండడంతో బౌల్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు.

తర్వాత రొట్టెలు వచ్చాయి.. వీటినే రోటీలంటారు.. ఇవి కూడా గోరు వెచ్చగానే ఉండడంతో అప్పుడు వచ్చింది సందేహం. వాటిని లాగిస్తూనే చుట్టూ చూడడం గమనించాం.. జనాకర్షక పథకాల్లో భాగంగా ఆ రెస్టారెంట్ వాళ్ళు ఓ గోడకి హోం థియేటర్ ఫిక్స్ చేశారు. వచ్చిన అతిథులతో పాటు, బాసు-బంటు తేడా లేకుండా స్టాఫ్ అందరూ టీవీకి కళ్ళప్పగించారు. హిందీ చానెల్ లో డాన్స్ ప్రోగ్రాం రియాలిటీ షో వస్తోంది. ఎక్కువగా మేకప్, పొదుపుగా దుస్తులు ధరించిన నర్తకీమణులు పాత, కొత్త హిందీ పాటలు మరియు వాటి రిమిక్సులకి ఒళ్ళు మరచి నర్తిస్తున్నారు. టెస్ట్ చేద్దామని సర్వర్ని పిలిచాం.. అబ్బే.. స్పందన లేదు.. ఓ పది నిమిషాల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. టీవీ వైపు చూస్తే కమర్షియల్స్ వస్తున్నాయి. ప్రోగ్రాం కి బ్రేక్ అన్నమాట.

నాకైతే రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళ మీద చిరాకు అనిపించింది. ఇంట్లో ఉన్నంత సేపు ఎలాగు టీవీ చూస్తారు. రెస్టారెంట్లో కూడా టీవీ ఏనా అని.. మా హోస్టు చాలా బాధ పడ్డారు. 'అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చాను.. వేరే చోటకి వెళ్ళాల్సింది' అని. మా ఫ్రెండ్ ఒకతను వెంటనే 'పోన్లెండి నెక్స్ట్ బర్త్ డే కి వేరే చోటకి తీసుకెల్దురు గాని' అంటూ ఆవిడని ఓదార్చాడు. అయినా కూడా స్టాఫ్ నుంచి స్పందన లేదు. నాట్యం లో మునిగిపోయారు. 'వచ్చే బర్త్ డే కి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కాని, ఇక్కడికి రాలేం' అన్నాను నేను.. మా వాళ్ళు ప్రశ్నార్ధకంగా చూడడం తో 'అప్పటివరకు ఈ రెస్టారెంట్ ఉండాలి కదా' అని పూర్తి చేశా.. మాకు కొంచం దూరంగా నిలబడి టీవీ చూస్తున్న సర్వరుడికి వినబడేలా.. 'ఇలాంటివి చాలా విన్నాం' అన్నట్టుగా అతను తదేక దృష్టితో నృత్యం తిలకిస్తున్నాడు. 'ఇంత చిన్న వయసులోనే యెంత స్థిత ప్రజ్ఞత?' అనిపించి ముచ్చటేసింది.

'బహుశా వీళ్ళ కిచెన్ లోంచి కూడా టీవీ చూసే వీలుందేమో.. వాళ్ళు కూడా డాన్స్ చూస్తూ వంట చేస్తున్నారేమో..' ఇలా కామెంట్స్ చేసుకుంటూ ప్లేట్స్ ఖాళీ చేస్తున్నాం. టీవీ లో కొందరు పార్టిసిపెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొంచం ఆలశ్యంగా వచ్చిన ఫ్రెండ్ కోసం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాం. మాకెవరికీ దాని మీద పెద్దగా హోప్స్ లేవు. ఆశ్చర్యం ఏమిటంటే ఆర్డర్ చేసిన పదో నిమిషంలో పొగలు కక్కుతున్న ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి వినయంగా వడ్డించాడు సర్వరుడు. ఇంతలో ఎంత మార్పు అని అందరూ ఆశ్చర్యపోవడమే.. మా కామెంట్స్ విని జ్ఞానోదయం పొందారేమో అని కూడా అనేసుకున్నాం.

'పోనిలెండి.. కనీసం ఇదొక్కటీ అయినా బాగుంది' అని మా హోస్టు కూడా చాలా సంతోష పడ్డారు.. అల్ప సంతోషి.. ఇందులో మతలబు ఏమిటా అని ఆలోచిస్తూ చుట్టూ చూశా.. అప్పుడు తెలిసింది అసలు రహస్యం. టీవీ లో నృత్య కార్యక్రమం ఐపోయింది. ఆనందంగా బిల్లు పే చేస్తున్నహోస్టు కి ఈరహస్యం చెప్పలేదు. మరోసారి 'హ్యాపీ బర్త్ డే' చెప్పి ఇంటికి బయలుదేరా..

శనివారం, మార్చి 14, 2009

మీరా కళాజ్యోత్స్న

తెలుగు పద్య నాటకం అనగానే ఎవరికైనా గుర్తొచ్చేవి సుదీర్ఘమైన రాగాలు. నటన కన్నా, ఒకరిని మించి మరొకరు రాగాలు తీస్తూ పద్యాలు ఆలపించడం లోనే నటీనటులు పోటీ పడతారు. పూర్వం పల్లెల్లో నాటకాలు ప్రదర్శించినపుడు ఈ పద్యాలకి వన్స్ మోర్లు పడేవి. ముఖ్యంగా 'గయోపాఖ్యానం' 'హరిశ్చంద్ర' వంటి నాటకాల ప్రదర్శన అంటే సగం నాటకం కూడా పూర్తి కాకముందే తెల్లవారిపోయేది. కేవలం పద్యాల కోసమే నాటకాలు చూసేవాళ్ళు అప్పటి తరం ప్రేక్షకులు. కాలం తో పాటే ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పు వచ్చింది. పద్యనాటకాలను ఇష్టపడే వాళ్ళు కూడా సుదీర్ఘ రాగాలను ఆమోదించలేకపోతున్నారు.

ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును గుర్తించి, అందుకు అనుగుణంగా పద్య నాటక ప్రదర్శన లో గణనీయమైన మార్పులు తెచ్చిన సంస్థ విశాఖపట్టణానికి చెందిన 'మీరా కళాజ్యోత్స్న.' ఈ సంస్థ స్థాపకుడు మీగడ రామలింగ స్వామి. రంగస్థలంపై మూడున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు. కేవలం నటుడు మాత్రమే కాదు రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఆహార్య నిపుణుడు - ఒక్క మాటలో చెప్పాలంటే నాటకానికి సంబంధిన ప్రతి పనిలోనూ నైపుణ్యం ఉన్నవాడు. వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకుడైన రామలింగ స్వామి ప్రవృత్తి పద్య నాటకాలు నిర్మించి ప్రదర్శించడం. తర్వాతి తరానికి రంగస్థల శిక్షణ ఇవ్వడం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాటకాలకు నంది బహుమతులు ప్రవేశ పెట్టి, పోటీలు ప్రారంభించాక మొదటి మూడు సంవత్సరాల్లో వివిధ విభాలకు గాను మొత్తం 35 నందులను అందుకున్న సంస్థ 'మీరా కళాజ్యోత్స్న.' మరో విశేషమేమిటంటే స్వామి మినహా మిగిలిన అందరూ రంగస్థలానికి కొత్తవారు. నాయిక పాత్రలు పోషించే రత్న శాస్త్రి ఐతే షష్టిపూర్తి కి చేరువైన ఓ బామ్మ గారు. ఒక స్కూలు ప్రిన్సిపాల్. కొత్త స్క్రిప్టు ని తయారు చేయడం మొదలు, దానికి కావలసిన సంగీతం, నాతీనతులకి ఆహార్యం సమకూర్చడం, రిహార్సల్స్ చేయించడం, పోటీలకి ఎంట్రీ పంపడం ఇలా సమస్తమూ ఒంటి చేతి మీద నిర్వహిస్తారు స్వామి.

అది 'అశ్వద్ధామ' కావొచ్చు, 'గుణనిధి' కావొచ్చు లేదా 'చిరు తొండ నంబి' కావొచ్చు.. ఏ నాటకం లోనైనా ప్రేక్షకుల కోసం ఓ సందేశం అంతర్లీనంగా ఉంటుంది. వర్తమాన అంశాలను పరోక్షంగా స్పృశిస్తారు. పద్యాలు వినసొంపుగా ఉంటాయి. పాత్రధారుల నటన తమ పరిధి మేరకు మాత్రమే ఉంటుంది. భారీ సెట్టింగులకి వీరి ప్రదర్శనలు దూరం. చిన్నపాత్రలను మలచడం లో సైతం ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. ప్రతి నాటకం చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు నాటకంలో లీనమై రసానుభూతిని పొందుతారు. కేవలం నంది నాటకాల్లో మాత్రమే కాదు, ఆంధ్ర దేశం లో జరిగే అని ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లోనూ పాల్గొన్న 'మీరా కళాజ్యోత్స్న' కళాకారుల ప్రతిభ అనతి కాలంలోనే విదేశాలకూ పాకింది.

కొత్తతరం సరే.. పాత తరం ప్రేక్షకులు ఈ మార్పులని అంగీకరిస్తారా? అన్న సందేహం సహజం. ప్రదర్శన ముగిశాక వీరిని అభినందించే వారిలో పాత తరం ప్రేక్షకులే ముందుంటారు. పద్యాలను ఆలపించడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న స్వామి అప్పుడప్పుడు టీవీల్లో కనిపిస్తున్నారు.. పద్యాలు ఆలపిస్తూ. చిన్న పిల్లలకి పద్యాలు నేర్పించడం ఆయనకి ఇష్టమైన పనుల్లో ఒకటి. వరుసగా ప్రతిసంవత్సరం 'మీరా కళాజ్యోత్స్న' కి నందులు రావడం సహజంగానే కొందరికి నచ్చలేదు. రచ్చ, రాజకీయం చేశారు. నాటక ప్రదర్శనకి అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం. తమ చప్పట్ల ద్వారా అప్పటికప్పుడే వాటిని ప్రకటిస్తారు ప్రేక్షకులు. ఈ రివార్డులు మాత్రం 'మీరా కళాజ్యోత్స్న' కి అందుతూనే ఉన్నాయి.

గురువారం, మార్చి 12, 2009

వీరబొబ్బిలి

"కుక్కలకు మాత్రం నీతి ఉండక్కర్లేదనుకున్నావా పాత్రుడూ? ...ఫలానీ రాజు ఫలానీ కుక్కను పెంచి చెడి పోయినాడని జనం చెప్పుకుంటే లోకం లోని కుక్కలన్నిటికీ మచ్చగాదా?" ...ఇదేమిటి? 'కన్యాశుల్కం' మధురవాణి డైలాగు ఒక కుక్క చెబుతోంది? అని ఎవరైనా అనుకున్నారంటే వాళ్లకి 'వీరబొబ్బిలి' తెలియదన్నమాట. రాజుల లోగిళ్ళ లో పుట్టి పెరిగి, మాటలతో పాటు వారి మర్యాదలు, పెంకితనాలు కూడా నేర్చుకున్న గ్రామసింహం వీరబొబ్బిలి. కె.యెన్.వై. పతంజలి దాదాపు మూడు దశాబ్దాల క్రితం సృష్టించిన పాత్ర ఇది. అలమండ కి చెందిన ఉప్పలపాటి ఫకీర్రాజు దివాణం లో బొబ్బిలి బస. "నావల్ల ఈ దివాణానికి కళ, కాంతి. ఈ బొబ్బిలే లేకపోయాక ఈ దివాణం ముఖం చూసే వాడెవడోయ్," అనడానికి సందేహించదు.

బొబ్బిలి వేట కుక్క. అందుకే దివాణానికి కావలి కాయదు. కావలి కుక్కలు మరో నాలుగు ఉన్నాయి, కాని జన్మతా వేట కుక్క కాబట్టి వాటితో కలవదు. ఓ అర్ధరాత్రి దివాణం లోకి ప్రవేశించిన దొంగకి వంటింటి దారి చూపించడం తో పాటు వంటరాజు దాచిన పోలుగుల కూరలో తన వాటా అడిగి మరీ తింటుంది. "నేనే గనక కావలి కుక్కని ఐతేనా.. నున్ను పిక్క పట్టుకుని కరిసీసుందును. వేట కుక్కని కాబట్టి బతికిపోయావు. ఇది నా యింట్లో కూర. ఇందులో నాకు వాటా ఉంది.. రేపైనా నేను తినాల్సిందే.. ఇప్పుడు నాకు తినాలనిపించింది కాబట్టి నిన్ను పెట్టమన్నాను.. ఇది దొంగతనం కాదు తెలిసిందా.." అని దొంగాడితో వాదించగలదు.

ఫకీర్రాజుని చూడవచ్చిన అతని బంధువు ఈటెసూరి ని గుమ్మంలోనే అడ్డగించి దర్పం ప్రదర్శిస్తుంది బొబ్బిలి. "నన్ను చూసి భయపడినట్టు ఒప్పుకో"మంటుంది ఈటెసూరి ని. "రాసోడిని.. ఓ కుక్కకి భయపడతానా?" అని బింకం ప్రదర్శిస్తాడతను. ఇంతలొ ఫకీర్రాజు వచ్చి "భయం లేదు బావా.. చూడడానికి గుర్రం లా ఉంది గానీ, ఇది తిండి దండుగ కుక్క. ఏమి చేయదులే.. అయినా ఇది దాని ఆరోగ్యం ఎంత బాగా కాపాడు కుంటుందనీ.. వేటలో ఏదైనా ఏదైనా పెద్ద జంతువు కానీ కనపడిందా.. ఇది చెట్టెక్కి మరి దిగదు.." అనేసరికి గుడ్ల నీరు కక్కుకుంటుంది బొబ్బిలి.

"భవిషం తీసేశావు కదయ్యా ఫకీరూ.. నీ కుక్కని అవమానిస్తే అది నీకు అవమానం గాదూ.." అని మద్యాహ్నం వరకూ చింతిస్తుంది. అదే ఈటె సూరికి ఫకీరు బొబ్బిలిని కానుకగా ఇస్తాడు. సూరి చేతిలో అవమానానికి గురైన బొబ్బిలి బాధ వర్ణనాతీతం. సూరి తనని తన్నినపుడు "కుడి కాలుతోనే తన్నాడా.. కుడి కాలే అయిఉంటుంది లే.. అయినా ఈ బొబ్బిలిని ఎడం కాలితో తన్నేంత మగదూర్ ఉన్నవాడెవడు?" అనుకుని తృప్తి పడుతుంది.

ఫకీర్రాజు స్నేహితుడు 'గోపాత్రుడు' భూమి బల్లపరుపుగా ఉందని అలమండ వాస్తవ్యులతో వాదిస్తాడు. పాత్రుడికి మొదట మద్దతు పలికింది బొబ్బిలే. "విశ్వాసం ముఖ్యం" అని చెప్పి పాత్రుడింటికి వెళ్ళిపోతుంది. పాత్రుడి భార్య తమ ఇంట బొబ్బిలికి బోయినం ఎంత మాత్రం వీలుపడదు అని కచ్చితంగా చెప్పేసరికి "విశ్వాసం ముఖ్యమా? బోయినం ముఖ్యమా?" అనే సమస్య వస్తుంది బొబ్బిలికి. "ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది కాబట్టి బోయినం ముఖ్యం. బోయినం చేశాక, మళ్ళీ ఆకలి వేసేవరకు విశ్వాసమే ముఖ్యం" అని చెప్పేస్తుంది పాత్రుడికి. బోయినం విషయంలో ఎలాంటి శషభిషలూ లేవు బొబ్బిలికి. భూమాత ఆకారం అనే అంశం మీద అభిప్రాయ భేదాలోచ్చి ఊరు రెండుగా చీలిపోతుంది. ఫకీరు కూడా పాత్రుడిని సమర్ధించడంతో బొబ్బిలి బోయినం సమస్య పరిష్కారం అవుతుంది.

భూ ప్రపంచం లో తన వంటి కుక్క మరొకటి లేదని ప్రగాఢ విశ్వాసం బొబ్బిలికి. ఇదే విషయం లో ఓ దెయ్యం తో వాదన పెట్టుకుంటుంది. ఈటె సూరి దగ్గర నుంచి తిరిగి వచ్చేటపుడు ఓ ఊరి ప్రజల తీర్పు అడుగుతుంది. ఊరిజనం ఫకీరు కి మర్యాద ఇస్తున్నారంటే అది తన వల్లనే అంటుంది బొబ్బిలి. భూమాత ఆకారం ఎలా ఉందో తేల్చుకోడానికి అలమండ బయలు లో రెండు గ్రూపులో యుద్ధానికి తలపడినప్పుడు 'అవతలి గ్రూపులో కుక్కలు ఏవీ లేవే..' అని చింతిస్తుంది బొబ్బిలి. తను మనిషి భాష నేర్చాను కాబట్టి మనిషిలాగే ప్రవర్తించాలనుకుంటుంది.. ఐనప్పటికీ మనుషుల కన్నా తను గొప్పదాన్నని నమ్మకం 'మహారాజశ్రీ' బొబ్బిలికి.

పతంజలి మరణ వార్త తెలియగానే నాకు మొదట గుర్తొచ్చింది బొబ్బిలే.. ఆ తర్వాతే ఫకీర్రాజు, చిట్టెమ్మ, పాత్రుడు, దుంపల దత్తుడు, మీర్జా పెదబాబు..వీళ్ళంతా.. వ్యంగ్యమే కాదు ఏది రాసినా తనకి తానే సాటి అనిపించే రీతిలో రచనలు చేసిన పతంజలి 'రాజుల లోగిళ్ళు' రచన పూర్తి చేస్తారని ఎదురుచూశాను.. ప్చ్..అది చదివే అదృష్టం లేదంతే..ఆయన రాసిన 'వేట కథలు'చదివితే అడవిలో వేటకి వెళ్తున్న అనుభూతి. జంతువుల కదలికలపై ఆయనకీ యెంత అవగాహన..! వేటలో చనిపోయే జంతువు ఆత్మఘోషని ఆయన అక్షరాల్లో చదువు తుంటే కళ్ళు తడవక మానవు. ఆయన చివరి రోజుల తాలూకు విజువల్స్ టీవీలో చూస్తుంటే కళ్ళు మళ్ళీ తడిశాయి. రాచ కురుపు ఆయన్ని పీల్చి పిప్పి చేసింది. మరణం ఎవరికైనా తప్పదు.. కానీ ఆయనకీ మరణం సంభవించిన తీరు మాత్రం కడు బాధాకరం.

పతంజలి రాసిన పది నవలలని కలిపి పతంజలి మిత్ర మండలి 'పతంజలి రచనలు' పేరిట సంపుటిగా విడుదల చేసింది. విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలోనూ లభించే ఈ పుస్తకం వెల రూ. 240. ఆయన మిగిలిన రచనలని కూడా మిత్ర మండలి ప్రచురిస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అసంపూర్తి రచన 'రాజుల లోగిళ్ళు.'

పతంజలి పై సాక్షి, ఆంధ్రజ్యోతి వ్యాసాలు ప్రచురించాయి.ఎంత రాసినా ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది పతంజలి రచనల గురించి..

బుధవారం, మార్చి 11, 2009

మార్పు

మా బామ్మ (నాయనమ్మ) కి ఎనిమిదేళ్ళ వయసప్పుడు తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఉండగా, మా ముత్తాత (తాతయ్య వాళ్ళ నాన్న) వాళ్ళ ఇంటికి వెళ్లారట. బామ్మ వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడి, దూరంగా ఆడుకుంటున్న బామ్మని చూపించి 'అదిగో ఆ ఎర్ర గౌను వేసుకున్న పిల్లే మీ కోడలు' అని చెప్పారట. పెళ్ళికి బంధువులని పిలవడం మొదలు పెట్టే వరకు తాతయ్యకి తన పెళ్లి అనే విషయమే తెలియదట.

అర్ధరాత్రి ముహూర్తానికి నిద్రకి జోగుతున్న బామ్మ మెడలో ఆయన తాళి కట్టేశారు. వీధి బడి ముఖం కూడా తెలియని బామ్మ తన వాళ్ళందరిని వదిలి కాపురానికి వచ్చేసింది తన లక్కపిడతల బుట్ట తో సహా.. . తాతయ్య నాయనమ్మ కలిసి కాపురం చేసి ఎనిమిది మంది పిల్లల్ని కన్నారు. ముత్తాత ఇచ్చిన ఆస్తుల్ని కరిగించి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి పెళ్ళిళ్ళు చేశారు. ఇటు వైపు అమ్మమ్మ, తాతగార్లదీ ఇదే కథ. వీళ్ళకి తొమ్మిది మంది సంతానం.

మా బామ్మకి గానీ, అమ్మమ్మకి గానీ భర్త ఏది చెబితే అదే వేదం. భర్త మాటకి ఎదురు చెప్పడం నేరం. ఇంటి ఖర్చులకి డబ్బు అడగాలన్నా కూడా అతగాడి మూడ్ గమనించి ఓర్పుగా, నేర్పుగా అడగాలి. పుట్టింటికి వెళ్లి రావడానికి ఎంతగానో బతిమాలాలి. ఆ తరం లో ఆడపిల్ల భర్త మరణిస్తే పుట్టింట్లో వితంతువుగా శేష జీవితం గడపాలి. తన పిల్లలు కాని వాళ్లకి చాకిరీ చేస్తూ, అన్నా వదినల మోచేతి నీళ్ళు తాగుతూ.. మరణం కోసం ఎదురు చూడాలి. ఆడ పిల్లకి చదువెందుకు అనే రోజులు. సకేశి అయినా, అకేశి అయినా గోషా పాటించాల్సిందే. భర్తకే కాదు, పెరిగిపెద్దైన మగ పిల్లలకీ వాళ్ళు భయ పడాల్సిందే.

మా అమ్మ, అత్తయ్యల తరం వచ్చే సరికి 'ఆడపిల్లకి చాకలి పద్దు రాసేంత చదువు వస్తే చాలు' అనుకునే రోజులు. మా పెద్దత్త పొరుగూరిలో ఉన్న హై స్కూలికి వెళ్ళడం మా చుట్టుపక్కల నాలుగూళ్ళలో పెద్ద వార్త. మా అత్త సైకిల్ మీద స్కూలుకి వెళ్లడాన్ని మా ఊళ్ళో మా చిన్నప్పటి రోజుల్లో కూడా కథలా చెప్పుకున్నారు. ఆస్తులు కరిగి పోతూ ఉండడం తో కళ్ళు తెరిచారో లేక లోకం పోకడని గమనించ గలిగారో, సంప్రదాయాన్ని ఎదిరించి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించారు తాతయ్య.

చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న అమ్మాయిల పెళ్లి విషయం లోనూ కొంత మార్పు వచ్చింది. అబ్బాయిని పెద్దలే నిర్ణయించినా, పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఒకరికి ఒకరిని చూపించి పెళ్లి చేశారు. ఆ తరం లో విడాకులు తీసుకోవడం పెద్ద వింత. ఆ విడాకులు తీసుకున్న అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం పెద్ద వార్త. 'ఆడది అణిగి ఉండాలి' అన్న మాట చాలాసార్లు విన్నాను.

ఒక తరం ఆలస్యంగానైనా మిగిలిన కుటుంబాలలోనూ ఈ మార్పు వచ్చింది. మగవాడే కుటుంబాన్ని పోషించాలి అన్న దగ్గర నుంచి మగ, ఆడ ఇద్దరూ సంపాదించడం అనే పద్ధతి మొదలైంది. శ్రమ విభజనకి వచ్చే సరికి ఈ తరం మహిళలు ఇంటా బయటా కష్టపడ్డారు. ఎక్కడో తప్ప, చాలా మంది మగవాళ్ళు వంటింటి గడప తొక్కడం నామోషీగా భావించారు. కాలక్రమంలో పెళ్ళిచూపుల ఏర్పాటు తో పాటు, 'అతన్ని చేసుకోవడం నీకు ఇష్టమేనా' అని అమ్మాయిని అడగడం మొదలైంది.

ఆస్తులు, అంతస్తుల స్థానం లో చదువులు, ఉద్యోగాలు ప్రామాణికంగా తీసుకుని పెళ్లి సంబంధాలు చూడడం, ఇరు పక్షాల అంగీకారం తోనే పెళ్ళిళ్ళు జరగడమే కాదు, పెళ్లి తర్వాత భార్యా భర్తలిద్దరూ కలిసి భవిష్యత్తుని నిర్ణయించు కోవడం జరిగింది. పనివిభజన రేఖలు కొద్దిగా చెరిగి, భార్య బయటి పనిలోనూ, భర్త ఇంటి పనిలోనూ సాయపడడం మొదలైంది. విడాకులు, మళ్ళీ పెళ్లి అనేవి సమాజం అంగీకరించ గలిగింది. ఆడ, మగ తేడా లేకుండా సమంగా చదివించడం మొదలుపెట్టారు తలిదండ్రులు.

ఇక ప్రస్తుత తరానికి వస్తే, తాము ఏమి చదువుకోవాలో, ఎలాంటి కెరీర్ లో కొనసాగాలో పిల్లలే నిర్ణయించు కుంటున్నారు. ఆడ, మగ బేధం లేదు. చదువు కోసం, ఉద్యోగం కోసం ఆడపిల్లల్ని కూడా దూర ప్రాంతాలకి, విదేశాలకి పంపిస్తున్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్చ కూడా కొన్ని కుటుంబాల్లో పిల్లలు పొందగలుగుతున్నారు. 'నీ నిర్ణయానికి మేము అడ్డు చెప్పం.. పెళ్లి మాత్రం మన పద్ధతిలో చేస్తాం' అని మా కజిన్ వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఓ ఇతర రాష్ట్రానికి, ఇతర మతానికి చెందినా అబ్బాయితో చేశారీమధ్య.

డబ్బు కోసం భర్త ముందు చేయి చాపాల్సిన లేదా అనుమతి కోసం భర్త ముందు తలవంచవలసిన అవసరం ఇప్పటి అమ్మాయిలకి లేదు. కాపురం లో ఇమడ లేని పక్షంలో విడిగా వచ్చేయమని, తమ మద్దతు ఉంటుందని అమ్మాయికి హామీ ఇస్తున్న తలిదండ్రులు నాకు తెలుసును. చదువు, సంపాదన ఇచ్చిన ఆత్మ విశ్వాసం అమ్మాయిలు తమ ఆత్మాభిమానం విషయంలో రాజీ పడకుండా ఉండడానికి సహాయ పడుతోంది. కేవలం డబ్బు, పరువు అనే కారణాల కోసం మాత్రమే బలవంతంగా కాపురం చేసే పరిస్తితులు ఇప్పుడు లేవు.

పెళ్ళంటే ఏమిటో తెలియకుండానే వివాహ బంధం లోకి వచ్చేసిన ఓ అమ్మమ్మ ముని మనవరాలు తన పెళ్లిని తానే నిర్ణయించుకుంది. తండ్రి ఇచ్చిన ఆస్తి కరిగిపోతే కుటుంబం నడపడం ఎలా అని మధనపడ్డ ఓ తాతయ్య ముని మనవడు తను, తన భార్య సంపాదిస్తున్న డబ్బుని ఎలా ఖర్చు చేయాలో ఆమెతో కలిసి ప్లాన్ చేస్తున్నాడు. సాంఘిక హోదాని ఒకప్పుడు వ్యవసాయ భూమి సూచిస్తే, ఇప్పుడు దాని స్థానంలో ప్లాట్లు, ఫ్లాట్లు, కార్లు, డిపాజిట్లు భర్తీ చేస్తున్నాయి. గంపెడు పిల్లల్ని కని పెంచడానికి మాత్రమే పరిమితమైన స్థితి నుంచి ఇంటా బయటా నిర్ణయాల్లో భాగం పంచుకునే స్థాయికి మహిళ ఎదిగింది.

నేను చెబుతున్నది ఓ పల్లెటూరి సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో కాలం తెచ్చిన మార్పు. ఈ కుటుంబాన్ని సమాజానికి ప్రతీక గా భావిస్తున్నాను నేను. కొన్ని విషయాల్లో సమాజం కన్నా కొంచం ముందు, మరికొన్ని విషయాల్లో సమాజం కన్నా కొంత వెనుక ఉండి ఉండొచ్చు. కుటుంబంలోని స్త్రీ, పురుష పాత్రల్లో మార్పు ఏమి లేకుండా ఐతే లేదు. 'ఈ మార్పు మంచికా? చెడ్డకా?' అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. ఒకటి మాత్రం నిజం, మార్పు అనివార్యం.

"మార్పు కొందరిని భయపెడుతుంది. కొందరిని జోకొడుతుంది. కొందరిని ఆనందింప చేస్తుంది." -గొల్లపూడి మారుతి రావు ('సాయంకాలమైంది,' పేజి 88)

మంగళవారం, మార్చి 10, 2009

గుడ్డివాడి వర్ణచిత్రాలు

ప్రగతిశీల ఉద్యమాల నేపధ్యం నుంచి వచ్చిన కె.వి. కూర్మనాధ్ రాసే కథల్లో ఆ ఉద్యమాల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఆయన రాసిన కథల్లో ఒకటి 'గుడ్డివాడి వర్ణచిత్రాలు.' నాలుగేళ్ల క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితం అయ్యింది. 'ప్రస్తుత ప్రజాస్వామ్యం' అనే అంశాన్ని కథగా మలచిన కూర్మనాధ్ చివరి పేరాలో మాత్రమే 'అసలు కథ' చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద బొమ్మలు గీసుకునే ఒక ఆర్టిస్టు కథ ఇది. బొమ్మలు గీసే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ, ఇతని ప్రత్యేకత ఏమిటంటే కళ్ళకు గంతలు కట్టుకుని, తన చేత బొమ్మలు గీయించుకోవడం కోసం వచ్చేవాళ్ళు చెప్పేది శ్రద్ధగా విని ఆ వ్యక్తి ని/వస్తువుని/ దృశ్యాన్ని పెయింట్ చేసి, టైటిల్ రాసి ఇవ్వడం.

తప్పిపోయిన పెంపుడు కుక్కపిల్ల మొదలు, మరణించిన తండ్రి, తాత, కలలోకి వచ్చే ప్రేయసి.. ఇలా ఏ అంశాన్నైనా బొమ్మగా మలచగలడు అతను. బొమ్మ కోసం వచ్చిన వాళ్ళు చేసే వర్ణనను బట్టి బొమ్మ ఉంటుంది. వర్ణన ఎంత బాగుంటే బొమ్మ అంత బాగుంటుంది. వర్ణన సరిగా లేకపోతె బొమ్మ అంత బాగా రాదు. బొమ్మ పూర్తయ్యాక వచ్చిన వాళ్ళనే అడిగి బొమ్మకి పేరు పెడతాడు అతను. బొమ్మ గీయించుకున్న వాళ్ళు యెంత ఇస్తే అంత తీసుకుంటాడు అతను. ఇలా తన పాటికి తను బొమ్మలు గీసుకుంటున్న ఆ ఆర్టిస్టు ఒకరోజు ఓ టీవీ చానల్ వాళ్ళ కళ్ళలో పడతాడు. తానెవరో చెప్పకుండా ఆ చానల్ ప్రతినిధి తన కూతురి బొమ్మ గీయించుకుంటాడు. ఆ బొమ్మ నచ్చడంతో ఆర్టిస్టు ని ఇంటర్వ్యూ చేస్తాడు.

తను మామూలు ఆర్టిస్టుననీ, వచ్చిన వాళ్ళు ఇచ్చిన వర్ణన ఆధారంగా బొమ్మ గీస్తాననీ, వర్ణన శ్రద్ధగా వినడం కోసమే కళ్ళకు గంతలు కట్టుకున్నాననీ చెబుతాడతను. టీవీ లో కథనం రావడం తో అతని పేరు మారుమోగుతుంది. అన్ని చానళ్ళ వాళ్ళూ, పేపర్ల వాళ్ళూ పోటీ పడి కథనాలు ఇస్తారు. కథనం మిస్సైన చానళ్ళ వాళ్ళు అతనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అనే అంశం మీద చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. అతను మాత్రం తన పని తాను చేసుకు పోతూ ఉంటాడు. జనం విపరీతంగా వస్తున్నా, వాళ్ళు ఇచ్చింది మాత్రమే తీసుకుంటా ఉంటాడు.

ఒక రోజు ఒక యునివర్సిటీ వాళ్ళు ఆర్టిస్టు ని ఆహ్వానిస్తారు. ముందుగా వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించి, తర్వాత ఒక్కొక్కరికీ బొమ్మలు వేయడం మొదలు పెడతాడు. చాలా మంది పోటీ పడడంతో, విద్యార్ధులు, ప్రొఫెసర్లు కలిసి ఓ నిర్ణయానికి వస్తారు. అందరూ కలిసి ఒక అంశం అనుకుని, అతనికి వర్ణించి చెప్పి బొమ్మ గీయించుకోవాలని. అతన్ని పక్క గదిలోకి పంపి ఏ అంశం మీద బొమ్మ గీయించాలో నిర్ణయించుకుని అతన్ని పిలుస్తారు. కళ్ళకి గంతలు కట్టుకున్న అతను, వాళ్ళు చెప్పే వర్ణనలన్నీ వింటాడు. అతను ఏం గీయాలన్నది నిర్ణయించుకోలేక పోతాడు. ఇలాకాదని, వాళ్ళంతా కలిసి టీవీ పట్టుకొచ్చి అసెంబ్లీ సమావేశాలు వినిపిస్తారు. అరగంటైనా కాక ముందే అతను 'ఆపండి' అని అరిచి, పది నిమిషాల్లో బొమ్మ పూర్తి చేస్తాడు. ఆడిటోరియంలో ఉన్నవాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన టైటిల్ 'నేటి ప్రజాస్వామ్యం' అని రాస్తాడు.

ఆ బొమ్మ ఎలా ఉన్నదన్నది రచయిత మాటల్లోనే: "ఎడమ వైపు కూర్చున్న వాళ్లకి ఆ బొమ్మ గాడిద బొమ్మలా కనిపించింది. కానీ తోక నక్కదిలా ఉన్నది. అక్కడక్కడ చర్మం పెళుసుబారి, గజ్జి పట్టి ఉంది. కుడివైపు కూర్చున్న వాళ్ళకది పిల్లలనెత్తుకు పోతున్న గద్ద లా కనిపించింది. మరికొందరికి నక్క కళ్ళున్న డ్రాగన్ తలలా, ఇంకొందరికి రెండు తలల జెర్రి గొడ్డు లా కనిపించింది. కొందరికది దాహంతో ఎండిపోయిన నేలవలె తోచింది. కన్న బిడ్డల్ని కాటేస్తున్న వికృత జంతువు వలె ఉంది."

ఈ వారం సాక్షి 'ఫన్ డే' లో మహమ్మద్ ఖదీర్ బాబు కథ 'ఒకవంతు' బాగుంది. పాత్రల అంతర్మధనం చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది.

సోమవారం, మార్చి 09, 2009

ఏం చూడాలి?

తెలుగు సినిమాలకు కరవొచ్చిందా? అవుననే అనిపిస్తోంది, గడిచిన రెండు నెలలుగా పరిస్థితి చూస్తుంటే. 'అరుంధతి' తర్వాత ఇప్పటివరకు సరైన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. 'అరుంధతి' నిర్మాతలకి ఇది కలిసొచ్చే అంశమే ఐనప్పటికీ, క్రమం తప్పకుండా సినిమాలు చూసే నాలాంటి ప్రేక్షకులకి ఎంత ఇబ్బంది? ఫిబ్రవరి నెల మొత్తానికి నేను థియేటర్ లో చూసినవి రెండే..'అరుంధతి''వినాయకుడు' అవికూడా రెండోసారి. గడిచిన వారం రోజుల్లోనూ చూసింది 'దోస్తానా' అనే హిందీ చిత్ర రాజం. అదికూడా అనుకోని పరిస్థితుల్లో.

గడిచిన నెలలో చూడాలనుకుని చివరి నిమిషంలో విరమించుకున్న సినిమాలు రెండు. 'కొంచం ఇష్టం కొంచం కష్టం' 'స్లండాగ్ మిలియనీర్.' మొదటి సినిమా చూడొద్దని ఓ ఫ్రెండ్ చివరి నిమిషంలో హెచ్చరించడంతో విరమించుకున్నా.. ఇక రెండో సినిమా చూద్దామనుకుంటుండగానే అది ఆస్కార్ కి నామినేట్ కావడం, మీడియా లో విస్తృతంగా వార్తలు, సమీక్షలు రావడం.. అవి చదివాక సినిమా చూడాలనే కోరిక సన్నగిల్లడం జరిగింది. చూడకూడదు అనైతే ఇంకా నిర్ణయించుకోలేదు. సినిమాలు చూడక పోవడం ఓ రకంగా మంచి చేసింది.. ఆ టైం ని పుస్తకాలు చదవడం కోసం వినియోగించా.. 'మృచ్చకటికమ్' అలా చదివిందే.

పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో చూడదగ్గ సినిమాలు వచ్చే అవకాశాలు ఏవీ కనిపించడం లేదు. పరిక్షల సీజన్, ఎలక్షన్ సీజన్ కూడా కావడంతో కొత్త సినిమాలు పెద్దగా విడుదల కాకపోవచ్చు. అయినా నటీనటులే రోడ్ల మీద కనిపిస్తారు కాబట్టి ప్రేక్షకులు కూడా సినిమాల కోసం ఎదురు చూడరేమో.. పరభాషా సినిమాల విషయానికి వస్తే ఢిల్లీ-6 సినిమా చూద్దామా అని ఆలోచిస్తున్నా. మంచి సినిమాలు ఏవీ రాకపోతే పాత సినిమాల డీవీడీ లు ఎలాగో ఉండనే ఉన్నాయి.

ఉదయం రోడ్డు మీద వెళ్తుంటే 'ఆకాశమంత' పోస్టర్ కనిపించింది. త్రిష టీనేజ్ అమ్మాయి గా కనిపించడం కోసం డైటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. నాకు ఒక్కసారిగా పాత సినిమాలు గుర్తొచ్చాయి. రామారావో, నాగేసర్రావో పరిగెత్తుకుంటూ కన్నాంబ దగ్గరికి వచ్చి 'అమ్మా నేను బీయే పాసయ్యానమ్మా..' అని చెప్పగానే, ఆవిడ ఫోటోలో పూల దండ వెనుక నవ్వుతున్న ఎస్వీఆర్ వైపు చూసి గాద్గదికంగా 'మీ నాన్నగారి ఆశయం నెరవేర్చావు నాయనా..' అంటూ జలజలా ఆనంద భాష్పాలు రాల్చడం కళ్ళ ముందు మెదిలింది.. అలాంటి పాత్రలకోసం అప్పటి వాళ్ళెవరూ డైటింగులు అవీ చేయలేదు.. జనం కూడా 'పిల్లల తండ్రుల్లా ఉన్నవాళ్ళు బీయే పాసవ్వడం ఏమి'టనీ అనుకోలేదు.. ఇప్పుడేమిటో పాత్రోచితంగా ఉండడం కోసం హీరోలు కండలు పెంచే, హీరోయిన్లు డైటింగులు చేసే ట్రెండ్ వచ్చింది.

ఈనాడు ఓ చల్లని వార్త చెప్పింది. ఈటీవీ సుమన్ని ఇక వెండి తెరపై చూడొచ్చు. ఓ భారీ పౌరాణిక చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. అప్పట్లో భారీ యెత్తున ప్రకటనలిచ్చిన 'ఉషా పరిణయం' ఏమైందో తెలియదు. కొత్తగా రాబోతున్న పౌరాణిక చిత్రంలో ప్రభాకర్ ఉంటాడా ఉండడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. వెండి తెర ప్రవేశం అంటే, బుల్లితెర మీద కూడా మళ్ళీ వీర విహారం మొదలు పెడతాడా అని స్నేహితులు కొందరు ఆత్రంగా ఎంక్వైరీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు బయటికి రావడానికి కొంచం సమయం పట్టేలా ఉంది. సుమన్ పునరాగమనంతో తెలుగు బ్లాగులకి కూడా కొత్త కళ వస్తుంది కదా...

శనివారం, మార్చి 07, 2009

నాయికలు-రాజేశ్వరి

కొన్ని తరాల తెలుగు పాఠకులను ఉలికిపాటుకి గురిచేసిన పేరు రాజేశ్వరి. 'చలం' గా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకటాచలం ఎనభైరెండేళ్ళ క్రితం రాసిన 'మైదానం' నవల్లో నాయిక రాజేశ్వరి. స్త్రీని వంటింటికి మాత్రమే పరిమితం చేసిన సమాజంలో తనకి నచ్చిన జీవితం కోసం అమీరు తో గడప దాటిన రాజేశ్వరి జీవితం ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందన్నదే 'మైదానం' నవల. ఈ పుస్తకాన్ని గురించి మొదట తెలుసుకున్నది అమ్మ ద్వారా.. తను ఎంత కష్టపడి దీనిని సంపాదించి చదివిందో కథలు కథలుగా చెప్పి 'పెద్దయ్యాక చదువు' అని చెప్పింది. నవల చదవడానికి చాలా కాలం ముందే ఈ పుస్తకం పై వచ్చిన ఎన్నో సమీక్షలు, విమర్శలు చదివి ఉండడం తో 'మైదానం' అనగానే నిఘంటువు సైజు లో ఉండే పుస్తకం అనుకున్నాను.

ఓ సహోద్యోగిని దగ్గర మొదటి సారి ఈ పుస్తకాన్ని చూశాను. మొత్తం తొంభై పేజీలు. చాలా ఆశ్చర్యపోయాను.. ఇంత చిన్న పుస్తకం గురించి ఇంత సాహిత్యం వచ్చిందా అని. ఆవిడ దగ్గర పుస్తకం తీసుకుని త్వరత్వరగా చదివేశాను. రాజేశ్వరి అమీరు తో వెళ్ళిపోవడం వరకు ఏమీ అనిపించలేదు.. తెలిసిన కథే కాబట్టి. కానీ ఆమెకి మీరాతో పరిచయం, తదనంతర పరిణామాలు చాలా కొత్తగా అనిపించాయి. సహోద్యిగినికి చలం అంటే అభిమానం కాదు, ఆరాధన.. ఆవిడతో పుస్తకాన్ని గురించి ఎక్కువగా చర్చించే అవకాశం దొరకలేదు. 'మగ వాళ్లకి ఈ పుస్తకం అర్ధం కాదు' అని చర్చను ముగించేశారావిడ.

ఆ తర్వాత 'మైదానం' చాలాసార్లు చదివాను. చాలా మందితో ఈ పుస్తకం గురించి మాట్లాడాను. చదివిన ప్రతిసారీ రాజేశ్వరి కొత్తగా పరిచయం అయ్యేది. సనాతన భావాలున్న ఓ బ్రాహ్మణ ప్లీడర్ భార్య రాజేశ్వరి. భార్య తనని కావలించుకున్నది ప్రేమతోనో, భయంతోనో అర్ధం చేసుకోలేని ఆ ప్లీడర్ తో జీవితం ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వడు ఆమెకి. సరిగ్గా అప్పుడే ఆమెకి అమీరు పరిచయమౌతాడు. గొప్ప సౌందర్యవతి ఐన రాజేశ్వరిని అతడు తొలిచూపులోనే మోహిస్తాడు (నాకెందుకో అతను ప్రేమించాడు అనిపించలేదు) . భర్త కన్నుగప్పి అతనితో శారీరక సంబంధం కొనసాగించలేని రాజేశ్వరి అమీరు తో కలిసి నైజాముకి వెళ్ళిపోతుంది. 'దీనినే మర్యాదస్తులు లేచిపోవడం అంటారు' అని తనే చెబుతుంది.

రాజేశ్వరి పోలీసు జీపులో వెళ్తూ తన కథ చెబుతూ ఉంటుంది..కథంతా ఆమె గొంతుతోనే వినిపిస్తుంది. అమీరు, రాజేశ్వరి నిజాము ప్రాంతం లో ఓ ఊరికి దూరంగా ఓ పెద్ద మైదానం అంచున ఉన్న ఓ గుడిసెలో జీవితం ప్రారంభిస్తారు. ఇద్దరికీ రోజులు చాలా సంతోషంగా గడుస్తూ ఉంటాయి. అమీరు మొరటుదనాన్ని సైతం ప్రేమించే రాజేశ్వరి, అతను మరో అమ్మాయి మీద మనసు పడ్డాడన్న విషయం గ్రహించి ఆమెని ఒప్పించి వారిద్దరిని కలుపుతుంది. ఐతే త్వరలోనే అతనికి ఆమె మీద మొహం మొత్తడంతో మళ్ళీ రాజేశ్వరి తో కలుస్తాడు. రాజేశ్వరి గర్భం దాలుస్తుంది. అమీరుకి అది ఇష్టం ఉండదు. గర్భం కోసం రాజేశ్వరి పట్టుపట్టడం తో మీరా అనే కుర్రాడిని ఆమెకి సాయం ఉంచి ఊరు విడిచి వెళ్ళిపోతాడు అమీరు, 'ఆరు నెలల తర్వాత వస్తా'నని చెప్పి.

మీరా సాహచర్యం ఉన్నప్పటికీ అమీరు మీద బెంగ పెట్టుకున్న రాజేశ్వరి గర్భ విచ్చిత్తికి అంగీకరిస్తుంది. అమీరు తిరిగి వస్తాడు. రాజేశ్వరి-మీరా ల మధ్య ప్రారంభమైన బంధాన్ని అంగీకరించలేక పోతాడు అమీరు. రాజేశ్వరి అటు అమీరుని, ఇటు మీరాని కూడా కాదనలేని పరిస్థితిలో ఉంటుంది. మీరా ని హత్యచేయడానికి సిద్ధ పడ్డ అమీరు, రాజేశ్వరి కోసం కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. మీరాయే హత్య చేశాడని భావించిన పోలీసులు అతన్ని అరెస్టు చేయబోతుంటే, హత్యా నేరాన్ని రాజేశ్వరి తనమీద వేసుకోవడం నవల ముగింపు. అమీరుకి, మీరాకి ఒకే విధమైన ప్రేమని పంచిన రాజేశ్వరి, వారినుంచి అదే ప్రేమని తిరిగి పొందింది.

స్త్రీ మనసుని, ఇష్టాలను పట్టించుకోని సమాజం అన్నా, సంప్రదాయాలన్నా అసహ్యం రాజేశ్వరికి. దానిని ప్రతి అక్షరంలోనూ వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆమె మేనమామ పాత్రని సమాజానికి ప్రతీకగా ఉపయోగించుకునాడు రచయిత. అతను వచ్చి 'తిరిగి వచ్చెయ్య' మన్నప్పుడు ససేమిరా అంటుంది రాజేశ్వరి. ఐతే, అమీరు తనని విడిచి వెళ్ళగానే భవిష్యత్తు గురించి భయపడి, ఇంటికి తిరిగి వెళ్ళిపోదామా అనుకుంటుంది. అమీరు-మీరా ల మధ్య ఘర్షణ ఆమెని కలచివేస్తుంది. మొదట నాకు ఈ నవల ముగింపు నచ్చలేదు. సనాతన వాదులని సంతృప్తి పరచడం కోసమే రాజేశ్వరిని జైలుకి పంపారని అనిపించింది. ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు అని కూడా అనిపించేది. పుస్తకాలని అవి రాసిన కాల మాన పరిస్థితుల ఆధారంగా అర్ధం చేసుకోవాలన్న విషయం అప్పట్లో అర్ధం కాలేదు.

గురువారం, మార్చి 05, 2009

నెలకోసారి...

"ఆడపిల్లగా పుట్టినా బాగుండును.. ఛీ..వెధవ బ్రతుకు.. అస్సలు జుట్టు పెరక్కుండా ఎవరైనా మందు కనిపెడితే ఎంత బాగుంటుంది? నా జుట్టు మొత్తం ఊడిపోతే ఇంకా బాగుంటుంది కదా.. ఈ బాధలేవీ లేకుండా..." ఊహ తెలిసినప్పటినుంచీ ప్రతినెలా నా అంతర్మధనం ఇది. ఇందుకు కారకుడు సత్యం.. మా ఊరికి ఏకైక క్షురకుడు. కుల వృత్తి నే ఇంటిపేరుగా చేసి పిలిచే మా పల్లెటూళ్ళో అతన్ని 'మంగలి సత్యం' అని పిలేచేవాళ్ళు. సత్యం గురించి మా ఊళ్ళో పెద్దవాళ్ళు కూడా అనుకునే మాట ఒకటి.. 'వీడు దూర్వాసుడికి తమ్ముడు' అని. అసలు ఇతని కోపం భరించలేకే సత్యం భార్య తన పిల్లలని తీసుకుని వేరే వెళ్ళిపోయిందని మా ఊళ్ళో రూమరు. అలాంటి సత్యానికి నెలకోసారి తల అప్పగించడం అంటే మాటలా..?

మా బళ్ళో మాష్టారు మమ్మల్ని బుద్ధిగా ఉండమని చెప్పి బయటకి వెళ్ళినప్పుడు మేమందరం చేసే పని ఒకటి ఉండేది. ఆయన టేబిల్ మీద ఉన్న గ్లోబు ని గుండ్రంగా తిప్పుతూ ఆడుకోవడం.. సరిగ్గా సత్యం కూడా నా తలని ఇలాగే తిప్పేవాడు, తలపని చేసేటప్పుడు. అతనికి మెడ ఎత్తినా, దించినా కోపమే. 'కుదురుగా కూర్చోలేరా?' అని కసురుకునే వాడు. అసలు సత్యాన్ని చూడడం తోనే భయం లాంటిది మొదలయ్యేది. మనల్ని ఎదురుగా కూర్చోపెట్టుకుని తన సంచీలోనుంచి సరంజామా అంతా తీసేవాడు.. అంటే రెండు కత్తెర్లు, రెండు కత్తులు, ఓ ఆకురాయి. ఆకుపచ్చని ఆ రాయిమీద కత్తులు నూరుతున్నంతసేపూ కూడా మెడ కదపకుండా కూర్చోవాలి.

సత్యం ప్రత్యేకత ఏమిటంటే నాకు అతను తలపని చేసిన పుష్కర కాలం పాటూ అవే కత్తులు, కత్తెర్లూ వాడాడు, కొత్తవి కొనకుండా.. అంటే నా ఒక్కడికే కాదు, ఊరి మొత్తానికి. ఎవరైనా ధైర్యం చేసి 'ఇవి పదును పోయాయి, కొత్తవి కొనచ్చు కదా' అన్నారో.. వాళ్ళ పని ఐపోయిందే.. మొత్తం పని పూర్తయ్యేసరికి ఓ గంటకు పైగా పట్టేది. ఈలోగానే అతన్ని వెతుక్కుంటూ చాలామంది వచ్చేవాళ్ళు. పని ఆపి వాళ్లకి సమాధానం చెప్పి పంపేవాడు. ఊరికంతటికీ ఒక్కడే కదా.. బోల్డంత డిమాండ్. తనకి ఏ వాయిద్యం వాయించడం రాదు కానీ, పెళ్ళిళ్ళకి డోలు, సన్నాయి ఏర్పాటు చేసేవాడు. ఆ నిమిత్తం కూడా చాలా మంది అతన్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. అతను ఎప్పుడు మాట్లాడతాడో, లేక మాట్లాడుతూనే మెడ మీద కత్తి పెడతాడో తెలీదు. చచ్చినట్టు కిక్కురుమనకుండా కదలకుండా కూర్చోవాల్సిందే.

'పిల్లాడి తల మాసిపోయినది.. సత్యానికి కబురు పెట్టండీ..' అని అమ్మ నాన్నని అడగడం చెవిన పడగానే గుండెల్లో రాయి పడేది. ఓ నాలుగైదు రోజుల్లో సత్యం వచ్చేస్తాడు అని తెలుసు. తనకి వీలు కాకపొతే ఆ విషయం సూటిగా చెప్పకుండా 'ఏకాదశి రోజు ఎలా చెయ్య మంటారు?' అనో 'అమావాస్య ముందు చెయ్యను' అనో చెప్పేవాడు. తన పొది లో ఓ పంచాంగం కూడా ఉండేది. కూలీలకి వాళ్ళ ఇళ్ళలో జరిగే చిన్న చిన్న శుభ కార్యాలకి సత్యమే ముహూర్తం పెట్టేవాడు. అతను వేరే పని ఉండి అలా చెబుతున్నాడని తెలిసినా ఎవరూ ఏమీ అనలేక పోయేవాళ్ళు, అతని నోటికి దడిసి. ఒక్క మా ఇంటికే నెలకి రెండు సార్లు వచ్చే వాడు. తండ్రీ, కొడుకు ఒకే రోజు తలపని చేయించుకో కూడదని సెంటిమెంటు. తాతయ్య ఊళ్ళో ఉంటె మాత్రం, నాకూ, తాతయ్యకీ ఒకే రోజు కానిచ్చేవాడు సత్యం. అమ్మ మాత్రం సత్యం రాగానే అతనికోసం టీ పట్టుకొచ్చేసేది.. నేను బలిపశువులా తల వంచుకు కూర్చున్నా సరే. 'పనయ్యాక టీ ఇవ్వొచ్చు కదా..' అని అమ్మతో చాలాసార్లు పోట్లాడాను. 'అయ్యాక సత్యం ఉంటాడా.. ఎవరో వచ్చి తీసుకెళ్ళి పోతారు' అనేది సింపుల్ గా.

నా ఆరో ఏటో, ఏడో ఏటో జరిగిన ఈ సంఘటన మాత్రం నేనే కాదు, మా బంధువర్గం లో ఎవరూ మర్చిపోరు. ఆ రోజు నేను చాలా తిక్కగా ఉన్నాను.. సత్యం చాలా బలవంతంగా తలపని చేసేశాడు. నేను వద్దని ఏడుస్తూనే ఉన్నాను. నాన్న ఇంట్లో లేరు. అమ్మ నన్ను ఊరుకోపెట్టే ప్రయత్నాలు చేస్తుంటే 'ఏమిటమ్మా బతిమాలతారు' అని సత్యం అనేసరికి నా కోపం తార స్థాయికి చేరింది. ఏం చేయాలో అర్ధం కాలా. పని పూర్తి చేసిన సత్యం కత్తిరించిన జుట్టు కుంకుడు చెట్టుకింద పారేయడానికి వెళ్ళాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి సత్యానికి అడ్డం పడి 'ఆ జుట్టు మళ్ళీ నా తలమీద అతికించమని' పేచీ మొదలుపెట్టాను. అతన్ని కదలనివ్వలేదు. దాదాపు అరగంట సేపు హై డ్రామా నడించింది. అమ్మకీ, సత్యానికీ ఏం చేయాలో అర్ధం కావడంలేదు. వాళ్ళిద్దర్నీ రక్షిస్తూ నాన్న వచ్చారు. ముందు మాటలతో చెప్పి చూశారు.. నేను ఊరుకోలేదు.. నిద్రగన్నేరు కొమ్మ విరిచి అది నా వీపు మీద విరిగేలా కొడుతుండే మా వీధి వీధంతా సినిమా షూటింగ్ లా చూసింది.

నేనొక్కడినేనా? మా ఊళ్ళో మగ పిల్లలంతా సత్యం బాధితులే.. పెద్దాళ్ళు కూడా బాధితులే కాని, పైకి చెప్పుకునే వాళ్ళు కాదు. ఓ రోజు స్కూల్లో మాస్టారు బయటికి వెళ్తూ నన్ను క్లాసు చూడమన్నారు. అంటే నేను లీడర్ని. లీడర్ అంటే మాస్టారి తర్వాత మాస్టారంత వాడు కదా.. పుస్తకం తీసి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. సత్యమా, అసత్యమా అని ప్రశ్నలు. 'భూమి సూర్యుని చుట్టూ తిరుగును.. సత్యమా, అసత్యమా?' అడిగాను. 'మంగలి సత్యం' అన్నాడు మా గణేష్ టక్కున. క్లాసంతా గొల్లుమంది. లీడర్ నవ్వకూడదు కదా, కర్రతో టేబిల్ మీద గట్టిగా కొట్టా.. మా ఊరి బళ్ళో చదివినంత కాలం పర్వాలేదు కానీ, పక్కూరి బడిలో చేరినప్పుడు కష్టాలు మొదలయ్యాయి. సత్యం చేసిన హెయిర్ స్టైల్ చూసి మిగిలిన పిల్లలు తెగ నవ్వేవారు.

వయసు అయిపోవడంతో సత్యానికి ఆరోగ్యం పాడైపోవడం మొదలు పెట్టింది. చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్న కొడుకులు వచ్చి అతన్ని తమతో తీసుకెళ్ళిపోయారు. తను తిరగ గలిగినన్నాళ్ళూ సత్యం మరో క్షురకుడిని మా ఊళ్ళో అడుగు పెట్టనివ్వలేదు. అతను బయట తిరగడం మానుకోగానే సత్యం స్థానం లో మా ఊరికి పక్కూరి చిన్న సత్యం వచ్చేవాడు. ఊరి మీద ప్రేమతో సత్యం అప్పుడప్పుడు ఓపిక చేసుకుని వచ్చేవాడు. ఒకసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చాడు సత్యం. 'మిమ్మల్ని చూద్దారని వచ్చేను అబ్బాయిగారూ..' అన్నప్పుడు మాత్రం తల వంచుకుని అతని ముందు కూర్చుని కత్తిరింపు వెయ్యమని అడగాలని అనిపించింది.

ఇప్పుడు నేను రెగ్యులర్ గా వెళ్ళే సెలూన్ లో బార్బర్ కి సెన్సాఫ్ హ్యుమర్ ఎక్కువ. మొన్నో రోజు హెయిర్ కట్ చేస్తూ 'ఇలా ఐతే కొన్నాళ్ళకి మీకు మా దగ్గరికి వచ్చే పని ఉండదు సార్. జుట్టు బాగా ఊడిపోతోంది..' అన్నప్పుడు నాకు మా సత్యం మరోసారి గుర్తొచ్చాడు.

మంగళవారం, మార్చి 03, 2009

మృచ్ఛకటికమ్

ముందుగా నా టపా 'నాయికలు-మధురవాణి' చదివి వ్యాఖ్య రాసిన బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆ టపాలో నేను శూద్రక కవి రాసిన 'మృచ్ఛకటికమ్' అనే సంస్కృత నాటకాన్నిగురించి ప్రస్తావించాను. నిజానికి, నేను ఆ నాటకాన్ని చదవలేదు. సంస్కృతం రాకపోవడమే అందుకు కారణం. నేను చేయాలనుకుని చేయలేకపోయిన వాటిలో సంస్కృతం నేర్చుకోవడం ఒకటి. మిత్రులు 'ఈ వయసులో ఇంకేం నేర్చుకుంటాం..' అంటారు కానీ, నేర్చుకోడానికి వయసు అడ్డంకి కాదని నా నమ్మకం. ఇక టపా విషయానికి వస్తే, శూద్రకుడి గురించి తెలుసుకోడానికి ఓ సంస్కృత అధ్యాపకుడిని కలిశాను. ఆయన తన దగ్గరున్న పుస్తకాల్లో ఒకటి నాకు చదవమని ఇచ్చారు. అది ఎం.ఆర్. కాలే పండితుడు ఎడిట్ చేసిన 'మృచ్ఛకటికమ్' నాటకం. 1924 లో ప్రచురించిన ఈ పుస్తకం సంస్కృతం తో పాటు, నా వంటి వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు లోనూ ఉంది. ఆ విశేషాలు..

ఎం.ఆర్. కాలే ప్రకారం 'మృచ్ఛకటికమ్' రచనా కాలం క్రీస్తుకు 200 సంవత్సరాల పూర్వం. రచయిత పేరు శూద్రకుడు. ఇతడు ఒక రాజు, కవిత్వం రాసేవాడు కాబట్టి కవి. నిజానికి ఈ రచన గురించి చరిత్ర కారుల మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 'దశకుమార చరిత్ర' రాసిన దండి ఈ రచన కూడా చేశాడన్న వాదన ఉంది. వివాదాలను పక్కన పెట్టి, కథలోకి వెళ్తే, కథా స్థలం ఉజ్జయిని నగరం. కథానాయకుడు చారుదత్తుడు. ఇతడు ఒక వ్యాపారి. సంపాదించినదంతా దాన ధర్మాలకు ఖర్చుపెట్టి, నిరుపేద గా మారతాడు. వయసులో ఉన్నవాడు, అందగాడు. లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నవాడు. నాయిక అదే పట్టణానికి చెందినా వేశ్య వసంతసేన. గొప్ప సౌందర్యవతి. తొలిచూపులోనే చారుదత్తుడితో ప్రేమలో పడుతుంది. చారుదత్తుడు దివాలా తీయగానే అతని దగ్గర పనిచేసే దాస దాసీ జనమంతా వేరే ఉద్యోగాలు చూసుకుంటారు. మైత్రేయుడు, రధనిక మాత్రం పని చేస్తూ ఉంటారు.

మొత్తం పది అంకాలున్న ఈ నాటకంలో మొదటి అంకం లో పాత్రల పరిచయంతో పాటు, ముఖ్య పాత్రలు రెండూ నాటకీయ పరిణామాల మధ్య కలుసుకుంటాయి. రాజైన పాలకుడి బావమరిది శకారుడు వసంతసేన వెంట పడగా ఆమె చారుదత్తుడి ఇంట్లో తల దాచుకుంటుంది. అతన్ని మళ్ళీ కలుసుకోవడం కోసం, తన నగలను అతని వద్ద దాచి ఉంచుతుంది. మైత్రేయుడి అజాగ్రత్త వల్ల సర్విలకుడు అనే దొంగ వసంతసేన ఆభరణాలను దొంగిలిస్తాడు. ఇతడు వసంతసేన దగ్గర పనిచేసే మదనిక ను ప్రేమిస్తాడు. ఆమెను బానిసత్వం నుంచి విడిపించడం కోసం ఈ దొంగతనానికి పాల్పడతాడు. ఆ నగలు వసంతసేనవే అని గుర్తించిన మదనిక 'చారుదత్తుడు పంపాడని' చెప్పి వసంతసేనకి ఇప్పిస్తుంది. చాటునుంచి వారి సంభాషణ విన్న వసంతసేన మదనికను సర్వికులకుడికి ఇచ్చి పంపుతుంది. మరో పక్క, వసంతసేన ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయని తెలుసుకున్న చారుదత్తుడి భార్య ధూత తన వజ్రాల హారాన్ని మైత్రేయుడి ద్వారా చారుదత్తునికి, అతని ద్వారా వసంత సేనకి అందించేందుకు సిద్ధ పడుతుంది.

ఈ నగల విషయమై మాట్లాడేందుకు చారుదత్తుని ఇంటికి వచ్చిన వసంతసేన, తన ప్రేమను ప్రకటించి అతనితో గడుపుతుంది. మర్నాడు ఉదయం ఆమెను పుష్పకరండక ఉద్యానవనానికి తీసుకురమ్మని బండివాడికి చెప్పి బయటకి వెళ్తాడు చారుదత్తుడు. ఇంట్లో ఆడుకుంటున్న చారుదత్తుని కొడుకు రోహసేనుడు, మట్టిబండితో ఆడుకోనని, తనకి బంగారంతో చేసిన బండి కావాలని మారాం చేస్తాడు. తన నగలన్నీ తీసి ఇచ్చి బంగారు బండి బొమ్మ కొనుక్కోమంటుంది వసంతసేన. ('మృచ్ఛకటికమ్' అంటే మట్టి బండి అని అర్ధం) రధసారధి పొరపాటువల్ల వసంతసేన ఎక్కాల్సిన బండిలో రాజుపై తిరుగుబాటు చేసిన ఆర్యకుడు ఎక్కుతాడు. వసంతసేన శకారుడికి చెందిన బండిలో ఎక్కుతుంది. ఉద్యానవనంలో వసంతసేనను చూసిన శకారుడు, ఆమె తనని తిరస్కరించిందన్న కోపంతో ఆమెని గాయపరిచి, మరణించిందని భావించి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వసంతసేన వల్ల సహాయం పొంది ఉన్న భిక్షువు సంవాకుడు ఆమెని రక్షించి, రహస్య ప్రదేశానికి తీసుకెళతాడు.

నగలకోసం వసంతసేన ని హత్య చేశాడన్న అభియోగంపై చారుదత్తుని న్యాయస్థానం లో ప్రవేశ పెడతారు. వసంతసేన ని భిక్షువు తీసుకెళ్ళిన సమయంలోనే, చెట్టు కూలి ఓ మహిళా మరణించడం, రాజోద్యోగులు ఆ మృతదేహం వసంతసేనది గా భావించడం, పైగా బంగారు బండి బొమ్మ కోసం వసంతసేన రోహసేనుడికి ఇచ్చిన నగలు చారుదత్తుడి ఇంట్లో దొరకడంతో నేరం నిరూపణ అవుతుంది. చారుదత్తునికి ఉరిశిక్ష పడుతుంది. సరిగ్గా ఉరి తాడు బిగించే సమయానికి, భిక్షువుతో కలిసి వసంతసేన రావడంతో శిక్ష రద్దవుతుంది. శకారుడికి శిక్ష పడుతుంది. తిరుగుబాటు చేసిన ఆర్యకుడు రాజు అవుతాడు. చారుదత్తుని బండిలో తప్పించుకున్నందుకు కృతజ్ఞతగా అతన్ని 'కుశావతి' అనే చిన్న రాజ్యానికి పాలకుడిగా నియమించడం తో పాటు వసంతసేనకి అతని భార్య హోదా ఇస్తూ ప్రకటన చేయడం నాటకం ముగింపు.

ఎలాంటి అంచనాలు లేకుండా ఈ నాటకం చదవడం మొదలు పెట్టాను. మొదట్లో పాత్రల పేర్లు కొద్దిగా తికమక పెట్టాయి. ఐతే కథలో పడ్డాక లీనమై చదివాను. నాటకం లో చాలా మలుపులని ఇప్పటికీ సినిమాల్లో వాడుకుంటున్నారు అనిపించింది. ఉరిశిక్ష సీన్ లో ఐతే 'అభిలాష' సినిమా గుర్తొచ్చింది. వందల ఏళ్ళ క్రితమే సంస్కృతం లో ఎంత మంచి సాహిత్యం వచ్చిందో కదా అనిపించింది. వర్ణనలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ, మూల రచనని అర్ధం చేసుకుని చదవగలిగితే బాగుండుననిపించింది. ఆనాటి సమాజంలో ఉన్న విలువలు, ముఖ్యంగా దొంగలు, వేశ్యలు కూడా విలువలు పాటించడం, మనుషుల్లో కనిపించే కృతజ్ఞత చూసినప్పుడు ఇప్పటి రోజులతో పోల్చుకోకుండా ఉండలేక పోయాను. ఒక్కో పాత్రను రచయిత పరిచయం చేసిన తీరు అద్భుతం. కేరక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం రీళ్ళకి రీళ్ళు తినేసే నేటి సినిమా దర్శకులు ఈ నాటకం చదవడం అవసరం. మొత్తం చదవడం పూర్తి చేసేసరికి, ఎలాగైనా సంస్కృతం నేర్చుకుని మిగిలిన మూల గ్రంధాలని చదవాలన్న కోరిక బలపడింది.

ఆదివారం, మార్చి 01, 2009

పులిహోర

ఆదివారాన్ని రొటీన్ కి భిన్నంగా గడపాలనుకుని చివరికి రొటీన్ గా గడిపేయడం చాలాసార్లు జరిగింది. అందుకే ఇవాళ రొటీన్ కి భిన్నంగా గడపడం లాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదు. బారెడు పొద్దెక్కాక నిద్రలేచి పేపర్లు ముందేసుకుని కూర్చున్నా.. సింగీతం-గొల్లపూడి ల డబుల్ ధమాకా చదివి, ఆదివారం అనుబంధాలు తిరగేశాక అప్పుడు అనిపించింది ఏదైనా వెరైటీ గా చేద్దాం అని.

ఆలోచించి..చించి..వంట దగర ఆగాను. వేసవి వచ్చేస్తోంది కాబట్టి అప్పుడు తినలేనిది ఏమైనా చేయాలనుకోగానే సూపర్ మార్కెట్ లో కొన్న రెడీమేడ్ పులిహోర పేకెట్ కి మోక్షం రాలేదన్న విషయం గుర్తొచ్చింది. 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని' ఎదురు చూడకుండా మనమే దాని సంగతి చూద్దాం అనుకున్నా. జింబో నగర ప్రవేశం తరహాలో వంటింటి ప్రవేశం చేసి పులిహోర అనే వంటకాన్ని పూర్తి చేసిన కథా క్రమంబెట్టిదనిన...

నాకు అస్సలు వంట అంటే ఏమిటో తెలియకుండా ఇంతటి మహా ప్రయత్నానికి ఒడిగట్టాననుకుంటే పొరపాటే.. థాంక్స్ టు అమ్మ.. చిన్నప్పుడు అసిస్టంట్ కుక్ గా పనిచేసిన అనుభవం ఉంది. అద్భుతంగా కాదు కాని, ఓ మాదిరిగా వండ గలను. పులిహోర చేయడానికి అన్నం కావాలి కదా.. 'పులిహోరకి అన్నం మేకుల్లా ఉండాలి' అని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. మేకుల్లాంటి అన్నం కోసం అమ్మ పడ్డ తిప్పలూ గుర్తొచ్చాయి.

ఎక్కువ గంజి వార్చి, మూతపైన కణ కణలాడే నిప్పులు వేసి.. ఇప్పుడు అలాంటి బాధలు లేవు. నీళ్ళు కొంచం తక్కువ పోసి కుక్కర్ లో బియ్యం పెట్టి, తదుపరి కర్తవ్యం ఆలోచించా.. 'ఆడుతూ పాడుతూ పని' చేయాలని సావిత్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. సినిమా సావిత్రే.. 'వూపుతు విసరుతు గూడేస్తూ' చెప్పింది కదా.. 'బొమ్మరిల్లు' పాటలు పెట్టా.. 'అపుడో ఇపుడో..' పాట అయ్యిందో లేదో కుక్కర్ విజిల్ ఊదేసింది.

అప్పుడు రెండో స్టవ్ మీద బాండీ పెట్టా.. వేడెక్కాక కొంచం ఉదారంగా నూనె పోసి, ఏమేం వేయాలా అని నూనె కాగే వరకు ఆలోచించి నూపప్పు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు వేశా.. నిలువుగా కోసిన ఓ అరడజను పచ్చి మిరపకాయలు నూనెలోకి జారవిడిచా.. 'పులిహోర పోపులో పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేగ కూడదురా..' చిన్నప్పుడు ఓ పళ్ళెం లోకి నాకోసం తీసిన పల్లీలు ఊదుకుని మింగుతుండగా అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ప్చ్.. అప్పటికే ఆలస్యం అయిపొయింది. పచ్చిమిర్చి రంగు మారి ముదురు రంగులోకి వచ్చేశాయి.

రెడీ మిక్స్ ప్యాకెట్ కత్తిరించి మొత్తం పదార్ధాన్ని బాండీ లోకి వంచా.. ఇప్పుడు వంట చేసే పుణ్య పురుషులకి ఓ సూచన. మీరు వంట చేసేటప్పుడు ఎవర్నీ వంట ఇంట్లోకి రానివ్వకండి.. వంట అనేది చాలా ఏకాగ్రత తో చేయాల్సిన పని. ఇది ఎందుకు చెబుతున్నానంటే మిక్స్ ని బాండీ లోకి వంచగానే ఫోన్ మోగింది. కొలీగ్ నుంచి..వద్దనుకుంటూనే తీశా. 'పులిహోర చేస్తున్నా'నని కొంచం గర్వంగానే చెప్పాను. ఫోన్ అయ్యేసరికి బాండీ లో పదార్ధం అప్పటి వరకు రంగురంగులలో ఉన్నదల్లా కృష్ణవర్ణంలోకి మారడం మొదలు పెట్టింది.

'పొయ్యిమీద వంటకం పాడవుతోందనిపిస్తే వెంటనే వెంటనే గిన్నెని పొయ్యిమీంచి దింపెయ్యాలి' అమ్మ చెప్పిన చిట్కానే.. గిన్నె దించే బదులు, స్టవ్ ఆపేశా.. కుక్కర్ మూత తీసి, మేకుల్ని.. అదే అన్నాన్ని.. బాండీ లోకి వంచా.. అన్నం వేడి చల్లరేవరకు గరిటె తోనూ తర్వాత చేతితో కలపడం మొదలు పెట్టా.. 'బొమ్మని గీస్తే నీలా ఉంది..' పాట వస్తోంది.. నాకు ఎప్పటిలాగే చినరాయుడు లో 'బుర్రుపిట్ట..' పాట గుర్తొచ్చింది.

బాండీ లో ఉన్నదాన్ని చూస్తే ఎక్కడా పులిహోర లా అనిపించడం లేదు. ఘుమఘుమలు కూడా లేవు. కొంచం రుచి చూశా.. 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' లో రవితేజ చేసిన పులిహోర రుచి చూసి కల్యాణి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లాంటిది ఈ వంటకానికి రావడం కల్ల అన్న విషయం అర్ధమైపోయింది. 'వంట బాగుండాలంటే వండే వాళ్ళ కష్టం తో పాటు తినే వాళ్ళకి దంతసిరి కూడా ఉండాలిరా..' అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాటలు వోదార్చాయి.

అయినా నేనేమీ అద్భుతమైన వంట చేయాలని మొదలు పెట్ట లేదు కదా.. సందర్భోచితంగా 'నమ్మక తప్పని నిజమైనా' పాట వచ్చింది. మొత్తానికి పులిహోర మిగల్లేదు. మిగిలిందల్లా గోళ్ల చివర పసుపు రంగు మాత్రమే..