శనివారం, జులై 09, 2011

భామిని విభునకు వ్రాసిన...

ప్రాణేశ్వరా,
....ఇలా పిలవడం మీకు అస్సలు ఇష్టం ఉండదని తెలుసు. 'ఏమిటీ నాటకాల భాష.. నాన్సెన్స్' అనేస్తారనీ తెలుసు. కానీ ఏం చేయను? నాకేమో ఉత్తరం రాయడం రాదు. మీర్రాసిన ఇరవై మూడు పేజీల ఉత్తరంలో మొత్తం పద్నాలుగు సార్లు తప్పకుండా జవాబు రాయమని రాశారు. మరి ఏదోలాగ మొదలెట్టాలి కదా. ఇరవై రోజులన్నా కలిసి కాపురం చేశామో లేదో ఆషాఢం రాజనాల్లాగా కత్తుచ్చుకుని వచ్చేసి, నన్నిక్కడికి తీసుకొచ్చేసింది.

నేను లేకపోవడం మీకు కొత్తగా ఉందని రాశారు కదూ. ఇక్కడ నా పరిస్థితి ఏమని చెప్పను? వచ్చిన రోజు సాయంత్రం స్నానానికి వెళ్ళబోతూ, "నాకు మైసూర్ శాండల్ వద్దమ్మా. మా ఇంట్లో పియర్సే వాడతాం?" అనేసరికి అమ్మ ఒక్క చూపు చూసిందంతే. మర్నాడు పొద్దున్నే కాఫీ కావాలని అడగ్గానే ఒకటే బుగ్గలు నొక్కుకోడం, 'ఇరవై ఏళ్ళుగా లేని అలవాటు ఇరవై రోజుల్లో వచ్చేసిందే నీకు' అంటూ. చెల్లీ, తమ్ముడూ అయితే నేనెక్కడ దొరుకుతానా అన్నట్టు చూస్తున్నారు. అసలు వాళ్ళిద్దరూ చూడకుండా మీ ఉత్తరం చదూకోడానికి ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా మీకు?

ఇప్పుడైనా వాళ్ళిద్దర్నీ మేటనీకి పంపించేసి, పెరట్లో బాదం చెట్టు కింద మంచం వేసుకుని కూర్చున్నా, మీకు ఉత్తరం రాయడం కోసం. ఇంట్లో అందరూ గుర్రు కొడుతూ నిద్రపోతున్నారు. బామ్మ గురకైతే ఇక్కడిక్కూడా వినిపిస్తోంది. మొన్నో రోజు నన్ను చూసి 'చిక్కిపోయావే అమ్ములూ' అంటూ బామ్మ ఒకటే గొడవ. గతేడాది సంక్రాంతికి నాన్నారి చేత కొనిపించుకున్న శాటిన్ పువ్వుల పరికిణీ ఉంది చూడండి, అదీను నీలం వోణీ వేసుకున్నాను. అసలు మన పెళ్లి కుదిరినప్పటి నుంచీ చీరల్లోకి మారిపోయాను కదా, అలవాటవుతుందని. ఒక్కసారిగా వోణీ లో చూసేసరికి చిక్కినట్టు కనిపించి ఉంటాను. 'ఇంకీ పరికిణీ నాకే కదే అక్కా' అంటూ చెల్లి ఒకటే ఏడిపించడం.

ఆవేళ మీరు సినిమాకి వెళ్దామన్నప్పుడు నేను పెట్లో వెతికి వెతికి నీలం రంగు శిల్కు చీర కట్టుకుంటే సిగరెట్ కాల్చుకుంటూ మీరన్నారు చూడండి 'ఆకాశం ఒంటికి చుట్టుకున్నట్టు ఉన్నావ్' అని, ఆమాట గుర్తొస్తూనే ఉంది రోజంతా. అక్కడికి వచ్చేటప్పుడు ఈ పరికిణీ తెచ్చేసుకుంటానండీ. ఇంట్లో ఉన్నప్పుడే కట్టుకుంటాను. సరేనా? అవునూ, నేను లేను కదా అని సిగరెట్లు ఎక్కువ కాల్చేసున్నారా? రోజూ రెండుకన్నా కాల్చనన్నారుకదా నాతో. కాల్చాలనిపించినప్పుడల్లా నన్ను గుర్తుచేసుకోవాలి మరి. అసలు మీ గురించి అడగనే లేదు కదా.. ఇంతకీ ఎలా ఉన్నారు? భోజనమన్నా సరిగ్గా చేస్తున్నారో లేదో అని పూటా తల్చుకుంటున్నాను. రత్తమ్మ రెండుపూటలా మానకుండా వస్తోందా? వస్తూ వస్తూ మంచి చీర పట్టుకొస్తానని చెప్పాను దానికి.

నేనొచ్చానని తెలిసి మొన్న మా కుసుమకుమారొచ్చింది. నా బెస్ట్ ఫ్రెండని చెప్పాను చూడండీ, అది. పాపం మన పెళ్లికి రాలేకపోయింది. మీరెలా ఉంటారని ఒకటే అడగడం. అసలీ ప్రశ్న చాలామందే అడుగుతున్నారనుకోండి. పక్కింటి నరసమ్మమ్మ గారైతే "యేవే పిల్లా.. నువ్వూ మీ ఆయనా ఒక్కసారైనా గొడవ పడ్డారుటే?' అని అడిగేసింది. 'అబ్బే అలాంటివేవీ లేవండీ' అని నేను చెబితే, 'మొగుడూ పెళ్ళాం గొడవ పడకపోతే అసలదేం సంసారమే?' అనేసిందావిడ, శాపం పెట్టే మంత్రగత్తెలాగా. 'దిష్టి కళ్ళమ్మా.. పచ్చగా ఉంటే ఓర్చలేరు' అని ఆవిణ్ణి తిట్టుకుంటూ అమ్మ పాపం నాకు దిష్టి తీసేసిందనుకోండి. 'నీది మరీ చాదస్తం సుభద్రా' అంటూ నాన్నారు, అమ్మని కేకలేయడం.

కుసుమకుమారి గురించి చెబుతూ మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయాను కదూ. ఏవిటో పరధ్యానం. మొన్నొక రోజు ఇలాగే అన్నం వదిలేసి గుత్తొంకాయ కూరొకటీ తినేస్తుంటే తమ్ముడు చూసి ఒకటే నవ్వడం. 'మాకు అన్నంలో కలుపుకుంటేనే కారంగా ఉంది.. బావగారు నీకు కారాలు బాగానే అలవాటు చేసేసినట్టున్నారూ' అంటూ. సరే, కుసుమ మీ ఫొటోన్నా చూపించమని ఒకటే గొడవ. స్టూడియో వాడు మన పెళ్లి ఫోటోలు ఇంకో నెల్లాళ్ళ వరకూ రావన్నాడు. ప్రింటింగుకనీ రాజమండ్రో, విజయవాడో పంపాట్ట. సరిగ్గా చెబితే కదా. సరే, పెళ్లికి ముందు మీరు పంపిన ఫోటో ఉంది కదా, అదన్నా చూపిద్దాం అనుకున్నా. ఎక్కడా, అదక్కడే నా పెట్టిలో ఉండిపోయింది. 'ఏకంగా ఆయన్నే చూద్దువుగాని లేవే' అని దాన్ని జోకొట్టాను.

అన్నట్టు మీరిక్కడికి ఎప్పుడొస్తారు? ఏదో వంక పెట్టుకుని మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తానని, రైలు దగ్గర నాన్నారు వినకుండా నాతో చెప్పారు కదా. రోజూ ఎదురు చూడ్డవే నేను. గోదారొడ్డున సినిమా షూటింగ్ అవుతోంది. నాగేసర్రావూ, సావిత్రీ ఒచ్చారుట. మా సదాశివం మావయ్యకి ఆ సినిమా వాళ్ళు తెలుసుట. మీరొస్తే మనిద్దరం కలిసెళదాం. నేను వెళ్ళడానికి నాన్నారొప్పుకోకపోతే, మీరన్నా వెళ్లి చూసొద్దురుగాని. సావిత్రంటే ఇష్టం కదా మీకు. మరేమో, ముఖ్యమయిన విషయం. మొన్న బామ్మా నాన్నారూ మాటాడుకుంటుంటే నా చెవిన పడింది. ఏకంగా శ్రావణ మాసం నోములూ అవీ అయ్యాక పంపుతారుట నన్ను. అలాగని మావయ్యగారికి ఉత్తరం రాయమని నాన్నారికి చెబుతోంది బామ్మ. వింటున్నారు కదూ?

మల్లంటు మీదనుంచి వచ్చే చల్లగాలి మాంచి వాసనొస్తోందండీ, మీరు కొనిచ్చిన అత్తర్లాగా. బుజ్జి మొక్కని నేనే పాతాను, పెంచాను. చెల్లేమో పూలకి వాటాకి రావడం తప్ప ఆకైనా దుయ్యదు ఎప్పుడూ. ఇన్నాళ్ళూ పూల కోసం దెబ్బలాడుకునే వాళ్ళమా, ఇప్పుడు మొత్తం దానికే ఇచ్చేస్తుంటే అదెంత ఆశ్చర్యపోతోందో. 'ఇంత మారిపోయావేమిటే నువ్వు?' అని రోజుకోసారైనా అంటోంది. హమ్మో. మల్లెమొగ్గలు విచ్చుతున్నాయ్. రాస్తుండగానే సాయంత్రం అయిపోయింది. కాసేపట్లో మా కోతులు రెండూ సినిమా నుంచి వచ్చేస్తాయ్. వాళ్ళ కళ్ళ పడకుండా దీన్ని డబ్బాలో వేయించాలి. ఏం రాశానో చదవడానిక్కూడా టైము లేదు. రోజులు లెక్క పెడదామన్నా కేలండర్ కూడా ఎవరూ చూడనప్పుడు చూడాల్సొస్తోంది. మీ జవాబు కోసం చూడనండీ.. జవాబుగా మీరే వచ్చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. వస్తున్నారు కదూ. - మీ ప్రాణసఖి