సోమవారం, జనవరి 05, 2015

గణేష్ పాత్రో ...

"విమానం, మా నాన్న కూడా కొనగలరు తాతయ్యా.. కానీ, నడిపించేవాడిని కొనడం మన తరమా?" మొదటిసారి ఈ ప్రశ్న విన్నప్పుడు నాక్కలిగిన అనుభూతి ఇప్పటికీ జ్ఞాపకమే. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా ఎప్పుడు చూసినా, అమెరికా నుంచి రావాల్సిన కొడుకు ప్రయాణం చివరి నిమిషంలో కేన్సిలయిన కారణంగా తను షష్టిపూర్తిని రద్దు చేసుకోడానికి సిద్ధపడిన సీతారామయ్యని, మనవరాలు సీత ఆ వేడుకకి ఒప్పించే సన్నివేశం రాగానే ఈ డైలాగు కోసం ఎదురు చూస్తాను నేను. నిజమే, నడిపించేవాడిని కొనడం ఎవరితరమూ కాదు. సీతారామయ్య కొడుకు వాసు విషయంలోనే కాదు, ఆ సినిమాకి సంభాషణలు రాసిన గణేష్ పాత్రో విషయంలోనూ రుజువయిన నిజమది.

కొన్ని కొన్ని పేర్లని విడిగా విన్నప్పుడు అసంపూర్ణంగా అనిపిస్తాయి. పక్కన మరో పేరు చేరినప్పుడే వాటికి సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. గణేష్ పాత్రో పేరు కూడా అంతే. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే మరో పేరు కె. బాలచందర్. గడిచిన శతాబ్దపు డెబ్భై, ఎనభై దశకాల్లో తెలుగు తెరమీద ఈ ద్వయం చేసిన మేజిక్ అంతా ఇంతా కాదు. బాలచందర్ అరవ ఆలోచనలకి అచ్చ తెలుగు నుడికారాన్ని దిద్దిన రచయిత గణేష్ పాత్రో. అందుకే కాబోలు బాలు, స్వప్న, జానీ, సుహాసిని, బుచ్చిబాబు, విద్య, బేబీ.. ఈ పాత్రలేవీ కూడా పరభాషా దర్శకుడు సృష్టించినవన్న భావన కలగదు. సినిమాకి నేటివిటీని అద్దడంలో సంభాషణలది కీలకపాత్ర మరి.

అయితే, గణేష్ పాత్రో అనే సంభాషణల రచయితని శ్రద్ధగా గమనించింది మాత్రం 'సీతారామయ్య గారి మనవరాలు' నుంచే. ఆ సినిమా తర్వాత, వెనక్కి వెళ్లి పాత్రో రాసిన సినిమాలని 'సంభాషణల' కోణం నుంచి చూస్తే ఎన్నెన్ని మెరుపులో. పాత్రో రాసిన సంభాషణలని పరిశీలించినప్పుడు ఆత్రేయ పెట్టిన ఒరవడిలో ప్రయాణం మొదలు పెట్టి, తనదైన శైలిని అలవరుచుకున్నాడనిపిస్తుంది. సంభాషణల్లో నాటకీయత ఉంటుంది. కానీ, అదెక్కడా శృతి మించి అసలు విషయాన్ని మింగేయదు. 'సినిమా కోసం సంభాషణలు తప్ప, సంభాషణల కోసం సినిమా కాదు' గణేష్ పాత్రో నమ్మిన సిద్ధాంతం ఇదేనేమో అనిపిస్తుంది.


దర్శకుడి ఆలోచనలని ఆకళింపు చేసుకుని, అందుకు అనువుగా సంభాషణలు రాయడం అన్నది అంత సులువుకాదు. జాగ్రత్తగా గమనిస్తే, దర్శకుడు-సంభాషణల రచయిత అన్న కాంబినేషన్ ఎక్కడో తప్ప మారదు. కొందరు దర్శకులకి, కొందరు రచయితలతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. బహుశా, ఈ సౌకర్యం కారణంగానే చాలామంది రచయితలకి ఎక్కువమంది దర్శకులతో పనిచేసే అవకాశం దొరకదు. కానీ, గణేష్ పాత్రో తన సినీ ప్రయాణంలో పని చేసిన దర్శకులందరూ వైవిధ్యాన్ని కోరుకునే వారే. వెండితెర మీద తమదైన ముద్ర వేసిన వాళ్ళే.

బాల చందర్ తో పాటు, సింగీతం శ్రీనివాసరావు, క్రాంతికుమార్, వంశీ, కోడి రామకృష్ణ, ఇంకా నేటితరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఎవరి శైలి వాళ్ళది. తెలుగు తెరమీద ఎవరి సంతకం వాళ్ళది. వారి వారి అభిరుచులకి అనుగుణంగా సంభాషణలు రాసి మెప్పించిన ఘనత మాత్రం గణేష్ పాత్రోదే. కేవలం సంభాషణలు మాత్రమే కాదు, కొన్ని పాటలూ ఉన్నాయి గణేష్ పాత్రో ఖాతాలో. సీరియస్ సంభాషణలు రాసిన ఈ రచయితే, 'హలో గురూ ప్రేమకోసమేరా జీవితం..' అనే అల్లరి పాటని రాశారంటే ఎంతమాత్రం ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే, పాత్రో సంభాషణల్లో హాస్యానికి ఏమాత్రం కొదవుండదు. 'రుద్రవీణ' సినిమాలో చిరంజీవి, శోభన చెప్పిన పేరు తన వదినకి చెప్పే సన్నివేశం గుర్తుందా? 'ప్రేమించు పెళ్ళాడు' సినిమాలో సంభాషణలు??

మళ్ళీ, 'సీతారామయ్య గారి మనవరాలు' దగ్గరికి వద్దాం. కొడుకు తన పెళ్లి తనే నిర్ణయించుకోడం కన్నా, తనకి ముందుగా చెప్పకపోవడం కోప కారణం అయ్యింది సీతారామయ్యకి. అటు భర్తకీ, ఇటు కొడుక్కీ మధ్య నలిగిపోతోంది జానకమ్మ. అక్కడికీ నోరు పెగుల్చుకుని, "వాడు పుట్టాక చేసిన మొదటి తప్పండీ" అంటుంది భర్తతో. "వాడికోసం నేనూ మొదటిసారే మాట తప్పాను జానకీ" అంటాడాయన. ఇక తిరుగులేదు. కథలో కీలకమైన సన్నివేశంలో అత్యంత సహజమైన ఆర్గ్యుమెంటు.  ఎక్కడ ఏం రాయాలో బాగా తెలిసిన రచయిత పాత్రో. ఒక్కమాటలో చెప్పాలంటే సినీ సంభాషణలకి రిఫరెన్స్, గణేష్ పాత్రో సినిమాలు.