సినిమా పరిశ్రమ అంత చిత్రమైన పరిశ్రమ మరొకటి ఉండదేమో.. అప్పటివరకూ ప్రపంచానికి తెలియని ఓ అనామకుడిని ఒక్క రాత్రిలోనే సూపర్ స్టార్ ని చేసేస్తుంది. కలలో కూడా ఊహించనంత పేరునీ, డబ్బునీ పాదాల ముందు ఉంచుతుంది. ఇరవయ్యేళ్ళ కుర్రాడు ఉదయ్ కిరణ్ ఇందుకు సాక్ష్యం.. ఇది పదమూడేళ్ళ క్రితం మాట. ఓ మామూలు మధ్య తరగతి కుర్రాడు.. ఆటోల్లో తిరగడం అతనికి లగ్జరీ.. సిటీ బస్సుల్లో తిరిగే కుర్రాడి కోసం సినిమా కంపెనీ అంబాసిడర్ కారు వచ్చి ఇంటి ముందు నిలబడ్డం ఉదయ్ జీవితంలో మొదటి మలుపు.
బూతుని దట్టించి నీతి ముసుగు తొడగడం వల్లో, అప్పటివరకూ వచ్చి పడుతున్న పరమ రొటీన్ సినిమాల కన్నా భిన్నం గా ఉండడం వల్లో.. మొత్తానికి జనం బ్రహ్మరథం పట్టారు ఆ సినిమాకి. గల్లీ కుర్రాడు వాల్ పోస్టర్ల మీదా, టీవీ చానళ్ళ లోనూ సందడి చేయడం మొదలుపెట్టాడు. మధ్యతరగతి జీవితంలో పెద్దగా మార్పు లేదు కానీ, సినిమానే తన కెరీర్ అన్న భావన మాత్రం స్థిరపడింది. రెండో సినిమా బ్రహ్మాండమైన హిట్.. అవకాశాలు వెల్లువెత్తడం మొదలయ్యింది.
ఇక మూడో సినిమా అయితే, సినిమా పరిశ్రమ ఆశ్చర్యపోయే అంతటి విజయం సాధించింది. క్లీన్ సినిమా అవ్వడంతో కుర్రాడిని ఒక్క యువతకి మాత్రమే కాక, వాళ్ళ కుటుంబాలకీ చేరువ చేసింది. ఉత్తరాది ప్రముఖ కథానాయకుడితో పోల్చి కథనాలు రాశాయి పత్రికలు. అప్పటికి అగ్రశ్రేణి కథానాయకుడిగా వెలుగుతున్న ఇప్పటి రాజకీయ నాయకుడు ఒకరు ఉదయ్ ని తన అల్లుడిగా చేసుకుంటానని ప్రకటించి, పనిలో పనిగా తనకి 'కులం' లాంటి సంకుచిత భావాలు ఏమాత్రం లేవని కూడా వాక్రుచ్చారు.
ఉదయ్ హోదా అంతా ఇంతా పెరగలేదు.. మూడు వరస హిట్లు, అత్యంత ప్రముఖ కథానాయకుడికి కాబోయే అల్లుడు.. తను సమకూర్చుకున్న ఇల్లు, కారు.. తన ఖాతాలో ఉన్న విజయాలు. చేతిలో ఉన్న అవకాశాలు.. అప్పటికి తన వయసు ఎంతనీ? పట్టుమని ఇరవై మూడేళ్ళు. ఓ మధ్య తరగతి కుర్రాడిని ఉక్కిరిబిక్కిరి చేసేసే మార్పు. తట్టుకోడం ఏమంత సులభం కాదు. అందులోనూ, ఓ సున్నిత మనస్కుడికి.
తెరవెనుక కారణాలు ఏమైనప్పటికీ, పెద్ద హీరోగారి అమ్మాయితో జరిగిన నిశ్చితార్ధం రద్దయ్యింది. చేసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. చేతిలో ఉన్నాయనుకున్న సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సినిమా పరిశ్రమ ఎంత చిత్రమైనది కాకపొతే, ఓ అనామకుణ్ణి అగ్ర కథానాయకుడిగా చేస్తుంది? ఎంత విచిత్రమైనది కాకపొతే ముచ్చటగా మూడేళ్ళు తిరిగేలోగానే అతన్ని సమస్యల సుడిగుండంలో తోసేసి కీర్తినీ, డబ్బునీ వెనక్కి లాగేసుకుంటుంది??
సంకల్ప బలం కావొచ్చు, అదృష్టం కావొచ్చు, ఎడతెగని కృషి కావొచ్చు.. ఢక్కా మక్కీలు తినాల్సిన వయసులో పూలు పరిచిన జీవితం స్వాగతం పలికింది. కొత్త జీవితానికి పూర్తిగా అలవాటు పడ్డాక, స్థిత ప్రజ్ఞత అలవర్చుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టేసింది.. దీనికి విధి అనో, మరొకటనో పేరు పెట్టుకోవచ్చు. దురదృష్టం.. తన వాళ్ళు వెనక ఉండి ధైర్యం చెప్పాల్సిన సమయంలో, కన్నతల్లి అకాల మరణం.. కుటుంబ పరమైన ఇబ్బందులు.. తనకంటూ ఎవరూ లేరన్న అభద్రత. జీవితంతో పోరాటం.. కెరీర్ కోసం పోరాటం.. మనుగడ కోసం పోరాటం..
ఒక్కసారిగా వచ్చి పడిపోయే విజయాన్ని తట్టుకోడానికి, తట్టుకుని నిలబడడానికి ఎంత శక్తి అవసరమో చెబుతుంది ఉదయ్ జీవితం. అభద్రత అనేది మనిషిని ఎక్కడి వరకూ తీసుకు వెళ్ళగలదో నిరూపిస్తుంది. పరిస్థితులని ఎదుర్కోగలిగే మానసిక ధృడత్వం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. సినిమా పరిశ్రమ ఆటుపోట్లని తట్టుకోలేక తమ జీవితాలకి మరణ శాసనం రాసుకున్న వాళ్ళు, పరాజయాలతో పోరాడలేక అస్త్ర సన్యాసం చేసేవాళ్ళు ప్రపంచానికి చెప్పేది ఒక్కటే.. బతకడానికి కావాల్సిన వాటిలో కాస్తంత 'స్థిత ప్రజ్ఞత' ని కూడా చేర్చుకోమని...
....నువ్విలా చేసి ఉండకూడదు ఉదయ్...
