'కాలం వేళ్ళ సందుల్లోనుంచి ఇసుకలా జారిపోతోంది....' తెలియకుండా గడిచిపోయే తీరుని ఇంత చక్కగా అక్షరాల్లో బంధించిన అజ్ఞాత రచయితకి అభివందనాలు. నిజం కదూ.. ఎప్పుడో అలసినప్పుడో, మనసు పుట్టినప్పుడో ఓసారి వెనక్కి చూసుకుందాం అనుకుంటే కనుచూపు మేరంతా పాదముద్రలే.. ఎక్కడ మొదలు పెట్టి ఏ చోట ముగిస్తామో తెలియని ప్రయాణమే కదా జీవితం. ఇంతకీ ఇలా వెనక్కి చూసుకున్నప్పుడు గడిచిన జీవితం మొత్తం సినిమా రీలులాగా కనిపించదు కాక కనిపించదు.. కేవలం కొన్ని సందర్భాలు, సన్నివేశాలు మాత్రమే కాలపరిక్షను ఎదుర్కొని నిలబడతాయి.
జీవిత సారాన్ని 'కష్టం-సుఖం' అని రెండు ముక్కల్లో తేల్చి పారేశారు మన పెద్దవాళ్ళు. నిజమే, జరిగిపోయిన వాటికి జాబితా వేయడం మొదలుపెడితే ఈ రెండు వర్గాలనీ దాటవు. కష్టాలు బావుంటాయి. మరీ ముఖ్యంగా అవి తీరిపోయాక మాబాగుంటాయి. ఇక సుఖం.. దీనికి అంతు ఏమన్నా ఉందా? ఇక చాలు అనిపిస్తుందా? 'సుఖం అనే ఎండమావిని చేరుకోవడం కోసం కష్టాల ఎడారిలో చేసే ప్రయాణమే జీవితం' అంటుంటారు కొందరు.. ఒప్పుకోవాలని అనిపించదు.. కష్టాన్ని గుర్తించినంత, గుర్తు పెట్టుకున్నంతగా సుఖాన్ని గుర్తు పెట్టుకోము కదా మరి..
ఎర్రటి ఎండలో బయట తిరిగొచ్చాక, నీడ పట్టున కూర్చుని చల్లటి నీళ్ళు తాగడంలో ఎంత సుఖం ఉందసలు? ఎండని గుర్తు పెట్టుకున్నంతగా నీళ్ళు తాగి, విశ్రమించడాన్ని గుర్తు చేసుకోం. ఎండా, మనదే, నీళ్ళూ మనవే అయినప్పుడు ఎండని మాత్రమే గుర్తుంచుకుని, నీళ్ళని మర్చిపోవడంలో తప్పు ఎవరిది మరి. నీడా, నీళ్ళూ అంత గొప్పగా ఉంటాయని మనకి చెప్పిన ఎండని మెచ్చుకోవాలి న్యాయంగా. కష్టం వల్లే కదా, సుఖం విలువ బాగా తెలుస్తుంది.
'నా మొహాన సుఖపడే రాత లేదు' లాంటి మాటలు విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ఆశించింది దొరకడం మాత్రమే సుఖం అనే ధోరణి వల్ల, కేవలం కష్టాలని మాత్రమే గుర్తించి గుర్తుపెట్టుకుంటున్నారేమో అనుకుంటూ ఉంటాను. పోనీ, సుఖపడడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ఏదీ తనంతట తాను రాని లోకంలో ఉన్నాం మనం. కష్టమైనా, సుఖమైనా తగినంత కారణం లేనిదే వచ్చి వాలిపోదు.మనం ఆలోచించనిదో, ఆలోచించడానికి ఇష్టపడనిదో ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.
మన కష్టసుఖాలకి - మరీ ముఖ్యంగా కష్టాలకి - మరొకర్ని బాధ్యులని చేసేయడం మనకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరి కర్మకి వారే కర్తలవుతారనే విషయాన్ని చాలా సులువుగా మర్చిపోగలం. అప్పుడైతేనే చేతులు దులిపేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా, మనల్ని మరొకరితో పోల్చుకుని వాళ్ళు సుఖ పడిపోతున్నారనీ మనం మాత్రం కష్టాల్లో మునిగి తేలుతున్నామనీ బలంగా నమ్ముతున్నప్పుడు, అవతలి వారికి అన్నీ అయాచితంగా వచ్చి పడ్డాయనీ, మనం ఎంత ప్రయత్నం చేసినా 'ఏదో అడ్డుపడి' దొరకాల్సింది దొరకలేదనీ అనేసుకోగలం.
జాజులు పూసే సాయంత్రం వేళ, పడక్కుర్చీలో విశ్రాంతిగా జేరబడి, కళ్ళు మూసుకుని పాటలు వినడం చాలా బాగుంటుంది. ఎప్పుడంటే, రోజంతా శ్రమ చేసినప్పుడు.. మనం నిర్వర్తించాల్సిన పనులు పూర్తి చేసినప్పుడు. ఏమీ చెయ్యకుండా, కనిపించిన వాళ్ళనీ, కనిపించని వారినీ తిట్టుకుంటూ రోజంతా గడిపేసినప్పుడు జాజి తీగె మీదనుంచే వచ్చే చల్లగాలి ఏమాత్రమూ ప్రత్యేకంగా అనిపించదు. అలాగే, అనుక్షణం దూరం జరిగే గమ్యమే లక్ష్యంగా సాగే పరుగుపందెంలో తలమునకలై ఉన్నప్పుడు జాజుల వాసన నాసికను తాకనే తాకదు..కదూ..