సముద్రమంటే నాకిష్టం. చిన్న ధారగా పుట్టి, సన్నగా ప్రవాహం మొదలు పెట్టి, ఉరుకులూ పరుగులెత్తి, ఎందరికో అన్నం పెట్టే మా గోదారి చివరకి కలిసేది సముద్రంలోనే కావడం ఇందుకు ఒక కారణం. అదిగో, ఆ సముద్రంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలనీ చూసిరావాలనే సంకల్పంతో కుటుంబంతో కలిసి నాలుగు రోజుల ఉత్తరాంధ్ర యాత్రకి బయలుదేరాను. ఒకటి రెండు ప్రదేశాలు మినహా చూడాలనుకున్నవన్నీ చూడగలిగాం, కారు అద్దం నుంచి. ఆరేళ్ళ విరామం తర్వాత చూస్తున్నానేమో, చాలా మార్పే కనిపించింది నాకు.
మహాకవి శ్రీశ్రీలో కవితావేశాన్ని రగిల్చిన సముద్ర కెరటాలని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.. విశాఖతో సమ చరిత్ర ఉన్న భీమిలి అన్నింటా వెనుకబడే కనిపించింది, బీచీతో సహా. ఎంతో మంది పర్యాటకులు వస్తున్నా, కనీస సదుపాయాలు కానీ, పరిశుభ్రత కానీ లేవక్కడ. కారు భీమిలి వైపు పరుగులు తీస్తుండగా, దారంతా చేతిలో ప్లాస్టిక్ కవర్లు పట్టుకున్న పల్లె పడుచులు 'బాబూ..బాబూ.. బాబూ' అని అరుస్తూ కనిపించారు. ఇద్దరు ముగ్గుర్ని దాటి ముందుకు వెళ్ళాక అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో కారాపమన్నాను డ్రైవర్ని.
ఓ ప్లాస్టిక్ సంచీలో వేయించిన జీడిపప్పు. మొత్తంగా ఓ ఇరవై పలుకులు ఉంటాయేమో. 'యాబై రూపాయలు' అంది అమ్మే ఆవిడ. తెగే బేరం కాదనిపించి, కారు పోనిమ్మన్నాను. ఆవిడ అదాటున నా చెయ్యి పట్టేసుకుని, "నలబై ఇవ్వండి బాబూ.. పోనీ ముప్పై.. బాబ్బాబ్బాబూ..." అనడం మొదలు పెట్టింది. ఊహించని 'పాణిగ్రహణా'నికి బిత్తరపోయాన్నేను. మావాళ్ళకి మాత్రం కావలసినంత వినోదం దొరికింది. నా అవస్థ గ్రహించిన వాడై, డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాడు. తోటల్లో రాలిన కాయలు ఏరి, కాల్చి అమ్ముతారని వివరం చెప్పాడు.
భీమిలి చూడగానే చలం గుర్తొచ్చాడు అప్రయత్నంగా. అక్కడ ఉన్నంతసేపూ గుర్తొస్తూనే ఉన్నాడు. తిరిగి వస్తూ 'ఎర్రమట్టి దిబ్బలు' చూడాలన్నాను నేను. ఆశ్చర్యం! అవి ఎక్కడున్నాయో తెలీదన్నాడు డ్రైవర్. నా పోరు పడలేక ఒకరిద్దర్ని వాకబు చేసి తీసుకెళ్ళాడు. రోడ్డుకి అటు పక్క తెల్లటి ఇసుకతో మెరిసిపోతున్న బీచ్.. ఇవతలి ఒడ్డున ఎర్రటి మట్టి దిబ్బలు. ఎన్నో తుపానుల్ని తట్టుకుని మరీ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాయవి. దట్టంగా పరుచుకున్న జీడిమామిడి తోటలూ, ఠీవిగా నిలబడ్డ సర్వీ చెట్లనీ చూసుకుంటూ రుషికొండ వైపు బయలుదేరాం.
ప్రయివేటు విశ్వవిద్యాలయం 'గీతం' ఎదురుగా ఉన్న రుషికొండ బీచీలో జనం పల్చగా ఉన్నారు. నిమ్మకాయ, కారం అద్దిన అపుడే కాల్చిన, లేత మొక్కజొన్న కండె తింటూ సముద్ర కెరటాలని చూస్తుంటే 'చిన్న చిన్న ఆనందాలు' అన్న మాట అప్రయత్నంగా గుర్తొచ్చింది. ఓ నవ్వూ వచ్చింది. భీమిలి బీచ్ లో పూర్తి పల్లెటూరి వాతావరణం కనిపిస్తే, రుషికొండ బీచ్ లో అర్బన్ పోకడలు కనిపించాయి. ఇనిస్టెంట్ ఫోటో తీయించుకోమంటూ వెంట పడే ఫోటోగ్రాఫర్లనీ, గుర్రం ఎక్కమని బలవంతం చేసే కుర్రాడినీ తప్పించుకుని ఆర్కే బీచ్ చేరేసరికి కనుచీకటి పడింది.
కాస్మోపాలిటన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా ఓ సాయంత్రం ఆర్కే బీచ్ చూస్తే చాలు. క్లబ్బులకీ, డిస్కోలకీ వెళ్ళక్కర్లేదు. విశాఖ 'అభివృద్ధి' ఎంత వేగంగా జరుగుతోందో తెలుసుకోడానికి కూడా ఈ బీచ్ ని మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో. బీచ్ రోడ్డుని మాత్రం ఒకప్పటి ట్యాంక్ బండ్ తరహాలో రూపుదిద్దారు. శ్రీశ్రీ మొదలు, రావిశాస్త్రి వరకూ రచయితలూ, అల్లూరి సీతారామ రాజు వంటి త్యాగధనులు, ఘంటసాల, ద్వారం వెంకటస్వామి నాయుడు తదితర కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేశారక్కడ!! నాక్కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. గతంలో చూడలేదు వాటిని.
సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో సముద్రం మరింత అందంగా ఉంటుంది. మేము సూర్యాస్తమయ వేళలో మాత్రం చూడగలిగాం సముద్రాన్ని. ఆ సాయంత్రం వేళ, కెరటాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ తీరాన్ని తాకుతున్నాయి. వాటిని చూసి, ఒక్కసారిగా చిన్నపిల్లాడినైపోయి, గవ్వలేరే ప్రయత్నం మొదలు పెట్టాను. తొలి కెరటం ఓ ప్లాస్టిక్ కవర్నీ, రెండో కెరటం ఖాళీ కోక్ టిన్నునీ ఇచ్చాయి నాకు. నిరాశ ముంచుకొచ్చి, గవ్వలేరే ప్రయత్నం విరమించుకున్నాను. (ఇంకా ఉంది).