"శతాబ్దాల కిందట ఒక రావి గౌతముణ్ణి ప్రభావితం చేసింది. ఈ శతాబ్దంలో ఒక రావి తెలుగు వారిని ప్రభావితం చేసి ప్రబుద్ధుల్ని చేస్తోంది. అదే రావిశాస్త్రీయం," అన్నారు మహాకవి శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి రచన 'రావిశాస్త్రీయం' గురించి. కథకుడిగా, నాటక, నవలా రచయితగా రావిశాస్త్రి గురించి ఇవాళ కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. "రావిశాస్త్రి వచనం శ్రీశ్రీ కవిత్వంలా ఉంటుందనీ" "వచన రచనపై రావిశాస్త్రి తనదైన ముద్ర వేశారనీ" ఏనాడో కితాబులు అందుకున్నారు.
రావిశాస్త్రి రాసిన వ్యాసాలు, లేఖలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు, వివిధ సందర్భాలలో చేసిన ఉపన్యాసాలు, ప్రకటనల సంకలనమే 'రావిశాస్త్రీయం.' తన బాల్యం, చదివిన పుస్తకాలు, రచయితగా ఎదిగిన క్రమం, తన్ను రచనలకి పురిగొల్పిన అంశాల మొదలు సమకాలీన సమాజం, సాహిత్యం, ఈ రెండింటి పరస్పర ప్రభావాల వంటి అనేక అంశాలని నిర్మొహమాటంగా చెప్పారు రావిశాస్త్రి. తనూ, తన రచనలూ కూడా పేదవాడి పక్షమేనని పదేపదే చెప్పారు.
శ్రీకాకుళంలో నాగావళి నది ఒడ్డున 1922 జూలై 30 నజన్మించిన రావిశాస్త్రి, పెరిగింది ఎక్కువకాలం జీవించింది విశాఖపట్నంలోనే. తన పదహారో ఏట 'దేవుడే చేశాడు'పేరిట తొలి కథని రాశారు. మరో రెండేళ్ళ తర్వాత చెహోవ్ కథ 'మిజరీ' ని తెలుగులోకి స్వేచ్చానువాదం చేశారు. అయితే, తన సాహిత్యం మొత్తాన్ని 'అల్పజీవి' కి ముందు, తర్వాత అని విభజించాలనీ, 'అల్పజీవి' రాసిన నాటినుంచే సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకున్నాననీ చాలాచోట్ల రాశారు.
'అల్పజీవి' కి అందిన ప్రశంశల్లో ముఖ్యమైనదీ, రావిశాస్త్రి మళ్ళీ మళ్ళీ ఇష్టంగా గుర్తుచేసుకున్నదీ, తానెంతో అభిమానించే మహాకవి శ్రీశ్రీ నుంచి అందిన ప్రశంశ. నిజానికి రావిశాస్త్రి చదువుకున్నది శ్రీశ్రీ తండ్రి దగ్గరే. ఆయన హెడ్మాస్టరుగా పనిచేసిన స్కూల్లోనే ఈయన పాఠశాల విద్య సాగింది. యవ్వనారంభంలో చదివిన సెక్స్ పుస్తకాలు తనని పక్కదోవ పట్టించాయని రావిశాస్త్రి రాసుకున్నది చదివినప్పుడు శ్రీశ్రీ ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల 'అనంతం' గుర్తొచ్చింది. శ్రీశ్రీ ఎంతగానో అభిమానించింది అబ్బూరి రామకృష్ణారావుని కాగా, ఆయన కుమారుడు వరద రాజేశ్వరరావు రావిశాస్త్రికి ప్రాణ స్నేహితుడు. హైస్కూల్లో మొదలైన స్నేహం చివరివరకూ కొనసాసింది.
తనకి 'దేవుడు లేడ'న్న విషయాన్ని మొదట చెప్పింది వరద రాజేశ్వరరావేననీ, అప్పుడు తనకి చాలా భయం వేసిందనీ చెప్పుకున్నారు రావిశాస్త్రి. అలాగే చాయాదేవి గారి సౌశీల్యాన్నీ తలచుకున్నారు. గురజాడ అప్పారావు అంటే తనకున్న అభిమానాన్నిఏమాత్రం దాచుకోలేదు రావిశాస్త్రి. 'కన్యాశుల్కం' కన్నా గొప్ప నాటకం ఇక తెలుగునాట రాదని డంకా బజాయించారు. తన సమకాలికుల్లో కాళీపట్నం రామారావు మేష్టారి మీదున్న గౌరవాన్నీ, బీనాదేవి రచనల మీద ఇష్టాన్నీ చాలాసార్లే ప్రస్తావించారు. కే.ఎన్.వై. పతంజలి 'పతంజలి భాష్యా'నికి ముందుమాట రాశారు.
కథాసాహిత్యం ద్వారా కన్నా ప్రజాగాయకుల ద్వారా జనంలో చైతన్యం తీసుకురావడం సులభమని నమ్మిన రావిశాస్త్రి, గదర్, వంగపండు ప్రసాదరావులు ఆపనిని సమర్ధవంతంగా చేస్తున్నారని అభినందించారు. విప్లవ రచయితల సంఘం (విరసం) ప్రారంభంలో కీలక భూమిక పోషించిన రావిశాస్త్రి, తర్వాత కొంతకాలంపాటు విరసానికి దూరం జరిగారు. విరామం తర్వాత మళ్ళీ చేరువయ్యారు కూడా. మార్క్సిజం పట్ల రావిశాస్త్రికి నమ్మకం, గౌరవం. వ్యక్తిగత ఆస్తి లేని సమాజంలోనే మాత్రమే అసమానతలన్నీ తొలగిపోతాయని నమ్మారు. గాంధీని ఎంతగా అభిమానించారో, నెహ్రూనీ, ఆయన వారసులనీ అంతగా విమర్శించారు.
వ్యక్తిగత జీవితం, ప్లీడరుగా ప్రాక్టీసు, తన దగ్గరకి వచ్చే 'పార్టీ' లనీ, వాళ్ళు మాట్లాడే భాషనీ గమనించి తన రచనల్లో ఉపయోగించడం మొదలు, తనని చుట్టుముట్టిన అనారోగ్యం, ఆర్ధిక సమస్యల వరకూ అన్నింటినీ పంచుకున్నారు తన 'రావిశాస్త్రీయం' లో. అసంపూర్తి నవలలు 'రాజు-మహిషి' 'రత్తాలు-రాంబాబు' లని పూర్తి చేసే ఉద్దేశ్యం లేనట్టేనని చాలాసార్లే చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో అనుభవించిన జైలు జీవితం, అక్కడి స్నేహాలు, వాతావరణం వీటన్నింటి సంగతులూ వివరించారు. రంగనాయకమ్మ 'బలిపీఠం' తనకెందుకు నచ్చలేదో చెప్పడంతో పాటు, స్త్రీవాదానికి తాను వ్యతిరేకినంటూ కారణాలని వివరించారు.
మొత్తం పుస్తకాన్ని ఇరవై అధ్యాయాలుగా విభజించారు ప్రకాశకులు. ఇది ముందుగా ప్లాన్ చేసి రాసిన పుస్తకం కాదు కాబట్టి, చాలా సంగతులు చర్విత చర్వణమయ్యాయి. కథలెలా రాయాలన్న విషయాన్ని గురించి శాస్త్రి గారి వ్యాసాలు కొత్తగా కలం పట్టే వారికి తప్పక ఉపయోగ పడగలవు. కొన్ని 'పూర్తిగా వ్యక్తిగతం' అనిపించే లేఖలకీ స్థానమిచ్చారు ఇందులో. అలాగే కొన్ని ఆంగ్ల లేఖలూ, వ్యాసాలూ కూడా ఉన్నాయిందులో. విప్లవ కవి చెరబండరాజుకి అంకితమిచ్చిన 'రావిశాస్త్రీయం' పుస్తకాన్ని 'రాచకొండ ప్రచురణలు' ప్రచురించింది. (పేజీలు 384, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
