తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు పుట్టడంతోనే అమృతం తాగేశాయి. అందుచేత అవి ఎప్పటికీ చిరంజీవులే. ఉదాహరణకి అలాంటి కొన్ని పాత్రలు: గురజాడ అప్పారావు గారు సృష్టించిన మధురవాణి, బాపు-రమణ ల బుడుగు, కే.ఎన్.వై. పతంజలి వీరబొబ్బిలి ఇంకా భానుమతీ రామకృష్ణ 'అత్తగారు.' తరాల అంతరాలతో సంబంధం లేకుండా మెజారిటీ తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు అందుకున్న పాత్రలివి.
సినిమాల్లో అత్తగారు అనగానే సూర్యకాంతం గుర్తొచ్చినట్టు, సాహిత్యంలో అత్తగారు అనగానే మొదట గుర్తొచ్చేది భానుమతి అత్తగారే. బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని మల్లు పంచ, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం, కొత్తని చూసి వింత పడడం, పాత సంగతులని ఆప్యాయంగా తలుచుకోవడం, అవకాశం దొరికితే పెత్తనం చేయాలన్న ఉబలాటం, ఒకమాట అని పది మాటలు పడ్డా అవి ఎవరికీ తెలియకూడదన్న లౌక్యం.. ఈ లక్షణాలన్నీ కలబోసిన మూర్తే 'అత్తగారు.'
బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ యధాలాపంగా సృష్టించిన 'అత్తగారి' పాత్రకి ఎంతటి పాఠకాదరణ లభించిందంటే, తర్వాతి కాలంలో ఆవిడ రాసిన కథలన్నింటిలోనూ ప్రధాన పాత్ర అత్తగారే. "నేను సృష్టించిన అత్తగారి పాత్ర ఎవరో కాదు మా ఇంట్లో మా అత్తగారే అనుకుంటారు చాలామంది.. కానీ అత్తగారి పాత్ర కోసం మా అత్తగారిలోని కొన్ని లక్షణాలు మాత్రమే తీసుకున్నాను నేను," అని భానుమతే ఒక సందర్భంలో చెప్పారు. అత్తగారి చుట్టూ తిరిగే కథలన్నింటి సంకలనమే 'అత్తగారి కథలు.'

ఆవకాయ పెట్టడంలో ఓనమాలు తెలియక పోయినా నిమ్మకాయ పచ్చడి చేసినట్టే ఐదువేల మామిడి కాయలతో ఆవకాయ పెట్టేయాలనే అత్తగారి ప్రయత్నమే సంకలనం లో మొదటి కథ 'అత్తగారూ-ఆవకాయ.' అత్తగారి స్వరూప స్వభావాలని ఈ కథలోనే పటం కట్టేశారు భానుమతి. మన ఊహకి అందని లక్షణాలని కూడా స్పష్టంగా చూపించడం కోసం పక్కనే బాపూ బొమ్మ ఉండనే ఉంది. రైతు మీద అజమాయిషీ చేసి మామిడి కాయలు తెప్పించిన అత్తగారు, వాటిని ఏం చేశారన్నదే ఈ కథ.
పశు పోషణలో అత్తగారు కొంచం వీక్. కానీ ఆవిషయం ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ పోషణలో ఓ గేదె తనువు చాలించగా, ఓ ఆవుని పెంచుకోవాలని సంకల్పిస్తుంది. ఆ సంకల్పం నెరవేర్చుకోడానికి ఆవిడ చేసే ప్రయత్నాలు 'అత్తగారూ-ఆవు నం: 23' కథలో చదవాల్సిందే. 'అత్తా తోటికోడలీయం' 'అత్తగారూ-అరటికాయ పొడి' 'అత్తగారూ-జపాన్ యాత్ర' కథలు చదువుతున్నంత సేపూ నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా జపాన్ వెళ్లాలని కలగనే అత్తగారి బొమ్మని చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదు.

తనకి లంకె బిందెలు దొరుకుతాయని అత్తగారి జాతకంలో ఉంది. కానీ ఎప్పుడు దొరుకుతాయో స్పష్టంగా లేదు. ఎప్పటికైనా దొరుకుతాయని ఆవిడకి ఆశ. ఇంతలో ఊరి చివర తోటలో ఇల్లు కొనుక్కోవడం, ఆ ఇల్లు అచ్చం అత్తగారి జాతకం లో లంకె బిందెలు దొరికే ఇల్లులాగే ఉండడం తో ఆవిడ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది, కోడలితో కలిసి. లంకె బిందెల విషయం ఎవరికీ తెలియకూడదు కదా, అందుకని అర్ధ రాత్రి లేచి పెరట్లో తవ్వకాలు. ఓ రాత్రి నేలలో గునపం వేయగానే 'ఖంగ్' మని చప్పుడు వస్తుంది. ఇంతకీ లంకె బిందెలు దొరికాయా?
ఆచారాల్ని సర్దుబాటు చేయడం, పెళ్లి సంబంధాలు కుదర్చడం మొదలు పని వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచడం, కొడుక్కీ, మనవడికీ వాళ్లకి నచ్చేవి తనకి చేతకాక పోయినా చేసి పెట్టాలనుకోడం వరకూ అత్తగారిలో ఉన్న ఎన్నో లక్షణాలని మనకి హాస్య స్పోరకంగా వర్ణించారు భానుమతి. సాహిత్య అకాడెమీ బహుమతి గెలుచుకున్న ఈ సంకలనం లోని మొత్తం కథలు చదివాక, ఈ అత్తగారు ఒక కల్పిత పాత్ర అంటే వెంటనే నమ్మబుద్ధి కాదు మనకి. సంకలనానికి బయట ఉండిపోయిన మరికొన్ని కథలనీ ఇందులో చేరిస్తే బాగుండు. (అత్తగారి కథలు, పేజీలు:300 వెల: రూ. 130, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.) కొన్ని కథల్ని ఇక్కడ చదవొచ్చు.